జ్ఞాతవ్యము 7: Father M. Devadas


శ్రమల గుండము - స్తుతియాగము


ప్రభువునందు ప్రియులారా! మీకు శ్రమలు కలుగునుగాక. శ్రమల గుండము మనకు పరీక్షాగుండము. ముగ్గురు బాలురకు అగ్ని గుండము. పెండ్లికుమార్తెకు కృపాగుండము

ఇవి పెండ్లి కుమార్తెకు శ్రమలగుండమువలె కనిపించినను కృపాగుండముగానే యుండును. కొలిమి వలననే కలిమి కలుగును.

శ్రమల నివారణ

పెండ్లి కుమార్తె వరుసలోనికి వెళ్ళతగినవారెవరు?

జవాబు:- ఈ ప్రశ్నకు యిదివరకే జవాబు చెప్పబడెను. గానీ యిప్పుడు క్రొత్తజవాబు వ్రాసుకొనవలయును. అదియేమంటే, ప్రస్తుతము మీకు కలిగియున్న చిక్కులు, నిందలు, యిబ్బందులు, భయము ఈ మొదలగునవన్నియు ఒక కాగితముమీద వ్రాసికొనండి. ఒకొక్క సంగతిని గురించి తండ్రిని స్తుతించండి. స్తుతించేటప్పుడు మీ మనస్సులో యేమియుండవలెనంటే

  1. తండ్రీ! యివి నా లోపములనుబట్టి రానిచ్చినావు.

  2. తండ్రీ! కేవలము నీ మహిమార్ధమై రానిచ్చినావు.

  3. తండ్రీ! ఏ విధముచేత వచ్చినను అవి నీ సెలవు మీద వచ్చినవి.

  4. ప్రభువా! వీటన్నిటికి ఒక్కొక్క మిష ఉన్నది అనగా ఒక్కొక్క శ్రమకు ఒక్కొక్క గొప్ప పనియున్నది. ఆ శ్రమలనేవి ముగించకముందు అనగా స్తుతించనిదే ఆ శ్రమపోదని గ్రహించవలయును.

  5. ప్రతిదియు మాకు మేలుచేయవలెనని నీవు ఆజ్ఞాపించెదవని మేము గ్రహించుచున్నాము.

  6. ప్రతి శ్రమవలన ఈ శ్రమల వంకద్వారా నీకు మహిమ రావలయునని మేము గ్రహించవలయును.

  7. ఈ శ్రమలలో మేము విసుగుకొనకుండ ఆనందించుచు, నిన్ను స్తుతించుచు ఉండడము చూచి, యితరులు మా వల్ల మంచిపాఠము నేర్చుకొందురని నీవు శ్రమలు రానిచ్చినావని మేము గ్రహించవలెను.

  8. మేము శ్రమలో నిన్ను స్తుతించుచు ఉండడముచూచి; పిశాచి, దయ్యములు, సిగ్గుపడి ముఖమువాల్చుకొని భయపడి పారిపోవలయునని మాకు ఈ శ్రమలు రానిచ్చుచున్నావని మేము గ్రహించుట నీ ఉద్దేశ్యమైయున్నది.

  9. మేము ఈ శ్రమలన్నిటిలో నూతనయనుభవ పాఠము, విశ్వాసాభివృద్ధి పాఠము, నీ ప్రేమయొక్క వ్రత్యక్షత తెలుసుకొను పాఠము నేర్చుకొనుటకే నీవు రానిచ్చినావని మేము గ్రహించవలెను.

  10. ఈ శ్రమలు అనుభవించుచున్నందుకు ఈ లోకములో అమూల్యమైన అనుభవములనే బహుమానము పొందుట మాత్రమేగాక, పరలోకములో మాకు ఇయ్యబోయే బహుమానమును కూడ ఆశించవలెనని నీవు శ్రమలను రానిచ్చినావు.

  11. ఇట్టి శ్రమలనుభవించడము మేమొక్కరమేకాదు. మాకు చాలామంది జత ఉన్నారు. యింకా రోజులు గడిస్తే క్రొత్తవారనేకులు వస్తారు. నన్ను నీవు కేవలము నమ్మినందువలననే ఈ శ్రమల వరుసలోనికి పిలిచినావు. నా యెడల నీవు చూపే కృపలలో ఇదియొకటి అని స్తుతించవలెను.

  12. మాకంటే ముందుగా పరలోకమునకు చేరిన ఒక జనసమూహము కలదు. వారు ఈ లోకమును దాటి పరలోకపు గట్టు యెక్కినారు. వారికీ శ్రమలు లేవు. గనుక వారు నిన్ను స్తుతించుచున్నారు. వారు శ్రమలకు వెలుపలనుండి నిన్ను స్తుతించుచున్నారు. మేము శ్రమలలోనుండి స్తుతించుచున్నాము. ఈ గదిలోనున్నవారు కీర్తనయెత్తి పాడుచుండగా రెండవగదిలోనివారు ఎత్తికొందురు. ఈ విధముగా మేము శ్రమలలో స్తుతిపాటలు పాడుచుండగా, శ్రమ సరిహద్దున అనగా అవతలనున్నవారు అందుకొందురు. మత్తయి 21వ అధ్యాయములో యేసుప్రభువు గార్థభముపై నెక్కి యెరూషలేమునకు వెళ్ళునపుడు ముందు, వెనుక యున్నవారు ఆయనను స్తుతించిరనియున్నది. ముందు అనగా చనిపోయిన భక్తులు; వెనుక అనగా యిప్పుడున్నా మనము. వారు, మేము స్తుతులందుకొని పాటలు పాడుచుంటే దేవదూతలు అందుకొందురు. యిన్ని భాగ్యములు మాకు కలిగే నిమిత్తము ఇన్ని శ్రమలను రానిచ్చినావు కాబట్టి నీకు స్తోత్రములు.

  13. కొందరిని శ్రమలలో ఉంచి కాపాడుదువు. మరికొందరిని శ్రమలనుండి తప్పించుదువు. మరికొందరికి శ్రమలు రాకుండజేసి కాపాడుదువు. అయితే రేపు మహాగొప్ప శ్రమలు ఆరంభించేముందు మహిమ మేఘముమీద వచ్చి తీసుకొని వెళ్ళుదువు. గనుక నీకు మహిమ వందములు.

  14. మేము శ్రమపడుచున్నామని అనుకొనువారు అజ్ఞాన విశ్వాసులు. మాతోకూడ ప్రభువును శ్రమపడుచున్నారనుకొను వారు జ్ఞాన విశ్వాసులు. నీవెందులో యున్నావు అనగా యే జాబితాలోనున్నావు?

షరా:- పై వ్రాయబడిన వ్రాతనుబట్టి యెవరు మోకాళ్ళూని స్తుతి చేయుదురో, వారియొక్క ఆత్మలకు ఆనందకరమైన మహిమ పరలోకముచేత అందింపబడును. తండ్రి, కుమార, పరిశుద్దాత్మ త్రియేక దేవుని మహిమ అందింపబడుట ఇది మహాగొప్ప అనుభవము. కష్టమైన అనుభవమైనను అందరు అట్టి స్తుతి చేయవలెను.

ఈ రీతిగా స్తుతించి, ధ్యానించి, శ్రమలయందు ఆదరణ పరలోక బహుమానము పొందుదుము గాక. ఆమేన్.