జ్ఞాతవ్యము 7: Father M. Devadas


సంస్కారపు విందు

“దాని గుణము వారు యెరుగక దానిని తరిగి, కూరకుండలో వేసిరి”
2రాజులు 41:38-44.

ఆదాము, అవ్వలుకూడ గుణమెరుగక తినివేసి, పాపము తెచ్చుకున్నారు. పాపముయొక్క గుణమెరుగక దానిని తినివేసేవారు ఎంతమంది ఉన్నారో. అది మంచో, చెడో ఎరుగక దానిని తినివేస్తారు. గుణమెరుగక విషము తింటే చస్తారు. అలాగే గుణమెరుగక పాపము చేయువారు తిని పాతాళమునకు వెళ్తున్నారు. నరకములో పడిపోతున్నారు. పాపాకర్షణలో ఉన్నవారిలో ఉండకండి. ఇక్కడ విషమున్నదని తెలియగానే ప్రవక్తలు తినడము మానివేశారు. ఎలీషాగారితో చెప్పినారు విషమున్నదని. ఎలీషాగారు రెండంతల ఆత్మగలవారు. నా శరీరమనే కుండలో పాపములేదు, విషములేదు అనేవారు యెంతమంది ఉన్నారు? ఈ శరీరమనే కుండలో పాపపు విషమున్నది. ప్రభువు తన శరీరమును పిండిగాచేసి, రొట్టెగాచేసి, కాల్చి మనకిస్తున్నారు. గోధుమగింజ అనబడిన ప్రభువు శరీరము గెత్సేమనే అనబడిన గానుక తొట్టిలో తిరుగలిలోనికి వెళ్ళినది. పై రాయి దేవుడు, క్రింది రాయి సైతాను. ఇద్దరు కలసి నలిపివేసినారు. పిండి అయిపోయినారు. ఆ పిండి రొట్టెగా చేయబడి సిలువ అనే బలిపీఠముమీద, దేవుని కోపాగ్నిలో కాల్బబడి, మనకివ్వబడినది. కాల్చబడి, మనకివ్వబడినది. ఆ కుండలో ఉన్న విషము పోవుటకు ఆయన శరీరమును పిండిగా చేసికొని, రొట్టెగాచేసి మనకిచ్చారు. పాపమును విరిచివేసినది యేసుప్రభువే గనుక ఆయనే మన పాపములనెల్ల విరిచివేసినారు. దాని గుణమెరుగక పాపమును నీళ్ళవలె త్రాగుచున్నారు.


వారు దాని గుణమెరుగక చేసిరి కాని మనమైతే గుణమెరిగీ చేస్తున్నాము. ఒక విశ్వాసి వచ్చినారు. మొదటి పంట యవల పిండితో రొట్టెలు చేసి దైవజనుడైన ఎలీషాగారికి తెచ్చినారు. ఆయన శిష్యులకు పంచిపెట్టినారు. గోధుమలను తెచ్చినారు వండుకు తినడానికి, మీరు ఈ మంచి పద్దతులు మానకండి. పండ్లు కానుకగా తెచ్చినారు. వాక్య సేవకులను ఎంతగానైనా ప్రేమించవలెను. అప్పుడు దేవుడు దీవిస్తారు. శ్రేష్టమైన ప్రేమ కలిగియుండండి. వచ్చింది తక్కువ, ఉన్నవారు ఎక్కువమంది. ఏలాగు సరిపోతుంది అన్నారు. ఇది అవిశ్వాసము. ఇది చాలగా మిగిలిపోతుంది అని దైవజనుడు అంటున్నారు. ప్రభువుమీద ఆధారపడి ఏమి చేసినా మిగలవలసిందే కాని తక్కువ కాదు. వస్తువులను చూడవద్దు దేవునివైపు చూడండి నాయనా నీదే భారము అనండి. బైబిలుమిషను విశ్వాసము మిగిలే విశ్వాసము. ఆ శిష్యులైనవారిది చాలదనే విశ్వాసము. అందుకే వారి అవిశ్వాసమును కడిగివేయడానికి ప్రభువు శిష్యుల పాదములను కడిగినారు. బల్లమీద ఆయన శరీరమున్నది. ఆయన రక్తమున్నది. ఆయన బల్లయొద్దకు వచ్చువారలారా! జాగ్రత్త. నిరంతర జీవమునకు మనలను సిద్ధపరచేదే, ఆయన శరీర రక్తములనే ఆహారము. 3 రోజులు జనులకు ఆహారములేదు, కాని వారికి ప్రభువు తృప్తిగా ఆహారము వడ్డించినారు. తినగా మిగిలినది. ఆయన ఆహారము ఎప్పుడూ మిగిలేటట్టే యిస్తారు.


ప్రభువు వేసిన భోజనపు బల్ల:- మనది భోజనపు సహవాసము, అందరము ఒకే సహవాసములోనికి వచ్చినాము. మనము పిలువబడిన వారము. మనము యేసుప్రభువుయొక్క బంధువులమై యున్నాము. ఇదే దేవునియొక్క సహవాసము. ఈ బల్ల దగ్గర ఒకే మనస్సు ఒకే ప్రేమకలిగియుండాలి. ఇది కబుర్ల సహవాసముకాదు. భోజనము కొరకైన సహవాసము కలిగియున్నాము. గనుక బలము కలిగియుండండి. ఆత్మీయమైన బలము కొరకు ఈ బల్లయొద్దకు రండి.

ప్రభువు నిత్యము తన వాక్యముతో మిమ్మును నడిపించి, రాకడకు సిద్ధపర్చునుగాక. ఆమేన్.