జ్ఞాతవ్యము 7: Father M. Devadas
నాకు అందనివాటిని అభ్యాసము చేసికొనుటలేదు. కీర్తన 131:1.
ప్రార్ధన:- ఈ దినము నీవు చేసిన అద్భుతములు తలంచుకొని, ఓ తండ్రీ! నిన్ను స్తుతించుచున్నాము. నీ సేవకులలో ఏమిలేదు. వారు నీ చేతిలోని సాధనములు. మోషేను ఒక సాధనముగా పెట్టుకొని అద్భుతములు చేసినావు. మోషే చేతిలో కర్ర సాధనము. కర్రలో ఏమియు లేదు. నిర్గమ 14:16 “నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి, దాని పాయలుగా చేయుము” అన్నావు. అప్పుడు మోషే తన కర్రను ఎత్తి తన చెయ్యి చాపగా సముద్రము పాయలైనది”. నీ శక్తి యివ్వబట్టి అప్పుడు ఆ కార్యము జరిగినది. ఇప్పుడు నీ శక్తియివ్వబట్టి కాకానిలో నీ సేవకులు పనిచేయుచున్నారు. కాకానిలో పెద్ద దయ్యమునే వెళ్ళగొట్టినట్లు, మా గ్రామములోని మా విరోధుల హృదయములోని కక్ష వెళ్ళగొట్టగలవని నమ్మి, ఎవరికిని తెలియకుండ లోవల ప్రార్ధించే ప్రార్ధన దయచేయుము. ఇంటిలోనివారు ప్రార్థించి, బయటకు వెళ్ళి చినుకులు పడుచున్నవేమో చూచి రమ్మంటే, ఒకడు వెళ్ళి వర్షము వచ్చెటట్లు లేదు అనెను. ఆలాగే గ్రామములోని విరోధుల కొరకు గదిలో ప్రార్థించి, మారినారేమో ఊరిలో తిరిగి రమ్మనగా, మారలేదని చెప్పినను 2వ దినము, ౩వ దినము, 4,5,6 దినములు ప్రార్థించినను గ్రామము మారలేదు గనుక మా ప్రార్థన చాలలేదు. వారి పగకే బలమున్నది గనుక వారి పగ బలముకు మించిన ప్రార్థన బలము కావలెను గనుక రెట్టింపు ప్రార్ధన చేయుదము.
- 1. రెట్టింపు ప్రార్ధన
- 2. రెట్టింపు కన్నీరు.
శత్రువుల యెడల జాలితో జాలిగల మనస్సుతో కన్నీటితో ప్రార్ధన చేసినయెడల వారు తప్పక మారుదురు. అట్లు మా శత్రువులు మారే వరకు ప్రార్థించే కృప దయచేయుము.
పగవారిమీద పగగాదు పగవారిమీద జాలి ఉండవలెను. మాకు రక్షణ వచ్చినది. మా బంధువులకు రక్షణలేదు అని జాలి పడే స్థితి దయచేయుము. మా శత్రువులకు రక్షణ లేదని జాలిగల మనసుతో ప్రార్ధించే కృప దయచేయుము. ఆమేన్.
షరా:- మన ప్రార్ధన వారిని మార్చకపోతే (గ్రామస్తులను, పగవారి పగను) మనకు క్రైస్తవ మతము వస్తే మాత్రము ఏమిలాభము.
రాజులు 18:42వ వచనములో, ఏలియా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీదపడి, ముఖము మోకాళ్ళ మద్య ఉంచుకొని, ప్రార్థించెను అని వ్రాయబడినది. ౩న్నర సం॥లుగా కరువుచేత దేశములో ఎవరికిన్ని అన్నములేదు, రాజుకును లేదు. అందుచేత కరువు పోవునట్లు వర్షము కొరకు ప్రార్ధించెను.
ఉదా:- ఆవు వద్దకు వెళ్ళి పాలు పిండితే తెపాల(పాలబిందె)లో పాలుపడును. అట్లే భక్తుడు మేఘము వద్దకు వెళ్ళి పిండితే వర్షము వచ్చునా? (ప్రార్థించితే వర్షము వచ్చును). ఆవు పాలు అందరు పితుకగలరా? ఆ నేర్చు లేకపోతే పితకలేరు. అట్లే అందరు ప్రార్థించలేరు. పాలు పితక వచ్చునుగాని మేఘములోని నీరు తీయట అందరికిని రాదు. భక్తులకే ఆ విద్య వచ్చును.
