జ్ఞాతవ్యము 7: Father M. Devadas
పునరుత్థాన జ్ఞాపకము
“నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసికొనుము” - 2తిమోతి 2:8.
యేనుక్రీన్తును జ్ఞావకము చేసికొనుము అనుమాట మహాముఖ్యమైనమాట. ఎవరిని జ్ఞావకము చేసికొనవలెను? యేసుప్రభువును. ఈ జ్ఞాపకంలో జన్మము, పునరుత్థానము రెండును ఉన్నవి. ఈ రెంటిమధ్య జరిగిన క్రీస్తుచరిత్రను జ్ఞాపకము చేసికొనవలెను.
ఇప్పుడు ఇంకొకటి జ్ఞాపకముచేస్తాను. మనము పుట్టినపుడు ప్రభువు మనలో రెండు శక్తులు పెట్టెను. అవి చాలా ఉన్నవిగాని ఈవేళ ఎంచినవి రెండు. ఇవి విశ్వాసులలో, అవిశ్వాసులలో, ఆయా మతములలో నున్నవారిలోను, చనిపోయినవారిలో, ఇప్పుడున్న వారిలో, లోకాంతము వరకు పుట్టువారిలోను నున్నవి.
- 1. జ్ఞానశక్తి
- 2. మనోశక్తి (మనస్సాక్షి).
జ్ఞానమునకు రెండుపనులు. జ్ఞానము ఏది మంచిదో, ఏది మంచిదికాదో తెలిసికొనగలదు. బేటరీలైటు నొక్కితే ఆ వెలుతురులో అన్ని కనబడును. అట్లే జ్ఞానము మంచి చెడ్డలన్ని చూడగలదు. జ్ఞానమునకు రెండును కనబడును. మన కంటికిని రెండు కనబడును.
- 1) శరీర నేత్రము
- 2) జ్ఞాననేత్రము;
ఈ రెండు కన్నులలో జ్ఞాననేత్రమే గొప్పది. ఎందుకంటే మనిషి ఇక్కడేఉండి, ఈ కంటితోచూస్తే ఇక్కడిదే కనబడును. అయితే జ్ఞానము అన్నిలోకములలోనిది, నక్షత్రములలోనిది, నదులలోనిది, అన్నీ ఊహవలన తెలిసికొనగలదు. జ్ఞానము, మనస్సాక్షి రెండు ఒకటేగాని తేడా ఉన్నది. ఈ శరీరమనే గృహములో ఈ రెండు శక్తులున్నవి. రెండు ఒకటేగాని తేడా ఉన్నది. 1. జ్ఞానమునకు రెండు పనులు, మనస్సాక్షికి రెండు పనులును ఉన్నవి.
దృష్టాంతము:- దేవదాసు అయ్యగారు ఒకప్పుడు ఒక పెండ్లి విందుకు వెళ్ళినారు. ఆ పెండ్లి ఇంటివారు శూద్రులు మరియు వారు యేసు ప్రభువును అంగీకరించినవారు. ఆ వివాహమునకు క్షత్రియరాలైన ముసలి తల్లి, యుక్త వయస్సుగల ఆమె కుమార్తె కూర్చున్నారు. వారికి విస్తర్లు వేసి వాటిలో అన్ని వడ్డించిరి. పిల్ల అన్నం తింటున్నది. తల్లి అన్నం కలిపి తినకుండ అటు ఇటు చూస్తున్నది. నోటిలోని ముద్ద ఆకు క్రింద ఊసినది. అట్లెందుకు ఊసినది? అక్కడ తల్లి, పిల్ల ఇద్దరే కూర్చున్నారు. అన్ని బాగానేయున్నవట అనగా కూర, చారు. వంటపాకం బాగానే కుదిరింది గాని తల్లి తినుటలేదు. ఎందుకనగా మనస్సు ఒప్పలేదు. జ్ఞానమునకు బాగుగానే ఉన్నదని తెలిసింది గాని మనస్సు ఒప్పలేదు (మనస్సాక్షి ఒప్పుకోలేదు). జ్ఞానమునకు మనస్సునకు నచ్చితేనే ముద్ద కడుపులోనికి దిగును.
- 1. జ్ఞానము బాగున్నదని చెప్పుట,
- 2. మనస్సు అంగీకరించుట ఇదే వాటి వాటి పని.
