గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

11. గొఱ్ఱెల కాపరి



ప్రభువైన యేసు చెప్పిన మాటలు:- (యోహాను 10:1-16) నేర్పరియైన గొల్లవాడు తన గొఱ్ఱెలను పచ్చికబైళ్ళుగల స్థలములలోనికి నడిపించును. అక్కడ గొఱ్ఱెలను తృప్తిగామేపి మరల తన స్వకీయమైన గొఱ్ఱెలన్నిటిని దొడ్డిలోనికి తీసికొని వెళ్ళునట్లుగా నేను మిమ్మును తీసికొని వెళ్ళుదును. ఏ గొఱ్ఱెకు ఏ పచ్చిక ఇష్టమో అది తెలిసికొని ఆ గొర్రెను ఆ పచ్చికగల స్థలములలోనికి నడిపించువాడను నేనే (యోహాను 10:7-8) ఒకవేళ ఏ గొఱ్ఱెయైన తన దారిని విడిచిన ఆ గొర్రెను పట్టుకొని వచ్చువరకు కాపరి నిద్రపోడు. ఆలాగే మీరు తప్పిపోయినప్పుడు మిమ్ములను శ్రద్ధతో వెదకువాడను నేనే. శ్రద్ధగా వెదకి పట్టుకొందును. నేను తప్పిపోయినవారిని వదలివేయను, పట్టుకొందును.


అందరును త్రోవతప్పినవారే (యెష 53:6). గనుక అందరిని వదలివేయుదునా? వదలను. గట్టిగా పట్టుకొని నా సన్నిధికి తెచ్చెదను. ఏకాంత సన్నిధికి ఎవరురారో ఎవరు సన్నిధిచేయరో వారికి మహిమ తగ్గును. నేను సన్నిధికూటములకు వెళ్ళి ప్రతివారియొక్క పేరులను హాజరుపట్టిలో ఉన్న సన్నిధికూటస్థుల పేరులను పిలిచెదను. అప్పుడు క్రమముగా సన్నిధికి వచ్చినవారికి మంచి బహుమానము పరలోకములో ఇచ్చెదను. నాయొద్దకు వచ్చి తప్పిపోయిన బహు మానములు ఉండదు. వారిని భయపెట్టియో లేక ఏదో ఒకరీతిగానో రప్పించి సన్నిధిలో నిలిపెదను. ఒక దినమున సన్నిధిమానివేసిన యెడల మహిమ తగ్గిపోవును. అందుచేత మహిమ తగ్గకుండ చూచుకొన వలెను. మనుష్యుని రక్షించుటకు రక్షకుడనైన నేను మనుష్యుని పోలికగాపుట్టి, దాసునిస్వరూపమును ధరించుకొంటిని, నా మొదటి రాకడకు కన్య మరియమ్మ బాగుగా సిద్ధపడినది. నా రాకకొరకు పరిశుద్ధ పరుపబడినది. గనుక ఆమెయొక్క గర్భమందు నేను జన్మించితిని. రాకడ తొందర అనగా ఏ విశ్వాసి రాకడకు సిద్ధపడునో ఆ విశ్వాసికి తప్ప మరెవ్వరికిని తొందర ఉండదు. ఏ విశ్వాసి యొద్దకైనను నేను వచ్చినప్పుడు పరలోకమందున్న బహుమానములలో ఒక బహుమానము తెచ్చి ఇచ్చెదను.


విశ్వాసులను రాకడ విశ్వాసులను నేను విడిచిపెట్టను. ఏదో ఒకవిధముగా సన్నిధికి రప్పించెదను. దూతలందరు పరలోకముయొక్క మహిమ చూచుచున్నారు. వారందరు ఇప్పుడే ఆ మహిమను చూచుచున్నారు. మీరైతే నా మహిమను పూర్తిగా చూచుటలేదు. గనుక క్రమముగా నా మహిమను మీకు కనపరచి మిమ్మును పై అంతస్థుకు తీసికొని వెళ్లుదును. మీ తల్లిదండ్రులు భోజనము వడ్దించుచు ఉన్నప్పుడు మీరు ఆకడవరి పంక్తిలో ఉన్నను చివర ఉన్నను మూలన ఉన్నను అక్కడవరకువచ్చి శ్రేష్టమైన పదార్ధములు వడ్డింపరా? ఆలాగే మీ తండ్రిగా బైలుపడిన నేను మీరు ఏమూలలో ఉన్నను అక్కడకు రాలేనా? వచ్చి మీకు కావలసిన వాటిని తృప్తిగా భుజించువరకు వడ్డించెదను. యీ సమయములో దేవదూతలు ఉన్నారు, ఇది ఎంతగొప్ప దైవసహాయము. దేవదూతలు మీపనికొరకు ప్రతినిమిషము కనిపెట్టుచుందురు. ఎందుకనిన మీరు దైవసన్నిధిచేయువారు గనుక మీయందరికొరకు వారు కావలిబంటుల వలె ఉందురు.


ప్రార్ధనపరులు అనగా నా నామమును ఎత్తి స్తుతించువారు నాకు ప్రార్ధన చేయకముందే విని వారికోర్కెలు తీర్చగల వాడను గనుక మీకెల్లప్పుడును సంతోషముగానుండును. మీ మహిమకు కారణము నేనే. గనుక మీకు సంతోషము. ప్రియబిడ్డలారా ఎప్పుడు నన్ను పిలచెదరో అప్పుడే మీమధ్యకు వచ్చి నిలిచియుందును. మీరు నన్ను పిలుచుటయే ఆలస్యము. ప్రతి శ్రమకును మీకు మహిమ రాకపోదు. ప్రతి విశ్వాసికిని తగిన శ్రమలు ఉండును.


శ్రమలులేని విశ్వాసులులేరు. ఆలాగే మహిమలేని విశ్వాసులునులేరు. గనుక శ్రమకుతగిన ప్రతిఫలము మహిమలై ఉండును. మీరు మహిమకొరకు ప్రయాసపడుచున్న యెడల మహిమ దానంతట అదే వచ్చును. నా ప్రియబిడ్డలను ప్రేమించుడి అదియును మహిమకు కారణమే. మీయొద్దకు ఎవరు వచ్చినను వారికి రాకడను గురించి బోధించండి, బోధ మీ పని.


భూకంపము రానైయున్నది. మీరు నా సన్నిధిలో దాగుకొనవలెనుగదా? కీర్తన 32:7. మీరు తండ్రిని కలిగియున్న బిడ్డలు. తండ్రిని హత్తుకొనిన కుమారులును కుమార్తెలునైయున్నారు. తండ్రిని విడిచి స్వేచ్చగా తిరిగిన వారికి శ్రమ గాని మీకేమియు ఉండదు. సుఖమే సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును.


త్రైక దేవుని దీవెనలు మీకు కలుగునుగాక! ఆమేన్.