మొర పెట్టుడి
"దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొర్రపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా! " లూకా 18:7.
ఈ వాక్యములో ఒక జనాంగముగలదు. ఏర్పరచుకొనిన వారే ఆ జనాంగము. క్రైస్తవసంఘ స్థానమునకు ముందు, యూదులు ఏర్పాటు జనాంగము అయితే ఇప్పుడు క్రైస్తవులు ఏర్పాటు జనాంగముగా కనబడుచున్నారు. గాని యీ వాక్యములో నున్నది అది కాదు. విశ్వాసులందరు అనగా ఏకాలపు వారైననుసరే ఏ జనాంగము వారైననుసరే ఏర్పాటు ప్రజలైయున్నారు. ఏర్పరచబడి ఉన్నారు. కాబట్టి వారు మొర్రపెట్టక మానరు. ఎందుకనగా మొర్రపెట్టుట వారి నైజమై ఉన్నది. వారొక్క రోజున మొర్రపెట్టి ఊరుకొనరు గాని దివారాత్రులు మొర్రపెట్టుదురు. దివారాత్రులనేది కూడా వారి నైజమైయున్నది. వారి నైజము రెండవమాటలోనికి వెళ్ళినది. అవి ఒకటి దివారాత్రులు, రెండు మొర; ఈ రెండు మొర్రలను బట్టి చూడగా వారు నిజముగా ఏర్పాటు జనమై ఉన్నారు. ఎవరైతే మొర్రపెట్టరో వారును, ఎవరి మొర్ర దివారాత్రులుండవో వారును ఏర్పాటులో ఉండరు. పెండ్లికుమార్తె సంఘములో ఎట్లుండగలరు? ఒక రోజు మొరపెట్టి రెండవరోజున మొర్రబెట్టనియెడల ఎట్లుండగలరు? మొర్రబెట్టుట యొక్క ఉద్రేకము తగ్గిన యెడల ఎట్లుండగలరు. ఈ వాక్యములో ప్రార్ధనయొక్క గొప్ప తీవ్ర ప్రార్ధనలుండి తీరవలెను. సామాన్య ప్రార్ధన ఎప్పుడు తీవ్ర ప్రార్ధనలోనికి వెళ్ళును? శ్రమకాలమందే. ఒక మూలను చేరి, నేను మొరబెట్టుచున్నాను; నా మొర్ర దివారాత్రులున్నదా? అను ఈ రెండు ప్రశ్నలు వేసికొనినప్పుడు వధువు శాఖో కాదో బయలుపడును. ఏర్పాటులో లేనివారు ప్రార్ధన చేయుదురుగాని బద్దకింపరు. నాలుగు పగళ్లు నాలుగు రాత్రుళ్ళు ప్రార్ధన బాగుగా వచ్చును అటు తరువాత సాగదు.
అప్పుడేమందురు. నేనెంత ప్రార్ధన చేయబోయినను వాలుకుదరదు అని అందురు. అదే గుర్తు
మధ్య మధ్యలో కుదర వచ్చునుగాని, ఏకరీతిగా
వాలుకుదరదు. ఏర్పాటు ప్రజలగు వారిలోనుండి ఏర్పాటు ప్రజలగు క్రైస్తవులలో నుండియు విశ్వాసులు వచ్చిరి. గనుక ఏమి తేలినది
విశ్వాసులే ఏర్పాటు జనమని తేలినది. అనగా నామక యూదులు కారు శరీర రీతిగా అబ్రాహాము
సంతతి కాదు. నామక క్రైస్తవులు కారు.
అనగా బాప్తిస్మము పొందిన వారు కారు. అనగా అబ్రాహామువంటి విశ్వాసముగలవారే ఏర్పాటు జనాంగము. యూదులు ఏర్పాటు జనాంగము.
క్రైస్తవులు ఏర్పాటు జనాంగము. విశ్వాసము లేకపోతే ఆ ఏర్పాటునకు విలువరాదు, మొర్రపెట్టుట ప్రార్థించుటకాదు, అడుగుటకాదు, ఏడ్చుట, ప్రాధేయపడుట; మొర్రపెట్టుట కేకవేయడం అందురు. ఆపదలోనున్నప్పుడు పెద్దకేకవేసి ఎవరినైనను పిలుతురు. ఒకేసారికాదు. అనేక పర్యాయములు పిలుతురు. విశ్వాసులుకూడ అనేక శ్రమలు పొందుచున్నారు. గనుక కేకలువేతురు. ఇశ్రాయేలీయుల దాసత్వములో బాధపడు
చున్నప్పుడు దేవునికి మొర్రబెట్టిరి. అప్పుడు దేవుడు మోషేను పంపెను.