పిల్లకు మాత్రము రెండును కుదిరెను. జ్ఞానము బాగున్నదని చెప్పగా మనస్సాక్షి అంగీకరించింది గనుక పిల్ల తింటున్నది. తల్లికైతే మనస్సాక్షి అంగీకరించుట లేదు. గనుక ఒక్క జ్ఞానం మాత్రమే అంగీకరించితే చాలదు, మనస్సాక్షికూడ దానిని అంగీకరించాలి. అన్నం ఊచే తల్లిని పిల్లచూచి, “ఏం బడాయియమ్మా! తినక” అన్నది. తల్లియొక్క జ్ఞానము ప్రక్కన అజ్ఞానము కూర్చున్నది. గనుక ఆమెకు ముద్ద దిగలేదు.
“పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది” తిమోతి 1:15. రక్షించుటకు ప్రభువు వచ్చినారని తెలియును, గాన అంగీకారము అవసరము. ప్రభువు తీర్పుచేయునపుడు, “నీవు నేరస్తుడవు, నరకమునకు వెళ్ళుము” అని అంటే, “ప్రభువా! నాకు నీ సంగతి తెలియదు" అని అంటే, "పలానా ఊరిలో, నా బోధకుడు చెప్పినపుడు, నీవు తెలిసినదని అంటివిగదా!” అని ప్రభువు అడిగిన యెడల, నాకు తెలియలేదని జవాబు చెప్పుటకు నోరురాదు. అప్పుడు చెప్పినది నాకు తెలిసినదిగాని మనస్సునకు అంగీకారము కాలేదనును. అపుడు ప్రభువు- “నేను నీకు రెండు ఇచ్చినాను, నీవు అంగీకరించలేదు గాన శిక్షతప్పదని” శిక్షించును. లోకమును విడువకముందు
- జ్ఞానమునుబట్టి తెలిసికొని
- మనస్సాక్షిని బట్టి ఇష్టపడవలెను.
ఈ రెండు శక్తులు దేవుడు ఎందుకిచ్చినాడంటే తెలిసికొని ఇష్టపడుటకు ఇచ్చెను. తెలిసికొనేశక్తి జ్ఞానములో పెట్టినట్లు, ఇష్టపదేశక్తి మనస్సాక్షిలో దేవుడు పెట్టినాడు. ఇష్టపడకపోతే ఎవరిది నేరము? గనుక ఈ రెంటినిబట్టి నరుడు అంగీకరించవలెను.
లోకములో కొందరు దేవుడున్నాడని నమ్ముచున్నారు. కొందరు దేవుడు లేడనుచున్నారు. కొందరు దేవదూతలున్నారనుచున్నారు, కొందరు లేరనుచున్నారు. అనేకులు సైతాను ఉన్నదనుచున్నారు, అనేకమంది లేదనుచున్నారు, కొందరు దయ్యములున్నవనుచున్నారు, కొందరు లేవనుచున్నారు. కొందరు మనము బాగా నడిస్తే మోక్షమంటున్నారు, కొందరు మోక్షములేదు, నరకములేదు చనిపోతే ఆత్మ గాలిలో కలిసిపోతుందనుచున్నారు. కొందరు తీర్పున్నది మోక్ష నరకములున్నవి అనుచున్నారు. కొందరు ఆ రెండులేదనుచున్నారు. దేవునికి అనుకూలముగా నడిస్తే మోక్షము, నడువకపోతే నరకము. ఈ రెండు వరుసలు లోకములో ఉన్నవి. దేవుడున్నాడని నమ్మే వరుసలోనివారు చాలామంది. లేడనే వరుసలోనివారు తక్కువమంది దేవుడు లేడనువారు అన్నిటికి సున్నా చుడుతున్నారు. దేవుడున్నాడు అనువారు, దేవునిలో సమస్తమును ఉన్నవని సమస్తమును సంపాదించుకొందురనుచున్నారు. కొందరు దేవుడు లేడు, దేవునితో ఏమిలేవు, దేవునిలో ఏమిలేవనునుచున్నారు. దేవుడున్నాడను వారు - “నిన్ను నేను విడువను దేవ - నన్ను నీవు దీవించు వరకు” అని. దేవుడు మనిషిలో జ్ఞానము పెట్టినాడుగాని, దానిప్రక్కను అజ్ఞానమువచ్చి కూర్చున్నది.
