గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
13. రక్షణ పత్రిక
నా పత్రికలున్న దీనిలో దేవవాక్యమున్నది; పాడుకానీయకండి.
- (1) దేవలోకము:- దేవుని సింహాసనస్థలము (యెషయా 66:1)
- (2) దేవదూతల లోకము:- (యోబు 38అ) మన కావలిబంటులైన వీరిచోటు (హెబ్రీ 1:14).
- (3) మోక్షలోకము:- (యోహాను 14:2) మృతులైన భక్తుల నిత్యనివాసము.
- (4) సాతాను లోకము:- (ఎఫెసీ 6అ) ఇతడును, ఇతని దూతలును ఉండు ప్రదేశము
-
(5) భూలోకము:- (ఆది:1)
- (1) ఈ పరిశుద్ధలోకము సైతానువలన పాపమయమాయెను.
- (2) కొన్ని ఏండ్లకు దేవుడే యేసుక్రీస్తను నరుడుగా భూమిమీద వెలసెను (లూకా 2అ) ధర్మములు బోధించి, అద్భుతోపకారములుచేసి, అవమానములపాలై శత్రువుల వలన హతమై, బ్రతికివచ్చి మోక్షమునకు వెళ్ళెను. (కార్య 1అ)
-
(6) మారినభూమి:- (ప్రక 20:6).
- 1. అపుడు క్రీస్తు పరలోక వాస్తవ్యులతో వచ్చి వెయ్యేండ్లు శాంతిపాలన చేయును. పాపము చేసినవారు ఉండరు గనుక పాపకార్యములు ఉండవుగాని నైజపాపము గలవారుందురు. వారికి క్రీస్తు బోధ వినబడును. నరులు వందలాది ఏండ్లు సుఖముగా బ్రతుకుదురు. పురుగులబాధ, మృగములబాధ ఉండదు.
- 2. బోధవిన్నవారి తీర్మానమును క్రీస్తు చెప్పించి తీర్పు విధించును.
- 3. క్రీస్తు సైతానుకు విడుదల కలుగజేయగా అతడు యుద్ధముచేసి ఓడిపోయి నరకములో పడును. (ప్రక 20:7-10). అతనితోపాటు నమ్మనివారుకూడ నరకము పాలగుదురు. (ప్రక 20:15).
- (7) హేడేస్సు:- పాతాళ లోకము. మారని మృతులుండు గొయ్యి. నశించినదానిని రక్షింపవచ్చిన క్రీస్తు వీరికి గడువియ్యక విడిచిపెట్టునా? (1సమూ. 2:6; 1పేతు 4:6)
-
(8)క్రొత్తభూమి:- అప్పుడు భూమి మోక్షములో ఒక భాగమగును. అన్ని
లోకములలో
క్రీస్తే ఉండును (ప్రక. 21అ).
బోధ:-- (1) బైబిలు: దీనిలో దేవునిమాటలున్నవి చదువండి. మంచిమాదిరిని అవలంభించుటకు సజ్జనుల చరిత్రయును, చెడ్డ మాదిరిని విసర్జించుటకు దుష్టుల చరిత్రయును దీనిలో గలవు.
- (2) క్రీస్తు చరిత్ర: ఈయనవలన మాత్రమే నరులు పాపపరిహారము పొంది మోక్షమునకు వెళ్ళగలరు. (కార్య. 4:12). పాపములు విసర్జించి ఇతరపూజలు మాని ఈయననే ఆశ్రయించువారికి కోరికలన్నియు తీరును.
- (9) క్రైస్తవమతము: ఇది అన్నిమతములను పిలుచుచున్నది. అన్ని దేశములలో వ్యాపించుచున్నది. బైబిలును (ఇప్పటికి 1958 సం॥ము వరకు) ఒక వెయ్యి నూట ఏబది భాషలలో ప్రచురించినది.
-
(10) బైబిలు మిషను:
- (1) రాజమండ్రిలో 1938వ సం॥ము జనవరి మాసమున దేవుడు "బైబిలుమిషను" అని గాలిలో వ్రాసి నాకు చూపెను గనుక “బైబిలుమిషనును” ఎత్తిచూపుమని చెప్పెను గనుకను దీనిని వెల్లడిలోనికి తెచ్చుచున్నాను.
- (2) ప్రార్ధనలో క్రీస్తు కనబడి బైబిలు వచనముల వివరము చెప్పుననియు, బైబిలులోని అద్భుతములు అక్కరలనుబట్టి నేడుకూడ జరుగుననియు బోధించుచున్నాము.
