గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
6. సువార్త ప్రచార ప్రార్ధన
- 1. ఓ దేవా! రక్షణ పొందినవారికి సువార్త పనిమీద గొప్ప ఆశకలిగించుము. బావిదగ్గరకు నీళ్ళకు వచ్చిన వనిత (యోహాను 4అధ్యా) రక్షకుని తెలిసికొన్న వెంటనే స్వజనులకు చెప్పవలెనను తలంపు తనంతట తనకే కలిగినది. అట్లే సువార్తికులకు ఒకరి ప్రేరేపణ అవసరము లేకుండానే ఆ తలంపు రక్షణస్థితివల్ల కలిగే నైజము అనుగ్రహించుము.
- 2. ఓ యేసుప్రభువా! సువార్త ప్రకటనపని నా జన్మహక్కు నా వారసత్వము. ఎవరు చేసినను చేయకపోయినను నాకక్కరలేదు. నేను తప్పకుండ చేసితీరవలెను అని రక్షితులు అనుకొందురు. ఓ తండ్రీ ఇట్లు అనుకొనుట నాకు దయచేయుము.
- 3. కుమారుడవైన ఓ తండ్రీ! ఇది నా తండ్రిపని, నేనాయన బిడ్డను, నా తండ్రిపని నేను చేయుట నా విధి. ఇది నా స్వంతపని. కూలీలు కూలికి చేయుదురు. కుమారులు, కుమారులు గనుక చేయుదురు. కుమారులకు బాద్యత ఉండును. ఇట్టి స్వభావము సువార్తికుడనైన నాకు అనుగ్రహించుము.
- 4. ఓ రక్షణకర్తా! రక్షింపబడినవారు కృతజ్ఞత గలవారై యుందురు. అట్టి కృతజ్ఞత చూపించుటకు మరియొకరిని రక్షణ మార్గమునకు త్రిప్పవలెనని ప్రయత్నము చేయుదురు. ఊరుకొని ఉండలేరు. తమకు కలిగిన రక్షణానందమునుబట్టి ఆ పని ఆనందముతో చేయుదురు. అట్టి హృదయ స్థితి నాకు దయచేయుము.
- 5. ఓ తండ్రీ! నీలోనికి వచ్చినవారు తాము రక్షింపబడినవారు కాబట్టి ఎన్ని కష్టములు వచ్చిన లెక్కలేదు. వారు ఇహలోక అంతరంగ బహిరంగ కష్టములను చూచి ఆగరు. తమలోని రక్షణనుచూచి పాపాత్ములయొద్దకు సాగివెళ్ళి సంభాషింతురు. వారిలోని రక్షణస్థితి శ్రమలస్ధితిని అణగద్రొక్కునదైయుండునుగాని, శ్రమలస్థితి రక్షణస్థితిని అణగద్రొక్కునదై యుండదు. ఇట్టి విషయము తెలిసిన సువార్తికుడనైన నేను ఎన్ని శ్రమలున్నా ఎదురు వెళ్ళి ప్రకటించు ధైర్యము దయచేయుము.
- 6. ఓ నిరీక్షణకర్తా! రైతు పంటకొరకు నిరీక్షించకుండ పొలములో కష్టపడి పనిచేయడు. ముండ్లు, రాళ్లు చేతిలో గ్రుచ్చుకొన్నపుడు విసుగుకొనడు. అతనికి గాదెలో పోసికొనబోవు ధాన్యమే జ్ఞాపకమునకువచ్చి అంతరంగములో ఆనందించుచుండును. నిజమైన సువార్తికులు వారి కష్ట సమయములందు తమబోధవల్ల కొందరి ఆత్మలు రక్షణలోనికి వచ్చును అను సంతోషముతో కష్టములు అనుభవించుదురు. ఓ ప్రభువా! అట్టి నిరీక్షణ మాకును దయచేయుము.
- 7. ఓ దేవా! సువార్త ప్రకటించుట మా పని. ఆత్మలను రక్షించుట నీ పని. ఎన్ని ఏండ్లు ప్రకటించిన ఒక్క మనిషియైన బాప్తిస్మము పొందలేదు, అని విచారించుట మా పనికాదు. మొక్కనాటు వానిలోనైనను, నీరుపోయువానిలోనైనను ఏమియు లేదు. అంకురింపజేసే దేవునియందే సమస్తమును కలదు అనే నమ్మిక మేము కలిగియుండవలెను. ఓ ప్రభువా! ఫలితము కనబడకపోయినను నిరాశపడక మా ఉద్యోగధర్మము సాగించుకొనే చురుకుదనము అనుగ్రహించుము.
