సందేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

ఎన్నికజనము - 1



ప్రభువా! మా కన్నులు విప్పి ఆకాశమును చూచిన యెడల నీజ్ఞానము ఎంత గొప్పదో తెలియుచున్నది. సూర్య చంద్ర నక్షత్రములను అందులోని నీవు ఉంచినావు. భూమిని చూడగా జంతువులు, నదులు, మానవులు మొ॥వి ఉంచినావు. ఏది ఎక్కడ పెట్టవలెనో అక్కడ అది ఉంచినావు. సృష్టి అనే ఇంటిలో ఏది ఎక్కడ ఉంచవలెనో అక్కడ ఉంచినావు. ఈ నీ జ్ఞానమును తలంచుచు వందించుచున్నాము. బైబిలు గ్రంథములో ఒకరి సమయములో ఒకరు పుట్టలేదు. ఎవరు ఎక్కడ పుట్టవలెనో అక్కడ వారు పుట్టినారు. నీవు ఆలాగున వారిని పుట్టించినావు. అన్నిటికి మంచి క్రమము ఏర్పరచినావు. చిందర వందరగా ఏదియు నీవు చేయలేదు. ఆలాగుననే పడిన మానవులను రక్షించుటకు సంకల్పన ఏర్పరచినావు. దానికికూడ క్రమమున్నది. వాగ్దానమెప్పుడు ఇవ్వవలెనో, మిశ్రమజనమునుండి ఏర్పాటు జనమును ఎప్పుడు వేరుచేయవలెనో, మొ॥వి ఈ ఏర్పాటులన్నియు నీ జ్ఞానమును తెలియపరచుచున్నవి. మా హృదయము, జ్ఞానము, మనస్సాక్షిని, నీ జ్ఞానవశము చేసికొనుము. నేడు మాకు బోధించవలసిన అంశములను వివరించుమని యేసునామమున వందించుచున్నాము తండ్రీ! ఆమేన్.


ఎన్నిక జనము:- ఈ జనము అబ్రాహాముతో, మొదలై, పెంతెకొస్తు వరకు వచ్చిన క్రైస్తవ సంఘము. దేవుని జ్ఞానము ఈ జనములను ఏర్పాటులో చేర్పించుటలో కనబడుచున్నది. యూదులు ఇప్పటివరకు ఉన్ననూ సంఘ ఏర్పాటులో లేరు. ఆదామును మొదటగా దేవుడు ఏర్పాటులోనికి నడిపించెను. మిశ్రమ జనమును ఎన్నికజనము కొరకు; ఎన్నిక జనమును క్రైస్తవ సంఘము కొరకు; క్రైస్తవ సంఘమును పెండ్లికుమార్తె కొరకు దేవుడు ఏర్పాటుచేసెను.


ఎన్నిక జనమన్ననూ, ఇశ్రాయేలీయులు, యూదులు అన్ననూ అన్నీ ఒకటే. పాత నిబంధన జనమన్నను, హెబ్రీయులన్నను ఒకటే. వీరిని బయటకు తీయవలెను. దేశమును ఇచ్చి లోకరక్షకుని రప్పించవలెను. ఈ జనాంగమును తయారు చేయవలెను. వీరికి ట్రయినింగ్ (శిక్షణ) ఈయవలెను. ఈ గొప్ప పని చాలా సంవత్సరములు పట్టెను.

తరువాత వారిని కనానుకు తీసికొనిపోయెను. ముందు అన్యులను వెళ్ళగొట్టవలెను గనుక సిపాయిలనుగా తయారు చేసెను. ఐగుప్తులో వారు పటాలమును చూచిరి. యెహోషువ ఐగుప్తు సోల్జరు (సైనికుడు)
ఉదా:- మోషే చేతులు దించితే ఇశ్రాయేలీయులు ఓడిపోవుట, చేతులు పైకి ఎత్తితే గెలుపు. ఇక్కడ యెహోషువ అధిపతి. అందుచేతనే యెహోషువ కనానులో 7 జనాంగములను జయించెను.


ఐగుప్తులో దాసులుగా మూల్గుచున్నారు. అడవిలో (సీనాయి ఎడారిలో) చేతులు కట్టుకొనిన విధ్యార్థులు, తర్వాత సిపాయిలు; తర్వాత పటాలము; తర్వాత రాజులుగా వచ్చిరి. ఎన్నిక జనము, దాసులు, విద్యార్థులుగా వారు భటులు తర్వాత రాజులైరి. అరణ్యములో పూజారులైరి. వారు గుడి కట్టుకొనిరి. అది గుడారము, అందులోని దేవుని, పూజించిరి. దేవునియొక్క జ్ఞానము ఏదనగా ఎన్నిక జనమును దాసత్వము అను కాడి క్రింద ఉంచి, తర్ఫీదునిచ్చి రాజులను చేసినది. 40 ఏండ్లలో అరణ్యములో అహరోనుతో పూజారులను; సౌలుతో రాజులను ఆయన ప్రారంభించిరి. ఆలాగే రేపు వెయ్యేండ్లలో సేవకులు కొందరు యాజకులు కొందరు, రాజులు కొందరు అగుదురు (1పేతు. 2:9). రాజులు పరిపాలనలో నుందురు. వెయ్యేండ్లలో గుడిలో ఆరాధన, బయట పరిపాలన ఉన్నది. ఎన్నికజనము వెయ్యేండ్లలో నుందురు. వారిలోనుండి క్రైస్తవులు, వారిలోనుండి పెండ్లికుమార్తె ఎన్నిక జనమగును. పెంతెకొస్తు తర్వాత బేధములేదు, అందరికినీ ఏర్పాటు సమానముగా నున్నది. అయితే, ఈ సంగతి కొందరికి తెలియదు గాని టైము వచ్చినప్పుడు ఆత్మ తండ్రియే తెలియచెప్పును.


అట్టి స్పష్టమైన ఆత్మ ప్రత్యక్షతలో త్రిత్వతండ్రి మనలను స్థిరపర్చి, వెయ్యెండ్లలో రాజుల వరుసలోనికి చేర్చి, పరిపాలించు ధన్యతను అనుగ్రహించునుగాక! ఆమేన్.