గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

3. సిలువలు



సిలువ అనగా శ్రమ బాధ అవమానము. అన్నివిధములైన శ్రమలను సిలువలని చెప్పవచ్చునుగాని బైబిలులో దేవునిబట్టి వచ్చిన శ్రమలకు సిలువలు అను అంతరార్థము కలదు. క్రీస్తుప్రభువు కర్రసిలువ మోసెను. సిలువమీద ఆయన పడినబాధ మరియొక సిలువ.

  1. క్రీస్తుప్రభువు దేవుడైనను మననిమిత్తమై నరుడుగా జన్మించెను. ఆయనకు ఇదెంత నూన్యత! ఇది మొదటి సిలువ. ఫిలిప్పీ 2:6-7.

  2. కన్య మరియ సృజింపబడుటకు కారకుడైన యేసుప్రభువు ఆమెయందు జన్మించెను. ఆయనకు ఇదెంత బిడియముగా నుండవలసినస్థితి! ఇది రెండవ సిలువ. గలతీ. 4:5.

  3. యేసుప్రభువే తల్లిదండ్రులను పోషింపవలసిన దేవుడు, గాని వారే ఆయనను పోషించిరి. ఆయనకే వారు లోబడవలసినవారు గాని ఆయనేవారికి లోబడెను. ఆయనకు ఇదెంత బీదస్థితి! ఆయనకు ఇదెంత దీనస్థితి! ఇది మూడవ సిలువ. లూకా. 2:51.

  4. “లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లగా” ప్రభువు వచ్చినను “లోక మాయనను తెలిసికొనలేదు”. ఆయనకు ఇదెంత నిరాశకరమైన స్థితి! ఇది నాల్గవ సిలువ. యోహాను. 1:29; యోహాను. 1:10.

  5. ఏర్పాటు ప్రజలైన యూదులు ప్రభువునకు స్వకీయులు. వారైనను ఆయనను “అంగీకరింపలేదు” ఆయనకు ఇదెంత పరాభవము! ఇది అయిదవ సిలువ. యోహాను. 1:11.

  6. యూదులకొరకై మోషే వ్రాసిన ధర్మశాస్త్రమును యేసు ప్రభువు నూతనముగా బోధించుచు కృపాశాస్తమును ప్రవేశపెట్టినపుడు యూదులు నిరాకరించిరి. ఆయనకు ఇదెంత అవమానము! ఇది ఆరవసిలువ. యోహాను. 1:17.

  7. పాపములు క్షమించిన దేవప్రభువునుచూచి యూదులు ఇది దేవుడు చేయవలసినపనిగాని నరుడు చేయవలసిన పనిగాదు అని తలంచిరి. ఈయన నరుడనియే కాని దేవుడని వారు గుర్తించలేదు. ఆయనకు ఇదెంత చిన్నతనము! ఇది ఏడవ సిలువ.

  8. ప్రభువు రోగులను బాగుచేసినప్పుడు యూదులు సంతోషించుటకు బదులుగా సబ్బాతుదినమున చేసినాడని ఆక్షేపించిరి. ఆయనకు ఇదెంత నింద! ఇది ఎనిమిదవ సిలువ. లూకా. 13:14.

  9. ప్రభువు భూతపీడితులలోనున్న దయ్యములను వెళ్ళగొట్టినపుడు యూదులు పిశాచిశక్తివలన వెళ్ళగొట్టుచున్నాడని అపార్ధము చేసికొనిరి ఆయనకు ఇదెంత కోత! ఇది తొమ్మిదవ సిలువ. మత్తయి. 12:24.

  10. ప్రభువు అందరితోను కలిసిమెలసినవాడై పాపులతోను సుంకరులతోను భోజన పంక్తిని కూర్చున్నందులకు యూదులు ఆయనమీద నెపముమోపిరి. ఆయనకు ఇదెంతబాధ! ఇది పదియవ సిలువ. లూకా. 15:1.

  11. మృతినొందిన లాజరును ప్రభువు బ్రతికించినందులకు యూదులు లాజరును, ప్రభువును చంప యత్నించిరి. ఆయనకు ఇదెంత ఘోరమైన అవమానము! ఇది పదునొకండవ సిలువ. యోహాను. 11:53; 12:11.

  12. శిష్యులకు యేసుప్రభువు మూడేండ్లు బోధించినను వారిలో నొకడైన ఇస్కరియోతుయూదా ఉరిపెట్టుకొని చచ్చిపోయెను. ఆయనకు ఇదెంత మనో వేదన! ఇది పన్నెండవ సిలువ. మత్తయి. 27:5.

  13. ప్రభువును శత్రువులు పట్టుకొన్నప్పుడు శిష్యులు పారిపోయిరి. ఆయనకు ఇదెంత అపకీర్తి! ఇది పదమూడవ సిలువ. మత్తయి. 26:56.

  14. కఱ్ఱసిలువమీద ఆయనపడినబాధ గొప్పసిలువ. ఇది మనము గ్రహింపలేని బాధ. లోక పాపములను మోసికొన్న మోపు ఎంత బరువైయుండునో ఆలోచించండి. ఎంత బాధకలిగించినదై యుండునో యోచించండి. ఆయనకు ఇదెంత ఊపిరి ఆడదని ఆయాసము! “అక్రమకారులలో ఒకడుగా ఆయన ఎంచబడెను”. వీడు ఇతరులను రక్షించెను. వీడు దేవుడేర్పచుకొనిన క్రీస్తు అయినయెడల తన్నుతాను రక్షించుకొనునని అపహాసించిరి.” ఆయనకు ఇదెంత హేళనపదము! ఇది పదునాల్గవ సిలువ. లూకా. 22:37; 23:35.

  15. దేవుడు నరుడైనాడు. కాబట్టి ఆ నరశరీరమునకు సమాధి చేసిరి. ఇది ఆకాలపు భక్తులు ఎంతగా విలపించి నిరాశలోనికి దిగిపోవలసిన చరిత్రాంశము! ఆయన బ్రతికి రానియెడల లోకమును రక్షింపలేడు. నేను బ్రతికిరాగలనో రాలేనో అని ఆయన అనుకున్న యెడల అది ఎంత గొప్ప సిలువయై యుండును! ఆయన బ్రతికిరాడు అని అనుకొనుట మనుష్యస్వభావమునకు సరిపోవును. విశ్వాసికి సరిపోదు. విశ్వాసులట్లనుకొన్నారు. ఆయనకు ఇదెంత కష్టతరమైన సిలువ! ఇది పదునైదవ సిలువ.

షరా:- యేసుక్రీస్తు ప్రభువు శరీరధారియైయున్న దినములలో మహారోధనముతోను, కన్నీళ్ళతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను అని హెబ్రీ. 5:7లో వ్రాయబడియున్నది. ప్రభువు అనుభవించిన సిలువలు పదిహేనేకాదు. అనేకములు. ఆయన జీవిత కాలమంతయు దించివేయని ఒక గొప్ప సిలువయైయున్నది. యేసు ప్రభువు నిలువమీద ఉన్నప్పుడు ఎవరెవరిని తలంచుకొనెనో!


మన నిమిత్తమై శ్రమలపాలై తన ప్రేమను వెల్లడించిన ప్రభువునకు మనము సదా కృతజ్ఞతాస్తుతులు ఆచరించిన యెడల ఆయనకెంత సంతోషము!!!


ఇవి ధ్యానించువారికి ఇంకను అనేకమైన సిలువలు కనబడును.


ఆయన సిలువ మన శరీరాత్మలకు చలువ దయచేయును గాక! ఆమేన్.