జ్ఞాతవ్యము 7: Father M. Devadas


ప్రభువుయొక్క తీర్పులు

మత్తయి 26:57-67 27:11-26 మార్కు 14:38-64 లూకా 22:66-71; 23: 1-25; యోహాను 18:12-14, 19-24, 28-40; 19:1-16.

ప్రభువుయొక్క శ్రమకాలములో రెండు రకముల కోర్టులకు ఆయనను తీసికొనివెళ్ళిరి.

యేసుప్రభువు ఈ రెండు కోర్టులకు వెళ్ళవలెను. యేసుప్రభువు నజరేతునుండి యూదయ, గలిలయ, సమరయ, పెరయ దేశములలో సువార్తచేసి తిరుగుట ముగించెను. ఇప్పుడు కోర్టులకు పోవలెను, తరువాత సిలువ దగ్గరకు పోవలెను. ఆయన తనను ప్రత్యక్ష పరచుకొనుటకు వచ్చెను గనుక అందరికి ఆయన కనబడుటకే, కోర్టులకు కూడ వెళ్ళెను. రేపు ఎవరును ఆయన మాకు కనబడలేదని అనకూడదు. యూదులకు కనబడుటకు మతసంబంధమైన కోర్టునకును, రోమా గవర్నమెంటు వారికి కనబడుటకు గవర్నమెంటు కోర్టునకును వెళ్ళెను. ఇప్పుడు మతసంబంధమైన కోర్టులో ఆయన దగ్గర వాంగ్మూలము తీసికొని తీర్పు వ్రాయవలెను. ముందు ఇక్కడ తీర్పుపొంది, తర్వాత గవర్నమెంటు కోర్టులో తన వాంగ్మూలము వినిపించవలెను.


రేపు వెయ్యేండ్ల పరిపాలన ముగిసిన తర్వాత ఆయన సజీవుల తీర్పులో వాంగ్మూలము తీసికొనును. వెయ్యేండ్లు బోధవిన్నారు, శాంతి అనుభవించినారు మీయొక్క తీర్మానమేమి? అని అడిగి తీర్పుచెప్పవలెను. వెయ్యేండ్లకథ అయిన తర్వాత తీర్పు. ఆలాగే ప్రభువుయొక్క కథ అయిన తర్వాత ఆయనకు తీర్పు. ఎందుకు ఆయనకు తీర్పు? ఆయన అనేకులకు తీర్పుచేయవలెను గనుక ముందు ఆయన తీర్పు పొందవలెను.

ముందు మత సంబంధమైన కోర్టులో తీర్పు జరిగెను. అక్కడ కొన్ని ప్రశ్నలు అడిగిరి: నీవు దేవుని కుమారుడవా? నీవు క్రీస్తువా? అనగా నీవు దేవుడవా? రక్షించుటకు వచ్చినవాడవు నీవేనా? నీవు మెస్సీయవా? ఇవి వారి మనసును బాధించుచున్నందున, మత గురువులు ఈ ప్రశ్నలువేసిరి. వాటి జవాబులు విని వారు నమస్మరించవలసినదిగాని ఆయనను ద్వేషించిరి. ఆయన సేవయొక్క ప్రారంభములో సైతానుకూడ అదే ప్రశ్న వేసెను. ఆయన సేవయొక్క చివరలోకూడ మతగురువులు అదే ప్రశ్నవేసిరి. "నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను". నేను దేవుని కుమారుడను, దేవుడను అన్నయెడల యూదులకు అంగీకారము ఎందుకనగా వారు పాతనిబంధన వాగ్ధానములు ఎరుగుదురు. అయితే ఇతరులు దేవుని కుమారుడనినయెడల ఒప్పుకొనరు. యూదులకు దేవుని కుమారుడన్న తెలియును.

