జ్ఞాతవ్యము 7: Father M. Devadas
నిజార్ధి విధి అను పత్రికకు జవాబులు
ప్రియులారా! నేను పాపినికాను, నేను యోగ్యుడను అని నేను అనుకొనుట లేదు, అనుటలేదు; గాని ప్రభువే తన అమూల్య రక్తము వలన నన్ను శుద్ధిచేయుచున్నాడు అని ప్రభువునుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను. ప్రభువు తుదకు తన సంఘమునకు ముడత అయినను, మచ్చ అయినను లేకుండచేసి, దానిని పరలోకమునకు కొంచుపోవును అని పౌలు వ్రాయుచున్నాడు గదా (ఎఫెసీ 5:27). అలాగే ప్రభువు నన్ను కడకు సంపూర్ణ పరిశుద్దునిగా స్థిరపరుపనై యున్నాడు గనుకనే ఆయన నా కూటస్థులకు నన్ను గురించి ఘనముగా చెప్పుచున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరమునందలి బేతనియ దైవసన్నిధి కూటస్థులు ప్రభువు నడిగి తెలిసికొన్న జవాబులు నాకు పంపగా అవి ప్రచురించుచున్నాను.
1. ప్రశ్న :- సృష్టికర్తయైన దేవా! నీవు ఎమ్. దేవదాసను నీ సేవకునికి గాలిలో తెలుగు అక్షరములతో “బైబిలుమిషను” అని వ్రాసి, ఆ మిషనును బైలుపరచినావట. ఈ ప్రత్యక్షత రాజమండ్రిలో 1938వ సం॥మున కలిగెనట. ఇది నిజమా?
జవాబు:- యోహాను 14:17 నన్ను గూర్చి తండ్రి ఇచ్చిన సాక్ష్యము ఎట్లున్నదో, నేను దేవదాసయ్య గారిని గురించి ఇచ్చిన సాక్ష్యము అట్లున్నది. “ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయనయందు నే నానందించు చున్నాను. ఈయన మాట వినుడి”. అని అయ్యగారినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. స్త్రీలు కనినవారిలో ఎవరు గొప్పవారు? యోహాను గొప్పవాడు. ఆయన మొదటి యోహాను. ఈ దేవదాసయ్యగారు 2వ యోహాను. లూథరుమిషను పాదుర్లు అయ్యగారి పాదముల దగ్గరకు వచ్చి రాకడ వర్తమానము చెప్పండి అని అడుగుచున్నారు.
1a. ప్రశ్న:- ప్లేటులో అన్నము, అన్నములో చారుపోయుచున్నట్లు కనబడినది. దీని అర్థమేమి? అని అడిగితిని.
జవాబు:- నా కుమారుడు రాకముందు క్రైస్తవసంఘము ఎముకలతోను, కొమ్ములతోను ఉన్నది. ఇప్పుడైతేనో ఎంతో పుష్టిగాను సంతోషముగాను ఉన్నది.
1b. ప్రశ్న :- ఎముకనగా నేమి? కొమ్ములనగా నేమి? అని అదడిగితిని.
జవాబు:- ఎముకలు క్రైస్తవసంఘములోని నిర్జీవమునకు గుర్తు. బైబిలు మిషను స్థాపించిన తర్వాత సంఘమునకు వాక్యములోని క్రొత్త అర్ధము వచ్చినది. నూతనానుభవము వచ్చినది, స్వస్థత పొందుచున్నారు.
కొమ్ములు అనగా క్రైస్తవ సంఘములోని కలహములు, అపార్ధములు, భేదములు. ఇప్పుడు బైబిలుమిషను ద్వారా అన్నిట్రికిని ఐక్యత కుదిరీ అన్ని సంఘములు ఏకమై, సార్వత్రిక సంఘము గొప్ప సమాధానముతో నిండినది.
2. ప్రశ్న :- ఇంతకుముందే కొన్ని యేండ్ల క్రిందట త్రైక దేవుడవైన నీవు దర్శనములో ఆయనకు పాదిరిపనికి ఆర్డినేషను ఇచ్చినావట. ఇది నిజమా?
