జ్ఞాతవ్యము 7: Father M. Devadas
అనాది సంకల్పన - వధువు ఏర్పాటు
(రాకడ పండుగ)
బంతివలెనున్న భూమినుండి దేవుడు ఆదామును తీసెను, వాని నుండి అవ్వను తీసెను. వారిరువురినుండి ఇంతమంది వచ్చిరి. వారిలో భక్తులు, భక్తిహీనులు అబ్రహాము వరకు వచ్చెను. అప్పుడు దేవుడు ఎన్నిక జనమును ఏర్పాటు చేసెను. ఈ ఎన్నిక జనము పెంతెకొస్తువరకు నుండెను. తర్వాత దేవుడు క్రొత్త ప్లానువేసి అందులోనుండి క్రైస్తవులను వేరుచేసెను. ఇదంతయు దేవునియొక్క గొప్పజ్ఞానముగా కనబడుచున్నది. ఆయన కంగారుగా ఏమియు చేయలేదు. ఆలస్యమైనను సరే వందల సంవత్సరములు గడిచినను సరే అంతా ప్లాను ప్రకారము ఏర్పరచెను. ఇప్పుడు క్రైస్తవులలో నుండి పెండ్లి కుమార్తెను తీయుచున్నాడు. వీరికే రాకడ జనము అనిపేరు. వీరి నిమిత్తము దేవుడు ఇప్పుడు కష్టపడుచుండెను. ఇది ఆఖరు ఏర్పాటు గనుక ఇప్పుడు రాకడ సువార్త ప్రకటింపబడవలెను. రెండవేల సం॥ల నుండి దేవుడు ఈ పని చేయుచుండెను. రాకడ జనము తయారైన తర్వాత తీసికొని వెళ్ళు పని గలదు. మట్టిలోనుండి తీసిన ఈ మనిషిని 6వేల సం॥లు నడిపించి, నడిపించి రేపు మహిమలోనికి తీసికొని పోవలెను.
ఎక్కడోనుండే మనిషిని పాపలోకములో మట్టిలోకములో నుండవలసిన మనిషిని, మహిమ లోకములోనికి, పరిశుద్ధ లోకములోనికి తీసికొనిపోవలెను. తర్వాత ఉన్నవారిని కూడ విడువక ఏడేండ్ల శ్రమలలో కొందరిని రక్షించి, మోక్షములో ఇంకొక భాగమునకు, తర్వాత వెయ్యేండ్ల పరిపాలనలోనుండి మారినవారిని భూలోక మోక్షమునకు తీసికొనివెళ్ళును. ఏడేండ్లలో మారిన వారిని రెండవ రాకడలో ఎందుకు తీసికొని పోలేదు? వారు అందుకు సిద్ధపడలేదు. ఎఫెసీ 1:6లో “జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో ఏర్పర్చుకొనెను”. ఇది రాకడలో నెరవేరును.
పెండ్లికుమార్తె గుంపులోనివారే క్రీస్తులో ఏర్పరుపబడినవారు. వీరికొరకు దేవుడు నిరీక్షించుచు, ఈ పని అంతయు చేసెను. పరలోకములో దూతలుండగా వారిని ఏర్పర్చుకొనక, మొదట ఆదామును ఆ తరువాత ఎన్నిక జనమును, అలాగే ఇప్పుడు పెండ్లికుమార్తెను ఏర్పర్చుకొని దేవుడు తన ప్రత్యేకతను నెరవేర్చుకొనెను. దేవుని మనస్సులో పెండ్లికుమార్తె ఉన్నది గనుక ఇన్ని వేల సం॥ల కథ నడుపుచుండెను. తక్కినవారిని ఆయన విడువడు గాని మరియొకచోట రక్షించును. ఇప్పుడు ఎవరు రాకడకు సిద్ధముగానున్నారో, వారే వెళ్ళిపోవుదురు. ఇదివరకు చనిపోయి కొందరు వెళ్ళిరి. ఈ ప్రత్యేక జనాంగము కొరకే ఈ కథంతయు నడిపెను.
