అడుగుడి
"అడుగుడి మీకియ్యబడును. వెదకుడి, మీకు దొరుకును. తట్టుడి, మీకు తీయబడును" - మత్తయి 7:7.
ప్రార్ధనపరులకిది ప్రేరేపణగల వాక్యము. సన్నిధిలోనికి వచ్చి మౌనముగా ఉండవచ్చును. ఇది అతనిచేత మాట్లాడించే వాక్యమై ఉన్నది. ఏమి అడగవలెనో ఈ వాక్యములో వివరములేదు. గనుక దైవసన్నిధిలోనికి వెళ్ళి ఏదైన అడగవచ్చును. ఏమి యియ్యబడుననే వివరములేదు. గనుక అడిగినదెల్ల ఇవ్వబడుననే నిరీక్షణ కలుగవచ్చును. "అడుగుడి" అనెడి మాట అందరికి సుళువుగా తెలిసిన మాట, అడుగుటనే క్రియ అందరు చేయగలరు. తీరా మీరు అడిగిన తరువాత ఇదెందుకు అడిగినావని ప్రభువు అనరు. ఒకవేళ ఎవరైనా అడిగిన తరువాత ఈ
వాక్యమును చూపించవచ్చును. ప్రభువు సామాన్యమైన మాటలలో గొప్ప వేదాంతమును చెప్పెను.
మీరు అడుగరు గనుక పొందరని (యాకోబు 4:2)లో వ్రాయబడుటనుబట్టి అడుగనివారు చాలామంది ఉండవచ్చును. నేను పది దినములనుండి తురుగువేడుకొనుచున్నను
ఇవ్వబడలేదని ఒకరు అనినపుడు మీరు అడుగుట పూర్తి కాలేదని బోధకుడు జవాబు చెప్పవలయును.
దైవవాగ్ధానములు ఎల్లప్పుడు పూర్తిగానే ఉండును. అన్ని కాలములలో ఒకేరీతిగానే ఉండును. మీరెంతో పవిత్రులై ఉంటేనేగాని మీరు అడుగరాదని ఒకరనుచున్నారు?
జవాబు : ఆ మాట వాక్యములో లేదు. అడుగుటకేమి ఆటంకమున్నదో అది తీసివేయమని మొదట అడిగి, ఆ పిమ్మట కావలసినవి అడిగినయెడల; మీరడుగుట పూర్తియగును. మరియు మన ఏర్పాటు ప్రకారము
ప్రార్ధన మెట్ల వరుస ననుసరించి అడుగుటయే పూర్తియెన అడుగుటయై ఉన్నది. తమ తల్లిదండ్రులను పిల్లలు ఏదైన అడిగినప్పుడు దేశ జనులు అధికారులకు అర్జీ పెట్టుకొను రీతిగా అడుగరుగాని సూక్ష్మపద్ధతిని చనువు చొప్పున అడుగుదురు గనుక అడిగినది పొందుదురు. అలాగుననే మనమును మన తండ్రియైన దేవుని అట్లే అడుగవలయును. ఇయ్యబడుటయొద్ద మన ప్రభువు ఉన్నారు. ఈ రెండు మాటలయొద్ద మనిషియొక్క అడుగుట అనేది నెరవేర్చును. ప్రభువు ఇచ్చుట అనేది ఇచ్చట నెరవేర్చును. ఒకే స్థలములోనే ఉన్నవి.
ఉదా:- ఒక చిన్న అబ్బాయి తండ్రి గదిలోనికి వచ్చి నాయనా! నాకొక ఠావు కాగితము కావలెనని అడిగి, వెంటనే డ్రాయరు తెరచి ఆ కాగితము దొరకినదని చెప్పి పట్టుకొని వెళ్లును. అందుకు తండ్రి సంతోషించును.
ప్రియులైన పిల్లలు ప్రియుడైన తండ్రిని వేడుకొను రీతిగా అడుగవలెనని డాక్టరు మార్టిన్ లూథరు చెప్పుచున్నాడు.