- (3) ఇతర మతములను మాత్రమేగాక ఇతర మిషనులనుకూడ దేవుడు బైలుపరచిన ఈ బైబిలుమిషనులోనికి రండని పిలుచుచున్నాము.
- (4) బైబిలు మిషనును దేవుడు పేరువ్రాసి బైలు పరచినందునను, ఎత్తిచూపించుమని చెప్పినందునను, దేవుడు స్వయముగా బైబిలును మిషనెరీవలె "బైబిలు మిషను వారికి" వివరించుచున్నందున ఇది అన్నిటికంటె పై అంతస్థుగలదైయున్నది. ఇతరులకు రక్షణలేదని మేము చెప్పము. విశ్వాసులందరికి రక్షణగలదు (ఎఫెసీ 2:18) బైబిలు మిషను సేవార్థమైన మాలో జీతముల ఏర్పాటులేదు.
- (5) దైవ ప్రార్థన విషయములు: ప్రార్థనలో ఉండి దేవునియెదుట పాపము లొప్పుకొనండి; మేళ్ళ నిమిత్తమై స్తుతించండి; మీ యిష్టము వచ్చిన మనవులు చెప్పుకొనండి జవాబుకొరకు కనిపెట్టండి.
-
(6) స్వస్థిశాల: ఇది గుంటూరువద్దనున్న శ్రీ రావుసాహెబ్ జె. రాజారావుగారి కాకానితోటలో ఉన్నది. ఇక్కడికి
ప్రతి
సోమవారము
నలుగురు బైబిలుమిషను పాదుర్లు వచ్చి, క్రీస్తుబోధలు, ప్రార్ధనలు, కీర్తనలు నేర్పింతురు. పాపులకు, రోగులకు, బిడ్డలు
లేనివారికి, భూత పీడితులకు, చిక్కులలో ఉన్నవారికి, పశ్వాదులకు మేలు కలుగుచున్నది. ఈ పని బైబిలు వాక్యానుసారమే.
స్వస్థికూటములందరును పెట్టుకొనవలసినదే.
దైవసన్నిధి కూటములు:- ఈ 1957 లో తెలుగు జిల్లాలయందు ఈ కూటములు స్థాపింపబడినవి. క్రీస్తుప్రభువు దర్శనములో కనబడి ప్రశ్నలకు జవాబులు చెప్పును. దేవదూతలను, మోక్షలోక భక్తులను పంపును. వారును మాటలాడుదురు. భూలోక విశ్వాసుల ఆత్మలను, మారని ఆత్మలను కోరినవారిని పంపును. ఒకానొకప్పుడు భూతములనుకూడ రానిచ్చును. తర్వాత ఆయనవచ్చి భూతముల మాటలు నమ్మవద్దనియు, వాటికి భయపడవద్దనియు చెప్పి ఆదరించును. ఇట్టి కూటములు లోకములోని ప్రతి ఇంటిలో పెట్టుకొనవలెనని కోరుచున్నాను. దేవుడు మీకు కనబడి మాట్లాడుట ఇష్టములేదా? ఇది శక్తిపూజకాదు దైవపూజ. (యెషయా 8:19). - (7) క్రీస్తు నిమిషములమీద వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు అని ఎంతచెప్పినను, యొన్ని మారులు చెప్పినను లక్ష్యపెట్టనివారు ఒకమారు బైబిలంతయు చదువవలెననియు, ముఖ్యముగా ప్రకటన పుస్తకము నేర్చుకొనవలెననియు, నిత్యము ఆయన రాకడ తలంపు మీదనే ఉండుట శ్రేయస్కరమనియు, రాకడను గురించి బోధించుమని దేవుని నడుగవలెననియు, క్రైస్తవమతముమీద ద్వేషభావము కలిగించుకొనకుండుట క్షేమమనియు, సర్వజనసంఘము మీద మాకున్న అభిమానము చొప్పున సలహా ఇచ్చుచున్నాము.
-
(8) మరికొన్ని విషయములు:-
- (1) దేవా! సైతానును అతని దూతలను, అతనిని అనుసరించిన కఠినాత్ములను నీ శక్తిచేత బలవంతముగా మార్చి నరకములేకుండగచేసి మోక్షమునందు గాకపోయినను మరియొక స్థలమునందైనను చేర్చి రక్షించుము ఆమేన్. అని నేను ముప్పదియేండ్ల క్రిందట ఈ తిరుగుబాటు ప్రార్ధనచేసి ఇప్పుడు మానివేసితిని.
