జ్ఞాతవ్యము 7: Father M. Devadas



ఆరోహణ పండుగ అనగా ప్రభువు పరలోకము వెళ్ళిన దినము జ్ఞాపకము తెచ్చుకొను దినము. అలాగే మిగిలిన పండుగలును ఆయా విషయములును జ్ఞాపకము తెచ్చుకొను దినములైయున్నవి.


ప్రభువు చరిత్రలోని అంశములు ధ్యానించిన మనకు పరలోక జీవనవృద్ధి కలుగును. పండుగల సమయములలో ఇతరులను పిలుతుము. ఆలాగే ప్రభువు చరిత్రనుబట్టి మనము చేయు ప్రతి పండుగలోను, పరలోక పరిశుద్ధులను, దేవదూతలను పిలువవలెను.

ప్రభువు చరిత్రలో

1. ప్రవచన రూపమనగా ప్రభువు పుట్టకముందే వ్రాసినది. అనగా వాగ్దాన రూపములో వ్రాసినది. ఆయన పుట్టకముందే రోగులను స్వస్థపర్చుట, మరణ, పునరుత్ధాన, ఆరోహణములు జరుగునని భక్తులు వ్రాసిరి. ప్రవచన రూపములో భవిష్యత్తు వ్రాయబడినది. ప్రవచన రూపములోనున్న ప్రభువు చరిత్ర మొదటి గ్రంథము, అనగా పాతనిబంధన.


ప్రభువు పుట్టకముందు 4వేల సం॥ల వరకు ఈ ప్రవచన గ్రంధ స్వరము వినబడుచున్నది. పరలోక వాయిద్యము వలన ఆ వాక్కు వినబడుచున్నది. ఇది భక్తులు వ్రాసి ఉంచినారు. ఇదియే పాతనిబంధన గ్రంథము. ఇందులో ప్రభువు జీవన చరిత్ర, ఆయన లోకరక్షకుడుగా స్త్రీ సంతానమందు ఉద్భవించునని వినబడినది. ఇది ఒక చరిత్రాంశము. ప్రవచనములో ఆయన జన్మచరితము మామూలుగా నున్నది. అటుపిమ్మట మరో ప్రవచనములో మరికొంత వివరము వినబడినది.


దావీదు వంశమందు జన్మించునని వినబడినది. ఇది మరియొక కథ మొదటి ప్రవచనముకంటే రెండవది వివరముగా ఉన్నది.

ఆయన రక్షకుడని ఉన్నది ఆనందమేగాని రక్షకుడైయుండి, నిత్యుడగు తండ్రి కాకపోతే ఏమిలాభము? మనిషిగా వంద సంవత్సరములున్నా ఏమి ప్రయోజనము? 100 సం॥లు రక్షకుడు ఉన్నను, ఆ తరువాత ప్రజలు నిరాశపడుదురు. ఆ రక్షకుడు నిత్యదేవుడు గనుక అన్నికాలములలో, అన్ని స్థలములలో సర్వవ్యాపియై యుండగలడు, అన్నిచోట్ల ఉండగలడు. మనిషియైనాడు గనుక అందరు పిలిస్తే వెళ్ళువాడు. గనుక సర్వజనులకు ఉపయోగముగానుండును. ఇది ప్రవచన సందేశము. పై 5 మెట్లు ప్రభువు జీవిత చరిత్రలో ఉన్నది.


ఈ వర్తమానములు విన్నవారు నిరీక్షించినారు. దానికే నిరీక్షణ కాలమనిరి. అట్లు నిరీక్షణ ఉంచినవారు రక్షింపబడిరి. ఆయన దేవుడు గనుక

ఆయన భూత, వర్తమాన, భవిష్యత్కాలములలో నున్నవారిని రక్షించు దేవుడు గనుక ప్రభువుయొక్క జీవితకాలములో మరియొక భాగము: 'జరిగిన చరిత్ర'. పై అంశములలోని వాగ్ధానములు నెరవేరవలెను. ఆయన నరుడుగా పుట్టి పై వాగ్ధానములు నెరవేర్చవలెను.


