జ్ఞాతవ్యము 7: Father M. Devadas
ఎజ్రా 3:1-5.
ఇశ్రాయేలీయులు పాపము చేసినందువల్ల దేవుడు వారిని ఇతర దేశములకు ఖైదీలుగా పంపినాడు. అక్కడవారు గోల పెట్టిరి. అప్పుడు దేవుడు వారిని కనికరించి, వారి స్వదేశమైన పాలస్తీనాకు వారిని తీసికొనివచ్చినాడు. ఈ విధముగా దేవుడు ఇశ్రాయేలీయులకు మేలుచేసినాడు. వారు పాపులైనప్పటికిని, వారి పాపములను వారు ఒప్పుకొని, ప్రార్ధనచేసినందువల్ల దేవుడు వారిని క్షమించి, స్వదేశమునకు రప్పించినాడు. పాపమువలన జబ్బులు, పాపమువలననే చిక్కులు మొ॥నవి వచ్చును. పాపములను తీసివేయగల దేవుడు ఆ పాపమువలన వచ్చిన పాపఫలితములు తీసివేయడా? పాపము గడ్డెనదా? పాపఫలితము గడ్డెనదా?
వారు స్వదేశమునకు వచ్చిన తర్వాత వారిలో కలిగిన మార్పు :- 1. ఐకమత్యత, అందరు ఒక్కమాటమీదనే నిలువబడిరి. ఎందుచేతననగా అందరు అక్కడ ఒకే మేలును పొందిరి గనుక అందరు ఒకేమాటమీద నిలువబడిరి. గాని యిప్పుడు లోకములో అదేలేదు.
- 2. క్రైస్తవులలో లేని ఐక్యత
- 1) అన్యులలోను
- 2) జంతువులలోను
- 3) పక్షులలోను
- 4) చెట్లలోను ఎట్లుండును?
ఈ ఐక్యతను గూర్చిన విషయము కార్యముల గ్రంథము 2వ అధ్యాయములోను ఉన్నది. శిష్యులు ఏకముగాకూడిరి. వారు ఏకముగా కూడిరి గనుక ఏదైన చేయగలరు. ఇక్కడ యూదులును
- 1. ఏకముగా కూడిరి
- 2. దేవుని కృతజ్ఞతకి చూపించుటకై బలిపీఠమును కట్టించిరి.
ఈ రెంటిలోను విడ్డూరములేదు. ఎందుకనగా అక్కడ ఏకమైనారు. అనగా పరదేశములో ఏకమైరి. ఇక్కడ దేవునికి కృతజ్ఞతను చూపించిరి. దేవా! ఇతర దేశములనుండి స్వదేశమునకు తీసికొనివచ్చినావని దేవునికి స్తోత్రముచేసిరి. వారు వెనుకటి పాపమును తలంచలేదు. గనుకనే వారు సంతోషముతో బలిపీఠము కట్టిరి. ఆ తరువాత మందిరమునుకట్టి మోషే ధర్మశాస్త్రమును తెచ్చినారు. ఆ శాస్త్రము పేరు యూదుల గ్రంథము; మనకు ఇవ్వబడినది కొత్తనిబంధన. ఈ రెండు కలిపితే అది బైబిలు అయినది. అది యూదుల గ్రంథము. గనుక వారు ఆ పండుగలను ఆచరించిరి. ఒకరు ఒకదానికి అలవాటుపడిన యెడల వారు మరియొక దానికికూడ అలవాటువడగలరు. వారు స్వదేశములో నున్నపుడు విగ్రహారాధన చేయుటకును అలవాటుపడిన వీరు ఏకమనస్సుగలవారైరి. చెడుగును విగ్రహారాధన చేయుటకు ఇతర దేశములోకూడ దేవునితట్టు తిరుగుటకు ఏక మనస్సుగలవారైరి. దీనిలోను విడ్డూరములేదు.
- 1. ఏక మనస్సుగలవారై యుండుటయు,
- 2. బలిపీఠమును కట్టుటలో ఏకీభవించుటయు,
- 3. ధర్మశాస్త్రము జ్ఞాపకము చేసికొనుటయు,
- 4. దీనినిబట్టి పండుగలు చేసి, బలులు అర్పించుటయు
- 5. ఇవిగాక స్వేచ్చార్పణలు చెల్లించుటను బట్టియు ఏమియు ఆశ్చర్యము లేదు.
తేడా:- లోకమునకు యేసుప్రభువు రక్షకుడుగా రానైయున్నాడు. ఆయన సిలువపై బలి కాబోవుచున్నాడని ముంగుర్తుగా బలిపీఠము మీద బలులర్పించిరి. అసలు బలి యేసుప్రభువే. అసలు బలి ఇంకా రానందున వారు ఈ బలులు అర్పించి తృప్తిపడినారు.
స్వేచ్చార్పణ అనగా ఇష్టముతో తెచ్చి అర్పించినది. వారు ఏమితెచ్చినా, ఎంత తెచ్చినా అవి విడ్డూరములు కావు.
