జ్ఞాతవ్యము 7: Father M. Devadas
“పిలువబడిన వారనేకులు ఏర్పరచబడినవారు కొందరే” మత్తయి 22: 14
ప్రతివిశ్వాసియు రాకడకు పూర్వము స్వపరీక్ష చేసికొనవలయును.
- (1) పాపశుద్ధి
- (2) బైబిలుపఠన
- (3) ప్రార్ధనా స్తుతులు
- (4) సువార్త పని
- (5) వరములు వాడుట
- (6) నష్టము
- (7) క్రొత్తపనులు.
- 1. శుద్ధి గది:- ఈ గదిలో నరుడు 10 ఆజ్ఞల ప్రకారము తన్ను తాను పరీక్షించుకొనవలయును. తెలిసిన పాపములకు లోకువైపోకూడదు. పాపశోధనలు రాకమానవు. అవి వచ్చుచుండగా పోరాడుచుండవలయును. పోరాడి జయము పొందవలెను. గనుక ఈ శుద్ధిగదిలో రాకడ శుద్ధిని అందుకొన్నామా? అని ఆలోచనచేసి పరీక్షించుకొనవలెను.
- 2. బైబిలు పఠన:- బైబిలంతయు తండ్రి మనకు దానపట్టాగా ఇచ్చెను. గనుక చదువవలయును. చదువురానివారు జాగ్రత్తగా వినవలయును. నీకొక ఉత్తరము వచ్చినయెడల అంతయు చదువుదువుగదా? ఆలాగుననే రాకడకు ముందు బైబిలు అంతయు చదువవలయును. రాకడ పేరుమీద నీవు బైబిలు చదువుట ముగించి రాకడకు సిద్ధముగా యున్నావా?
- 3. ప్రార్ధనా స్తుతులు:- ప్రతి ఒక్కరు ప్రార్ధన మెట్లు ప్రకారముగా అన్ని ప్రార్థనలుచేసి, ముగించవలయును. ఇతరులను గూర్చిన, సృష్టిని గూర్చిన ప్రార్ధనలన్నియు చేసి ముగించవలయును. “అయ్యో! నేను ఫలానివారినిగూర్చి, వాటినిగూర్చి ప్రార్ధించలేదని అనుకొంటారేమో! గనుక యిప్పుడే ప్రార్ధనా స్తుతులు ముగించవలెను. స్తుతి జీవనముగలవారు యూదా గోత్రికులైయుందురు. స్తుతి ఎంత కష్టమో సమర్పణ అంత కష్టము.
- 4. సువార్త పని:- వీలైన వారందరికి సువార్త చెప్పినారా? సువార్త అనగా మనము నూరు వాక్యములు చెప్పితే అది సువార్తకాదు గాని ఒక ఆత్మను క్రీస్తుయొద్దకు మళ్ళించితే అదియే సువార్త, అదియే మంచివార్త. క్రీస్తు దగ్గరకు ఆత్మలను తేవలయును. గనుక సువార్తఅనే వల ఉన్నదో లేదో పరీక్షించుకొనండి.
- 5. వరముల గది:- ప్రభువిచ్చు వరములన్నీ వాడినారా? మూటగట్టినారా లేక భూస్థాపన చేసినారా? జ్ఞాపకము తెచ్చుకొని యిచ్చిన వరములను ఆడుకొనక వాడుకొనండి (సంఘ క్షేమాభివృద్ధి కొరకు).
- 6. నష్టము:- ప్రభువు నిమిత్తము నీవేమి నష్టమైనావు? కొందరు ధనము, ఆరోగ్యము, ఆయుష్కాలము, మంచిపేరును పోగొట్టుకొనుచున్నారు. నీవేమి పోగొట్టుకొనుచున్నావు. పౌలు సమస్తమును నష్టముగా యెంచుకొనుచున్నాడు. స్వపరీక్ష చేసికొని, నష్టపర్చుకొనుటకు సిద్ధపడుము.
- 7. క్రొత్త పని:- ప్రభువు నీకు అప్పగించిన పనిని గాక మరిక్రొత్త పని ఏదైనా చేసినావా? ఈ గదులన్నిటి ప్రకారముచేసి రాకడకు సిద్ధముగా నుండండి. ఈ ప్రకారముగా సిద్ధపడకపోతే వెళ్ళలేమా? అనేవారినిగూర్చి యేమి చెప్పగలము! కాబట్టి ప్రియులారా! ప్రభువుయొక్క శ్రమలను తలంచుచు స్వపరీక్ష చేసికొనుచున్నందున, ఆ శ్రమలవలననే రాకడభాగ్యము అందుకొనగలము.
కావున ఈ రీతిగా ధ్యానముచేసి పెండ్లికుమార్తె సంఘ కన్యకగా స్థిరపడుదుము గాక. ఆమేన్.