గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
7. యెరికో నీరు బాగుపడుట
వాక్యము: 2రాజులు 2:19-22.
దైవజనుడైన ఎలీషా రెండంతల ఆత్మనుపొంది ఏలీయాకన్న ఎక్కువ అద్భుతములు చేసెను. యెరికో శపించబడినది, అక్కడి ప్రజలు అవిధేయులు, అందువలన భూమి శాపముపొందెను. గనుక ఆ నీరు మంచిదికాదు, భూమిసారము మంచిదికాదు. గనుక పంటలు సరిగా పండవు. ఇవి అవిధేయులైనవారు అనుభవింపవలసిన శిక్షలు. ఇవి దుష్టఫలితము. అట్టి ప్రజలకుకూడ దేవుడు కృపను చూపించెను. ప్రవక్తల పాఠశాలలు అక్కడగలవు. అందు యౌవనస్తులకు తర్ఫీదు నిచ్చిరి. వారే తరువాత ప్రవక్తలుగా తయారైరి. ఈ పట్టణమునందలి అవిధేయులకు కూడ దేవుని వాక్యము విను కృపాసమయమును దేవుడనుగ్రహించెను. దేవుని వాక్యము వినువారిని ప్రోగుచేసి వారికి వాక్యముచెప్పి ప్రవక్తలుగా సిద్ధపరచి అట్టి శిష్యులలో కొందరువచ్చి ఎలీషాతో ఈ పట్టణములో నీరు మంచిదికాదు, భూమిసారము మంచిదికాదు అని చెప్పిరి. వీరికి ప్రవక్తయెడల గౌరవము కలదుగాని మిగతావారికిలేదు. అట్టి అవిధేయులకు ఇంకా కృపను చూపించుచుండెను. ఆ స్థలము రమ్యమైన స్థలము, ఎక్కడ భూసారము లేదో, మంచినీరుకాదో అది రమ్యమైన స్థలము. అనగా ఆ స్థలముపైకి రమ్యమైనది. ఆ రీతిగానే మానవుల చరిత్ర చూచిన విద్య, ఉద్యోగము, ధనము, సౌఖ్యము అంతయు పైకి రమ్యముగానేయుండును. గాని వారి ఆత్మీయ జీవనము చూచిన ఏమియు బాగుగా నుండదు. యెరికో పట్టణమునందు భూమి పైకి రమ్యముగా నున్నదిగాని నీరు మంచిదికాదు, సారములేదు గనుక అన్నపానములు, ఆహారము లేదు. క్రైస్తవులుకూడ అట్లేయున్నారు. పైకి బాగున్నారుగాని వారి అంతరంగమున మంచిలేదు, సారములేదు గనుక అన్నపానములు, ఆహారములేదు. క్రైస్తవులుకూడ అట్లేయున్నారు. పైకి బాగున్నాగాని వారి అంతరంగమున మంచిలేదు, సారములేదు, ఫలితముకూడా లేదు. మన జీవితము సరిచేసికొనుటకు ఇది అద్దమువలె నున్నది. మంచివారమైనను చెడ్డవారమైనను దేవుడు తన మంచితనమునుబట్టి సమస్తమును అనుగ్రహించును. పైకి కనబడు వేషధారణ ఉన్నను దేవుడు కృప చూపించక మానడు. మనలను మంచివారిని చేయుటకు దేవుడు అట్టి కృపను చూపించును.
ఎలీషా వారితో
- (1) క్రొత్త పాత్రకావలెను.
- (2) ఉప్పు కావలెను.
ఉప్పుపాత్రలోవేసి తీసికొనిరమ్మని చెప్పెను. శిష్యులు ప్రవక్త ఏమి చెప్పిన అది చేయవలెనని నేర్చుకొనిరి. ఎందుకు ఉప్పు? ఎందుకు పాత్ర? అని ప్రశ్నించలేదు. వారు ప్రవక్త చెప్పినట్లు చేసిరి గనుక వారుకూడ గొప్ప ప్రవక్తలైరి. క్రొత్తనిబంధనలో కానా వివాహములోకూడ నీరు మోయువారు ప్రభువు చెప్పినట్లు చేసిరిగాని నీరు ఎందుకు అని అడుగలేదు. ఆలాగే విశ్వాసి ప్రభువు చెప్పినది చేయుట నేర్చుకొనవలెను. ఆ పట్టణములోనివారు అవిధేయులుగాని ఈ పాఠశాలలోని బాలురు విధేయులుగా నుండిరి. మనమును విధేయులము కావలెనని తండ్రి కోరుచున్నాడు. అప్పుడు ప్రవక్త ఆ నీరు బాగుచేయుటకు పాత్రలోని ఉప్పును నీటిఊటలో వేయుమని చెప్పెను. నీరు ప్రవహించు ప్రవాహములో వేయలేదు. నీరు ఎచ్చటినుండి వచ్చుచున్నాదో ఆ ఊటయొద్ద వేసెను. ఎందుకు నీటి ఊటలోవేసెను. పైపైన దేవుడు మనలను బాగుచేసిన ఏమిలాభము. అంతరంగము బాగుచేయవలెను. పాపము ఎక్కడ పుట్టుచున్నదో అదే ప్రభువు ముట్టి బాగుచేయవలెను. ఊటలో ఉప్పువేసిన అక్కడినుండి వచ్చు నీరు శుభ్రమగును. ఆలాగే అంతరంగము శుద్ధి అయినయెడల బహిరంగము బాగుగానుండును. బహిరంగముగా చేయు చెడ్డపనులు మానిన మంచిదేగాని అంతరంగము శుద్ధి అయిన పైన క్రియలు బాగుపడును. భూమిలో ఫలసారము బాగున్నయెడల పైపంట బాగుపడును గనుక మనము వాక్యమునకు లోబడి అంతరంగమును శుద్ధిచేసికొనవలెను. ఉప్పు దేనికి సూచన? ఉప్పు సారము గలిగినది, మరియు రుచిని కలిగించునది. కొంచెము ఉప్పువేసిన అంతకాలమునుండి వచ్చు నీరు బాగుపడునా? దేవుడు ఆ నీటిని బాగుచేసినాడని గ్రహించుటకు ఉప్పు గురుతుగా నున్నది.