- 6వది విడ్డూరము అదేదనగా, వారు ఈ దేశములో ఇవన్నీ చేసేటప్పుడు వారి గుండె కొట్టుకుంటుంది. బెదురుచూపులు చూచారు. శత్రువులనుగూర్చి
- 1) శత్రువులు వస్తారు
- 2) మీద పడతారు అనే భయము ఉన్నప్పటికిని పై కార్యములు చేసిరి. అట్లుచేయటయే విడ్డూరము.
ఇప్పుడు పొరుగూరునుండి వచ్చినవారికి శరీరమునకు కష్టములున్నవి. మనసులో బాధలున్నవి. ఇవి ఉన్నప్పటికిని వారు సంతోషించాలి. చేయవలసినవన్నీ చేయాలి. భయమున్నవ్పుటికిని చేయట మానకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు భయమున్నప్పటికిని పై 5 విషయములు చేసినారుగదా? అల్లే పొరుగూరు నుండి వచ్చినవారును ఈ విషయములన్ని చేయవలెను. అట్లు చేయని యెడల ఈ బోధ ఫలితముండదు.
అయ్యగార్కి ఆరోగ్యము లేకున్నా గట్టిగా చెప్పలేకపోయినా, మీవలె తిరగలేకపోయినా పాఠమును ఎట్లు చెప్పుచున్నారో, అలాగే మీకు కష్టములున్నా శత్రువులున్నా మీరు చేయవలసినది చేయుట మానకూడదు.
ప్రార్ధన:-
- 1వ మనవి :- ఓ దయగల తండ్రీ! ఇప్పుడు పొరుగూరునుంచి వస్తువస్తూ, కష్టములనే మూట కూడ తీసికొని వచ్చిన వీరు, ఈ మూట పారవేసి నిన్ను స్తుతించేటట్టు శక్తి దయచేయుము. ఇశ్రాయేలీయులు అప్పుడు చేసిన పనులన్నియు కలిసి ఒక స్తోత్రమైనది, స్తుతియైనది. అలాగే ఇకమీదట ఈ కష్టములను విడిచిపెట్టి సత్కార్యములు సాగించితే అదే స్తుతి, అదే ఘనత. అట్లు చేసే కృప వీరికి దయచేయుము.
- 2వ మనవి :- వీరు ఇంటికి వెళ్ళేటప్పుడు తమ పాపములుగాని, కష్టములుగాని ఏ మాత్రమును జ్ఞాపకము తెచ్చుకొనకుండే కృప దయచేయుము.
- 3వ మనవి :- దయగలప్రభువా! దూరమునుండి నడిచివెళ్ళునపుడు వీరి కాలికి ధూళి అగును. అప్పుడు ఇంటికివచ్చి నీళ్ళు తీసుకొని కాళ్ళు కడుగుకొందురు. అప్పుడు అయ్యో ధూళి పోయిందే అని, ధూళి కడిగివేశానే అని ఎవరును విచారపడరు. ఆలాగే వీరు కష్టములను మీరు కడిగివేసినందున మరలా వాటికొరకు వీరు విచారపడకుండా ఉండే కృప దయచేయుము.
- 4వ మనవి :- ప్రతిదినము ఇక్కడ మేము చదువుకొను ప్రకారము వీరును, వీరి గృహములలో అనుదినము బైబిలు చదువుకొని ధ్యానించే కృపనిమ్ము.
- 5వ మనవి :- ప్రతిదినము వారికొరకు, ఇతరుల కొరకు పట్టుదలతో ప్రార్ధించే కృపనిమ్ము.
- 6వ మనవి :- ఆదివారము ఎన్ని పనులున్నప్పటికిని గుడికి వెళ్లేటట్లు కృప దయచేయుము ఇష్టమున్నా, లేకపోయినా, ఆరాధనలో ఏకీభవించు కృప దయచేయుము.
- 7వ మనవి :- ఇబ్బందిగా ఉన్నప్పుడు సహితము గుడిలో చందా ఇచ్చే కృప దయచేయుము.
- 8వ మనవి :- తమకు తెలిసినటువంటి ఏ పొరపాటు చేయకుండా పవిత్రముగా ఉండే కృప దయచేయుము.
- 9వ మనవి :- తమకు తెలిసిన బైబిలుకథలు చెప్పుట చేతకాక పోయినను, ఇతరులకు చెప్పగలిగే శక్తి దయచేయుము.
- 10వ మనవి :- అన్నిటిలో జాగ్రత్తగా ఉండి ప్రభువుయొక్కరెండవ రాకడకు సిద్ధపడకపోతే ముందున్న 9 పనులు సున్నాలే. గనుక జాగ్రత్తగా ఉండి రాకడకు సిద్ధపడే కృప దయచేయుము.
- 11వ మనవి :- ప్రయాణములో దూతయొక్క సహాయము దయచేయుము.
- 12వ మనవి :- వచ్చినవారినేగాక వారి స్వజనులనుకూడా దీవించుము.
- 13వ మనవి :- ఈ 12 ప్రార్ధనలు మాత్రమేగాక ఇంకను మేము మరచిన ఇతర ప్రార్ధనలుకూడా అంగీకరించుము.
ఈ 13 ప్రార్ధనలు నెరవేరేటట్టు దీవించుమని మిక్కిలి త్వరగా వస్తున్న యేసుప్రభువుద్వారా మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము. ఆమేన్.