గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
4. విశ్వాస వాదము
ఆది. 24:13,14; 19:18-22; లూకా. 10:1 మత్త. 10:1.
విశ్వాసముయొక్క వాదమును వినగోరువారలారా మీకు శుభము కలుగునుగాక!
విశ్వాసము దేవునితో వాదించునది. ఏది దేవునితో వాదించునో అదే విశ్వాసము. అనగా దేవునియొక్క వాగ్దానములు ఆయనకే చూపించి వాదించుట. అది విశ్వాసముయొక్క పని. బైబిలు అంతటిలో రెండు ముఖ్యమైన అంశములు గలవు.
- 1. దేవుడు తన ఇష్ట ప్రకారము తన పనులు మనుష్యుల ద్వారా చేయించుట. దేవుడు తన ఏర్పాటు ప్రకారము చేయుట. ఇది ఒక పద్ధతి.
- 2. దేవుడు మనుష్యలయొక్క ఇష్టప్రకారము చేయుట అనగా మనుష్యలయొక్క ఏర్పాటు ప్రకారము దేవుడు చేయుట. ఇది రెండవ పద్ధతి,
ఈ రెండు పద్ధతులు బైబిలులో గలవు. ఈ రెండు దేవుడు చేయు పనులేగాని ఏర్పాటులు వేరు.
ప్రభువుయొక్క ఏర్పాటు:-
- 1. యేసుప్రభువు శిష్యులను, ఇతరులను 70 మందిని పిలిచి, మీరు ఆయా గ్రామములకు వెళ్ళి సువార్త ప్రకటించుడి అని తన ఏర్పాటును, తన ఇష్టము నెరవేర్చుటకు వారిని పంపెను. మత్తయి 10:1; లూకా 10:1. వారు మారుమాట్లాడుటకు వీలులేదు. ఎందుకనగా అది వారికి ప్రభువుయొక్క ఏర్పాటు. అది ప్రభువుయొక్క ఇష్టము గనుక వారు తప్పక చేయవలెను.
- 2. ఆయన మరియొక ఏర్పాటు చేసెను. మీరు సర్వసృష్టికి సువార్త ప్రకటించుడని ఆజ్ఞాపించెను. అదికూడ దేవుని ఇష్టము, దేవుని ఏర్పాటు. ఆయన ఇష్టప్రకారము, ఆయన ఏర్పాటు ప్రకారము శిష్యులు చేయవలెను.
మనుష్యుని ఏర్పాటు:- మానవునియొక్క ఇష్టము, అతనియొక్క ఏర్పాటు. ఇదికూడ దేవుడే నెరవేర్చవలెను. గాని ఇష్టము, ఏర్పాటు మానవునిది - అదే భేదము. ఆది 24:13, 14 వచనములలో ఎలియాజరు నూతిదగ్గర ఉండెను. తన ఇష్టము ప్రభువుతో చెప్పుచున్నాడు. ప్రభువా! “నీ ఇష్టమేమిటి” అని అడుగలేదు. గాని "నా ఇష్టప్రకారము" చేయుము అని అడుగుచున్నాడు. "ఏ చిన్నది నాకు నా ఒంటెలకు నీళ్ళు పోయునో ఆ చిన్నదే నా యజమానుని కుమారుడైన ఇస్సాకునకు భార్య అగును" అని తన ఇష్టము ప్రభువుతో చెప్పుచున్నాడు. అమ్మాయి కొరకు వెతకి వెతకి దేవా నీ చిత్తము నెరవేర్చుము అని ప్రభువుతో చెప్పవలెను. తీరా కన్యక రిబ్కా వచ్చినది గనుక కథ నెరవేరినది. మరియొక స్త్రీ వివాహము అయిన ఆమె ఎదురు వచ్చినయెడల ఎంత ఆటంకము కలుగును? ఎలియాజరునకు ఆలాగు దేవుడు చేయడని తెలియును. తాను అడిగినది తన ఇష్ట ప్రకారము, తన ఏర్పాటు ప్రకారము ప్రభువు చేయును అనే గొప్ప విశ్వాసము గలదు. ఎందుచేత అతనికి అట్టి విశ్వాసము గలదు? విశ్వాసులకు తండ్రియైన అబ్రాహాము ముందె చెప్పియున్నాడు. ఆది. 24:40 “నీతోకూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును.” విశ్వాసులకు తండ్రియైన అబ్రాహాముయొక్క విశ్వాసము తుదకు ఎలియాజరుయొక్క విశ్వాసమాయెను. దేవుడు ఈ ఎలియాజరు ప్రార్ధన ప్రకారము రిబ్కానే పంపి తనకును ఒంటెలకును నీళ్ళు పోయించెను.
