సందేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
పాద రక్తధార
కీర్తన 22:1-3; లూకా. 23:27; 1తిమో. 3:2.
బరువు, భారము ప్రయాసపడి మోసికొనుచున్న వారలారా! నాయొద్దకు రండని యేసుప్రభువు చెప్పెను. ఆయనే లోక భారములను మోసికొనుచున్నారు. ఆయనే భారమును మోస్తూ, భారములను మోయుచున్నవారికేమి సహాయము చేయగలడు? గాని భారము మోయువారికి సహాయము చేసెను. అప్పటినుండి సహాయము చేస్తూనేయున్నారు. ఇక్కడ లోకములో ఉన్నవారికి ఎంత భారము! ఏ విషయములో భారము ఉన్నను అది ఆయన తీసివేయగలడు. ఇది మంచి వర్తమానము. బజారులోనుండి ఒకరు బియ్యము బస్తా ఎత్తుకొని వస్తు ఉంటే, మధ్యలో ఎవరైనా ఎత్తుకొని దించిన ఆయనకు ఎంత హాయిగా ఉండును! అలాగే మానవులకు ఏ భారమైనా, ఎన్నాళ్ళ భారమైనా, ఏ రకమైన భారమైనను, మనస్సు శరీర బాధలైనా అన్నీ ఆయన తీసివేయగలడు. ఎందుకంటే ఆయన ఆ భారములను మోయగలడు, మోసివేసినాడు గనుక తీసివేయగలడు. పోయిన వారములలో శిరో, రక్తధారలను గూర్చి చెప్పినాను. ఆ శిరస్సు ముండ్ల కిరీట భారము మోసెను. మరొక వారము హస్త రక్తధారను గూర్చి చెప్పినాను.
నేడు పాద రక్తధారను ధ్యానించెదము.
పాద రక్తధార:- పాదరక్తధారను గూర్చికూడ శిరస్సునకు ఒక పని ఉన్నది. చేతులకు ఒక పని ఉన్నట్లు పాదములకు ఇంకొక పని ఉన్నది. పాదములకు ఉన్న పనులలో ఏ పని ముఖ్యమైన పనో ఆ పనిని తలంచవలెను. మహాముఖ్యమైన పని పాదములకు ఉన్నది. అనగా మన పాదములకు ఉన్న ముఖ్యమైన పని తెలియని వారుండరు. అది ఏది అని అడిగితే, నడవడమే అని అందురు.
పాదములకు ఉన్న పని నడవడమేగాని పాదములయొక్క పని అంతటిలో మహా ముఖ్యమైనదియు, మనము విచారింపవలసిన పనియు ఏది? ఆటలలో చిన్నపిల్లవాడు, పెద్దవానిపైన నిలువబడగా ఒకరిపై ఒకరు నలుగురు నిలువబడినప్పుడు ఎవరికి ఎక్కువ భారము మొదటి వానికే గదా! నేలపై అడుగువేయునప్పుడు, మొదటిగా నేలను తాకునది అరికాలు గాన అరికాలు శరీరమంతటిని మోయుచున్నది. దానికే ఎక్కువ భారము. తక్కిన శరీరమునకు భారమే గాని ఎక్కువ భారము అరికాలుకున్నది. అది మన చరిత్ర. అరికాలికే కాదు. మీ కాళ్ళకుకూడా బరువే. మీ కాళ్ళు శరీరమంతటి భారమును మోస్తున్నవి. యేసుప్రభువుయొక్క కాళ్ళకు మేకులు కొట్టినప్పుడు యేసుప్రభువు లోకభారమంతా మోస్తున్నారు. ఆయనకాళ్లు, దేహ భారమంతా మోస్తున్నవి రెండు సంతోషమే. చేతులు కొంతవరకు సహాయముగాని ముఖ్యభారము కాళ్లకే. పాదములతో చేయుచున్న దుష్టకార్యములున్నందున యేసుప్రభువు మన పాపములకు బదులుగా శిక్ష అనుభవించెను. అది ఎంత కష్టమో మనకు తెలియదు. శరీరమంతటి, భారమును కాళ్లు మోస్తున్నవి. ప్రభువు శరీరమంతటిని, లోకభారమంతటిని ఆయన పాదములే మోస్తున్నవి. నీ పాపములను ఆయనే మోస్తున్నాడు. నా కాడి సుళువని యేసుప్రభువు చెప్పెను. అయితే మన పాప కాడి బరువుగానే యున్నది. మన కాడి మనకు బరుగానే యున్నది గాని అది ఇదివరకే యేసుప్రభువు మోసిరిగాన ఉంటేఉన్నది గాని తేలిక అయినది. కాళ్లతో చేసిన పాపములు మానవులలో ఉన్నవి.