- 1. ఏలీయా మోకాళ్లమధ్యను తలపెట్టి ప్రార్థించెను. ఏలీయా శిష్యుని చూచి, తనను నీవు సముద్రము యొద్దకు వెళ్ళి వర్షము వచ్చుచున్నదేమో చూడుమనెను. అతడు కొండ దిగిపోయి చూచెను మేఘము లేదు అనెను.
- 2. భక్తుడు మరలా ప్రార్థించెను. మరల చూచి రమ్మని శిష్యునికి చెప్పెను. మరల వెళ్ళి, చూచి, మేఘము లేదని గురువుకు చెప్పెను
- 3. భక్తుడు మరల ప్రార్ధించెను. మరల చూడుమనగా చూచి మేఘము లేదనెను.
- 4. భక్తుడు మరల ప్రార్ధించెను. చూడుమనెను. ఈసారి వచ్చుననుకొనెను గాని చూచి మేఘము లేదనెను. శిష్యునికి కాళ్ళు లాగుచున్నవిగాని భక్తునికి కాళ్ళు లాడుటలేదు. ఈలాగు 7 మారులు ప్రార్ధించెను. ఆలాగు శిష్యుడు 7 మారులు వెళ్ళి చూచెను.
భక్తుడు శిష్యునితో - అబ్బాయి మనము వెళ్ళుదము. రాజుతో రధమెక్కి ఇంటిలోకి వెళ్ళుమని చెప్పుము, కుంభ వర్షము కురియుననెను. రాజు నమ్మినాడా? నమ్మకపోయినను, చెప్పవలసినది చెప్పివేసెను. రాజుకు భక్తుడు అంటే భయమె గాని నమ్మకపోయినను వెళ్ళెను. ఆ తర్వాత రాజు వెనుక ఏలీయా వెళ్లెను. రాజు వర్షములో తడిసెను. ఏలీయా (తడిచిపోవుట) దుప్పటి కప్పుకొనెను. తడిస్తే బరువుగాని, తడవని వారికేమి బరువు! ఏలియాకు వానా (వర్షము) లేదు నానాలేదు. గనుక రాజుకంటే ముందు వెళ్ళిపోయెను.
- 1. రధముకు ఎక్కువ బలమా? మోకాళ్లలో తలపెట్టి ప్రార్థించిన ప్రవక్తయే ఎక్కువ బలమా? రథమునకే బలముగాని ఏలియాకు ఏమి బలము!
- 2. గుర్రము కాళ్లకు ఎక్కువ బలమా? ఏలీయా కాళ్లకు ఎక్కువ బలమా? రాజుకే ఎక్కువ బలముగాని ఏలీయాకేమి బలము! అట్లే మనమును ఎవరికి తెలియకుండ ఇంట్లో ప్రార్థించితే, ఊరు తిరుగవచ్చును (మారవచ్చును). వర్షము హోరుమంటు వచ్చినట్లు ఊరు జయమొందును (అందరు హోరుపెట్టి) మారుదురు.
ఏలీయా ఒక్కడే ప్రార్థించినట్లు మీరును ఒక్కరే ప్రార్థించండి ఏలీయా చేసిన ప్రార్ధనవంటి ప్రార్ధన చేయండి. ఏలీయా ప్రార్ధన మేఘములు దాటి, నక్షత్రములు దాటి దేవునియొద్దకు వెళ్ళెను. ఆ ప్రార్ధన దేవునికి చెప్పెను. అప్పుడు దేవడు ఆ మేఘమునకు చెప్పెను. వర్షము కురువుమని అప్పుడు వర్షము కురిసెను.
ఉదా:- కొండమీద నున్న రాయిని క్రిందికి దొర్లించుట సుళువే గాని మేఘములోనుండి నీళ్ళు కురిపించుట కష్టము.
కొండమీద ఒక గమ్మత్తు జరిగెను (విడ్డూరము)
ఏలీయా ప్రార్ధించక ముందు కొండమీద ఒక గమత్తు జరిగినది. ఏలీయా ప్రార్థించు స్థలమునకు వెళ్ళక ముందు జరిగిన విడ్డూరము. అదేమనగా పెద్దవాన కురిసేటట్టుగా ఉన్నదని తన మనస్సులో ఓరు కలిగెను. మనస్సులో హోరున్నది. వర్షము కనబడుటలేదుగాని ఓరు వినబడుచున్నది. అర్దకట్లంత (అరమైలు) దూరంలో ఊరేగింపు శబ్దము వినబడినట్టే, ఆలాగే ఏలియాకు వర్షముయొక్క హోరు వినబడెను. మీ గదిలోనికి ప్రార్ధనకు వెళ్ళకముందే, మా గ్రామము మారునను ఓరు (నమ్మకము) కలుగవలెను. (ముందే నమ్ముట, అదే ఆ ఓరు) మార్కు 11:24.