జవాబు:- నీవు నీతిని ప్రేమించితివి. దుష్టత్వము విడిచితివి. కావున నీవు నా కుమారుడవు. నేను నిన్ను కనియున్నాను. కావున నీ దేవుడే నీ చెలికాండ్రందరికంటె ఎక్కువగా ఆనందతైలముతో నిన్ను అభిషేకించియున్నాడు. హెబ్రీ 1:9; కీర్తన 45:7. నిర్దోషమైన గొర్రెపిల్లను ఏడాది వయసులోనే ఇశ్రాయేలీయులు అర్పించినట్లు ఈయన అర్పింపబడెను. అప్పుడే నేను తైలముతో అభిషేకించితిని. నాతో పరలోక పరిశుద్ధులు, దేవదూతలు వచ్చిరి గాని ఈ అభిషేకమునునుగూర్చి, దేవదాసు అయ్యగారి తల్లిదండ్రులు లోకములో ఉన్నప్పుడు వారికి తెలియదు. ఇప్పుడు వారికి తెలుసును. వారెంతో సంతోషించుచున్నారు. నేడు ఈ సంగతి నా సన్నిధిలో ఉండు ప్రతివారికి తెలియబడును. సన్నిధిలో లేనివారికి తెలియబడదు. చెప్పినను వారు నమ్మరు. గొప్ప ఉద్యోగము కొరకు మీ జనకుని తల్లిదండ్రులు ఆశింపలేదు. దేవుని సేవకొరకు ఆశించిరి, గాని తల్లిదండ్రులు భూమిమీద ఉన్నంతకాలము వారి సమర్పణ ఫలితము చూడలేదు, గాని పరలోకములోనుండి చూచి సంతోషించుచు స్తుతించుచున్నారు. మీ అయ్యగారు అభిషేకము పొందినప్పుడు కైలాస మహర్షిగారు, దాక్టర్ మార్టిను లూథరుగారి భార్యయును సాక్షులుగా నిలువబడిరి.
- (1) యేసుప్రభువు యూదులలో ఉన్నంతకాలము వారు ఆయనను అంగీకరింపలేదు అలాగే లూథరన్ సంఘము మీ అయ్యగారిని అంగీకరింపలేదు. పూర్ణవిశ్వాసము గలవారే పూర్ణహృదయముతో నమ్మగలరు గాని అందరును నమ్మలేరు.
- (2) దాస్యపు ఆత్మకాదు, స్వీకృత పుత్రాత్మను మీరు పొందితిరి గనుక ఇంకను సందేహమెందుకు?
3. ప్రశ్న- లూథరుమిషనుకు రిజైను పెట్టవలసినదని ఫిబ్రవరిలో చెప్పినావట. ఇది నిజమా?
జవాబు:-
- 1) నిజమే. పరిశుద్దాత్మ కూటములు దేవదాసయ్యగారు శానిటోరియములో పెట్టినప్పుడు, ఆ కూటములో హాజరైనవారికి కూటములో పాలుపొందినవారికి బైబిలులో నున్న ప్రకారము, భాషావరము, భాషలకు అర్ధముచెప్పు వరము, ప్రవచన వరము, స్వస్థపర్చు వరము, పాటలుపాడగల వరము, దర్శనవరము, స్వర ప్రత్యక్షత, వ్రాత ప్రత్యక్షత, దయ్యములను వెళ్ళగొట్టువరము అనుగ్రహింపబడను. (1కొరింధీ 14వ అ.ము చూడుము) ఆ వరములను బట్టి వారు ఎంతో సంతోషముగా ఉండి మేలుపొందుచు ఉండిరి.
- 2) లూథరన్ మిషను పాదుర్లకు చాల ఆయాసము కలిగినది. ఇది దయ్యముల బోధ. మనకు వ్యతిరేకముగా ఉన్నది గనుక ఇట్టి కూటములు పెట్టవద్దని దేవదాసయ్యగారిని అభ్యంతరపరచిరి.
- ౩) అయినప్పటికిని కూటములు పెట్టుచునే యుండిరి. వచ్చుచున్నవారికి లూథరన్ మిషనులోని పెద్దలు ఆటంకముగా నున్నారు. నీమీద వారికి ఇష్టములేదు. గనుక నీవు లూథరన్ మిషనుకు రిజైను పెట్టవలెనని నేను చెప్పితిని.
- 4) అప్పుడు (దేవదాసయ్యగారు) ఆశ్చర్యముగా పైకి చూచుచున్నట్లు కనిపించిరి.
- 5) పరలోకమునుండి పరిశుద్ధులువచ్చి దేవదాసయ్యగారిని వ్రేలితో చూపుచు “ఇడుగో గొఱ్ఱెల కాపరి” (ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలోని 163వ కీర్తన) అను పాట పాడిరి.
4. ప్రశ్న- ఒక సైన్యముయొక్క యువరాజువలె నీవు బయటికి వచ్చివేయుము అని సెలవిచ్చినావట. ఇది నిజమా?