-
8. ఓ యేసుప్రభువా! భూదిగంతములవరకు వెళ్ళి మీరు నాకు సాక్షులై ఉండండి అని మాకు సెలవిచ్చినావు కదా! (కార్య 1:8) నీవు
ఎటువంటివాడవో, నీ పని ఎటువంటిదో, నీ పని ఫలితము ఎటువంటిదో ఇతరులకు మేము చెప్పునప్పుడు నేర్చుకొన్న మాటలుకాక
అనుభవించినవి
చెప్పుటవల్ల మేము సాక్షులమై యుండగలము. అట్టి సాక్షులమైయుండుటకు, అనుభవసాక్షులనుగా మమ్మును సిద్ధపరచుము.
షరా: యేసుప్రభువు పాపులను క్షమించినాడు, రోగులను బాగుచేసినాడు మంచిబోధ చేసి మనుష్యులను మార్చినాడు అని చెప్పుట సువార్త ప్రకటనయైయున్నది. ప్రభువు నన్ను క్షమించినాడు నన్ను బాగుచేసినాడు, నాకు వాక్యము చెప్పుచున్నాడు అని చెప్పుట స్వంత సాక్ష్యమైయున్నది. ఓ ప్రభువా! మేము సువార్త ప్రకటించువారమైయుండుట మాత్రమేగాక, సాక్షులముగాకూడ ఉండే కృప దయచేయుము. -
9. ఓ తండ్రీ! నీవాక్య వేదాంతమునకు అంతములేదు. మరి ఎంతతరచిన తరగదు. నాకు పూర్తిగా తెలియదుగాని, తెలిసినంతమట్టుకు
చెప్పుదును.
ఎవరికిని పూర్తిగా తెలియదు. పరలోకములో పూర్తిగా తెలున్తుంది. అంతయు ముందే తెలిసికొనవలెననునది నేను విడిచిపెట్టవలెను.
సువార్త
పని అనునది ప్రకటించుట, సాక్షమిచ్చుటయైయున్నది. ఈ రెండు ఉద్యోగములు మనము చేయవలసిన ఉద్యోగములు.
షరా: నేను నా ఇంటిలోనే ఉండి సువార్త పనికి వెళ్ళకుండా భక్తిగానున్న చాలదా? అని కొంతమంది క్రైస్తవులు అనుచున్నారు. ఓ తండ్రీ! ఇట్టి అభిప్రాయము నాలోనికి చేరనీయకుము. ఇంటిలో భక్తిగా నుండవలెను (మత్త. 5:16) సువార్తకూడ చేయవలెను. రెండు ఉండవలెను. బోధకుడవుగా నుండకపోయినయెడల “మీరు వెళ్ళి సమస్త రాష్ట్రములకు బోధించండి” అని ప్రభువు చెప్పినమాట ఎట్లు నెరవేరును మార్కు 16:15. గనుక ఓ ప్రభువా! ఈ రెండు స్వభావములు నాకు దయచేయుము. నేను బైబిలంతా బాగానేర్చుకొని ఆ తరువాత బోధకు బైలుదేరుదును అని కొందరు క్రైస్తవులు అనుచున్నారు. బాగుగా నేర్చుకొనుటమంచిపనే గాని, నేర్చుకొన్నంతమట్టుకు ఇతరులకు చెప్పవలెను. నేర్చుకొనుటకు అంతములేదు. అప్పటివరకు వెళ్ళను అనుట సువార్త పని ఎగురగొట్టుటయైయున్నది. ఒక దరినుండి నేర్చుకొంటూ మరియొక దరినుండి బోధిన్తూయుండుట సాధ్యమే. ప్రభువుయొక్క శిష్యులు నేర్పు పూర్తికాకముందుకూడ సువార్తకు వెళ్ళినారు. డెబ్బదిమంది చరిత్రచూడండి. (లూకా 10:1-12) ఓ ప్రభువా! పూర్తిగా అభ్యాసము కాకముందును నీ శిష్యులకు సువార్త పనిమీద పంపినట్లు మమ్మునుకూడ పంపుము. నీకు స్తోత్రము. - 10. ఓ ప్రభువా! ఒకదరికి బోధించునపుడు మనస్సులో మాకు మేము బోధించుకొనే బుద్ధి అనుగ్రహించుము. వారికిచ్చే వర్తమానము మాకును అన్వయించుకొనుశక్తి దయచేయుము.
