జ్ఞాతవ్యము 7: Father M. Devadas
ఏలియా సేవకుడు
1 రాజులు 18:43-44.
ఏలియా సేవకుని చరిత్ర బైబిలులో లేదుగాని అతడు గురువు చెప్పినట్లు చేసెను అని మాత్రమున్నది.
షరా:- గురువు చెప్పినట్లు చేస్తే గుణమునకు వస్తాము. శిష్యుని కథ ఏమి? మేఘము రాలేదనెను. ఈలాగు 6సార్లు రాలేదంటూనే వచ్చెను. ఏడవసారి మాత్రము తుదకు ఏలియా వద్దకు వచ్చి మనిషి చేయి యంత మేఘము వచ్చినదనెను. కొండమీదికి ఇద్దరెక్కిరి.
- 1) ఏలియా
- 2) సేవకుడు.
- 1. భక్తుడు ప్రార్థించగా
- 2. ఏలియా ప్రార్ధన సేవకుడు చూచెను.
సేవకుడు భక్తుడో కాదో తెలియదుగాని ఏలియా ప్రార్థించుట చూచెను. అతనికి ప్రార్థించుట తెలియకపోయినను ఏలియా ప్రార్ధన చేయగా చూచుచుండెను. ఏలియావద్ద ఉన్న సేవకుని కథ ఏదనగా
- 1) ఏలియా ప్రార్ధించిన తర్వాత మేఘమును చూచి రమ్మంటే, చూచి, లేదు, లేదు, లేదు ఈలాగు 6సార్లు జవాబు చెప్పినాడు (అతడు భక్తుడో కాడో తెలియదు).
- 2) చివరగా 7వసారి అరచేయంత మేఘమున్నదన్నాడు.
- 3) అతడు సేవకుడు ఆ భక్తునితో ఉన్నాడు గనుక అతనికి అదే గొప్ప.
- 4) భక్తుడు మోకాళ్ళూని ప్రార్ధించుట కంటితో చూచినాడు. అదే గొప్ప అనుభవ సాక్ష్యము.
- 5) ప్రార్ధించగా జవాబు భక్తునికి రావలసినది గాని ప్రార్ధన జవాబు అనగా, దేవుని జవాబు సేవకునికి వచ్చింది. అది భక్తునికి సేవకుడు చెప్పినాడు.
- 6) ఆ దైవవార్త రాజకును సేవకుడు చెప్పినాడు. గనుక రాజుగారు రథమెక్కి వెళ్ళినారు.
- 7) చెప్పినట్లు చేయుట (ఇది విధేయత). ఇది గొప్ప గుణము విసుగుకొనకుండ చేయుట మహాగొప్ప గుణము.
షరా:- భక్తుడు ఎక్కువా? ప్రార్థన ఎక్కువా? భక్తుడు మనిషి భూమిమీదనున్నాడు. భక్తుని ప్రార్ధన పరలోక కొండెక్కెను, కొండెక్కినది. ఇద్దరు అనగా భక్తుడు, సేవకుడును అదే కొండ ఎక్కిరి. భక్తుడు ప్రార్ధించుట సేవకుడు చూచుట.
ఉదా:- గురువు చెప్పినట్లు చేస్తే గుణానికి వస్తాము.
ఉదా:- పిట్టకొంచెము కూత ఘనము అనగా ఏలియా మనవంటి మనిషైతేనేమి అతడు చేసిన ప్రార్ధన గొప్పది. అనగా మేఘము పిండినది. గనుక నీరు వర్షంగా కురిసింది.
షరా:-- 1) మేఘము మనకు చెప్పు పాఠము ఏమనగా, మేఘము కనబడగానే వర్షము వచ్చును.
- 2) ప్రభువు మేఘముపై వస్తానన్నారు. మేఘము మీద నీరు వచ్చునుగాని మేఘముమీద మనిషి ఏలాగు రాగలడో!
- ౩) యూదా పత్రికలో ఉన్నది గాలిమేఘము. గాలి మేఘము వల్ల వర్షమురాదు. ఈ మేఘము కనబడుటయేగాని వర్షమురాదని తెలుపు నిర్జల మేఘము.