- ప్రార్ధన:- దేవా! నాకు కనబడుము; నాతో మాటలాడుము; అందరికిని కనబడుము; అందరితోను మాటలాడుము; స్వప్నములోను, దర్శనములోను అందరికి సత్యమార్గమును బోధించుము. బోధను అనునరించు శక్తిని కలిగించుము. విగ్రహారాధన, శక్తిపూజ, ఇతర దేవతలపూజ కూడదని బైబిలులో వ్రాయించినావు గనుక ఇవి మాన్పించుము. మానవులకు హానికలిగించు పనిముట్లను వాడనీయకుము. కులనిష్ట ఎడబాపును ద్వేషభావమును కలిగించును గనుక దానిని రద్దుచేయుము. సోదరభావమును హెచ్చింపుము, మెరకను, నీటను, అంతరిక్షమునకును ప్రయాణము చేయువారికిని, భూగర్భమున పనిచేయువారికిని నీ దూతలను సహాయముగానిమ్ము. పాపులను, బీదలను, రోగులను, బిడ్డలు లేనివారిని, భూతపీడితులను, పెండ్లి సమకూడనివారిని, కుటుంబ కలహములు గల వారిని, వర్తక నష్టముగలవారిని, అప్పులపాలైనవారిని ఇండ్లు లేనివారిని, దేశదిమ్మరులను, భిక్షకులను, అన్యాయము పాలగువారిని పనులు ఉద్యోగములు దొరకనివారిని, ఉపకారులను, ఆయా అవస్థలలో నున్నవారిని కనికరించుము. మా విరోధులను క్షమించుము, దీవించుము. నిన్ను ఎరుగనివారికి బైలుపడుము. విద్యాభివృద్ధి, నాగరికతాభివృద్ధి, దైవభక్తి వృద్ధి ప్రబలపరచుము, సమస్త జీవులను, వృక్షాదులను నీవు కలుగజేసిన సమస్తమును అనుదినము దీవించుచుండుము. సైతాను ప్రయత్నములను, సైతాను అనుచరుల దుష్ట ప్రయత్నములను నెరవేరనీయకుము. పరదేశ ద్వేషమును, పరవస్తు ద్వేషమును, దురాచారములను, అనాచారములను మాన్పించుము. ఉపయోగకరమైన వృత్తులను సాగనీయుము. నరులలో ఎవరును నరకములోనికి వెళ్ళకుండ రక్షంపబడగల గడువు వారికి దయచేయుము అని నీ దివ్య లక్షణములను బట్టి నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము ఆమేన్.
- (3) ప్రియులారా! ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని తలంపుకలిగి యుండండి అన్నిటిలో దేవుని స్తుతించండి అప్పుడే మీకు దేవుని దీవెనకలుగును. మీ కంటబడు క్రొత్తవారిని చూచి దేవా! వారిని అధికముగా దీవించుమని మీ మనస్సులో ప్రార్ధించండి. మీకు దేవునివలన బహుమానము కలుగును. అధికారులకు న్యాయము జరిగించు జ్ఞానోదయము అనుగ్రహించుము. కష్టస్థితిలో నున్నవారిని, అకాలమరణము గలవారి స్వకీయులను, ఆకస్మికమరణము గలవారి స్వకీయులను ఆదరించుము అని ప్రార్ధించుడి. చదువరులారా! వినువారలారా! మేలు చేయు దేవుడు మనకు కలడు గనుక దిగులుపడకండి. భయపడకండి, చింతించకండి. అపనమ్మిక కలిగి యుండకండి, కాని ఎల్లప్పుడు సంతోషించుచుండండి.
ఈ దిగువనున్న మతములలో క్రైస్తవ మతమునకే ఎక్కువ ఆటంకములు, విరోధములు, శ్రమలు ఎందుకనిన ఇది అదివరకున్న మతముల యొద్దకు వెళ్ళుచున్నది గనుక.
ప్రపంచములోని మతములు:
- (1) క్రైస్తవులు: ఎనుబదికోట్ల నలుబది మూడు లక్షల ఆరువేల ఎనిమిదివందలు.
- (2) రోమన్ కతోలిక్కులు: నలుబది ఏడు కోట్ల, ఎనిమిదిలక్షల, ఏబది రెండువేల తొమ్మిదివందల ముప్పది నాలుగు,
- (3) తూర్పు అర్ధడాక్సు: పన్నెండుకోట్ల ఎనబై ఎనిమిదిలక్షల ఎనుబది ఏడువేల తొమ్మిదివందల పదిహేడు,
- (4) ప్రొటెస్టాంటులు: ఇరువదికోట్ల నలుబది ఐదు లక్షల అరువది ఆరువేల తొమ్మిది.
