సన్నిధిపరులు చేయవలసిన స్తుతులు
- 1. మా
సదుపాయుము నిమిత్తమై
సమస్తమును కలుగజేసిన
తండ్రీ, మారక్షణ నిమిత్తమై శరీరధారిగా వచ్చి ప్రాణ సమర్పణ
చేసిన
కుమారుడవైన
తండ్రీ! మాకు కుమ్మరింపుగా అందిన పరిశుద్దాత్ముడవైన తండ్రీ! త్రిత్వదేవుడవైన తండ్రీ
నీకు నమస్కారములు.
నీవు మాకు బోధకుడుగాను, రక్షకుడుగాను, పోషకుడవుగాను, వైద్యుడవుగాను, సర్వాంశ సహాయకుడుగాను, మోక్షదాయకుడుగాను బైలుపడినందున నీకు అనేక వందనములు. - 2. జ్ఞానముద్వారాను, సృష్టిద్వారాను, బైబిలుద్వారాను మాకు నిన్ను గురించి తెలియజేసికొన్నావు, గనుక నీకు అనేక స్తోత్రములు.
- 3. నీ ప్రియకుమారునిలో మాకు కనబడినావు. గనుక నీకనేక స్తోత్రములు.
- 4. భూమిమీదనున్న సమస్తజనుల రక్షణార్థమై సంఘమును పాఠశాల గృహముగా నిర్మించినావు గనుక నీకు అనేక స్తుతులు.
- 5. సంఘకాలముయొక్క ఈ కడవరి దినములలో అక్కడక్కడ దైవసన్నిధి కూటములు ఏర్పరచినావు. గనుక నీకనేక స్తుతులు.
- 6. నీవెంత పరిశుద్దుడవైయున్నను అయోగ్యులమైన మానవులమగు మా కూటములకువచ్చి, దర్శనమందు కనబడి మాతో ముచ్చటించుచున్నావు గనుకను, మా ప్రశ్నలకు సంతుష్టికరమైన జవాబులు వినిపించుచున్నావు గనుక నీ పాదములకు అనేకమైన స్తుతులు
- 7. తండ్రీ! సన్నిధి కూటముల విషయములు అందరకు తెలియునట్లు పత్రికలు మాచేత ప్రకటింపచేయుచున్నావు. గనుక నీకు అనేక స్తుతులు. సర్వలోకమునకు తండ్రివైన దేవా! నీవు మనుష్యులకు కనబడవనియు, వారితో మాటలాడవనియు లోకులు తలంచుచున్నారు. మా హృదయస్ధితి సరిగా లేనందున దేవుడు కనబడడనియు, మాటలాడడనియు వారు తలంచుటలేదు. తండ్రీ మాకు దర్శనమిచ్చుచున్నావని మేము చెప్పినను కొందరు నమ్ముటలేదు. నీవు అందరికి కనబడుదువని వారు నమ్ముటకు మేము సాక్షులమైయుండునట్టి కృప దయచేసినందుకు నీకు అనంత స్తోత్రములు. యేసుప్రభువా! దర్శనమందు నాకు ప్రతి లక్ష్మివారము సంస్కార భోజనము వడ్డించుచున్నందుకు అనేక వందనార్పణములు. నీ రెండవ రాకడ విషయములను, సంస్కార భోజన విషయములను, మా ప్రశ్నలకు సంబంధించిన ఇతర విషయములను మేము వ్రాసుకొనగలిగినంత తేలికగా చెప్పుచున్నావు గనుక నీకు హృదయానంద ప్రణుతులు.
- 8. తండ్రీ! మా బైబిలు విషయములో లేచుచున్న అపార్ధములను ఖండన కార్యములను మాలో కొందరికి వచ్చుచున్న దుష్టస్వప్నములను తప్పుడు దర్శనములను ఆపుచేయుదువని నమ్ముచు నిన్ను స్తోత్రించుచున్నాము. నీయాజ్ఞ చొప్పున మేము బైబిలుమిషనును పైకెత్తి చూపించుచుండగా సైతానును, అతని దూతలును మామీదికి ఉర్రలూగుచు చేయుచున్న దుష్ట ప్రయత్నములను నాశనము చేయుదువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాము.
- 9. మా బైబిలుమిషను విషయములో భూలోక విశ్వాసులును పరలోక వాస్తవ్యులను, దేవదూతలును మాకు సహాయకారులుగా ఉండుటకు ఏర్పరుచుచున్నావని నమ్ముచు నిన్ను వందించుచున్నాము. ఆకాశజ్యోతులు అందరికి కనబడురీతిగా బైబిలుమిషను కనబడునట్లు చేయుదువని నమ్ముచు నిన్ను నమస్కరించుచున్నాము.
- 10. మాకు కలుగుచున్న అవమానములను, నేరస్థాపనలను మా విశ్వాస వృద్ధికొరకు, సర్వజనుల మేలుకొరకును, నీ మహిమ కొరకును మార్చగలవని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాము.
- 11. ప్రభువా! సంస్కార భోజన పాఠములను, రెండవ రాక పాఠములును, ఇతర పాఠములను మాకు నేర్పించుచున్నందుకు నిన్ను ఆరాధించుచున్నాము. దేవా! మేము అడిగినవాటికంటే ఎక్కువ చేయుదువని నీ దివ్య లక్షణములను నీ వాగ్ధానములను మా అనుభవములనుబట్టి నమ్ముచు నీమీద ఆధారపడుచున్నాము స్తోత్రము. నీవు స్థాపించిన సంఘ మూలముగాను, నీవు బైలుపరచిన బైబిలుమిషను మూలముగాను, సన్నిధికూటముల మూలముగాను, మా పత్రికాదుల మూలముగాను నెరవేరవలసిన పనులన్నియు సంపూర్తిగా నెరవేర్తువని నమ్ముచు నిన్ను ఘనపర్చుచున్నాము.
- 12. దేవా! కడవరి తీర్పు రాకముందు ప్రతివారికిని సుళువుగా బోధపడునట్లు నీ సువార్త అందించుదువని నమ్ముచు నిన్ను మహిమపరచుచున్నాము.
- 13. ఈ ప్రార్ధనలుకాక ఇంకను మిగిలియున్న ప్రార్ధనాంశములుకూడ నీవు పూర్తిచేయునట్లు మేము నీకు అర్పించుచున్న సమర్పణ అంగీకరింతువని నమ్ముచు నిన్ను శ్లాఘించుచున్నాము.
ఈ మా ప్రార్ధనలు భూమండలముకంటెను, ఆకాశమండలముకంటెను ఎక్కువగానుండి సఫలమౌటకై నీ ప్రియకుమారుడను, మా ప్రాణ రక్షకుడునైయుండి అతిశీఘ్ర కాలములో రానున్న ప్రభువునుబట్టి ఆలకింతువని ఆనందించుచున్నాము. ఆమెన్.