జ్ఞాతవ్యము 7: Father M. Devadas
దైవారోపణ
నేను వెళ్ళి స్ధలము సిద్ధపరచినప్పుడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలవచ్చి నాయొద్దనుండుటకు మిమ్మును తీసికొనిపోవుదును (యోహాను 14:3); నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు (యోహాను 14:20) ఒకడు నన్ను ప్రేమించువాడైతే నామాట గైకొనును, అప్పుడు వానిని ప్రేమించును. మేము వానియొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము (యోహాను 14:23); ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతోచెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకముచేయును (యోహాను 14:23).
క్రైస్తవ సహకారులారా! పైవాక్యములలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను త్రైక దేవుడు కనబడుచున్నాడు. క్రైస్తవ విశ్వాసులయొద్ద లోకములో దేవుడు ఉండును. తక్కినవారియొద్ద ఉండడను అర్ధము నా మాటలలో లేదు. అందరి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోను ఉన్నాడు (ఎఫెసీ 4:6). “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారిమధ్యను ఉందును” అని క్రీస్తుప్రభువు చెప్పెను (మత్తయి 18:20). దేవుడు నాయొద్ద ఉన్నాడని యెవరు నమ్మరో వారు జీవాంతమందు ఆయన సన్నిధియగు మోక్షలోకమునకు వెళ్ళలేరు. మనము మోక్షలోకమున ఆయన యొద్దనుందుము. అంతమాత్రమున మనలో యెవడును నేను దేవుడనే అని అనుకొనకూడదు. అట్లు అనుకొనుట, అనిపించుకొనుట దేవదూషణయై యుండును. గురువును దేవునిగా భావించుట అనేకమందికి అలవాటైయున్నది. గురువు దేవుడుకాడు గాని దేవుని విషయములు బోధించి ఆయనయొద్దకు నడిపించువారైయున్నాడు. ఈకాలము క్రీస్తుయొక్క రెండవరాకడ సమీపకాలమై యున్నది. గనుక క్రీస్తు ప్రభువు అనేకమందికి దర్శనములోనో, స్వప్నములోనో కనబడుచు మాటలాడుచున్నాడు. మనస్సులో పొరబాటులున్నవారికి తప్పుడు దర్శనములు వచ్చును.
- (1) కొందరు క్రైస్తవులు - నేను (యం. దేవదాసు అయ్యగారు) దేవునిలో ఒకభాగమని చెప్పుచున్నారు. ఇది నాకు మిగుల అవమానకరమైనమాట. చాల బాధ కలిగించు మాటయైయున్నది. భక్తులు పరలోకములో దేవుని చెంతనుందురు. అట్లే నేనుకూడ సిద్ధమైన యెడల వారివలె దేవునిచెంత నుందును. అంతమాత్రమున నేను దేవుడనా? దేవునిలో ఒక భాగమునా? దేవునితో సమానుడనా? అజ్ఞానము భక్తికి అద్దు. దేవుడు మనయొద్ద నుందును. మనము ఆయనయొద్ద నుండును. మనము ఆయనయొద్ద నుండవచ్చును గాని మనము దేవునితో సమానులముకాదు.
- (2) నా ఆత్మను యేసుప్రభువు అనేకమందియొద్దకు దర్శనములో తీసికొని వెళ్ళుచున్నాడని నాకు చెప్పుచున్నారు. ఇది యెంతవరకు నిజమో దేవునినడిగి తెలిసికొనండి.
- (3) నా ఆత్మ పూర్వికుల కాలమందుకూడ ఉండెనని కొంతమందికి దర్శనమందు వినబడినదట. ఇదికూడ దేవుని నడిగి తెలిసికొనండి.