జవాబు:-
- 1) నిజమే. ఆయన లూథరన్ మిషనులో నుండి బైటకు రాకముందు రెండవ రాకడయొక్క సంపూర్ణమైన అర్ధము ఎవరికిని తెలియలేదు. రెండవ రాకడయే అంత్యతీర్పు అని ప్రజలు అనుకొనిరి. దేవదాసయ్యగారు బైటకు వచ్చిన తర్వాత రక్షణ సంకల్పనలోని రెండవ రాకడ అనగా ఎత్తబడు సంఘములోని మృతులగుంపు, సజీవుల గుంపు వాటి వాటి వివరము అందరికిని తెలిసినది.
రెండవ రాకడనుండి అంత్యతీర్చువరకు ఉన్నక్రమము ఇప్పుడు బయలుపడినది. ఆయనయొద్ద నేర్చుకొన్నవారు అందరు ఆయన నడిపించు సైన్యము. బైబిలుమిషనువారును, ఆ మిషనును గురించి ఒప్పుకొనుచున్నవారును ఆయన యొక్క సైన్యమై యున్నారు. ఎవరు ఒప్పుకొన్నను, ఒప్పుకొనకపోయినను ఆయన యవరాజే. - 2) ఆయన బైటకు రాకముందు రెండవ రాకడకు గురించియును ప్రటకన గ్రంథమును గురించియును వివరముగా ఇక్కడ చెప్పిన వారెవరును లేరు. ఆయనే వివరించి పత్రిక మూలముగా ఎల్లవారికిని వివరించుచున్నారు. గనుక ఆయన పత్రిక తీసికొనిన వారందరు ఆయన నడిపించు సైన్యమే. ఆయన యువరాజే.
- 3) నేను ఆయనతో మాటలాడుచున్న రీతిగానే ఇతరులతో మాట్లాడునట్లు ప్రార్థన మెట్ల క్రమము బయలుపరచి, పత్రికలు అన్నిచోట్లకును పంపుచున్నందున ఇప్పుడు అనేకమందికి కనబడి మాటలాడుచున్నాను. వారందరు ఒక సైన్యము కాదా? ఆ సైన్యమును నడిపించు ఆయన యువరాజు కాడా?
- 4) బైబిలులోని పాతనిబంధనయందును, క్రొత్తనిబంధనయందును రోగుల స్వస్థత విషయములు కలవు. రోగములమీదను, దయ్యముల మీదను, శిష్యులకు అధికారము ఇచ్చితిని. ఇట్టి అధికారమే నేను దేవదాసను నా కుమారునికిచ్చితిని. ఆ అధికార దండమునుబట్టి ఆయన యువరాజు కాడా?
- 5) పరలోకమునందును, భూలోకమునందును, పాతాళలోకము నందునుకూడ ఆయనకు అధికారము కలదు. ఆయన స్వస్థికూటములు పెట్టి రోగులకును, ఇబ్బందిలో నున్నవారికిని, ఆయా అవస్తలుగలవారికిని, ఆయా కోరికలు గలవారికిని, ఉపకారము చేయుచున్నాడు. నావలన మేలు పొందినవారు, పొందిన మేలు అందరితో చెప్పి నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నారు. వీరుకూడ ఒకసైన్యము కాదా? ఆ సైన్యమునకు ఈయన యువరాజు కాడా?
- 6) ఇంకను దైవికస్వస్థత పొందినవారు అనేకులు ఉన్నారు. వారు సాక్ష్యమిచ్చుటలేదు. వారుకూడ ఈ సైన్యములోనివారే గదా? వారికికూడ ఆయన యువరాజు కాడా? (ఆ సమయములో) ఒక సిలువ కనిపించినది. ఒక పాక కనుపించినది. దానిపై ఇంద్రధనస్సు ఉన్నది, ఆ కాంతిలో ప్రభువు నిలువబడి యున్నాడు. ఆ కాంతిలో ధ్యానము అనేమాట వ్రాయబడి యున్నది. బైబిలు తెరువబడియున్నది.
- 7) షద్రకు, మేషాకు, అబేద్నెగో అనువారు అగ్నిగుండములో నుండుట నిజమా? అది నిజమైన యెడల అయ్యగారు యువరాజుగా నుండి సైన్యమును నడిపించుటయును నిజమే.
- 8) అయ్యగారిని గురించి కొందరు ఆయన యువరాజు యువరాజు అని హేళనగా అల్లరి చేయుచున్నారు. వారు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు, నిజమని నమ్మినవారు వర్దిల్లుచున్నారు.
