జ్ఞాతవ్యము 7: Father M. Devadas
(విశ్వాసిని పీల్చి పిప్పి చేయు ఏడు అదృశ్య దేవతలు)
దేవత: అధికారిగా ఉండి మనలను నడిపించే శక్తి
- 1. భయము:- భయపడుటకన్ని కారణములున్నను భయపడరాదు. మనచుట్టు పగవారు, పాపములు, పాపఫలితములు, వ్యాధులు, విషజీవులు, విషక్రిములు, భూకంపములు, కలహములు, ఇబ్బందులు, సిబ్బందివలె శ్రమలు మొదలగునవి గలవు. వీటన్నిటినిచూచి ప్రభువు చెప్పునది యేమనగా “భయపడవద్దు”. దినమునకు ఒక వాగ్ధానము చొప్పున, సంవత్సరము పొడుగునా మనకు 365 దైవవాగ్ధానములు కలవు. మనచుట్టు భయపెట్టు భయంకర సంగతులున్నను ప్రభువు మనలోనున్నాడు. కావున భయపడకూడదు. నోవహు జలప్రళయ కాలములో చుట్టు భయపెట్టు సంగతులున్నను ఓడలో తండ్రియున్నాడు కావున భయపడలేదు. ఆలాగుననే మనమును భయపడరాదు.
-
2. అపనమ్మిక:- ప్రభువు నా ప్రార్ధనలన్ని ఆలకించెడివాడని నమ్మి, అవి త్వరగా నెరవేరకపోవుటచూచి అపనమ్మిక పుట్టును. ఇది విశ్వాసములో నుండియే పుట్టును. పరలోకములో దేవదూతలలోనే పాపము ప్రవేశించినది. గనుక మనము జాగ్రత్తపడి అపనమ్మికను దరిచేరనీయకూడదు.
పేతురు కొంతవరకు నీళ్ళమీద నడిచి కెరటములను చూచి అపనమ్మిక వచ్చినందున మునగ నారంభించెను. వెంటనే ప్రభువు గద్దించి లేవనెత్తెను. ఈలాగు మనము కెరటములవంటి శ్రమలమధ్య ఉన్ననూ, శక్తిగల్గిన ప్రభువు మనలను నడిపించుచున్నాడని మన విశ్వాసమును వృద్ది చేసికొనవలెను గాని అవిశ్వాసపడరాదు. పేతురునకు మొదట విశ్వాసముండెను కాని మధ్యలో సందేహపడెను. కావున అల్ప విశ్వాసియనబడెను. ఓ అల్పవిశ్వాసీ! నీవు అవిశ్వాసపడరాదు. - 3. వెనుకాడుట:- అనగా వెనుకదీయుట. ఇదియు అపనమ్మికయును, అక్కచెల్లెండ్రు. ఒక మంచిపనిని చేయుటకు బయలుదేరి మరలా వెనుకాడుట. ప్రభువుకొరకు మనము యే మంచికార్యము చేయ మొదలుపెట్టినామో అది ముగియు వరకు వెనుకాడరాదు.
- 4. విచారము:- “అది లేదు యిదిలేదు, అది నెరవేరలేదు, యిది నెరవేరలేదు” అని తలంచుటే విచారపడుట. అబ్రహామునకు కుమారునిచ్చుటలో దేవునికి అసాధ్యమేదియు లేదు. అబ్రహామునకు వృద్ధాప్యము అడ్డముగాని దేవునికి అడ్డములేదు. తన కుమారునినే తండ్రి మనకు యిచ్చియుండగా, సమస్తము మనకెందుకివ్వడు! ఆయన తండ్రి మనము బిడ్డలము కావున తప్పక ఆయన మనకు ఇవ్వవలసినవన్నియు ఇస్తాడు.
- 5. బలహీనత:- క్రమముతప్పి తినుటవలన మనశరీరమునకు నీరసము వచ్చును. ఆలాగుననే ఆత్మీయజీవనములో క్రమము తప్పినందువలన ఆత్మీయ జీవనములో బలహీనులమగుదుము. క్రమము తప్పుట అనగా అక్రమముగా చేయుట. కావున, ప్రతి బలహీన సమయములోను ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి బలవంతులైయుండుడి.
- 6. అజ్ఞానము:- నేను ఎన్ని దినములనుండియో పట్టుదలతోను, స్తుతులతోను, ప్రార్ధన చేయుచున్నాము గాని నెరవేరుటలేదు. ఎందుచేతనో యేమో అందుము. ఇదియొక రకపు అజ్ఞానము. ఇది మనము కలిగియున్న యెడల వ్రభువా! నాకు జ్ఞానోదయము కలుగజేయుమని ప్రార్ధించవలయును. పిల్లి యెలుకను పట్టుకొని పీడించినట్లు, విశ్వాసులను అజ్ఞానము పీడించును. “ప్రభువు - నాయొద్ద నేర్చుకొనుడని” చెప్పెను. ప్రభువుయొధ్ధ మనకు అన్నియు తెలియును. విశ్వాసులకిట్టి అజ్ఞానముండకూడదు. చిన్నపిల్లల బాప్తీస్మము తప్పని బాప్టిస్టువారును, భాషలు మాట్లాడవలెనని పెంతెకొస్తువారునూ; ఈరీతిగా ఆయా మిషనులు ఆయా రీతులుగా పంతములు, పట్టింపులు పట్టుట అజ్ఞానము. పరలోక పరిశుద్ధులు కూటమునకు వస్తే వారిని చూడకపోవుట మరియెక అజ్ఞానము. తప్పులు తెలిసినను సమర్ధించుకొనుట మరియొక అజ్ఞానము. తాము జ్ఞానులు అనుకొన్న వారనేకులు ఆత్మీయ అజ్ఞానములో పడిపోవుచున్నారు.
- 7. మందస్థితి:- కొందరు మందముగ యుందురు. మరికొందరు మహా ఉద్రేకముగా యుందురు. తీరా ప్రభువు రాకడ వచ్చినపుడు మందముగా నుందురు. జబ్బువలన, తిండివలన, విచారమువలనను; "ఇంకను ప్రభువు రాలేదు" అని విసుగుదుదలజెంది, ప్రభువు రాకడకు మందముగాయుందురు.
షరా:- రాకడకు సిద్ధపడు ప్రతి విశ్వాసియు, ఈ 7 అదృశ్య శక్తులను సమూలముగా నాశనము చేయవలెను. అప్పుడు ప్రభువు పొందిన జయము మనమును పొందగలము. అట్టి దివ్యమైన ధన్యత మహాగొప్ప విజయము ఆత్మతండ్రి మనకు అనుగ్రహించునుగాక! ఆమేన్.