ప్రవచన రూపమున ప్రత్యక్షమైన ప్రభువు, వృత్తాంత రూపమున బైలుపడెను. మొదటి మెట్టునుండి 5వ మెట్టువరకు ఆయన వృత్తాంతము పైకి వచ్చినట్లు కనబడుచున్నది. ఒక్కొక్క మెట్టులోను ఆయన ప్రత్యక్షత హెచ్చగుచున్నది. ఈ పేర్చిన కథ ఆరోహణ చరిత్రతో ముగింపగు చున్నది.


ఆయన చరిత్ర వృద్ధి అగుచున్నది. గనుక ఇదే ఆరోహణము. మానవచరిత్రగా కనబడిన దేవుని చరిత్ర గనుక ఆరోహణముగా వృద్ధియెనది. కాబట్టి వాగ్ధాన రూపములో నుండి ప్రజల రక్షణ విషయమై ఆలోచించిన రక్షకునికి నిత్యము మంగళస్తోత్రములు.


2. వృత్తాంతము:- ఇప్పుడు భూమిమీద జరిగిన చరిత్ర అనగా కండ్లతో ప్రజలు చూచిన చరిత్ర.

రెండు గుంపులలోని ప్రతినిధులు వెళ్ళిరి. గనుక లోకమంతా ఆయన దర్శనమునకు వెళ్ళినట్లే. లోకములోని ప్రజలు రెండు రకములు

ఈ రెండు రకములైన ప్రజలకు ఆహ్వానము వెళ్ళినది. లోకమంతటికి వెళ్ళినది. ఈయన సర్వలోక రక్షకుడు గనుక లోకమంతటికి రక్షణ సందేశము అందవలెను. కాలక్రమేణ అందరకు అందినది.


ఆయన పెద్దవాడైనప్పుడు సైతాను శోధించినది. లోకమును. పాపములో పడవేసిన సైతానును ఆయన జయించవలెను గనుక అతని జయించుటకు, డీకొని జయించుటకు ఒకమెట్టు ఎక్కినాడు. ఆయన దాని మాయలోపడి చిక్కుకొనలేదు. మనిషి పడి చిక్కుకొన్నట్లు ఆయన చిక్కుకొనలేదు (రాళ్ళు రొట్టెలుగా చేసికొనే మాయ). తనను రక్షించుకొనలేనివాడు ఇతరులనెట్లు రక్షించును. గనుక ఆయన డీకొని జయించి అందరికి జయమిచ్చెను. 1వ మెట్టు జన్మము, 2వ మెట్టు జయము. మనిషిగా జన్మించుట మంచిదే. సైతానుతో పోరాడినప్పుడు ఓడిపోతే ఎట్లు రక్షించగలడు? గనుక జయించెను. ఒక మెట్టు ఎక్కెను. 2. ధర్మోపదేశము చేసినాడు.

ప్రజలు ఆయన బోధలు విని, తమ అనుభవ సాక్ష్యములు వినిపించిరి. ఏమంటే - మన గురువులు బోధించినదానికంటే ఇది ఉపయోగకరముగా ఉన్నది. ఈయన అధికారముతో బోధించెనని మెచ్చుకొనిరి. ఇది ఒక మెట్టు ఇందులోను ఆయన హెచ్చెను.

ఆయన పునరుత్థానుడైనప్పుడు గొప్ప నిరీక్షణ కలిగించెను. పరిశుద్ధులనేకులు సమాధిలోనుండి లేచిరి.


ఆయన లేచి 40 దినములు బోధించెను. ఆయన లేచిన నిశ్చయము తెలిసికొనేటందుకు జన్మించినది మొదలు మరణమైనంత వరకు ప్రత్యక్షమైన రీతిగా కాక క్రొత్త రకముగా ప్రత్యక్షమైనాడు. శరీరముతో ఇక్కడ ఉంటే ఇక్కడనే ప్రభువు ఒకచోటనే ఉండేవాడు గాని ఆయన లేచినప్పుడు అన్యప్రాంతములకు వెళ్ళగలిగెను. స్థూలశరీరము రక్తమాంసములు గలది. అయితే లేచిన తరువాత మహిమ శరీరము వచ్చినది. అప్పుడు తలుపులు వేసిన వెళ్ళగలరు. ఆ దేహముతో ప్రభువు నలుబది దినములు బోధించి కడవరి మాటలు వినిపించిరి.


