జ్ఞాతవ్యము 7: Father M. Devadas


సంస్కారపు బల్ల

హెబ్రీ 7:1-10.


బాప్తీస్మము పొందిన వారందరికి ఒక బల్లవేశారు అదే సంస్కారపు బల్ల. ఇది వేసినవారెవరు? ప్రభువే. ఇది ప్రభువు బల్లే గనుక అందరిని ఆహ్వానిస్తున్నారు. కంటికి కనబడేది

ఇవి బహిరంగముగా మనకు కనబడుచున్నవిగాని దీనిలో రహస్యముగా చూడవలసినవి

1. అబ్రహాముగారి దగ్గర వేసిన బల్ల:- యద్ధముచేసి అలసి వచ్చిన అబ్రహామునకు బలము, శక్తినివ్వటానికి మెల్మీసెదెకుగారు బల్ల వేశారు. ఓ విశ్వాసీ! నీవు యుద్ధము చేస్తూనేయున్నావు. దురాత్మలు మనచుట్టూ ఉన్నారు. వారితో మనము యుద్ధము చేయటకు శక్తికావాలి. విశ్వాసిని బలపరచే ఆయన శరీరరక్తములు, ప్రభువే స్వయముగా మనకిస్తున్నారు. విశ్వాసులకు తండ్రియైన అబ్రహామును బలపరచిన దేవుడు “క్రీస్తు యేసు సంబంధులు శరీరమును గాని ఇచ్చలతోను, దురాశలతోను సిలువవేసారూ అను వాక్యమును మనలో నెరవేర్చుటకే అబ్రాహాముగారిచ్చిన గొప్ప శరీర రక్తములు మనకును ఇచ్చుచున్నారు. అట్టి శరీర రక్తములు పుచ్చుకొనువారే అబ్రహాములు. శరీరము బలమునిచ్చును. రక్తము జీవమునిచ్చును. అబ్రహాము దగ్గరకు ప్రభువు పుట్టకముందే, 2000సం॥ క్రితమే వచ్చారు. రొట్టె, ద్రాక్షారసము తెచ్చారు. అబ్రహాము దగ్గర దశమభాగము తీసికొన్నాడు. నేను నిరంతరముండే యాజకుడను అనగా పుట్టకముందు పాదిరిగారినే పుట్టిన తర్వాత పాదిరిగారినే! “నా శరీర రక్తములను తీసికొనండి, మీరు బ్రతుకుదురు” అని ఆహ్వానిస్తున్నారు. ఆదామా! నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని మృతుల వరుస చూపించిన ప్రభువే, "మీకు నిత్యజీవము కావాలంటే నా బల్లయొద్దకు రండి” అని ఈ మొదటి బల్ల వేశారు.


2. దేవుడు ఇశ్రాయేలీయులకు 40 సం॥లు అరణ్యములో వేసిన బల్ల:- ఇది శరీర సంబంధమైన బల్ల. దేవదూతల ఆహారమే వారికిచ్చారు పన్ను కట్టలేదు. డబ్బు కట్టలేదు. బండతో మాట్లాడమన్నారు, దానికి చెవి ఉన్నట్లు. దేవుని భక్తులమాట వినే చెవి బండకు ఉన్నది అని మనము గ్రహించవలెను. మోషే మాట విన్నదంటే దేవుని మాట విన్నట్టే! దేవునిమాట వినని బండల్లారా! దేవుని న్వరము వినే చెవిని సంపాదించుకొనండి. ఆయన రూపముతో చేయబడిన మానవుడేకానీ ఆయన మాటవినే చెవులులేవు. ద్వితీయోపదేశ కాండమంతా చెప్పి ఒక బండను తెమ్మని ఇదే రేపు మీగురించి సాక్ష్యము చెప్పేది అన్నారు మోషే. గనుక అది సాక్ష్యము చెప్పే బండ. ఇశ్రాయేలీయులు మోషేమీద విసుగుకొన్నారు, దేవుని మీద విసుగుకొన్నారు. విసుకొన్నందువలన ఇసుకలో సమాధి చేయబడ్డారు. ప్రభువు చేపను పిలిచి నా బిడ్డ మాట వినుటలేదు. గనుక నీవు మింగి, పై పన్ను క్రింది పన్నునా బిడ్డ మీదకూడా వేయకుండా, నేను చెప్పే స్థలమునకు వెళ్ళి కక్కమన్నారు. చేప లోబడింది. బిలాము దగ్గర నా బిడ్డ నన్ను గుర్తించుటలేదు. నీకు నోరిస్తాను మాట్లాడమని గాడిదకు ప్రభువు చెప్పారు. గాడిద లోబడింది. సజీవమైన రాళ్ళము అని చెప్పుకుంటున్న మనము ఆయనను చూడాలి ఆయన మాట వినాలి.