మరియొక చిత్రము ఏమనగా నీళ్ళు పోసినందున ఎలియాజరు పెద్దల సలహా లేకుండా ఆమెకు నూతి దగ్గరే నగలు పెట్టెను. ఇది తన ఏర్పాటే. పెండ్లి ఏర్పాటు చేసికొనిన తర్వాత నగలు ఇచ్చిన బాగుండును. నీళ్ళు పోసినందుకు ఆ నగలు పెట్టినాడు గాని తుదకు అవే పెండ్లి నగలు అయినవి. గనుక దేవుడు మన ఇష్టముకూడ నెరవేర్చును. మన విశ్వాసమునుబట్టి చేయును గనుక నేటి మన ప్రసంగాంశము “విశ్వాస వాదము”.
మార్కు 5:22-43లో యాయీరు కథలో అతడు ప్రభువును తన ఇంటికి రమ్మని పిలిచెను. అది యాయీరుయొక్క ఏర్పాటు, ఇష్టము. ఆయన ఏర్పాటు కాకపోయిన ప్రభువు యాయీరు ఏర్పాటు ప్రకారము వెళ్ళి చనిపోయిన కుమార్తెను బ్రతికించెను. బ్రతికించుట కూడ యాయీరు ఏర్పాటే గనుక ప్రభువు అట్లే బ్రతికించెను. దీనినిబట్టి కూడ ప్రభువు మనిషి ఇష్టప్రకారము చేయునని కనబడుచున్నది. ఆది 19:18-22లో భక్తుడైన లోతు దేవదూతలను అడిగెను. దూతలు అతనిని “ఆ పర్వతమునకు పారిపొమ్ము” అని చెప్పిరి. అందుకు లోతు వారితో నేను అంత దూరము నడవలేను, ముసలివాడను. దగ్గరనున్న గ్రామమునకు వెళ్ళిదను అని మనవి చేయగా ఆ దూతలు అతనినిబట్టి ఆ ఊరును నాశనము చేయము అని చెప్పిరి. ఆ ఊరు లోతుయొక్క ఇష్టము, ఏర్పాటు గనుక అక్కడికి వెళ్ళుమని పలికిరి. గనుక మన ఇష్ట ప్రకారము ప్రభువు చేయుట అనేది గలదు. గనుక గుడికి వచ్చిన వారందరు మా ఇష్టము, మా ఏర్పాటు, విశ్వాసమును బట్టీ ప్రభువునడిగి చెప్పండి - దేవుని ఇష్టమును, దేవుని ఏర్పాటును ఏలాగైన నెరవేరును, గాని మనిషి ఇష్టము మనిషి ఏర్పాటు విశ్వాసమునుబట్టి ఉండును. ఆ విశ్వాసము వాగ్ధానమునుబట్టి ఉండును. ఈ వాగ్ధానమును బట్టి మనిషియొక్క ఏర్పాటు నెరవేరును.
వాగ్ధాన దృష్టాంతము:- మత్త. 9:27-31లో ఇద్దరు గుడ్డివారు ప్రభువు దగ్గరకు వెళ్ళిరి. ప్రభువు మాకేమి కావలెను అని అడుగగా వారు తమ ఇష్టము కోరిరి. చూపు కావలెను అని జవాబిచ్చిరి. ఇది చేయగలనని నమ్ముచున్నారా అని ప్రభువు ప్రశ్నించెను. వారు నమ్ముచున్నాము ప్రభువా అనిరి. అప్పుడు క్రీస్తుప్రభువు మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పిరి. అది వాగ్ధానము, ఆ వాగ్ధానమే ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదమే నెరవేర్పు. ఈ మూడు ఏకము కాగా వారికి కండ్లు వచ్చెను. ఈ స్వస్థత వారి ఇష్టప్రకారము కలిగెను. గనుక దేవుడు మన ఇష్టప్రకారముకూడ ఆయన వాగ్ధానమునుబట్టియు, మన విశ్వాసమునుబట్టియు నెరవేర్చును. ఎప్పుడు ప్రభువు మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక” అని అనిరో అప్పుడు వారి వారి మనసులలో “ఆమెన్ ” అన్నారు. “కలుగునుగాక” అనునది గొప్ప వాగ్దానము. గనుక నెరవేరినది. గనుక దేవుడు మన ఇష్టప్రకారము కొన్ని నెరవేర్చును - ఇవి బైబిలులోని దృష్టాంతములు.