దేవుడు మానవులను దేనివలన బాగుచేయును? ఆయన ఉచితమైన కృపవలన గనుక ఉప్పు దేవుని ఉచితమైన కృపకు గుర్తుగా వాడబడెను. శిష్యులకు విధేయత, విశ్వాసము ఉన్నది గనుక వీటిని బలపరచుటకు సూచన పెట్టెను. బహిరంగ గురుతులనుబట్టి వారు గ్రహించుకొందురు. దేవునికృప పాపిలో ప్రవేశించిన మనిషిమారును. దేవుని కృపను ఎవరు అంగీకరించగలరు? పాపులు, పాపమును ప్రేమించువారు మాత్రము అంగీకరింపలేరు. పాపమును వినర్జించువారు ప్రభువునొద్దకు రాగలరు, వచ్చి కృపను అంగీకరింపగలరు. అంతేగాక వారి హృదయమును నూతనముగాచేసికొని దేవునియొద్దకు రాగలరు, క్రొత్త పాత్రవలెనున్న క్రొత్తహృదయములో దేవునికృప ప్రవేసించును. పాత్ర క్రొత్తదై యుండవలెను.
మనము మంటి పాత్రులమైయున్నాము. గాని ఇట్టి మనలోనే దైవమహిమ బయలుపర్చబడినది. దేవుని మహిమ, పాత్రలో ఉప్పువేయుటద్వారా బయలుపడినది. మనమును వాక్యమువిని దేవునికృప పొందినయెడల నిజముగా దేవుని మహిమపరుపగలము. ప్రవక్తచెప్పిన మాటలేవనగా “యెహోవా సెలవిచ్చునదేమనగా” అని పలికెను. దేవుడు సెలవిచ్చినాడు గనుక నెరవేరును. శిష్యులు చెప్పినట్లు చేసినారు, దేవుడు అద్భుత కార్యములు జరిగించెను. మనిషి చేయవలసినవని మనిషిచేసిన దేవుడు చేయవలసినవని ఆయనచేయును. శిష్యులు మరియు గురువు చేసినవని సుళువైనపనిగాని దేవుడు గొప్పపని చేసెను.
వాక్యములో చెప్పబడినట్లు చేసిన గొప్పకార్యము దేవుడు చేయును. మన ఆత్మీయ జీవనమునకు కావలసిన అవసరములు రెండు, అవి జీవనాధారములు. ఆహారము, జీవజలము. మనకు వాక్యాహారము గలదు. దేవుని వాక్యము మనభాషలోనికి అందించినాడు, అది చదివి, అర్ధము చేసికొని అనుభవించుచున్నాము. దేవుడు మనజ్ఞానమును వెలిగించిన యెడల చదివినది అర్ధమగును. అప్పుడు అనుభవము కలుగును. అనేకులు అట్టివాక్యము చదువరు గనుక నీరసముగా నుందురు. శిష్యులు వారికి తెలిసినా తెలియకపోయిన చెప్పినట్లు చేసిరి గనుక మహోపకారము చూచియున్నారు. ఆ పట్టణములోని నీటివలన “మరణము, నిస్సారము” వచ్చినదని గలదు. అట్టి స్థితిని బాగుచేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని దృష్టిలో బాగైనది. దేవుని దృష్టిలోనున్నది ప్రవక్తచెప్పెను. అదివారు నమ్మినారు గనుక ఉపకారము పొందిరి. దేవునివాక్యము నమ్మవలెను, అప్పుడు నెరవేరును. దేవుడు బాగుచేసిన యెడల అది శాశ్వతముగా నుండును. దేవునివాక్యము శాశ్వతము. (ప్రసంగి 3:14) దేవుని ఉపయోగము శాశ్వతము దేవుడు చేయు పనులన్నియు శాశ్వతములు. వారు దేవునికి విధేయులైనప్పుడు అన్ని ఉపకారములు పొందిరి. వారి విశ్వాసము విధేయతనుబట్టి నీరు మంచిదైనది, భూమి సారవంతమైనదైనది. మనమును అట్టి విశ్వాస సంబంధమైన నీరు త్రాగి సంతుష్టి పొందుదుము. ఆహారము తిని బలపడుదుము. ఆత్మీయబలము, సంతుష్టి పొందుదుముగాక! ఆమేన్