ఎవరికి మొర్రపెట్టుట అని
వ్రాయబడియున్నది?
జవాబు :
దేవునికి మొర్రబెట్టుటను గురించి వ్రాయబడియున్నది. దేవుడనుమాట ఇక్కడ ఉదహరించబడినది. ఈ మాట
అన్ని జనాంగములకు
సంబంధించిన మాట. ఏర్పాటు విశ్వాసులు అన్ని జనాంగములలో నుండి వచ్చుచున్నారు. పరలోకమునకు
చేరవలసిన గడియను,
లెక్కయును వచ్చినప్పుడు, వీరు యూదులా? క్రైస్తవులా? అను ప్రశ్నలకంటే వీరు విశ్వాసులా?
అవిశ్వాసులా? అనే
ప్రశ్నలెక్కలోనికి
వచ్చును.
న్యాయము తీర్చడా? అనే వ్రాయబడియున్నది. ఈ ఉపమానములో ఒక స్తీకిని మరియొకరికిని ఒక వివాదముగలదు. న్యాయకర్త ఉభయపక్షమునకు న్యాయము తీర్చునని ఉన్నది.
- 1. ఎంతభక్తిగా నడుచుకొనవలెనని ఉన్నను, అపవాది సైన్యము మనకు అడ్డము వచ్చుచునే ఉన్నది.
- 2. మనస్సు ఎంత నిబ్బరము చేసికొనవలెనన్న శోధనవల్ల ఆకర్షణ కలుగుచున్నది. అందుచేత కీడు కలుగుచున్నది.
- 3. మానవులతో కొందరు విరోధులై నిందరుమోపుచున్నారు ఇతరమైన కీడుకూడ చేయుచున్నారు.
1. షరా:- దేవుని సింహాసనము యొద్దకు విశ్వాసులు ఈ మూడు కేసులను తీసికొని వెళ్లుచున్నారు. విశ్వాసులు కేసు తీసికొని వెళ్ళిన మొదటిరోజు మొదలుకొని చివరిదినము వరకు చాలా దినములు గడచిపోవచ్చును. అనగా దివారాత్రులు దేవుడు మన మనవి విననట్లు కన్పించునుగాని తుదకు వినును. అన్యాయస్థుడైన న్యాయాధిపతియే న్యాయము తీర్చెనుగదా! న్యాయస్థుడైన దేవుడెందుచేత న్యాయము తీర్చడు? ఇది మనము నేర్చుకొనవలసిన విషయము. గ్రహించుకొనవలసిన విషయము, గనుకనే ఈ ఉపమానములో న్యాయము అనుమాట ఉదహరింపబడినది.
షరా:- ఈ సందర్భమున ప్రకటనలోని ఒక విషయము జ్ఞప్తికి తెచ్చుకొందుము. అదేదనగా హర్మెగెద్దోను ఉద్ధ సమయము వరకు (ఆదాము పతన కాలముండి సాతానును అతని సైన్యమునకు నర శత్రువులకు, విషపురుగులకు, జంతువులకు మనలను శోధించేటందుకు) సమయమియ్యబడినది. అయితే హర్మెగెద్దోను యుద్ద సమయమందు
- 1. సాతాను బంధింపబడి ఉన్నది.
- 2. అంతెక్రీస్తు నరకములో వేయబడును.
- 3. అబద్ధ ప్రవక్త అగ్నిగుండములో వేయబడును.
- 4. పిశాచములన్ని నరకములో వేయబడెను.
- 5. శోధించే మారుమనస్సు లేనివారందరు గతించిపోయిరి.
- 6. విషపురుగులు జంతువులు అను వాటిలోని హానిచేయు లక్షణము, విషము తీసివేయబడును.
- 7. భూమి యావత్తును ముళ్ళుముట్రలు, మనిషికి హానిచేసెడి వస్తువులు శుభ్రము చేయబడెను.