5. ప్రశ్న :- ఆయన లూథరన్ మిషనువారికి రెజిగ్నేషను పంపినందున వారు ఆయనను సంస్కార భోజనమునకు రానియ్యలేదు గనుక గుడిలో అందరు సంస్కార భోజనము గైకొనునప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రొట్టె ద్రాక్షారసము తీసికొనివచ్చి ఆయనకు బహిరంగముగా దర్శనములో అందించెనని ఆయన చెప్పుచున్నారు. ఇది నిజమా? (ఇది ఏప్రిల్ 24వ తారీఖున జరిగెనట).
జవాబు:-
- 1) ఏలియాకు కాకులచేత ఆహారము పంపితిని. నేను దేవదాసయ్యగారికి శరీరపోషణ కొరకును, ఆత్మ పోషణ కొరకును సంస్కార భోజనమును వడ్డించితిని.
- 2) యవరాజుగా బైటకురమ్మని సెలవిచ్చిన నేనే, ఆ సైన్యమును నడిపింపగల శక్తి నియ్యవలెనుగదా! నేనే ఆయనకు సంస్కార భోజనము ఇచ్చితిని.
5a. ప్రశ్న :- ఆయనకు సంస్కార భోజనము ఇచ్చినపుడు మరి యెవరికిని ఎందుకు చూపించలేదు?
జవాబు :- వారి నేత్రమునకు ఆచారము అను మబ్బును, ద్వేషము అను మబ్బును కమ్మియున్నందున వారు చూడలేకపోయిరి. నా సన్నిధి లోనికి వారుకూడ వచ్చిన యెడల తెలిసికొని ఉందురు.
5b. ప్రశ్న :- ఆ విధముగ మాకుకూడా సంస్కార భోజనము ఇయ్యకూడదా?
జవాబు:- ఆ విధముగ మీడకూడా తీసికొనుటకు సన్నిధి కూటమే అభ్యాస సాధనమైయున్నది.
6. ప్రశ్న :- నీ ఆజ్ఞప్రకారము బైబిలుమిషనును స్థాపించిన తరువాత కొన్నాళ్ళకు దేవా! నీవు ఆయనకు "బైబిలుమిషనును పైకెత్తి చూపించుము” అను మాటలు గాలిలో వ్రాసి చూపించినావట. ఇది నిజమా?
జవాబు:-
- 1) లోకములో ఒక మిషనుకు, ఒక మిషనుకు సమాధానములేదు. ఒక మిషనువారు మరియొక మిషనులో బోధింప వీలులేదు. ఒక మిషనులోని సిద్ధాంతము ఒక మిషనుకు సరిపడుటలేదు. మా మిషను ఎక్కువ, మా మిషను ఎక్కువ అని ఎవరి మిషనును వారే పొగడుకొనుచున్నారు. ఆచారము ఆచరించుచున్నారు గాని నా వాక్యము ప్రకారము నడచుటలేదు. బోధకులు ప్రసంగములు, వాఖ్యానములు, కొటేషన్లు బాగుగా చెప్పుచున్నారు గాని వాక్యప్రకారముగా నడువక చెప్పుచున్నారు.
- 2) బైబిలుమిషనువారు బైబిలునుబట్టి ప్రవర్తించుటకు ప్రయత్నించుటయును, ఇతరులకు అట్లు బోధించుటయును బైబిలుమిషనును ఎత్తి చూపించుట కాదా!
- 3) అన్ని మిషనులవారు బైబిలులోని కొన్ని సిద్ధాంతములే నెరవేర్చుచున్నారు. బైబిలుమిషనువారు అయితే అన్ని సిద్ధాంతములు బోధించు చున్నారు. అన్ని మిషనులవారు నరుల రక్షణమట్టుకే బోధించుచున్నారు. బైబిలుమిషనువారు అయితే అనాదికాలమునుండి అనంతము వరకు ఉన్నవి బోధించుచున్నారు. రాకడ విషయములు, మహిమ సంగతులు బోధించు చున్నారు. ఇట్లు చేయుట బైబిలుమిషనును ఎత్తిచూపుటకాదా!