3. కొండపై 5 వేలమందికి వేసిన బల్ల:- మూడు దినములు యేసుప్రభువు ఉపదేశములను వింటూ, వాక్యాహారము తింటూ ఉండగా, రాత్రనే తలంపే, ఆహారము తిందామనే తలంపే లేకుండా, ప్రభువే వారి మనస్సులను కట్టివేసారు. ఆయనకాంతిని ఎలా కనుపరిచారో! ఎక్కడున్నారో కూడా వారు మరచిపోయారు. సెయింట్ ఫ్రాన్సిస్ గారు పక్షులన్నింటిని పిలిచి, రెండు పుల్లల్ని సిలువలాగా చేసి, వాటి ఎదురుగాపెట్టి రక్షణవార్తంతా చెప్పేవారు. విన్నా తర్వాత పక్షులన్నీ ఆ సిలువను ముక్కుతో ముద్దు పెట్టుకొని వెళ్ళేవి.


4. ప్రభువు వేసిన సంస్కారపు బల్ల:- రండి నా శరీరమును, నా రక్తమును తీసికొనండని పిలుస్తున్నారు. కాలునొప్పివస్తే చేతికి ఇంజిక్షన్ గాని టాబ్లెట్ వేసికొంటే తగ్గుతుంది. కాలినొప్పికి, చేయికెందుకు బాధ అనము. అలాగే చిన్న రొట్టె, ద్రాక్షారసము త్రాగితే మన శరీరములోనున్న పాప వ్యాధిపోతుంది. ఈ శరీర రక్తములే మానవ శరీరములోనున్న పాపనైజమును క్రుంచివేయును. క్యాన్సర్ జబ్బును పోగొట్టును. ఆయన పిలుపును విని, మనము వస్తున్నామా! ఆయన శరీరమునుబట్టి, రక్తమునుబట్టి మనలోనున్నదంతా బయటకు వస్తుంది. విశ్వాసముతో నిజముగా నేను ఆయన శరీర రక్తములే తీసికొనుచున్నాననే మనస్సు కలిగియున్నప్పుడు ఎగిరివెళ్లే శక్తినిస్తారు. తన కార్యమంతా ముగించుకొని శిష్యులను పిలిచి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి, వారుచూస్తుండగానే ఎగిరి వెళ్ళారు. మహిమలోనికి వెళ్ళే శక్తి ఆయన శరీరములోనున్నది గనుక అదే మనలోనికి ప్రవేశిస్తుంది. రేపు ప్రభువు వచ్చినప్పుడు మనముకూడా ఎగిరివెళ్ళాలి. ఈ బల్లయొద్దకు రానియెడల ఎగిరివెళ్ళే శక్తియుండదు. ఇట్టి విశ్వాసముతో మనము వస్తే ఈ విందులోనున్న శక్తంతా మన శరీరములోనికి వస్తుంది. గాలిలో లేచి మేఘములోనికి వెళ్తాము. అక్కడనుండి మహిమ మేఘములోనికి వెళ్తాము.


అట్టి అత్యున్నతమైన దివ్యస్థితికి మనందరిని ఆయత్తపర్చుటకు ఆయన శరీర రక్తములు మనకు ఉపయోగపడునుగాక! ఆమేన్.