- 11. ఓ దేవా! మా ప్రార్ధనవల్లను, మా బోధవల్లను, మా ప్రవర్తన వల్లను సువార్త ప్రకటించు సామర్ధ్యము కలుగజేయుము. నీకు స్తోత్రములు. (1కొరింథి 9:16,17,18; రోమా 1:15,16) అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఓ ప్రభువా! నీ సువార్త ప్రకటింపని నాకు మనస్సులో శ్రమగా తలంచుకొనే పౌలు తలంపు నాకుకూడ కలిగించుము.
- 12. ఓ క్రీస్తుప్రభువా! సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకున్న జీతము. (రోమా 9:18) ప్రభువా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతమని పౌలు సంతోషించునట్లు నేనుకూడా సంతోషించగల ఆత్మను దయచేయుము.
-
13. ప్రభువా! జీతమునకుగాని, ఇతరులు ఇచ్చే సహాయమునకుగాని ఆశించి సువార్తపనికి వెళ్ళక నీవే నా పోషకుడవు అనే తలంపుతో
సువార్త
ప్రకటించుటకు వెళ్లే మనస్సు దయచేయుము. (మత్త. 10:19,20) సభలోనికి పిలిచినప్పుఢు నామకార్థముగాగాని, వేషధారణగాగాని
నిరీక్షణలేకుండగాని, శ్రద్ధ లేకుండగాని ప్రార్ధన మొదలగు పనులు చేయకూడదు. సువార్త ప్రకటించువారికి ప్రకటించే అధికార
పత్రముగలదా! ఆ పత్రములోనున్న సరిహద్దులు ఏవనగా భూదిగంతముల వరకు వెళ్ళండి. సర్వరాష్ట్రములకు చెప్పండి.
సర్వప్రదేశములలో చెప్పండి (మత్త. 28:19). జనములందరికిని చెప్పండి. సమయమందును, అసమయమందును చెప్పండి. 2తిమోతి 4:2.
సువార్త
ప్రకటనకుగల మూడు అధికారములు ఏవనగా
- (1) వినయాధికారము - అనగా వినయముతో ప్రకటించుట.
- (2) స్వతంత్రాధికారము - అనగా ప్రకటించుటకు నాకు హక్కు ఉన్నదనియు, సువార్త నాకు అప్పగింపబడిన సందేశమనియు తలంచుకొని ప్రకటించుట.
- (3) జ్ఞానాధికారము - అనగా ఏమి చెప్పవలయునో నాకు తెలుసును అని నిశ్చయత కలిగి బోధించుట.
- 14. ఓ ప్రభువా! నీవు పరలోకమునకు వెళ్ళిన తర్వాతకూడ భూమిమీద సువార్త ప్రచారము చేస్తున్న శిష్యులకు జతగా నున్నావని వ్రాయబడియున్నది మార్కు 16:20. నీకు స్తోత్రములు. “ప్రభువు వారికి సహకారుడైయుండి, జరుగుచువచ్చిన సూచకక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను.” ఆ రీతిగానే నీవు మాకుకూడ సహకారివిగా నుండుమని వేడుకొనుచున్నాము. మరియు ఓ ప్రభువా! వారు బోధించుచున్న బోధను అద్భుతములవలన స్థిరపరచినావని వ్రాయించినావు స్తోత్రములు. మా బోధనుకూడ స్థిరపర్చుమని వేడుకొనుచున్నాము.
- 15. ఓ ప్రభువా! బోధించునప్పుడు ఏమి చెప్పవలెనో చింతింపవద్దనియు, సమయానుకూలముగా ఉపదేశము ఆత్మ అందించుననియు సెలవిచ్చినావు. కాబట్టి ఈ మాట జ్ఞాపకముంచుకొని నిర్భయముగ సువార్తపని ఆరంభించే కృప దయచేయుము. మరియు వాక్ ధోరణికూడ అనుగ్రహించుము. నీకు స్తోత్రములు.
- 16. ప్రభువా! నీయాత్మతో నువార్తికులను నింపి పనిజరిగించుము. మాకు తెలియదనియు, మేము చెప్పలేమనియు తలంచక మా ప్రభువునకు అన్నియు తెలియును. ఆయనే అందించును అని అనుకొని సువార్త ప్రకటించునట్లు కృపదయచేయుము. వందనములు.
