గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
12. సహింపు దానము
సిలువమీద యేసుప్రభువునకు శరీరమంతటను గొప్ప బాధ ఉన్నప్పటికిని మన నిమిత్తమై శ్రమపడుటకు వచ్చినందున సహించెను. బిడ్డల నిమిత్తమై కష్టములు వచ్చినప్పుడు తల్లిదండ్రులు సహింతురు. ప్రభువు సహించిన సహింపు ఒక ఇంటిలోని బిడ్డల నిమిత్తము మాత్రమే కాక సర్వలోకమందలి ప్రజలందరి నిమిత్తమై సహించెను. గనుక ఈ సహింపు గొప్ప అద్భుతకరమైన సహింపు.
- (1) రక్తబాధ కలిగినపుడు హింసకులను దూషింపలేదు, శపింపలేదు. “ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను.” (1పేతురు 2:22,23.) క్రీస్తు ప్రభువు సహింపునకు గొప్ప మాదిరి.
- (2) శత్రువులవలన బాధలు కలుగుచుండిన యొక విసుగుదల కలిగిన మనుష్యునితో నొకబోధకుడు ఇట్లనెను:- “నీ పగవారు బరువైన సిలువ నీ భుజముమీద ఎత్తలేదుగదా, నిన్ను ఊరివెంట తిప్పలేదుగదా, తత్పూర్వము నీ కాళ్ళలో మేకులు కొట్టలేదుగదా, నీ చేతులు కొయ్యకు అంటగొట్ట లేదుగదా, నీ తలమీద ఉన్న కిరీటము గుచ్చలేదుగదా, నీ ప్రక్కలో పొడవలేదుగదా, నీకెందుకింతకోపము, నీకెందుకింత విసుగుదల, సహింపునకు మాదిరియైన క్రీస్తుప్రభువు యొక్క సహింపును జ్ఞాపకము చేసికొని సహింపరాదా? అప్పుడు నీ మనస్సునకు శాంతి కలుగదా? (రోమా 12:19,20.)
- (3) దానము- అందరివలెకాక క్రీస్తుప్రభువు తన రక్తమునే, తన ప్రాణమునే మనకు దానముగానిచ్చెను. అందువలన విశ్వాసమునుబట్టి మనకు శుద్ధి, శక్తి, జీవము కలుగును. స్నేహితులు ఏదైన యీయగలరు. ప్రాణమును యీయగలరా? ఒకవేళ ఇస్తే లోకములోనున్న అందరికొరకు యీయగలరా? ఇవ్వలేరు, చాలదు. ప్రభువు ప్రాణ త్యాగముచేసిన వారిలో గొప్పవాడు. మీరు ఎందుకు క్రీస్తును మెచ్చుకొనుచున్నారు అని గాంధీగారిని అడిగినప్పుడు “ఈయనవలె త్యాగముచేసినవాడు మరియొకడులేడు” అని జవాబిచ్చెను. సహింపును, త్యాగమును కలిసియున్నవి. విడదీయ వీలులేదు. “తన ప్రాణమును నా నిమిత్తమై పోగొట్టుకొనువాడు దానిని సంపాదించు కొనుననియు తన నిమిత్తమై దానిని సంపాదించు కొనువాడు పోగొట్టుకొనుననియు” ప్రభువు చెప్పెనుగదా! (మత్తయి 16:25.)
ప్రతి కష్టస్థితిలోను, పాపశోధన స్థితిలోను, ప్రభుని పునరుత్ధానము తలంచుకొని పునరుత్థాన బలముపొంది లేవవలెను. నేను చనిపోయినను ప్రభువువలె లేచెదను అను నిరీక్షణతో బ్రతుకవలెను. సిలువ శ్రమ మరణము సమాధి ఉన్నప్పటికిని ప్రభువులేచి వచ్చెనుగదా!
అట్టి దీవెన ప్రభువునందు నిరీక్షణ గల వారందరికీ అనుగ్రహించును గాక! ఆమెన్.