ఉదా:- ఏమండో ఆయన దొర కొడుకు అనగా దొర అన్నమాట. అలాగే దేవుని కుమారుడనునది యూదులకు తెలియును. ఇతరులకు తెలియదు. ప్రభువు జవాబు చెప్పెను. గాని వారు నమ్మలేదు. వారి ప్రశ్నలకు "నీవన్నట్టే" అని ప్రభువు జవాబు చెప్పెను. అనగా నేను దేవుడను, దేవుని కుమారుడనని చెప్పెను. అవి మాత్రము చెప్పి ఊరుకొనలేదు. ఇంకా చెప్పెను. ఆరోహణమునుగూర్చియు, రేప్చరు (రెండవ రాకడను) గూర్చియుకూడ చెప్పెను. మత్తయి 26: 64వ వచనములో తన యొక్క ఆరోహణమును గురించికూడ చెప్పెను. మీరు గురువులా? నా రాకడను గూర్చి మీరు చదివినారా? చూచుకొనండి! రేపు ఆరోహణమగుదును అని సవాలు (Challenge) చేసెను. మీ కోర్టులను, సిలువను, మరణమును, మిమ్ములను దాటుకొని ఆరోహణమగుదును. రేప్చరులో మరల వస్తాను, అని సవాలు చేసెను. మనము ఈ లోకస్తుల మధ్య జీవించినంత కాలము ఇతర మతముల వారికిని, మనలోని వారికిని ఈ 4 సాక్ష్యములియ్యవలెను.

ప్రార్ధన:- ప్రభువా! మా మీదికి రావలసిన అయిదు తీర్పులు తప్పించుటకు మా స్థానములో నీవు తీర్పు పొందినావు. మాకు ఆ తీర్పులు రాకుండ చేసినావు. అవి మా మీదకు రావు గనుక నీకు వందనములు. ఇంకా రావల్సి ఉన్న తీర్పులన్ని పొందినావు గనుక అవి మాకు రావు. మా తీర్పులు పొందిన నీ కృపకు వందనములు. మాకు విమోచన దీవెన దయచేయుము. ఆమేన్.


ధ్యాన విధానము: ధ్యాన కూటముయొక్క ఉద్దేశము ప్రభువు మనకు ఏమి తలంపులు కలిగించును అనునది. ధ్యానము అనగా మనము మాట్లాడుటకాదు, ప్రార్ధన చేయుటకాదు, ప్రభువు, మనతో మన అంతరంగముతో మాట్లాడుట. ప్రభువు శ్రమకాలములో కలిగి ఉండవలసిన ధ్యానాంశము - “ప్రభువు సిలువ” ఈ సిలువలో అనేక అంశములు గలవు. ప్రభువుయొక్క మనసులో రాబోవు శ్రమలయొక్క తలంపు గలదు. అంతేకాదు, ఆయన సర్కీటులోను, గెత్సేమనే తోటలోను, కొట్టునప్పుడును, సిలువ వేయునప్పుడును ఆయన అంతరంగమును ధ్యానించుచుండవలెను. ఈ రీతిని ఆయన శ్రమపడుచూ చనిపోవునప్పుడు, నన్ను గురించి ఆయన ఏమని తలంచెను? ఇప్పుడు పుట్టిన నన్ను గురించి ఆయన అప్పుడు తలంచినాడా? నేను ఆయన జ్ఞాపకములోనున్నానా? ఆయన శ్రమలో నేనున్నానా? అదే నిజమైనయెడల నేనెంత కృతజ్ఞుడనై యుండవలెను! ఇప్పుడున్న నన్ను ఆయన అప్పుడే తలంచుకొనెను. నా రక్షణగురించి తలంచి శ్రమపడెను. గనుక వందనములు.


ఓ ప్రభువా! నీవు మమ్మును తలంచుకొన్నావు గనుక వందనములు మరియు నీవు దేవుడవు గనుక అందరిని నీ శ్రమలో తలంచుకొనగలిగినావు. ఇది మాకు అర్ధముకాదు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ఆమేన్.