2. షరా:- కాబట్టి మనుష్యులను శోధించేవి ఉండవు. గనుక భక్తిగా నడుచుకొనుట సుళువు. ఆహా అంతయు కష్టమే. ఆదాము మొదలు హర్మెగెద్దోను ఈ కాలమంతయు విశ్వాసులు దేవునిని ఆ స్త్రీవలె మొర్రబెట్టుచున్నారు. ఏమని? దేవా! మమ్మును శోధించేవాటిని తొలగింపుము (ఆదాము నుండి హర్మెగెద్దోను వరకు) మీ మొర నెరవేర్పును పొందదు. ఆ తరువాత నెరవేర్పును పొందుదుము.
3. న్యాయము గుర్తింపగలము
- 1. శిక్షా న్యాయము
- 2. ప్రార్థన న్యాయము
అనగా పాపము చేసినందుకు శిక్ష అనుభవించుట న్యాయము. అయితే ప్రార్ధన చేసినందువలన శిక్షలు తొలగుట న్యాయము. తన కుమారుని ఇచ్చుట వలన తనకు తానే ఇచ్చివేసికొన్నట్టే. మనము ఈలోకములో సంపాదించుకొనే ఈవులన్నియు తనకుమారుని తరువాతవే. ఇవి ఆయనకంటే తక్కువే. ఆయనే సమస్తమైయున్నాడు. మరియు ఆయనను ఇచ్చివేయుటవలన అన్నియు ఇచ్చివేసినట్లే. దేవుడు వెనుక తీయలేదని వ్రాయబడియున్నది. పాపాత్ములయొద్దకు నా కుమారుని పంపడమెందుకు? అశుభ్రతతో నిండియున్న భూగోళమునకు నాకుమారుడెందుకు? దయ్యముల పనియున్న ప్రపంచమునకు నా కుమారుడెందుకు? నా కుమారుని అంగీకరింపనివారును, తృణీకరించువారును, హింసించువారును ఉన్న ప్రపంచమునకు నా కుమారుని పంపడమెందుకు? అని దేవుడు అనుకొని పంపకుండ ఉండుట న్యాయమే. పంపని యెడల ఆయనను అనేవారులేరు. అయినప్పటికిని ఆయన పంపించినాడు. వెనకతీయలేదు. భూలోకములో ఒక్క కుమారుడే కలిగియున్న తల్లిదండ్రులు అతనిని అపాయకరమైన స్థలమునకు పంపక వెనుక తీయుదురు. లోకపుత్రులకంటే ఘనుడైన ప్రభువును పంపుటకు దేవుడు వెనుక తీయవలసినదే. దేవుడట్లు చేయలేదు. మరియు మన అందరి కొరకు ఆ కుమారుడు అనుగ్రహింపబడెనని వ్రాయబడియున్నది. అందరికొరకనే మాట సర్వజన లోకైక రక్షకుడనే భావము వెల్లడించుచున్నది. క్రీస్తు ప్రభువు ఒక పాలస్తేనా దేశమునకే కాదు, ఒక్క యూదులకే కాదు. క్రొత్త నిబంధన యూదులకు, క్రైస్తవులకు కూడ వ్రాయబడినది. కొందరికి రక్షకునివల్ల ప్రయోజనము తక్కువ. ఎటువంటి వారైనను సరే బైబిలులోని అందరికి అనే మాటలు చదువుకొనుట ఇష్టముగా నుండును, దేవుడు తన కుమారుని అనుగ్రహించెననియు అప్పగించెననియు ఇందులో వ్రాయబడియున్నది. అనుగ్రహించుట అనగా ధర్మము చేయుట పుచ్చుకొనేవారియొక్క యోగ్యతనుబట్టి కాదు. ఇచ్చే ఆయన యొక్క యోగ్యతనుబట్టి. అప్పగించుట అనగానేమి? ఈ పుస్తకము మీకు అప్పగించి వెళ్ళుచున్నాను అని ఒక గ్రంథకర్త ఒక విద్యార్థితో చెప్పెను. దానిభావమేమి? ఈ పుస్తకము నీవు చదువవలెను. దానిని అనుసరింపవలెను. ఇతరులకు బోధింపవలెను. కాగితము మూయకుండగను, చేతులు కొట్టకుండగను ఎవరయినా దొంగిలింపకుండగను, పాడుచేయకుండగను జాగ్రత్తగా చూచుకొనవలెను అని చెప్పినట్లే. అప్పగించుట అను మాటలో ఈ పూచీలన్నియు ఇమిడియున్నవి. అట్లే కుమారుడు మనకు అప్పగింపబడెను గనుక ఆయన విషయములో మనకు అన్ని పూచీలు గలవు.