షరా:- నల్లమేఘము మీద వర్షము వచ్చును. జవాబు రాని ప్రార్థనలు తెల్లని మేఘమువంటివి. కొందరు నల్లని మేఘమువంటివారు. వీరి ప్రార్ధనలు నెరవేరును. కొందరు తెల్లని మేఘము వంటివారు గాలిమేఘము వంటివారు. వారి ప్రార్ధనలు నెరవేరవు. కొందరు మహిమ మేఘములవంటివారు. వారు ఏలీయావలె ఎగిరివెళ్ళువారు.
ఏలీయా ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థనా నెరవేర్పు చూచిన రాజు భక్తుడైనాడా? కుర్రవాడు భక్తుడైనాడా? లేదు. అలాగే భక్తుల వద్ద ఉండువారిలో, వారిని చూచికూడ మారనివారు ఉన్నారు. వారి ప్రార్ధనలు చూచియైనను మారుటలేదు. మేము అట్టివారమై యుండక, మేము మార్పుపొందువారమై యుండునట్లు కృప దయచేయుమని ప్రార్థించండి.
షరా:- ఎంతపాపియైనను, ప్రభువు మేఘము మీద వచ్చి చావులేకుండ మోక్షమునకు తీసికొనివెళ్ళునని విని, అది కావలెనని కోరుదురుగాని పాపమును విడువరు. బాగా చెప్పేవారుంటే మారుదురు. హృదయమును మార్చుకొందురు. ఉపవాస ప్రార్థనలు గొప్పవి. గాని ఏలియా ఉపవాసము లేకుండగనే గొప్ప ప్రార్ధన చేసెను. ఉపవాస పరులకంటే గొప్ప ప్రార్ధన చేసెను. ఎందుకంటే దేవునితో ఉన్నాడు గనుక గొప్ప అద్భుతము చేసెను. సేవకుడు ఏలియాతో ఉన్నాడు అతడు ఏ అద్భుతములు చేయలేదు. అతడు దేవునితో ఉంటేనే అద్భుతములు చేయగలడు.
ప్రార్ధనద్వారా, గొప్ప బలము పొందగలరు. ఏలీయా ప్రార్ధన చేయగా, చేయగా ఆ ప్రార్ధనకు గొప్ప బలము వచ్చెను. 1వ సారి ఏలియా ప్రార్థించినాడు బలము కలిగినది.
2వ సారి మరింత పట్టుతో ప్రార్థించగా, మరింత బలము కలిగెను.
3వ సారి మూడంతల బలము
4వ సారి నాల్గంతల బలము
5వ సారి అయిదంతల బలము
6వ సారి ఆరంతల బలము
7వ సారి ఏడంతస్తులుగా బలము కలిగినది. అన్నిటికన్న ఇదే గొప్పది, అన్నీ సమకూర్చేది.
ఏలీయా హృదయములో ఒక గురి ఉన్నది. అది వర్షము. వర్షము రావలెనను గురి. ఆ గురితో గిరి ఎక్కినాడు. ప్రార్ధనను పురి ఎక్కించినాడు (ఇంకా పురి, ఇంకా పురి). అప్పుడు వర్షము కురిసినది. పొలము, పంటలు, ఫలములు బాగా ఫలించినవి. ప్రజలు సమకూర్చుకొన్నందున ఇంటిలో సిరి సంపదలు గలవారైనారు. ఆ పిమ్మట కరువులు తీరి, నీటి సమస్తమును యిబ్బందులు తీరి సరియైనది.
- ఏలీయాకున్నది గురి
- ఏలీయా ఎక్కింది గిరి
- ఏలీయాకు పెట్టింది ప్రార్ధనకు పురి
- ఏలీయా ప్రార్ధన వల్ల వచ్చింది దేశానికి సిరి
- అంతటా కలిగింది సరి
అట్టి మహిమానుభవములతో, గురిగల్గిన ప్రార్థనలతో, సమస్తమును సరిచేయగల్గిన విజ్ఞాపనలతో ఆత్మ తండ్రి మనలను అలంకరించి, ఏలీయావలె మహిమ మేఘమెక్కించును గాక! ఆమేన్.
ఈ పై సందేశమును దైవజనులైన యం. దేవదాసు అయ్యగారు 1953 సం॥ము అక్టోబర్ 20వ తేదీన ఉపదేశించిరి.