వరములు
- 1. బోధచేయుట. ఇది అందరికి రాదు. ఇది ఒక వరము. జ్ఞానమువల్ల కథలు చెప్పవచ్చునుగాని ప్రార్ధన అందరికిరాదు.
- 2. మనకు కావలసినది ప్రార్ధన వరము. ప్రార్ధన రావచ్చు అదిగాదు ప్రార్ధన వరము రావలెను అదే గొప్పవరము.
మన ఊరువారు మారలేదు అనగా మనకింక ప్రార్ధన వరము రాలేదు అని అర్ధము. ప్రార్ధన వరమా! గొప్పవరమా? కొప్పవరమా? మీ ఊరి వారిని మార్చితే అదీ గొప్పవరమే. అప్పుడు మన ప్రార్ధన వరము గొప్ప వరమగును.
గదిలో చేసిన ప్రార్ధన చిన్నదే. అర చేయి అంత చిన్నదే. అదే గొప్ప వర్షము, గొప్ప పని జరిగించెను. ఆలాగున మన ప్రార్ధనకు మన ఊరంతా మారితే అదే గొప్ప వర్షము. అదే గొప్ప వరము.
ఏలీయా పట్టణములోనుండి బయలుదేరి కొండెక్కెను. ఆయన మోకాళ్ళూని తన ప్రార్ధనను కొండెక్కించెను. మీరు గదిలోనే యుంటారు గాని మీ ప్రార్ధన ఇంటి కప్పులోనుండి మేఘములోనికి, మేఘములోనుండి నక్షత్రములలోనికి, నక్షత్రములలో నుండి పరలోక కొండమీదనున్న ప్రభువు వద్దకు ఎక్కివెళ్ళును. అప్పుడు గొప్ప నెరవేర్పులు కనబడును.
రక్షణ అందరికిని కావలెను. గనుక వరములు అందుకొనవలెను.
- (1 దేవుడు:- దేవుని పనులు ఎ) భూమి, ఆకాశము నక్షత్రములు, చెట్లు మొ॥నవి తయారుచేయుట.
- (2) మనుష్యుడు: - మనిషి పని ఎ) ఇల్లు, కుండ, చేట, బిందె మొ॥నవి.
- (3) సైతాను:- సైతాను పనులు:- చంపుట, తిట్టుట, దేవుడు లేడనుట, మోక్షము లేదనుట, క్రీస్తుమతము వద్దనుట, దోపుడులు, దొంగతనములు, నీటివలన వాని, నీళ్ళలోపడుట, అగ్ని, బండ్లక్రింద పడుట, కరువు, చిక్కులు, మరణం, నరకం, అధైర్యము, అవిశ్వాసము, నిరాశ మొ॥నవి కల్పించుట.
- (4) యేసు:- సైతానుచేయు పనులు, వాటివల్ల వచ్చు ఫలితములు తప్పించుటకు దేవుడే యేసుగా (నరుడుగా) వచ్చినాడు. యేసుప్రభువు ఒకరికి ప్రత్యక్షమై 'నేను సృష్టికర్తను. నేను యేసును, రక్షించేవాడను' అని చెప్పెను. ఇట్టి దర్శనము వలన ఏలియా మోకాళ్ళ సందులో తల ఉంచి ప్రార్థించినట్లు ఆ ఇంటీవారికిని ప్రార్ధించు వరము దొరుకును. మాకుకూడా ప్రభువు ఉన్నారు అనే మనసుతో మనమును పట్టుదలతో ప్రార్థించిన యెడల, ఏలీయావలె అద్భుతములు మన గ్రామములోను, సంఘములోను చేయగలము. ప్రభువును, ఆయన అంతరంగమును బాగుగా ఎరిగినవారి మనవికి అడ్డుగా ఏదియు నిలువనేరదు. అట్టి బలమైన ప్రార్ధనా వరములతో ఆత్మతండ్రి మనలను నింపి, మహిమకు ఆయత్తపర్చునుగాక! ఆమేన్.
ఈ పై సందేశమును దైవజనులైన యం. దేవదాసు అయ్యగారు 1953 సం॥ము లో 19న తేదిన ఉపదేశించిరి.