యేసు నామము



"నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును" అని రక్షకుడు చెప్పెను - యోహాను 14:14


ఇది ఇదివరకు వివరించినది. గనుక క్లుప్తపరచబడినది. బైబిలులో వ్రాయబడిన వాగ్ధానములన్నియు దీనిలో ఇమిడియున్నవి. ఈ మాట ప్రభువు తన శిష్యులకు చెప్పినమాట. అన్ని కాలముల శిష్యులకును అన్వయించును. నా నామము అనగానేమి? ప్రతి విశ్వాసి ప్రార్థనాంతమందు యేసుప్రభునిబట్టి ఆలకించుము అని చెప్పుటవలన ప్రార్ధనలు నెరవేరును. నామమనగానే ఆటంకములు విడిపోవును. ఎంతమంది నా నామమును ఎత్తినను ఆటంకపరులైన దురాత్మలకు భయములేదు. యేసునామమనగానే వాటికి భయము. ఆటంకములు పిశాచివలననే వచ్చును. యేసునామము ఎత్తగానే పిశాచి పారిపోవుట వలన ఆటంకముకూడ పోవును. యేసునామము ఉచ్చరింపగానే పాపియొధ్డనుండి పిశాచి పారిపోవునపుడు పాపముకూడ పారిపోవును. యేసునామము ఉచ్చరింపగా దయ్యము పారిపోవునపుడు వ్యాధికూడ పారిపోవును. అట్లే అన్ని చిక్కులలోను స్మరించి గ్రహించుకొనవచ్చును. ఒకప్పుడు చెప్పినట్లు ఇంటి యజమాని పేరు వినగానే, దొంగ పారిపోవును.

యేసునామము పామరుల ఉపయోగనిమిత్తము ఇవ్వబడిన నామములలో ముఖ్య శ్రేష్టనామము. యేసు నామము పేరెత్తగానే యేసుప్రభువు వచ్చును. ఆయనరాగానే పిశాచిపారిపోవును. అతడు పారిపోగానే చిక్కులన్నియు పారిపోవును. హిందువులు దైవనామస్మరణ వలన సమస్తమైన ఇక్కట్టులు అంతర్థానమగునని నమ్ముదురు. అదిమాత్రమేకాదు దైవభక్తుల నామస్మరణ చేసినయెడల కూడ, చిక్కులు మొదలైనవి పోవునని నమ్ముదురు.

చేతుననగా నేమి? వాగ్ధానముయొక్క నెరవేర్పు నిశ్చయత, ఈ క్రియలో కనబడును. ఈ వాక్యముకూడ ఒక వాగ్ధానమే, మనకు ఏది కావలసిన అడుగవలసినది ఈ వాక్యములో కనబడుచున్నది. అడుగుట, బ్రతిమలాడుట, మొర్రపెట్టుట, ప్రార్ధించుట. ఈ మొదలైన మాటలన్నియు అడుగుట అను అంశమునకే సంబంధించును. మాటల బేధమేగాని భావము ఒకటైతే; మాటలవాడుక చనువునుబట్టి ఉంటున్నది. నెరవేర్పుకలిగే వాటము లేనప్పుడు మొరబెట్టుదుము. నెరవేర్పు ఆలస్యమగుచున్నపుడు మునునివలె బ్రతిమలాడుదుము.

ప్రార్ధించుట అన్నిటికి సంబంధించినది, ఒకటి అడుగుట మిగిలిపోయినది, అడుగుటయేమిటి ఎవరు చెప్పగలరు. ఎంతో పరిచయము ఉంటేనేగాని ఇది కుదరదు. మొరబెట్టితేనేగాని, విసగకుండా ప్రార్ధిస్తేనేగాని నెరవేరదుగదా! అడిగితే నెరవేరుతుందా? అని అందురు. అందులోనే రహస్యమున్నది. ఏమి అవసరములేకుండా, ఏమియు తిప్పలు పడకుండా అడగడము తీసికోవడము ఇది ఎంతటివారికి లభించును? అడగండి మీకీయబడుననే వాక్యమిక్కడ జ్ఞాపకమునకు వచ్చును. పై వాక్యమంతటిలో ఏమనేది మహా ముఖ్యమైనది. వానిలో నరులకు కావలసినవన్నియు ఉన్నవి. ఇది అది అనే వివరములేదు. ఎటువంటి నిరాశపరులనైన ఇది ప్రేరేపించును. సంతోషపరచును. ఇది అడుగవచ్చు. అది అడుగవచ్చునని ప్రభువు చెప్పలేదు. ఏదైన అడుగవచ్చును అనగా మిక్కిలి సుళువైనది మిక్కిలి కష్టమైనది. అసాధ్యమైనది అడుగవచ్చును. తండ్రికిని, బిడ్డకునుగల సంబంధము ఇట్లు అడిగించగలదు. ఉండి ప్రభువు ఎంత అద్భుతకరమైన ఎంత విశాలమైన, ఎంత దాతృత్వముగల వాగ్దానమిచ్చినాడో చూడండి.

ఒక విశ్వాసి నేను బ్రతిమలాడను, మొరబెట్టను, ప్రార్ధించను కాని అడిగెదను అంటే ఇస్తాడా? ఇవ్వడా? అన్ని అనుకొను జవాబిందులో ఉన్నది. "అడుగుటనే" గొప్ప పని మీరు చేయగలిగితే చేయుటనే గొప్ప పని ప్రభువు నెరవేర్చలేడా? అడుగకముందు పరిచయమును విశ్వాసమును. పుచ్చుకొనే స్వభావమును సంపాదించుకొనవలెను. ఆ తర్వాత ఎన్ని అడిగినా ఫరవాలేదు. బైబిలు విద్యార్థులు ఈ వాక్యమును మొదటి పుటమీద వ్రాసికొనుట మంచిది. ఇది సన్నిధి గదికి తగిన మూలవాక్యము. ఒక విశ్వాసి ఇట్లనుచున్నాడని అనుకోండి; ఓ ప్రభువా! సన్నిధి గదిలోనికి వచ్చినాను, చాలసేపు ప్రార్ధించుటకు సమయము లేదు గనుక అడుగవలసినవి ఒక ముక్క అడిగి వెళ్ళిపోతాను, ఎవరికొరకు ఇస్తావు ఎందుకు వాగ్ధానము చేసినావు అనంటే తప్పుండవు. ఆ చనువునుబట్టి ఉండును.


ఈ వాగ్ధానముతో, యేసునామములో అడిగినవన్నియు దేవుడు అనుగ్రహించును గాక! మరనాత.