ఒకరి ఇంటిలో దొంగతనము చేయుటకు పాదాలు తీసికొని వెళ్లకపోతే మనిషి వెళ్లగలడా? గనుక ఆ మనిషిని తీసికొని వెళ్లినది పాదములే.
2. మత్తు పదార్ధములయొద్దకు ఈ పాదములే, సొమ్ము ఉన్నను లేకపోయినను; ఇష్టమున్నను లేకపోయినను తీసికొని పోవును
3. కలహ స్థలమునకు మనిషిని పాదాలే తీసికొని వెళ్లుచున్నవి. గనుక పాదములతో మనిషిచేసే నేరములున్నవి. సామితె కలదు అతగాడు "కలహానికి, కయ్యానికి కాలు దువ్వుననేది" కలదు. దానినిబట్టి పాదముల పాపము బైటపడుచున్నది గనుక ఎవరైనా ఎప్పుడైనా వారి పాదములతో పాపముచేసినా ప్రభువు దగ్గర పశ్చాత్తాపము పడిన ఆయనకు సంతోషము లేని యెడల విచారము.
ఒకరి పాదములు ఒకరి భారము మోయవలసిన దానికి బదులు ఇంకొకరికి భారము కలిగించుచున్నవి. ఎవరికైనా కోపము వచ్చినప్పుడు కర్రలేక, కాలితోనే తన్నివేస్తారు. అట్టి వారు ఎప్పుడు ఉంటారు. అయితే పాదముల పాపములు ఇంకా ఉన్నవి గాని ఇంతవరకు చాలును.
యేసుప్రభువు మన పాదముల పాపములు పరిహరించు నిమిత్తము సీలలు కొట్టించుకొని పరిహరించెను. ఆయన పాదములతో రక్తము చిందించెనని నమ్మితే మన పాదముల పాపములకు పరిహారము కలుగుచున్నది. ఇట్టి గొప్ప ఉపకారము కలుగజేసిన ఆయన పాదములతో ఎవరిని తన్నలేదు. పాదములతో కొట్టువారు తక్కువమంది. చేతులతో కొట్టువారు ఎక్కువ. బూతులతో కొట్టువారు మరీ ఎక్కువమంది.
మనము శిరస్సుతో, హస్తములతో పాదములతో ప్రభువును స్తుతించేవారముగా ఉండవలెను. గాని పాపములు చేసే వారముగా ఉండకూడదు.
ఇప్పుడాయన లోక శరీర పాదములకు మనకున్న రక్తము లేదు గాని పాదములలో మహిమ రక్తమున్నది. అది శ్రమలవల్ల ప్రవహించేదిగాదు గాని రక్షించే విశ్వాసుల పాదములమీద ప్రవహించేదైయున్నది.
ప్రక. 1వ అధ్యాయములో యోహాను గారికి రక్త సిక్త పాదాలు కాదుగాని అపరంజి పాదములు, మహిమ శరీరము కనిపించెను. అట్టి దర్శనమందుకొనుట కొరకు మనము శిలువమీద తన మానవ పాదములకు ఆయన కొట్టించుకొన్న సీలలను తలంచి ధ్యానించుకొందము.
పాట: నాయన్నా సిలువలోనీ వాయాసవడిననాటి -నీ యంఘ్రీయుగము (పాదములు) నిపుడు-నా యాశదీరజూతు ॥నాయన్న రాగదే॥