2వ కథ:- ముందు చెప్పిన కథలో అన్నము తిన్న అమ్మాయి వద్ద తినని అమ్మ కూర్చొనినట్టే, అలాగే మంచి మనస్సు జ్ఞానము వద్ద గాలిలోకము నుండి అజ్ఞానము వచ్చి కూర్చొన్నది. ఏది శరీరమునకు మంచిదో, ఏది మనస్సునకు మంచిదో బోధించేదో అదే జ్ఞానం. కావున దేవుని దగ్గరనుండి వచ్చిన జ్ఞానమునకును గాలిలోకము నుండి దిగివచ్చిన అజ్ఞానమునకును కలిసి జరిగే వాదములో ఏది మన ఆత్మకు, శరీరమునకు ప్రయోజనకరమో దానిని తెలియజేయునదే మనస్సాక్షి ఈ మనస్ఫాక్షికే మనోశక్తి అనిపేరు. ఆదికాలమునుండి ఈ సృష్టిలో దేవుడు చేసిన కార్యములన్నియు ఆయన మానవునకు తన జ్ఞానముద్వారా బోధించెను. ఆ జ్ఞానములో అజ్ఞానము ప్రవేశించినందున, దేవుడు తన సంగతులను మనస్సాక్షిద్వారా చెప్పించెను. అయినను మనస్సాక్షి చెప్పినదియు మానవుడు విననందున దేవుడు ఇంకొక పనిచేసెను. అదేదనగా తన చరిత్ర అంతయు అనగా తన పుట్టుకనుండి పునరుత్థానము వరకు గ్రంథముగా వ్రాయించి ఇచ్చెను. వ్రాయించిన ఆ గ్రంథమును చదువుకొనియైనను నరుడు నమ్మవలెను. వ్రాత వాగ్ధానమును తప్పక నమ్మవలెను. ఈ వ్రాత గ్రంధమే బైబిలు.
ఉదా:- ఒకరికి ఒకరు 50 రూపాయలు ఇస్తాననెను. గాని ఇచ్చేవారకు, ఇచ్చునో లేదో అని అనుమానముండును. అపుడు నమ్మకమునకు ఏమిచేయును? నోటు వ్రాసి ఇచ్చును. అట్లే తండ్రియైన దేవుడు తన గ్రంథమును వ్రాసియిచ్చెను అనగా దేవుడు నరుడుగా జన్మించి యేసుక్రీస్తు అనుపేరు పెట్టుకొని, నడిచిచూపించి, తన ప్రాణరక్తమును ధారపోసి చనిపోయి తిరిగిలేచిన చరిత్రను వ్రాసి ఇచ్చెను. ఇది నరుడు నమ్మవలెను.
- 1. జ్ఞానము చెప్పినది నమ్మలేదు.
- 2. మనస్సాక్షి చెప్పినది నమ్ముటలేదు.
- 3. భక్తులతో చెప్పించినను నమ్మలేదు.
- 1. జ్ఞానము
- 2. మనస్సాక్షి తీర్పు దగ్గరకు వచ్చును.
భూలోకములో సంతోషము, సుఖము ఉండును. అయితే పరలోకములో నిత్యానందముండును. ఈ పాఠము యొక్క వాటము తెలిసినదా? ఇప్పుడు నేను మాటలాడినది ఎంతసేపు? గడియారము ప్రకారము ఒక గంట. అయితే మీకు ఐదు నిమిషములవలె ఉన్నది. మరి ఏది నిజము? గడియారముదే నిజము. అల్లే వాయించిన గ్రంథములోనిదే నిజము. జ్ఞానము చెప్పేది నిజమేగాని జ్ఞానముకంటే బైబిలు చెప్పేది నిజము. బైబిలు చదివిన మరింత నిశ్చయము తెలియును. ఎంత చదివిన అర్ధముకాని వారికి అయ్యగారు ఒక ప్రార్ధన కల్పించిరి. అది వాక్యమునకు, సంఘమునకు వ్యతిరేకముకానిది.
- 1. దేవా! నాకు కనబడుము
- 2. నాతో మాట్లాడుము
- 3. నా ప్రశ్నలన్నిటికి జవాబు చెప్పుము.
- 4. అవి అన్నీ వ్రాసికొందును అని ప్రార్థించిన సంపూర్ణముగ తెలియును.
ప్రార్థన:- తండ్రీ! ఈ పాఠము మా హృదయములో ముద్రవేయుము. దస్తావేజుమీద ముద్రవేసినట్లు నీ పరిశుద్ధాత్మవల్ల ముద్రవేసి శాశ్వతముగ ఉండునట్లు చేయుమని ప్రభువుద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
ఈ పై సందేశమును దైనజనులైన యం. దేవదాసు అయ్యగారు. 1954 సం॥ము మార్చి 30న తేదీన ఉపదేశించిరి.