- 4) “మారుమనస్సు పొందండి" అని తక్కిన మిషనులవారు చెప్పుచున్నారు. ఎప్పుడును మారుమనస్సును గురించియే చెప్పుచుండగా రాకడకు సిద్ధపడుట ఎప్పుడు? బైబిలుమిషనులో రాకడ సంగతులు, ఆదికాండము మొదలు ప్రకటన గ్రంథము వరకు క్రమముగా భక్తులయొక్క చరిత్రలు, వాక్యములోని మర్మములు బోధించుచున్నారు. పాపము మొదలు మారుమనస్సువరకు, మారుమనస్సు మొదలు రాకడ వరకు గల సంగతులన్నియు వివరించు బోధలు, పద్ధతులు సంపూర్తిగా చెప్పుట బైబిలుమిషనును ఎత్తి చూపించుటకాదా!
- 5) నేను శిష్యులనుచూచి - నన్ను వెంబడించుడి అని చెప్పగా వారు నన్ను వెంబడించి నాతో కలిసి సేవచేసిరి. నాకున్న సర్వాధికారము చొప్పున వారికి సర్వాధికారమిచ్చితిని. బైబిలుమిషనులో కొందరిని నేను నా సేవకు పిలువగా వారు సమస్తమును విడిచి, నా సేవచేయుచు నేను చెప్పినట్లు చేయుచున్నారు. ఈ పని బైబిలుమిషనును ఎత్తిచూపించుట కాదా!
- 6) అన్ని మిషనులవారియొక్క బేధాభిప్రాయములకు, వాదములకు గల సమాధానపు జవాబులుగల పత్రికలు అచ్చువేయించి లోకమంతటికి బైబిలుమిషనువారు పంపుచున్నారు. ఇది బైబిలుమిషనును ఎత్తిచూపించుట కాదా!
- 7) మీ అయ్యగారు బైటకు వచ్చుట బైబిలుమిషనును ఎత్తి చూపించుటయై యున్నది. ఎందుకనగా ఆయన పనిని పరీక్షించి చూచుటకు అనేకులు ఆసక్తిగా వచ్చుచున్నారు.
- 8) తక్కిన మిషనులకన్న బైబిలుమిషనులోని విశేషమేమనగా, తక్కిన మిషనులవారు రక్షణను గురించిమాత్రమే చెప్పుచున్నారు. వారైతే రక్షణ పొందినవారికి పరలోకమందుగల అంతస్థులను గురించి చెప్పుచున్నారు. ఇది బైబిలుమిషనును ఎత్తి చూపించుటకాదా! (కాడికి అలవాటు పడిన కోడెలవలె ఉండువారు పై అంతస్థునకు రాగలరు).
- 9) 1918వ సం॥లో దేవదాసయ్యగారు తన స్వస్థానములో ఈ వింతబోధ చెప్పిరి. “బలమైన దానిలోనుండి తీపివచ్చెను. తిను దానిలోనుండి తిండివచ్చెను (న్యాయా 14:14). ఫిలిష్తీయులు సంసోనుమీదికి యుద్ధమునకు వెళ్ళినట్లు ఈ మిషనులన్నియు బైబిలుమిషను మీద రణవాదము (యుద్ధము) చేసినను బైబిలుమిషను ధ్వజ స్తంభముగానే నిలిచియున్నది (పాట:- 123వ కీర్తన). ఇది బైబిలుమిషనును ఎత్తి చూపించుట కాదా!
- 10) మోషేకు నేను పది ఆజ్ఞలు వ్రాసి యిచ్చినట్లు దేవదాసు అయ్యగారికి బైబిలు మిషనును ఎత్తి చూపించుమని వ్రాసి చూపించితిని.
7. ప్రశ్న :- ఆయన శ్రీ రావుసాహెబ్ జె. రాజారావుగారి ఆహ్వానమునుబట్టి 1949వ సం॥ము గుంటూరువచ్చిన పిదప కొన్నాళ్ళకు “యెహోవా నిన్ను యిక్కడికి తీసికొనివచ్చెను” అనుమాటలు తన గదియందు గాలిలో కనబడెనట. ఇది నిజమా?
జవాబు:-
- 1) కొర్నేలీ యింటికి పేతురును తీసికొనివెళ్ళినట్లును, నేను మీ అయ్యగారిని రాజారావుగారి యింటికి తీసికొనివెళ్ళితిని.
- 2) నా శరీరమును యిమ్మని అధికారిని అడుగుటకు ఎవరును తెగింపలేదు. ధనవంతుడైన అరిమతయియ యోసేపు అడుగుటకు తెగించెను. రాజారావుగారు ఆయనను చేర్చుకొనుటకు సమర్ధుడు.
8. ప్రశ్నః- కరపత్రములు వ్రాయవలసినదని తండ్రీ నీవే చెప్పినావట. ఇది నిజమా?