- (4) పగలు చూచినవి, ఆలోచించినవి, రాత్రులు స్వప్నములోను వచ్చినవి, దైవికములని నమ్మ వీలులేదు. దేవుడు ఈ కాలమందు ప్రత్యక్షమగుననియు, మాటలాడుచున్నాడనియు, ప్రశ్నలకు జవాబు చెప్పుచున్నాడనియు, వ్రాసి తన చిత్తమును వెల్లడించుచున్నాడనియు, యేదైన ఒక సత్కార్యమును చూపి ప్రేరేపించుచున్నాడనియు నమ్మవచ్చును. పూర్వము ఇట్టివే జరిగినవి గదా! కాని దేవా! నాకు తప్పుడు దర్శనములు రానీయకుమని ప్రార్థించుచుండవలెను. దైవసన్నిధిలో ప్రార్ధించి కనిపెట్టుచున్న వారిలో కొందరికి ఒకవిధముగాను, కొందరికి మరియొక విధముగాను జవాబులు వచ్చుచున్నవి. జ్ఞానశక్తిని ఉపయోగించి సరియైన అర్ధమును తెలిసికొనుటకై ప్రయత్నించవలెను.
- (5) పాపకారకుడగు సైతాను అనునొకడు గలదని బైబిలు చెప్పుచున్నది. అతడు దర్శనమై, అబద్ధములు చెప్పును. జాగ్రత్తగా పరీక్షించండి.
- (6) పాపములొప్పుకొని, మనకు కలిగినదంతయు దేవుని వశముచేసి, కావలసినవాటి కొరకు ప్రార్థించి, పొందిన మేళ్ళు తలంచుకొని స్తుతించి, జవాబు కొరకు కనిపెట్టువారికి సరియైన దర్శనములు వచ్చును. దర్శనములు అర్ధముకానప్పుడు రెండవసారి అడుగవలెను.
- (7) దేవా! ఎమ్. దేవదాసుగారికే బైబిలుమిషనును యెందుకు బైలుపరచినావు అని కొందరు దేవునినడిగిరి. "తగినవాడని" జవాబు వచ్చెనట. మీరును అడగండి.
- (8) దేవుడు నన్ను పొగడుచున్నాడని కొందరనుచున్నారు. "నన్ను ఆయన తరచుగా శుద్ధిచేయుచున్నందున" అని నాకు తోచినది.
- (9) బైబిలుమిషను పెట్టినందున క్రైస్తవులలో కొందరును, ఇతరులలో కొందరును నన్ను ఖండించుచున్నారు. ఊహలే దర్శనములని మరికొందరు తేలికగా మాట్లాడుచున్నారు. వారు దేవుని నడిగి తెలిసికొని విమర్శించుట మంచిది.
- (10) దేవుడు క్రీస్తురూపమున భూమిమీదికి వచ్చినట్టును, ఇక్కడనుండి మోక్ష లోకమునకు వెళ్ళినట్టును, భక్తులకొరకు పరలోకమందు స్థలము సిద్ధపరచుచున్నట్టును, మరల భక్తులకొరకు రానైయున్నట్టును, భక్తులకు తనచెంతనే నిత్యనివానము ఏర్పరుపనైయున్నట్టును యోహాను 14:3లో కనబడుచున్నది. అవతారము, ఆరోహణము, రెండవ రాకడ, నిత్యనివాసము ఈ వచనములో నున్నవి.
ఈ పత్రికలోని ధన్యత ఒక్క క్రైస్తవులకు మాత్రమేగాక నమ్మగలిగిన వారందరికి అన్వయించును. క్రీస్తు మూలముగ రావలసిన ధన్యత మాకు అక్కరలేదని అనుకొనువారిని మేము నిందింపము. ఎందుకనిన వారి మనస్సాక్షికి అట్లు తోచినది గనుక క్రీస్తు ప్రభువు జీవితమువలనను, బోధలవలనను, ప్రత్యక్షతల వలనను చదువరులు సంపూర్ణ సిద్ధ నందుకొని, మహిమ మేఘమునకు ఆయత్త పడుదురుగాక! ఆమేన్.
ఈ పై సందేశమును దైవజనులైన యం. దేనదాసు అయ్యగారు 1958 సం॥ము ఉపదేశించిరి.