ఆత్మ సహాయము



"ఆ ఆత్మయు మన దౌర్బల్యమును చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్ధన చేయవలెనో మనకు తెలియదుగాని ఉచ్చరింపశక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు." - రోమా. 8:26.

విజ్ఞాపనము అనగానేమి?

యేసుప్రభువు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మనకొరకు ప్రార్ధించుచున్నాడు. అందుచేత మనపక్షముగా నెరవేరవలసిన అంశములు 'నెరవేరుచున్నవి'. ప్రార్ధనాపరుడు ఫలానిది నా ప్రార్ధనవల్ల నెరవేరినదని చెప్పకూడదు. అతనికొరకు చాలామంది ప్రార్థించి యుండవచ్చును. ఒకరి పక్షముగా ప్రార్థించే ప్రార్ధన విజ్ఞాపన ప్రార్ధనయని చెప్పవచ్చును. పరలోకమున ఆయన ప్రార్థించుచుండగా, భూలోకమున ఆత్మ మనలోనుండి ప్రార్థించు చున్నది. ప్రభువు చేయునది స్వయముగా చేయు ప్రార్ధన. ఆత్మ చేయునది సహాయక ప్రార్ధన. ఏరీతిగానైన మన ప్రార్ధన నెరవేర్చవలెననే ఉద్దేశ్యముతో ఈ ఏర్పాటు అనగా సింహాసనము నొద్ద యేసుప్రభువును, మనయొద్ద ఆత్మయును ప్రార్ధన చేయుట కలిగియున్నారు. బొత్తిగా ప్రార్ధన ఏమిటో తెలియనివారి నిమిత్తమై ప్రభువు ప్రార్థించును. ప్రార్ధనచేయుట కొంత అభ్యాసముగలవారికి ఆత్మసహాయము చేయును. ఆత్మ చేయునట్టి ప్రార్థనకూడ విజ్ఞాపన ప్రార్ధనయైయున్నది. విజ్ఞాపన కర్తలిద్దరు, మనమెంత ధన్యులము! నిర్లక్ష్యపరులమై యుండరాదు, నిరాశపడరాదు, ఒకరి అంశములు గురించి నేను ప్రార్ధించుచున్నాను, మరికొందరు ప్రార్థించు చున్నారు. ప్రభువు ప్రార్థించుచున్నారు, ఆత్మ ప్రార్థించుచున్నారని ప్రార్ధనాపరుడు ధైర్యము తెచ్చుకొనవలెను.

ఇంతమంది చేసే ప్రార్ధన కొట్టివేయబడునా? నిరాశపడుటకు సందులేదు. ఒకానొకప్పుడు ఒక అంశముమీద ప్రార్ధన పెట్టుకొంటే అపరాదు ఇంకొకటివచ్చును. ఏమని గ్రహించుకొనవలెను? మన అంశమును ఒక ప్రక్కనుబెట్టి ఆత్మ మరియొక అంశమును అందించెనని గ్రహించుకొనవలెను. కలెక్టరుగారి బల్లమీద నాలుగు అర్జీలు ఉన్నవి, చెంతను నిలువబడియున్న సహాయకారి మూడవ అర్జీ అధికారికిచ్చెను. ఆ అర్జీ ఆత్మ ప్రార్ధన. ఆత్మ ప్రభువుయొక్క విజ్ఞాపనను అందించును.

ఒక ఉపమానము:- ఒక స్త్రీ చనిపోతూ తన కుమారునివైపు చూస్తు పాదిరిగారును ఇతరులును చేయుచున్న ప్రార్ధనలో ఏకీభవించడమేలేదు. అంతకుముందు పాదిరిగారు చెప్పిన మాటలు జ్ఞాపకము తెచ్చుకొనడములేదు. దీనిపేరు, దౌర్భల్యములోనే గొప్ప సహాయము కలుగును. ఈ వాక్యము అట్టివారికే.


ఈ వాగ్ధానముతో, మనము ఎట్టి పరిస్థితులలో ఉండి ప్రార్థించుచున్నను, దేవుడు తన ఆత్మ సహాయమును అందించి, అంశములు నెరవేర్చును గాక! మరనాత.