జవాబు:-
- 1) క్రైస్తవులందరరు దైవగ్రంథమైన బైబిలు గ్రంథమును చదువుచున్నారుగాని మానవునియొక్క రక్షణకార్యక్రమము వారికి పూర్తిగా తెలియదు. పాపములొప్పుకొని, పాప క్షమాపణపొంది, యేసుక్రీస్తునందు విశ్వాసముంచితే చాలును అనుచున్నారు. అంతమాత్రమున రక్షణ సంకల్పన కార్యక్రమము తెలిసినట్టు కాదు. అన్ని విషయములు తెలిసికొని నమ్ముట పూర్ణవిశ్వాసము. అట్టివారు మరల తిరిగిపోరు గనుక మానవుడు తాను రక్షింపబడియున్నాననే బుజువు ఈ లోకములోనే తెలిసికొనవలెనన్న యెడల కరపత్రములుకూడా అవసరము. బైబిలులో రక్షణనుగురించి ఉన్న వాక్యములకు తగిన మూల వాక్యములు, వాటి వివరములు కరపత్రములో ఉన్నవి. ఇతరులకు యివి అవసరమే. వారికి బైబిలు గ్రంథములు లేవు. క్రైస్త్రవులలో కూడా కొందరికి లేవు. కరపత్రముల సహాయమున బైబిలుగ్రంథము కొనుక్కొని బైబిలు చదువుచున్నారు. గనుక కరపత్రములు చాల అవసరముగ ఉండునని నేను అచ్చువేయించుచున్నాను. వాటిద్వారా సువార్త లోకమంతట వ్యాపించుచున్నది. బైబిలును అందరికిని అందింపలేరు.
- 2) కరపత్రములలోని సంగతులు ఎవరు నమ్ముదురో వారే రాకడకు సిద్ధపడగలరు.
- 3) బైబిలు కాలప్రవక్తలకు నేను చెప్పినది ప్రజలకు చెప్పండి అని చెప్పితిని. వారుచెప్పిరి. ఆలాగే ఈ కాలప్రవక్తయగు దేవదాసయ్యగారికి నేను బైలుపరచిన సంగతులు కరపత్రములద్వారా ప్రకటించుమని చెప్పితిని.
9. ప్రశ్న:- పత్రికాదులు ప్రచురింపవలసినప్పుడెల్ల ఓ తండ్రీ! నీవే ప్రేరేపించు చున్నావట. ఇది నిజమా?
జవాబు:-
- 1) మీ అయ్యగారి మాట, ఆట, పాట, ఊహ, ఉద్దేశము అన్నియు నా ఆత్మయొక్క ప్రేరేపణవలన కలుగుచున్నవి.
- 2) పత్రికలు నా ఆత్మ ప్రేరేపణతోనే పంచిపెట్టుచున్నారు గనుక పత్రికను చదువవలెనను ప్రేరేపణ లేనివారికిని చదువవలెనను ఆశ కలుగుచున్నది.
షరా:- ఆది సర్పమగు సైతాను యూదులచేత క్రీస్తుప్రభువును సిలువకు అంటకొట్టించెను గాని ఆయన లోకపాపభారము వహించినందున అప్పుడే సైతానును అంతరంగమందు వేరొక సిలువమీద తాపడము చేసెను గనుక సైతాను నన్ను ఏమియు చేయలేదు అని సంఘము సంతోషింపవలెనని దర్శనములో కనబడినది.
10. ప్రశ్న :- యేసుప్రభువా! నీవు అప్పుడప్పుడు సన్నిధి కూటములోనికి వచ్చి మెంబర్లతో దర్శనమందు మాటలాడుచున్నావట. ఇది నిజమా?
జవాబు:-
- (1) (హెబ్రీ 1:1) కయీను హేబెలును చంపినప్పుడు హేబెలు యొక్క రక్తము భూమిలోనుండివచ్చి నాకు మొర్రపెట్టినప్పుడు, నేను పరలోకమునుండి దిగివచ్చి కయీనుతో - నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ అని నేను అడుగలేదా?
- (2) నోవహు కాలములో పాపము విస్తరించినందున నేను అతనియొద్దకు వచ్చి, చితిసారకపు మ్రానుతో ఒక ఓడను నీ కుటుంబమునకును, ప్రతి జీవరాసులు పోతు, పెంటికి సరిపడు అరలు సిద్ధముచేయుమని నేను చెప్పలేదా?
- (3) సొదొమ గొమొర్రాల పాపము నాయొద్దకు వచ్చి మొర్రపెట్టినప్పుడు, నా స్నేహితుడైన అబ్రాహాముతో ముఖాముఖిగా కనబడి మాటలాడలేదా?