- 17. “సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడనుకాను” (రోమా 1:16, 2తిమో. 2:15) అని వ్రాయబడియున్న ప్రకారము ఓ ప్రభువా! స్వజనులయొద్ద గాని మేమెరిగినవారి యొద్దగాని, స్నేహితుల యొద్దగాని, మాస్వకీయ చరిత్ర తెలిసినవారియొద్దగాని, సువార్త చెప్పుటకు సిగ్గుపడుట సహజమై యున్నది. ఇట్టి బలహీనత మాకు లేకుండచేయుము.
- 18. ఓ ప్రభువా! అన్ని సమయములలో సువార్త చెప్పే ఇష్టము, వాక్కు వీలు, జయము అనుగ్రహించుము. ఎందుకనగా సమయమందును అసమయమందును సువార్త ప్రకటింపుము (2తిమో. 4:2) అని వ్రాయబడియున్నది. అసమయమందును అనగా వీలులేనప్పుడును అని సువార్త ప్రకటననుగూర్చి పౌలు వ్రాయుచున్నాడు. మనము మిక్కిలి అవసరమైన పనిమీద ఉన్నప్పుడు సహితము బిక్షకులువచ్చి గోజులాడుదురు. మన సమయము, మన వీలు, మన ఇబ్బంది వారెరుగరు. వారు గమనించరు. లెక్కచేయరు. సువార్తికులయితే వారేదో మాట్లాడుకొనుచున్నారు. తర్వాత సువార్త చెప్పవచ్చునని ఆ సమయమును దాటబెట్టుదురు. పౌలు అన్ని అవసరములకంటె సువార్తయే మిక్కిలి గొప్పఅవసరమని చెప్పెను. ఆ తరువాత ఆ మనిషి దొరకకపోవచ్చును. సువార్తపని నాకిష్టము లేకపోయినను, పాలు వ్రాసినదే మాకందరకు సంబంధించినదని గ్రహించి లోబడగల కృప దయచేయుము. ఓ దేవా! సువార్తపని అనునది ఎదుట ఉన్న మనుష్యుని రక్షింపవలసిన పని గనుక. నాకు రక్షణ అందుట అవసరమని తోచిన ప్రకారముగా ఇతరులకుకూడా రక్షణ అందించుట అంతే అవసరమని నాకు కనపర్చుము. నీకు స్తోత్రములు.
- 19. ఓ ప్రభువా! సువార్తపని రక్షితునియొక్క జన్మవృత్తి లోకములోని అన్ని వృత్తులకంటెను, ఉద్యోగములకంటెను, పనిపాటులకంటెను గొప్పదై యున్నది. దేవా, ఇంతగొప్ప ఉద్యోగముచేయుట నేనెట్లు మానగలను అను తలంపు నాకు సువార్త ఉద్యోగ విషయములో కలిగించుము స్తోత్రములు.
- 20. ఓ ప్రభువా! గడచిన సంఘ శతాబ్దములలో సువార్తికులు పట్టణములలో, పల్లెలలో, అరణ్యములలో, నీటిమీద, కొండలమీద, కందకములలో, సొరంగములలో సువార్త ప్రకటించిరి. విద్వాంసులకు, పామరులకు, అధికారులకు, రాజులకు, అరణ్యవాసులకు, నరమాంస భక్షకులకు సువార్త ప్రకటించెను. అవమానములకుగాని, ఇబ్బందులకుగాని, మరణమునకుగాని భయపడకుండ సువార్త ప్రకటించిరి (హెబ్రీ. 11:33-40). అలాగే నేటికాల సువార్తికులు ప్రచారముమీద వెళ్ళుచున్నారు. వారు సువార్త ప్రకటించుటలో ఏ మాత్రమును సందేహింపక సంతోషముతో ప్రకటించు కృప దయచేయుము. అన్న వస్త్రాదులకుగాని, బసకుగాని, సువార్తపనికిగాని, ఎట్టి చిక్కులు రానీయకుము. ఒకవేళ వచ్చినయెడల సంతోషమువల్ల జయించు కృప అనుగ్రహించుము. స్తోత్రములు.
- 21. ఓ దేవా! కఠిన హృదయులకు, మాట చొరబడనియ్యని వారికి, అక్కరలేదనువారికి, విని తప్పులు పట్టువారికి, తప్పు అర్ధము చేయువారికి, నాకు తెలుసును అనువారికి, సమయములేదని చెప్పువారికి వాక్యము బోధించే ఉపాయము అనుగ్రహించుము. స్తోత్రములు.