స్వంత అనుభవము:-
- (1) ప్రభువా! నా పాపములు క్షమించుము అని ప్రార్ధనచేసినపుడు దేవుడు నెరవేర్చునా? బైబిలులో వాగ్ధానములున్నవా? పాపములు క్షమింతును అను వాగ్దానములు కావలసినన్ని గలవు. దేవుడు పాపములు క్షమింపక పోయిన యెడల మన ఇష్టాలు, మన ఏర్పాట్లు ఎన్ని నెరవేర్చిన ఏమి లాభము? జీవాంతమందు ఏమియు లాభములేదు. ఇంకను క్షమించబడలేదు. అని ఎవరికైన సందేహమున్నయెడల, వారు ఒప్పుకొని ఎన్నటికి తప్పుచేయను అని ప్రమాణము చేయవలెను. ప్రమాణము గట్టిదైన క్షమించుటకూడ గట్టిదగును. యెషయాలో పాపములు కప్పివేతును. అవతల పారవేతును, ఎప్పుడు జ్ఞాపకము చేసికొనను. నీ పూచీ అయిపోయింది, జ్ఞాపకము తెచ్చుకోను అని దేవుడు చెప్పుచున్నాడు. అయితే నీవు ఎందుకు జ్ఞాపకము తెచ్చుకొనవలెను? అది బాగుగాలేదు. నేనే జ్ఞాపకము తెచ్చుకొనను అన్నప్పుడు నీవెందుకు జ్ఞాపకము తెచ్చుకొనవలెను? అని ప్రభువు అడుగుచున్నాడు.
- (2) ఓ ప్రభువా! మా ఇంటిలో ఒకరికి చాల జబ్బుగా నున్నది. నీ వాగ్దానము నమ్ముచున్నాను. ప్రభువా! నీవు గుడ్డివారితో అన్నట్లు “నా నమ్మికచొప్పున నాకు కలుగుగాక” అని ప్రార్ధించిన ఆ వ్యాధి పోవును. ప్రభువు ఆ గుడ్డివారితో నేను నీ కండ్లు బాగుచేయుదును అని అనలేదుగాని ఆయన బాగుచేయుట నిజమే, అయితే ఆయన ఆ మాట పలుకకుండా మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాకి అని చెప్పెను. బాగుచేయువారు ప్రభువే గాని, నమ్మికభారము వారిమీద పెట్టిరి.
- (3) ప్రభువా ఈమె బీదరాలు, ఈమెకు తృప్తికరముగా ఆహారము దయచేయుము అని ప్రార్ధించండి.
ప్రార్ధన:- ప్రభువా! నీవు అన్నావు “మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక” ఆ విధముగానే ఆమె పేదరికము తీసివేయుదువని నమ్ముచున్నాను. “మేము నమ్ముచున్నాము” అని గుడ్డివారు అన్నారు. అలాగే ప్రభువా నేను నమ్ముచున్నాను గనుక “నీవు నా విషయములోను కలుగును గాక” అని చెప్పుము. ఈలాగు వాదము పెట్టుకొన్న తప్పక జరుగును.
- (ఎ) ప్రభువా ఆ మనుష్యుల (గ్రుడ్డివారు) ఇష్ట ప్రకారము చేసినావుకదా నేనును ఆలాటి మనుష్యుడనే గనుక నా ఇష్టప్రకారము చేయుము.
- (బి) ఆ గ్రుడ్దివారు “నమ్ముచున్నాము” అనగానే నీవు కలుగుగాక! అన్నావు. ఆలాగే నేను నమ్ముచున్నాను! కలుగుగాక! అని చెప్పుము.
- (సి) వారి విషయములో నెరవేర్చినావు గనుక - నా ప్రార్ధనకూడ నెరవేర్చుము ఆమేన్.
గమనిక:- ఈ ప్రకారముగా మీ ఇష్టములోనున్న కోరికలన్నిటిని దేవుని దగ్గర పరచివేయుము. అయితే ప్రార్థించునపుడు నా కోర్కె ఆయన కోర్కె కాదేమో? నా ఏర్పాటు ఆయన ఏర్పాటు కాదేమో? నా విశ్వాసముబట్టి చెప్పితిని అది దేవుని ఇష్టము కాదేమో? అను తలంపులు హృదయమునకు వచ్చును; ప్రార్ధించుట, విశ్వసించుట వారి పని. సాతాను ఎంత భయపెట్టినను దేవుని వాగ్దానము గట్టిగా పట్టుకొని నీవు అన్నావు గనుక తప్పక నెరవేర్చుదువు అనుట - అదే విశ్వాసము. “నా నామమునుబట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును” యోహాను 14:14 అన్నావుగదా. “ఏమి అను మాటలో పలానిది అని లేదు. 'ఏమి' అని వ్రాసి ఉంది. గనుక తప్పక నెరవేరును. వాగ్దానము చేసినవాడు “కాదు” అనుటకు వీలులేదు. “సాతాను చెప్పు మాటలకు అనుమాన పడక, విచారపడక వాగ్దానము గట్టిగా పట్టుకొనవలెను”.
ఈ పై విషయములు మీ హృదయములలో ముద్రింపబడును గాక! ఆమేన్.