- (4) రిబ్కా గర్భములో ఇద్దరు శిశువులు పోరాడినట్టు ఆమె గ్రహించి నన్ను అడుగగా - నీ గర్భములో రెండు జనపదములున్నవి. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని నేను చెప్పలేదా?
- (5) యాకోబు పద్దనరామునుండి కుటుంబముతో స్పదేశమునకు వచ్చుచున్నప్పుడు అరణ్యములో ఒక మనుష్యుడు పోరాడినట్టు పోరాడగా, నేను దేవుడనని యాకోబు తెలిసికొని నీవు నన్ను దీవించితేనేగాని నిన్ను విడువననగా నేను అతనిని దీవించి, "నీవు దేవునితో పోరాడి గెలిచితివి గనుక యికమీదట నీవు యాకోబువు అనబడవు. ఇశ్రాయేలు అనబడుదువు” అని ముఖాముఖిగా అతనితో మాటలాడలేదా?
- (6) ఇశ్రాయేలీయులు ఐగుప్తులో దాసత్వములోనుండగా, ఫరోనొద్ద పెరిగిన మోషే పొదదగ్గర నిలువబడియుండగా పొదలో అగ్ని మంటలోనుండి మోషే మోషే నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము. నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను; యాకోబు దేవుడను, ఇశ్రాయేలీయులు అను నా ప్రజలు ఐగుప్తు దాసత్వములోనుండి పెట్టిన మొర్ర నేను ఆలకించితిని గనుక నీవు ఫరో రాజునొద్దకు వెళ్ళి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించుటకు నా ప్రజలను పంపుమని మోషేతో నేను మాటలాడలేదా?
- (7) సీనాయి కొండమీద నేను 40 దినములు మోషేను నిలువబెట్టి 10 యాజ్ఞలుగల రెండు రాతిపలకలను అతనికిచ్చి ముఖాముఖిగా బోధింపలేదా? ఆ బోధ గ్రంథములో వ్రాయింపలేదా?
- (8) హన్నా దేవాలయములో వేదనతో మగ బిడ్డను దయచేయుమని ప్రార్ధించగా - నీకు కుమారుడు కలుగును అతనికి సమూయేలు అను పేరు పెట్టుదువని ఆమెతో చెప్పలేదా?
- (9) మానవుని జీవితములోని పాపములు నేను చూపింవలేదా? గద్దింవులు, హెచ్చరికలు, తీర్పులు, శిక్షలు, బహుమానములు బైలుపరచలేదా? నరులకొరకై నేను సంకల్పనచేసిన రక్షణ సంకల్పన వారిచేత వ్రాయించలేదా?
- (10) జెకర్యా దేవాలయములో ప్రార్ధింపగా నేను - 'జెకర్యా! భయపడకుము నీ ప్రార్ధన వినబడినది. నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు' అని ఆయనకు నేను చెప్పింపలేదా? జెకర్యా నేను చెప్పించినమాటలు నమ్మనందున నా మాటలు వాటికాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినమువరకు నీవు మాటలాడలేక మౌనివై యుందువని అతనికి చెప్పింపలేదా? అతడు ప్రభువుదృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తనతల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై, ఇశాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవునివైపుకు త్రిప్పును అని ఆయనకు చెప్పింపలేదా?
- (11) ప్రవక్తలందరితో నేను మాట్లాడి వర్తమాన భూతబభవివ్యత్ కాలములలోని నంగతులన్నియు బయలుపరచలేదా?
- (12) నా నరవతార కాలములో 12మంది శిష్యులను పిలిచి వారితో నేను ముఖాముఖిగా మాటలాడలేదా?
- (13) రోగులను దర్శించి రోగులతో మాటలాడలేదా? దయ్యములతో మాటలాడలేదా?
- (14) ఈ కాలమందుకూడ నేను నా నన్నిధిలో నున్నవారితో మాటలాడుచున్నాను. నేను జీవముగల దేవుడను. ఆది అంతములేని దేవుడను, యుగయుగములు ఒక్కరీతిగానే ఉండువాడను, నేను మార్పులేనివాడను గనుక అన్ని కాలములలో అందరితోను వారి జీవితయులలో వారి హృదయములో నున్న కొన్ని మంచి లక్షణములను బట్టి వారిని రక్షీంచుటకె వారితో నేను మాటలాడుచున్నాను.
