స్వరక్షకుడు - స్వంత దేవుడు



"నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైన దేదైననుండునా?" - యిర్మియా 32:27.


అర్ధము:- దీనిలో మూడు భాగములుగలవు.

1. నేను యెహోవాను. ఈ మాట ప్రత్యక్షతగలమాట. అనగా పాతనిబంధన ప్రజలకు, తనను గురించి తెలియపర్చుకొన్న నామము. ప్రత్యేకముగా ఆ జనాంగమునకు ఉపయోగించిన నామము. రక్షకుడు జన్మింపవలసిన జనాంగమునకు వెల్లడించిన నామము. ప్రత్యేకమైన జనాంగమునకు ప్రత్యేకమైన నామమందు దేవుడు బైలుపడినాడు, గనుక ప్రత్యేకమైన రీతిగా విశ్వాసులకు చేసిన సహాయముకంటే ఎక్కువ చేయగలడు. ప్రత్యేకము ప్రత్యేకమే, అది విశ్వాసులందరికి ఆదరణ పదము.


2) సర్వశరీరులకు దేవుడను
ఈ మాటలో లోకస్థులందరు ఇమిడియున్నారు. సర్వశరీరులనగా విశ్వాసులు అవిశ్వాసులు, అన్యులు యూదులు. ఈ మాట సామాన్యమైన మాటయైయున్నది. దేవుడను మాట అన్నీ జాతులవారు అన్నీ మతములవారు వాడుకొనే మాటయై యున్నది. యేసుక్రీస్తు అనేమాట ప్రత్యేకముగా క్రైస్తవులకు మాత్రమే వాడుకొనుమాట. అయినను అన్ని మతములవారి యొద్దకు రక్షణార్ధమై పంపబడుచున్నది. ఈ నామముననే రక్షణ అని చాటింపబడుచున్నది. యెహోవాయే దేవుడు వేరొక దేవుడు లేడని యూదులు చెప్పుకొన్నట్లు, యేసే రక్షకుడని క్రైస్తవులు చెప్పుకొనుచున్నారు. దేవుడు యేసుక్రీస్తుగా ప్రత్యక్షమైనందున ఈ చెప్పుకొనుట నిజమైయున్నది. అనగా క్లుప్తముగా చెప్పవలెనంటే ఇట్లు చెప్పవలెను. ఎట్లనగా యూదులకు యెహోవా నామము, క్రైస్తవులకు యేసుక్రీస్తు నామము. అందరికి కలిసి దేవుడను నామము ఇవ్వబడినట్లు కనబడుచున్నది. అయితే తక్కిన రెండు నామములు యేసుక్రీస్తులో ఇమిడియున్నవి. గనుక యేసు ప్రభువు, రక్షకుడు మాత్రమే కాదు దేవుడునైయున్నాడు.


3) నాకు అసాధ్యమైనదేదైనా యుండునా:-
నాకనగానేమి? ఇది ఏకవచనము. బహువచనముకాదు. క్రొత్త నిబంధన సిద్ధాంతమును బట్టి దేవుడు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను బయలుపడియున్నాడు. అలాగైతే మాకు అని అనవలెనుగదా! ముగ్గురు వ్యక్తులు ఒకవ్యక్తిగా ఉన్నందువలన అట్లనుటకు వీలులేదు. ఒక్కొక్క వ్యక్తిపేరు వేరుగా మాట్లాడినప్పుడు కూడ ఏకవచనము వాడుబడును. బైబిలులో ఎక్కడను త్రిత్వమునకు బహువచనము వాడినట్లు కనబడదు గాని, పరమ గీతములో బహువచన జాడ కనిపించుచున్నది.

"అసాధ్యమైనది" అనగానేమి? నేడు చేయలేనిదని అర్ధము. సాధ్యము ఉన్నదా అని అంటే, లేదనే జవాబే గాని ఉన్నదని జవాబు వచ్చుటకు వీలులేని ప్రశ్నయైయున్నది. ఏదైనా ఉండునా? ఇది నీవు సమస్తము చేయగల వాడవని అన్న మాటలకు సరిపోయినది. దేవునికి ఎవరి ప్రార్ధన నెరవేర్చుటకైనను అసాధ్యముకాదు అను తలంపుగల వాక్యములలో ఇది చదువుకొని, కుప్పిగంతులు వేయుదురు.

దేవా! నీవు అందరి దేవుడవు, మా దేవుడవు, నా దేవుడవు కాబట్టి నీకసాధ్యమైనదేదియు లేదు. కాబట్టి నాకును ఇతరులకును అసాధ్యముగా తోచుచున్న ఈ కార్యమును నెరవేర్చుము, అని ప్రార్ధనాపరులు ప్రార్ధింతురు. యిర్మియా అనగా ఈ మాట వ్రాయించిన యిర్మియాకు అన్నియు ఇక్కట్టులే. దేవుడు వాటన్నిటిని తొలగించినాడు. మనకు కూడ అనగా ఇది చదివే మనకు కూడ తొలగించునట్టి సహాయము చేయగలడు. నాకు అసాధ్యమైనది ఏదైనా యున్నదా? అను ప్రశ్న వినసొంపుగా నుండునా? నాకు అసాధ్యమైనది యేదియు లేదనియు, సమస్తము సాధ్యమేననియు చెప్పగల నిశ్చయవాక్యము వినసొంపుగా నుండునా! యూదులు జన్మవిషయములోను మనము విశ్వాస విషయములోను ప్రత్యేక జనాంగమైయున్నాము. తెలుగులో దేవుడను ఏక వచనమునకు బహువచనమేలేదు. దేవుడు ఒక్కడే, గనుక బహువచనమెట్లుండును? అసలు వ్యక్తిలోలేని బహువచనము మాటలో ఉండనేరదు. మాట్లాడుకొనేటప్పుడు సంభాషణలో మాకైతే ఒక్కదేవుడేగాని, మీకు అనేక దేవుళ్ళున్నారు, అని మాట్లాడుకొందురు. శాస్త్రయుక్తముగా చూచిన దేవుళ్ళు అను పదము తప్పు.

సారాంశము: మనుష్యులకు అసాధ్యమేగాని దేవునికి సమస్తము సాధ్యము (మత్తయి 19:26).


ఈ వాగ్ధానముతో, ప్రభువైన యేసుక్రీస్తు స్వంత దేవుడని గ్రహించి, మనకు అసాధ్యమైనవి ప్రభువు ద్వారా సాధ్యము చేసుకొందుము గాక! మరనాత.