జ్ఞాతవ్యము 7: Father M. Devadas


సంస్కారపు సహవాసము

సామెతలు 9:4-6; లూకా 14:16-24; 1కొరింధీ 11:23

నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ఈ అనుభవము ఏర్పరచబడినవారికే తన పిలుపు నంగీకరించే వారికే, తన సహవాసము కోరేవారికే ఆయన ఇవ్వగలరు.


ప్రభువే స్వయముగా ఈ సంస్కారమును పౌలుగారికిచ్చారు. చివరిరాత్రి మేడగదిలో ప్రభువు నూతన నిబంధన ఇచ్చారు. 12 మంది శిష్యులతో ఆ మేడ గదిలో పౌలుగారు లేరు. కానీ 'నేను ప్రభువు వలన పొందితిని' అని ఆయనే వ్రాసారు.


యోహానుగారు సంఘములకు చట్టమునిచ్చే బాధ్యత పౌలుగారికి ఇచ్చారు. యూదామత ప్రవిష్టుడైన పౌలు ప్రతిదీ ప్రభువు దగ్గరే నేర్చుకొని సంఘములకు చెప్పేవాడు. అలాగే అబ్బాయ్ నేను చివరి రాత్రి 12 మందికి ఇలా ఇచ్చానని పౌలుగారికి ప్రభువే సంస్కారమిచ్చారు. “ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను తీసికొని” ఈ సంగతి పౌలుగారికి తెలియదు. కాని అన్నీ ప్రభువే చెప్పెవారు. పౌలుగారికిచ్చిన ప్రభువు మనకివ్వరా? పౌలుగారికిచ్చిన ప్రభువా! నీవు నాకివ్వవా! నేను నీ బిడ్డను కానా! ప్రియుడవైన నీవిచ్చే విందు నాకు కావాలి. ప్రభువు రాకడ కాలములో మనమున్నాము. నా బిడ్డకు నేనే స్వయముగా ఆహారము పెట్టుకోవాలని తల్లికి ప్రియమైన బిడ్డలపై ఉంటుంది. మనము కోరవలెనేగాని, నీవే నాకివ్వాలని అడిగితే ఇవ్వరా! ఆయన తన గొర్రెలను తన చేతితో మేపును. ప్రతి గురువారము 1గంట సంస్కారము కొరకు కనిపెట్టండి. ఆయన మేపును తప్పక అందుకోగలరు.

గనుక అట్టి సంస్కారపు విందును పరిశుద్ధముగా ఎంచి, ఘనమైనదిగా మనము ఆచరించిన యెడల ఆయనే స్వయముగా పౌలుగారికిచ్చినట్లు మనకును స్వయముగా వడ్డించి, తినిపించి ఆరోహణబలమిచ్చి ఆయన రాకడలో పాలు మనకు దయచేయును. అట్టి అంతరంగ సంస్కార బలముతో ఆత్మ తండ్రి మనకు నైజముపై బలమిచ్చి జయమిచ్చును గాక! ఆమేన్.