గ్రంథకర్త యం. దేవదాసు అయ్యగారు
దైవ సన్నిధి
"నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను" - యోహాను 6:37.
ప్రభువునందు ప్రియులారా! మీకు శుభములు కలుగును గాక!
వివరము :-
దైవ సన్నిధి లోనికి ఎవరుబడితే వారు; ఎప్పుడుబడితే అప్పుడు బిడియము లేకుండ వెళ్ళుటకిది గొప్ప ఆధారమైన వాక్యము. పాపి, గొప్పపాపి, మారుమనస్సులేని పాపి, పాపవిసర్జన చేయలేననుకొను పాపి, మంచిచెడ్డలు తెలిసినను తెలిసినట్లుగా నడవలేని పాపి, ఇంకను ఏవిధమైన పాపియై యుంటే ఆ పాపి ధైర్యముగా దైవసన్నిదిలోనికి వెళ్ళవచ్చును.
కృపా ద్వారము ప్రతివారికి నిత్యము తెరువబడియున్నది. "ఉన్నపాటున వచ్చుచున్నాను" అను కీర్తనలో యున్నట్లు సిద్ధపడకపోయినను వెళ్ళవచ్చునని గలదు. నేరస్థుడైయున్న అపరాది స్నేహితుని యొద్దకు వెళ్ళుటకు బిడియపడుచున్న యపరాధి అధికారులయొద్దకు వెళ్ళుటకు బిడియపడుచున్న యపరాధియైనట్టి పాప సహితము సన్నిధిలోనికి వెళ్ళవచ్చును. నరులుగాని, పరలోక వాస్తవ్యులుగాని, దూతలుగాని మీ తట్టు చూచి యింతగొప్ప దుస్థితిలో ఉన్న నీవు యే ముఖము బెట్టుకొని సన్నిధికి తగుదుననుచు వెళ్ళుచున్నావనియనిన యెడల ఆ పాపి కండ్లు, నోరు ఒక చేతితో మూసికొని చూపుడు వ్రేలితో ఈ వాక్యము తట్టు చూపించుచు సన్నిధిలోపలికి వెళ్ళవచ్చును. అసలు దేవుడే సెలవిస్తే మీరెవరు అడ్డము చేయుటకు?
"ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి." (మత్తయి 11:28-30).
ఈ వాక్యములో అందరకని కలదు. గాని "నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను" (యోహాను 6: 37,38) అను ఈ వాక్యములో అందరనిలేదు. అందరిని ఒకే పర్యాయము రండని చెప్పితే అందరికి చెప్పినాడు గాని, ప్రభువు మాకు చెప్పలేదని కొందరు అందురు, గనుక ఈ శుభలేక యొక్కొక్కరికిని యుద్దేశింపబడినది; గనుక సన్నిధికి రాకుండుటకు మిష దొరకదు. ఎందుకనిన ఫలానివారు రావచ్చును, ఫలానవారు రాకూడదని వివరములేదు. గనుక అందరును రావచ్చును.