గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

10. కుష్టురోగి బాగగుట



యేసుప్రభువు కొండెక్కి ప్రసంగముచేసి దిగి వచ్చుచుండెను. కొండక్రింద ఒక కుష్టురోగి ఆయన దగ్గరకు వచ్చి నమస్కారము చేసి “నీకిష్టమైతే నన్ను శుద్దునిగా చేయగలవని చెప్పెను.” మత్తయి 8:1-4.


యేసు ప్రభువుయొక్క రెండు లక్షణములను అతడు కనిపెట్టెను. మొదటి లక్షణము ఇష్టము. రెండవ లక్షణము శక్తి. ఈ రెండు ఉన్నయెడల స్వస్థత జరుగును. ఒకని రోగము బాగుచేయుటకు ఈ రెండు లక్షణములు అవసరము. బాగుచేయుటకు ఇష్టముండి, శక్తి లేకపోయిన లాభములేదు. బాగుచేయుటకు శక్తి ఉండి ఇష్టము లేకపోయిన యెడల బాగుచేయరు.


ఉదా:-

పై రెండు కథలలోను కార్యము జరుగదు ఎందుకనగా ఒకరికి ఇష్టమున్నదిగాని శక్తిలేదు. ఒకరికి శక్తిగలదు గాని ఇష్టము లేదు. గనుక ఇష్టము, శక్తి రెండు లక్షణములు ఉంటేనే కార్యము నెరవేరును.


కుష్టురోగి కథలో యేసుప్రభువు బాగుచేయ శక్తిగలవాడని అతనికి తెలియును. బాగుచేయ శక్తిమంతుడని అతడు ప్రభువును మెచ్చుకొనెను. గాని ప్రభువునకు అతనిని బాగుచేయుటకు ఇష్టమున్నది లేనిది అతనికి తెలియదు. శక్తి ఉన్నదని అతడు గ్రహించెనుగాని ఇష్టమున్నది లేనిది గ్రహింపలేదు. రెండు ఉన్నప్పుడే రోగి బాగుపడును.


ఆ రోగికి ఒక విద్య ఉన్నది. అదేదనగా ప్రభువునకు శక్తి ఉన్నదని, ప్రభువు శక్తిగలవాడనే విద్య కుష్టరోగికి ఉన్నది. అప్పుడు ప్రభువు అతనికి తెలిసినది విడిచిపెట్టి, తెలియని క్రొత్తపాఠము నేర్పించెను. “నాకిష్టమే నీవు శుద్ధుడవుకమ్ము అను పాఠము నేర్పించెను. పాత నిబంధనలో పాపము చేసిన కుష్టురోగము వచ్చుననియు, అది శాపమనియు ఉన్నది. గనుక అతడు నేను పాపిని అందువలన శాపముగా వచ్చిన ఈ కుష్టు వ్యాధిని బాగుచేయుటకు ప్రభువునకు ఇష్టముండునా అని తలంచెను. గనుక ప్రభువు నీవు బాగుపడుట “నాకిష్టమే” అను పాఠము నేర్పించెను. ఆ మాట ఆ రోగికి గొప్ప ఆదరణ. కుష్టురోగి నేర్చుకొన్న పాఠమేమనగా ఈయనకు శక్తికి శక్తియున్నది. ఇష్టమునకిష్టమూ ఉన్నది అని తెలిసికొనెను.


అంతకుముందు ప్రభువునకిష్టమున్నట్లు అతనికి తెలియదు. అయితే అతనికి క్రొత్త సంగతి యేమనగా “నీవు శుద్ధుడవు కమ్మని” అతనిమీదనే భారము పెట్టెను. ప్రభువు బాగుచేస్తాడని రోగివస్తే, రోగిమీదనే ప్రభువు బాగుపడే భారము పెట్టెను. పాతనిబంధనలోని నయమాను స్వస్థపడుటకూడ ఇటువంటిదే. ప్రవక్తయైన ఎలీషాకూడ ఈలాగుననే చెప్పెను. ఇక్కడికి ఈ దినము జబ్బులు బాగుచేయించుకొనుటకు వచ్చిన వారు మీరే మీ జబ్బులు బాగుచేసికొనవలెనా? లేక ప్రభువు బాగుచేయవలెనా? ప్రభువు రోగిమీదనే బాగుపడే భారము ఉంచినాడు గనుక మీకు మీరే బాగుపడవలెను. ఎందుకనగా మీరు బాగుపడవలెనని ప్రభువునకు ఇష్టమును మరియు శక్తియును రెండునూ గలవు గనుక బాగుపడవలెను. బాగుపడకపోతే మనదే తప్పు.


యేసుప్రభువు కొండమీద ప్రసంగము చేసి దిగి వచ్చుచుండెను. ఇక క్రియ చేయవలెను. చేయకపోతే ప్రసంగమేగాని క్రియలేదు అంటారు. లోకమునకు ఆయన, బోధకు బోధ చేయవలెను. క్రియకు క్రియ చేయవలెను. గనుక తెలియకుండ కుష్టురోగి వచ్చెను. ప్రభువు అతని బాగుచేసి క్రియ చూపించెను. బోధకులైనవారు బోధ చేయవలెను. రోగులను స్వస్థపర్చవలెను. ఇదే ఎమ్మాయు శిష్యులు చెప్పిరి (లూకా 24:19). అయితే ఆయన పునరుత్ధానమును వారు నమ్మనందున ఆయన చనిపోయెనని వారు చెప్పిరి. కుష్టురోగి గొప్పవాడు ఎందుకనగా ప్రభువు శక్తిగలవాడని నమ్మెను. ఎమ్మాయు శిష్యులు నమ్మలేదు. గనుకనే ప్రభువు అవివేకులారా, మందమతులారా అని వారిని గద్దించెను. (లూకా 24:25). అట్లే ఈ వేళ జబ్బులు బాగుచేయించు కొనుటకు వచ్చినవారు బాగుపడకపోతే వారు అవివేకులు, మందమతులు. బాగుపడకపోవుట రోగుల తప్పుగాని, ప్రభువు తప్పుకాదు. ఈ కుష్టు రోగియొక్క పాఠములో కొన్ని జట్టులున్నవి.

(మత్తయి 28:20) ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పిన ప్రభువు, (హెబ్రి 13:8)లో యేసు క్రీస్తు నిన్న నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అని వ్రాయించిన ఆయనకు మనలను నేడు స్వస్థపరచుటకు ఇష్టము, శక్తి ఉన్నవి గనుక చదువరులెల్లరకూ క్రీస్తు యేసు నామములో అట్టి కృప అనుగ్రహించును గాక! ఆమెన్.