ఉదా:- పంతులుగారు బోర్డుమీద గీతలుగీస్తారు. పిల్లలు నవ్వుదురు. తరువాత షక్షిని వేస్తారు. అప్పుడు పిల్లలు 'పక్షిగూడు వేయుటకా ఇన్ని గీతలు గీసారు' అని నవ్వుదురు. అలాగే దేవుడు ఆదామును, మిశ్రమజనమును, ఎన్నికజనమును, పెండ్లికుమార్తెను ఎందుకేర్పర్చుకొనినది అప్పుడు మనకు తెలియును. ఇప్పుడు తెలియదు. ఇదివరకు సిద్ధపడి చనిపోయినవారికి తెలియదుగాని మోక్షములో తెలిసికొందురు. ఆ ప్రత్యేక జనాంగములో ఎవరు ఉందురో వారికొరతు ఈ భోదలు వచ్చినవి. పెండ్లికుమార్తె అన్ని జనాంగములలోనుండి వచ్చెను. పెండ్లికుమార్తె మాత్రము రేపు రాకడలో తీసికొనిపోబడును. మత్తయి 25వ అధ్యాయములో 10మంది కన్యకలు నూనెను సిద్ధము చేసిరిగాని చివరకు 5గురే వెళ్ళిరి. గడువిచ్చుటకు అందరిని రానిచ్చునుగాని అందరూ సిద్ధపడలేదు. అన్ని బాగుండవచ్చునుగాని ఏ ఒక్కటి తక్కువైనా, కొందరు బుద్ధిలేని కన్యకలవలె అగిపోవుదురు. కొంచెము శ్రద్ధ తగ్గెను గనుక; మనకు కొదువగా నున్నదేదో తెలిసికొని, ఏది తక్కువైనదో దానిని సరిచేసుకొనవలెను. నూనె తక్కువైనది దానిని కొనుక్కొనిరిగాని లాభము లేకపోయెను. తప్పులు దిద్దుకొనుటకు ప్రయత్నించినవారికే పెండ్లి కుమార్తె వరుసలో చోటు లేకపోతో తక్కినవారి గతిపమి? గనుక ఎప్పుడు సిద్ధముగానే యుండవలెను. కొంచెము తక్కువైతే రక్షణలోనికి రాగలరు. ఎందుకనగా లోటు దిద్దుకొనుటకు పోయిరి గనుక పెండ్లికుమార్తెగా మారలేరు. అసలు పెండ్లికుమార్తె పడుట, లేచుట, దిద్దుకొనుట ఇవన్ని సమయము రాకముందే చేసిరి గనుక తయారైరి. ఆ సమయమున దిద్దుకొనుట కూడదు. బుద్ధిలేని వారు సమయము దాటిన తరువాత దిద్దుకొనిరి గనుక వారిది రక్షణ వరుసగాని రాకడ వరుసకాదు.
దేవుడు ఆలస్యము చేయుచున్నాడు గనుక ఎవ్వరు సంపూర్ణముగా సిద్ధపడియుందురో వారే పెండ్లికుమార్తె. మృతులైతే మృతుల గుంపు, సజీవులైతే సజీవుల గుంపు. రాకడలో సంఘమును తీసికొనివెళ్ళిన తర్వాత మిగిలిన వారిలో ప్రభువు పెండ్లి కుమార్తెను తయారుచేయ్యడు. మిగిలిన వారిని రక్షణలోనికి రానిచ్చును. వెంటనే విందు జరుగును. ఆ విందులో పెండ్లికుమార్తె క్రీస్తు ప్రభువు ప్రక్కన కూర్చుండును. మిగతావారు కొంచెము దూరముగానుందురు. పెండ్లికుమార్తెకు సంపూర్ణ సంతోషము.