ఈవేళ చివరి దినమందు ఆఖరుమాటలు ఆరోహణ సంగతులు చెప్పిరి. పై చరిత్రలన్నియు పెద్దవియే. ఆలాగే ఆరోహణ చరిత్రయు పెద్దదే. ముందుగా ప్రభువుయొక్క ప్రవచన చరిత్రను చెప్పితిని. ఇప్పుడు ఆయన భూమిమీద ప్రదర్శించిన చివరి చరిత్ర చెప్పుచున్నాను.


యేసుప్రభువు తన శిష్యులను పిలిచి ఒక సందేశమిచ్చిరి. లోకమునకొక సందేశమిచ్చిరి.

1. శిష్యుల సందేశము:- నేను 33న్నర సం॥లలో అనేక సంగతులు చెప్పినాను. ఏమి చేయవలెనని చెప్పినానో అవి లోకమునకు వినిపించండి అని చెప్పెను. నాలుగు సువార్తలలో

అవన్నియు యేసుప్రభువు తన శిష్యులకు చూపించి, నేను ఏమి ఆజ్ఞాపించినానో అవి అందరికి చెప్పండి. ప్రజలు విన్న పిమ్మట మీరు ఆ ప్రకారముగా నడుచుకొనవలెనని చెప్పెను.

2. ప్రభువు బోధలు విని, నమ్మి ఎవరు బాప్తిస్మము పొందుదురో అనగా సంఘములో చేరుదురో వారికి మేలు కలుగును. లోకమునకు ఈ సందేశము వినిపించుటకు ఇప్పటి వరకు ఈ రెండు అంశములు బోధించుచునే యున్నారు. ఇప్పటివరకు అభయ హస్తమిచ్చినారు. రెండు వర్తమానములు యిచ్చిన ఆయన ధైర్యము చెప్పకపోతే శిష్యులు ధైర్యముగా వినిపించలేరు.


3. మోక్షలోకములో నాకు సర్వాధికారమున్నది. భూమి మీద సర్వాధికారమున్నది. నేను మోక్షమునకు వెళ్ళుచున్నాను. నిజమే గాని “మిమ్మును విడువను, మీతో ఉందును" అని అన్నప్పుడు శిష్యులకు సంతోషము కలిగినది. మనకు

మనతో నిత్యము ప్రభువు ఉంటాడని సంతోషించిరి అది వారు మరచిపోలేదు.


4. మతప్రచార ప్రదేశమెక్కడ

భూమిమీద దిక్కు ఎక్కడ అంతమగునో అంతవరకు సాక్షులై యుండవలెను.

మూడు ఒకటే అనగా భూమిమీద ఉన్న సర్వజనులకు వినిపించుమనెను. నాలుగు సువార్తలలోని సందేశము అందించవలెను. ప్రభువు వెళ్లుచు 11 మంది శిష్యులను దీవించెను. ఇది యెందుకు? శిష్యులకు ఇవ్వబడిన వారిని దీవించుచు ఆయన పరలోకమునకు ఆరోహణమాయెను. నేటివరకు ఈ రెండు జరుగుచునేయున్నవి.

ఒక మేఘము వచ్చి శిష్యులకు కనబడకుండా చేసెను. కమ్మివేసెను అది మోక్షలోక సింహాసనాసీనుడాయెను. ఇది అన్నిటికంటే గొప్ప ఆరోహణము. ఇద్దరు మనుష్యులు వచ్చి మీరెందుకు పైకి చూచుచున్నారు, మీరు చూచుచున్నట్లు ఆయన మరల వచ్చును అని వారికి గొప్ప ధైర్యము చెప్పిరి. ఆయన చనిపోయి తిరిగిలేచినప్పుడు, తిరిగిలేచినాడని వారు సంతోషించిరి. ఇప్పుడును ప్రభువు ఆరోహణమై వెళ్ళినట్లు, మరలా తిరిగి వచ్చునని దూతల సందేశముద్వారా విని సంతోషించెను. అట్టి ఆరోహణ ఆనందముతో ప్రభువు మిమ్మును దీవించునుగాక! ఆమేన్.


ఈ పై సందేశమును దైవజనులైన యం. దేవదాసు అయ్యగారు. 1948 సం॥ము మే 6వ తేదీన ఉపదేశించిరి.