- 22. ఓ దేవా! నీకృపవలన ప్రతి శతాబ్దములో నీవిశ్వాసులకు నూతన విషయములు బయలుపరచుచున్నందులకు నీకనేక స్తోత్రములు. మాకుకూడ కొన్ని క్రొత్త విషయములు బయలుపరచినావు గనుక స్తోత్రములు. మాకు బయలుపడిన విషయములు నీవాక్యము చదువువారే అంగీకరింపరని మాకు తెలిసినప్పటికిని వారికి అన్ని వివరముగా బోధించు శాంతగుణము, జ్ఞానము అనుగ్రహించుము.
-
23. ప్రభువా! ఇతరులు ఎదిరింపనివాక్కును జ్ఞానమును దయచేయుము (కార్య 6:10; లూకా 21:15)
- 1. బోధ
- 2. అనుభవము .
- 3. సిద్దాంతము
- 4. దర్శనము - ప్రభువు ఏమిచెప్పునో అదిచేయుట.
- 1. ప్రభువునకు మన స్వంత విషయములు రిపోర్టు చేయవలెను.
- 2. ఇతరులను గూర్చి చేయవలెను.
- 3. కావలసినవి అడుగవలెను.
- 4 ఇతరులనుగూర్చి విజ్ఞాపన చేయవలెను.
- 5. ప్రశ్నలు వేయవలెను.
- 24. ఓ దేవా! “అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి” (కీర్తన 96:2; 1దిన. 16:23) అని వ్రాయబడియున్నది. సువార్త అనునది అనుదినము ప్రకటింపవలసినది అని ఈ రెండు వాక్యములలోను కనబడుచున్నది. అనుదినము అనుమాట ముఖ్యమైనమాట. ఓ ప్రభువా, సువార్తను అనుదినము ప్రకటింపగల కోరిక నాలో పుట్టించి, అందుకు అనుకూలమైన సమయమును అనుగ్రహింపుము. స్తోత్రములు.
- 25. మధుర జిల్లాలోని రామనాడు అను గ్రామ సంఘములో 12మంది క్రైస్తవులు ఇట్లు మాట్లాడుకొనిరి (లూకా 10:4-12) మీరు సంచినైనను, జాలెనైనను, చెప్పులనైనను తీసికొని పోవద్దు అని ప్రభువు తన శిష్యులతో చెప్పినారుగదా. అది మనకాలములో నెరవేరునో, నెరవేరదో పరీక్షించుటకు మనమేదియు తీసికొని వెళ్ళకుండ సువార్త ప్రకటించుదము అని అనుకొనిరి - ఓ ప్రభువా! నీవు బీదవాడవా! గిల్లిపుచ్చుకొని ఇస్తావా? లక్షలు ఇస్తున్నావు. ఇంకను ఇమ్ము! చనువునుబట్టి అడుగుచున్నాము. ఆమేన్. అని ప్రార్ధించుకొని ఈ ప్రకారముగా వారు మాట్లాడుకొని ఒక నెల దినములు సువార్తచేసి తిరిగివచ్చిరి. వారు తమ సంఘమునకు రిపోర్టు చేసిరి. మాకు భోజనమునకు లోటులేదు, పడిశమైననుపట్టలేదు, ఎట్టి ఇబ్బందియైనను కలుగలేదు. తిండినిగూర్చి గాని, బసనుగూర్చిగాని ఆలోచింపక తిన్నగా వీధులలోనికివెళ్ళి ప్రసంగించినాము. వారు మాలో ప్రతివారిని తమ ఇండ్లకు తీసికొని వెళ్ళి సమస్త సదుపాయములు చేసిరి. ప్రభువు వాక్యము నెరవేరెను అని చెప్పెను. స్తోత్రములు.
ఓ ప్రభువా! నీ సువార్త పనిమీద వెళ్ళునప్పుడు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో, ఎక్కడ బసచేయుదుమో అని చింతింపక అన్నియు నీవే చూచుకొందువను సంతోషముతో వెళ్ళు విశ్వాసము దయచేయుము. మరియు వ్యాధులు, శత్రుబాధలు, ఆటంకములు, వినకపోవుటలు కలుగునేమో అని భయపడక నీవే మా సహాయకారివి అనిచెప్పి ధైర్యముతో ప్రయాణము సాగించు కృపను దయచేయుము స్తోత్రములు. ఈ మా ప్రార్ధన మనవులన్నిటినీ నీ కుమారుని పరిముఖముచూచి ఆలకించుము ఆమేన్.