ఉదా:- పెండ్లికుమారుడు పెండ్లి కుమార్తెను ఏర్పాటుచేసికొనుటకు 4గురు లేక 5గురు కన్యకలను చూచును గాని ఒక్కరినే ఏర్పర్చుకొనును. మిగతావారు ఆహ్వానము అందుకొని, అన్నిటిలో పాలుపొందురుగాని పెండ్లికుమార్తెకున్న సంతోషము వారికి ఉండదు. రక్షింపబడినవారు విందుకు పిలువబడుదురు.
పెండ్లికుమార్తె వారిని ఆహ్వానించును. పెండ్లికుమారుడు పిలువడు.
పెండ్లికుమార్తె ఎవ్వరికి ఆహ్వానము పంపుననగా, ఎవరి కొరకు ఆమె ప్రార్ధించెనో, ఎవరికి సువార్త చెప్పెనో వారిని పిలుచును. వీరు సంతోషముగా వస్తారుగాని పెండ్లికుమార్తెయొక్క సంతోషము వీరికుండదు.
ఈ పిలువబడినవారు పెండ్లికుమార్తె యొక్క మహిమ అనుభవింపలేరు గనుక వీరికి ముసుగు ఇవ్వబడును. ఆ ముసుగుతో మాట్లాడి చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చి పెండ్లికుమార్తె గుంపులోనివారు వెళ్ళిపోవుదురు. గనుక రాకడకు ముందే మన లోటులు వెతుక్కొని రాకడకు సిద్ధపడుట ముఖ్యము.
లోపలకు వెళ్ళిన కన్యకలు మరలా కొనుక్కొనుటకు బైటకు రాలేదు. మనలో ఎవరైనను “ప్రభువా! నా పాపములు క్షమించుము" అంటే ఇంకా పెండ్లికుమార్తెగా తయారు కాలేదన్నమాట. నా పాపములు క్షమించినావు నీకు వందనములు అంటే ప్రభువునకు సంతోషము.
ఉదా:- డాక్టర్ గారు రోగము బాగుచేసిన తరువాత "ఏమి చేసారు" అని అడిగితే, కృతజ్ఞత లేదన్నమాట. పెండ్లికుమార్తె సంఘము "పాపములు క్షమించుము" అని అనరాదు.
-
3 వరుసలు:
- 1) పాపాత్ముల వరుస
- 2) రక్షణ వరుస
- 3) పెండ్లికుమార్తె వరుస.
ఈ పెండ్లి కుమార్తె వరుసలో సణుగుకొనుట ఉంటే మరలా పాపాత్ముల వరుసలోనికే పోవుదురు జాగ్రత్త! పెండ్లికుమార్తె వరుసకు వచ్చిన తరువాత ప్రభువా క్షమించుమని అన్నయెడల రక్షణ వరుసలో చేరుదురు. క్షమించినట్లు గురుతు కావలెనంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు అద్భుతము కావలయునని అడిగిన వరుసలో నుందురు. గుర్తులు అడిగిన యెడల రక్షణ వరుసలోనే ఉందురు (యోహాను 4:48). ప్రభువును మనము పూర్తిగా నమ్మవలెనుగాని సూచక క్రియ కొరకు అడుగరాదు అది అవిశ్వాసమగును. అడుగకుండా ప్రభువు చూపించిన ఫరవాలేదు. పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తె మాట్లాడుకున్న తర్వాత పెండ్లికుమార్తె ఏదైన గుర్తునకు ఇవ్వండి అని అడిగిన యెడల ఆమె పెండ్లికుమారుని నమ్మలేదన్నమాట. మనము కోరిన గుర్తులకన్నా ప్రభువు ఎక్కువ ఇస్తారుగాని మనము కోరరాదు.
అట్టి అనాది వధువుయొక్క మహిమ ఏర్పాటులోనికి ఆత్మతండ్రి చదువరులను ఆయత్తపర్చుకొని, మేఘమెక్కించునుగాక! ఆమేన్.