- (15) (యోహాను 20:26) దేవుడు మాటలాడుచున్నాడనేమాట నమ్మనివారిగతి తోమా గతివలె నుండును. 11మంది మేడగదిలోనున్నపుడు అవిశ్వాసియైన తోమాతో నేను మాటలాడలేదా?
- (16) నన్నుగురించి ఎమ్మాయు శిష్యులు మార్గములో మాటలాడుచున్నప్పుడు, వారికి తెలియనిరీతిగా నేను మాటలాడలేదా? వారు తమ యింటిలో ప్రవేశింపగా నేనును ప్రవేశించి వారియొద్ద యుండలేదా?
- (17) నేను మాటలాడుచున్నానని నమ్మనివారు రెండవ రాకడలోనికి వెళ్లలేరు.
- (18) నేను నా గ్రంథములో వ్రాయించిన వాగ్దానములు మీరు వాడుకొనలేదు గనుక యిప్పుడైనను సన్నిధిలోనికి వచ్చినయెడల మీతో మాటలాడుదును.
11. ప్రశ్న :- యేసుక్రీస్తు ప్రభువా! అప్పుడప్పుడు నీవు వారి సన్నిధి కూటములలోనికి దేవదూతలను, పరలోక భక్తులు, భూలోక భక్తుల ఆత్మలను, నిన్ను అనుసరింపని మృతుల ఆత్మలను వారియొద్దకు తీసికొని వచ్చుచున్నావట. ఇది నిజమా?
జవాబు:-
- (1) ఎవడైనను నా ఆత్మలేనివాడైన యెడల నన్ను ఎరుగడు. అతడు నావాడుకాడు. పిలువబడిన వారనేకులు, ఏర్పరచబడినవారు కొందరే. ఏర్పరుపబడిన వారికే నేను కనబడి మాటలాడుదును. పరలోక భక్తులను, దేవదూతలను, సన్నిధానవర్తులు చూడగలరు. తండ్రుల హృదయము పిల్లలతట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును త్రిప్పుదును. ఏలియా ఆత్మ 30 సం॥ల నుండి ఈలోకమంతటను తిరిగి పని చేయుచున్నది.
- (2) ఫిలిప్పును ఆత్మ కొనిపోయినట్లు సన్నిధి కూటస్థుల ఆత్మలను నా ఆత్మ వచ్చి ఆయా స్థలములకు తీసికొని వెళ్ళును.
12. ప్రశ్న - అప్పుడప్పుడు యేసుప్రభువా! నీవు భూతములను కూడ సన్నిధి కూటములకు రానిచ్చుచున్నావట. అవి వెళ్ళిపోయిన తర్వాత నీవు వచ్చి భూతములమాట నమ్మవద్దు; భయపడవద్దని మెంబర్లను ఆదరించుచున్నావట. ఇది నిజమా?
జవాబు:- మరణముయొక్కయు, మృతులలోకము యొక్కయు తాళపుచెవులు నాయొద్దనున్నవి (ప్రకటన 1:8). గనుక పనికట్టుకొని నేను భూతమును మీయొద్దకు పంపి, మిమ్ములను బెదరనిచ్చి మీప్రక్కనే నేనుండి “భయపడవద్దు" అని మిమ్మును ధైర్యపరచి, మీ కాళ్లకింద సైతానును చితుకత్రొక్కించుచున్నాను. ఇందుమూలముగ సైతాను బలముకంటె మీ బలమే గొప్పదని బుజువుపరచుచున్నాను.
షరా :- నిజార్ధి విధి ప్రశ్నల జవాబులు వచ్చిన తరువాత కృతజ్ఞత ప్రార్ధనచేసి వర్తమానముకొరకు కనిపెట్టితిమి.
జవాబు:- షారోనుయొక్క దీవెనలతో అలంకరింపబడుచున్న ప్రియులారా! మీలో ఆరంభమైన దీవెనలు ఎవ్వరును తీసివేయలేరు. క్రియలులేని విశ్వాసము వద్దు. పట్టుదలగలిగిన విశ్వాసమును కలిగియుండండి అని ప్రభువు చెప్పెను.
ముగింపు:- ఈ నిజార్దవిధియొక్క పత్రికలోని ప్రశ్నలు - జవాబులు మిమ్ములను ఇందులోని నిజమైన విధులను, సర్వ సత్య సూత్రములను అనుసరింపజేసి, పెండ్లికుమార్తెయొక్క నిజమైన అనుభవ అంతస్థులో స్థిరపర్చును గాక! ఆమేన్.
ఈ పై సందేశమును దైవజనులైన యం. దేనదాసు అయ్యగారు 1957 సం॥ము లో ఉపదేశించిరి.