- (5) యూదులు: ఒక కోటి పదునెనిమిది లక్షల అరువది ఆరువేల ఆరువందల ఇరువది.
- (6) ముస్లిములు: నలువది ఒకకోటి అరువది ఐదు లక్షల డెబ్బదివేల ఇరువది ఎనిమిది.
- (7) జోరాస్ట్రియన్లు: ఒకలక్ష నలువదివేలు,
- (8) షింటోలు: మూడుకోట్లు,
- (9) టోయిష్టులు: ఐదుకోట్ల ఏబది మూడువేల రెండువందలు,
- (10) కన్ఫూషియనులు: ముప్పదికోట్ల రెండులక్షల ఐదువందలు,
- (11) బౌద్ధులు: పదిహేనుకోట్ల మూడు లక్షల పదివేలు,
- (12) హిందువులు: ముప్పై ఒకకోటి ఏబది తొమ్మిది లక్షల తొంబది తొమ్మిదివేల నాలుగువందల ఐదు,
- (13) ఆదిమ నివాసులు: పన్నెండుకోట్ల పదకొండు లక్షల ఏభైవేలు,
- (14) ఇతరులు: ముప్పైకోట్ల అరువది రెండులక్షల నలభై ఏడువేల తొమ్మిదివందల ఇరువది ఏడు. మొత్తము: మూడువందల ముప్పది ఒకకోటి పదకొండు లక్షల ఏభై ఒక్కవేల మూడువందల నలుబది.
ఈ సంఖ్యలో క్రైస్తవుల సంఖ్యయే ఎక్కువగానున్నది. ఎందుకనిన క్రైస్తవబోధ అన్ని దేశములకు వినిపింపవలెనను ఒక ఏర్పాటు ఉన్నందున, క్రైస్తవులు కష్టపడి అన్నిదేశములకు వెళ్ళి మతమును ప్రకటించినారు. ఇప్పుడు (1960) క్రైస్తవులు ఎనుబది కోట్ల నలభై మూడులక్షల ఆరువేల ఎనిమిదివందలు. కాని గడిచిన పందొమ్మిదివందల ఏండ్లలోను ఎందరు క్రైస్తవులు అయినారో ఆ లెక్క చూచినయెడల ఈ లెక్కకంటె ఎన్నోరెట్లు ఎక్కువగానుండును.
క్రీస్తుమతము ప్రకటనమతము, సర్వజనోపకార మతము గనుక ప్రతిపర్యాయము జనసంఖ్య ఎక్కువకాకమానదు. క్రైస్తవమతము వృద్ధిపొందుచున్న మతము గనుక వృద్ధికోరువారందరు దీనిలోనికి రావలసినదని బైబిలునుబట్టి చెప్పుట న్యాయమే. క్రీస్తుప్రభువు జన్మించుటకై ఏర్పడిన జనాంగము యూదుల జనాంగము. ఈ యూదులకే ఇశ్రాయేలీయులు అను పేరుకూడగలదు. వీరు ఆదిలో పన్నెండు గోత్రములవారు. ఆ గోత్రములలోని యూదాగోత్రపు జనసంఖ్య తక్కిన గోత్రముల జనసంఖ్యకంటె ఎక్కువ. ఆ ఎక్కువలో యూదాగోత్రములో జన్మించిన క్రీస్తునుబట్టి స్థాపితమైన క్రైస్తవమత జనసంఖ్యకుకూడ వచ్చినది. ఇది ఆ శాఖలోనిదే గనుక దాని దీవెన దీనికిని కలిగినది. ఈ ప్రజలు లెక్కింపబడిన సం॥ము క్రీస్తునకు ముందు 1490 (సంఖ్యా. 2:9; 26:22).
దైవసంకల్పనచేత వేరొకమతములోనికి ఆకర్షించువరకు ప్రతివారును తమ మతములో నిలకడగానుండుట యుక్తమైయున్నది. వేరొక మతములోనికి దైవసంకల్పననుబట్టి వెళ్ళితినని బుజువుపరచుకొను వారిని మనము ఆపేక్షింపకూడదు. వేదాంత పండితులు, ఇతర శాస్త్రపండితులు, పరోపకార సాధనములు కల్పించుచున్న నేర్పరులుకూడ ఎక్కువే. బైబిలు ప్రచురమైన భాషలు, ప్రతులు, వ్యాఖ్యానములు, కరపత్రములు కూడ ఎక్కువే. అందరికొరకు జరుగు ప్రార్ధనలు ఎక్కువే, దేవాలయములు ఎక్కువే. ఈస్టరుపండుగ దీవెనలు మీకు కలుగునుగాక! ఆమేన్.