జ్ఞాతవ్యము 7: Father M. Devadas


దేవుడు కనబడుట - మాట్లాడుట
అపో. కార్య 1:1-11. దేవుడు కనబడుట ఎందుకు?


అంతరార్థముల చివర ఆరోహణమాయెను. ఇది కనబడుటయే గాని మాయమగుటకాదు. మేఘము మాత్రము అడ్డము వచ్చెను గనుక ఆరోహణమునకును మాయమగుటకును భేదముకలదు. ఆయనను నమ్మినవారందరికి ఆయన కనబడుచు వచ్చెను. రూపము మాత్రము కొంచెము తేడాగా నుండెను. వారందరు 33న్నర సం॥లు జీవించినవాడు ఈయనే అని అనుకొనిరి. ఆయన కనబడకపోయినట్లయితే వారి విశ్వాసము పోవును. గనుక ఆయన కనబడుచూ వచ్చెను. ఈ కనబడుట అనునది ఆయన ప్రేమనుబట్టియేగాని వారి విశ్వాసమునుబట్టికాదు.

  1. ఇదివరకు శరీరధారిగా ఉన్నప్పుడు కనబడకుండుట మాత్రమేగాక, ఇపుడు దేవుడు గనుక ఆయన పూర్తిగా మాయమైపోగల శక్తిగలవాడు. ఈ తేడా శిష్యులు గుర్తించి, ఆయన నిజముగా దేవుడే అని గ్రహించుటకు.

  2. ఇప్పుడు ఆత్మీయరీతిగా చనువు ఇచ్చుచున్నాడు. ఇకముందుకు ఆయన ఆరోహణమగును. అప్పుడు శిష్యులు హడలిపోవుదురు. గనుక అట్లు హడలిపోకుండ ఉండుటకు గాను కనబడుచు, మాయమగుచూ వారికి అలవాటు చేసెను.

  3. మరియు రాజ్య విషములు అనగా వారు ఇదివరకు గ్రహించని విషయములు వారికి బోధించుటకు ఇప్పుడు 11సార్లు కనబడెను. ఆయన మాటలు, క్రియలువారు ధ్యానించుటకు ఆయన మాయమగుచు వచ్చెను.

  4. శిష్యులు అందరును ఒకస్థలమందు కూడుకొని, తమకు ప్రభువు కనబడిన సంగతులు మాట్లాడుకొనేటట్లు చేయుటకు ఆయన కనబడుచూ మాయమగుచు వచ్చెను.

  5. ఆయన ఆరోహణ దినమందు ఏదియు తొందరగా చేయక, అంతర్థానమగు వరకు, ఒక పని తరువాత ఒక పని క్రమముగా చేసే పనియొక్క చార్జి (బాధ్యత) అప్పగించి, దీవిస్తూ దీవిస్తూ పరలోకమునకు వెళ్ళిను. మా రక్షకుడు, మృతుడుగా లేడు సజీవుడుగానే యున్నాడు. ఎక్కడో ఒకచోట బ్రతికియున్నాడు. ఫరవాలేదని ఇంటికివెళ్ళిరి. ఇదే ఆరోహణముయొక్క కథ ముఖ్యపాఠము అది ప్రభువు నేర్పడానికి నెమ్మదిగా వెళ్ళిపోయెను. అపో.కార్య. 1:3.

  6. ప్రభువు సజీవుడై ఎత్తబడిన రీతిగానే సంఘము సజీవ సంఘముగా రెండవ రాకడలో ఎత్తబడవలెను.

  7. ఆయన ఆరోహణమును సంఘము తదేకముగాను, మనోనిదానముతోను ధ్యానించిన యెడల ఆయన ఆరోహణశక్తిని అందుకొనగలదు.
అట్టి మహిమ ధన్యత కూడియున్న వారికి త్వరగా వచ్చుచున్న వరుడు అనుగ్రహించుగాక!

ఈపై సందేశమును దైనజనులైన యం. దేవదాసు అయ్య గారు 1941 సం॥ము మే 22న తేదిన ఉపదేశించిరి.