గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
9. దేవుని ప్రార్ధించుడి
దేశీయులారా! అపాయము వచ్చినప్పుడు తప్పించుకొనుటకు మీరెన్నో ప్రయత్నములు చేయుదురు. అవన్నియు నెరవేరుటకును, నూతన సాధనములు కల్పించుటకును, దైవప్రార్ధన ప్రయత్నము చేయగలరా? ఇది అన్ని యత్నములకంటె మొదటిది; ముఖ్యమైనదియునై యున్నది. గాలి, వానలు, వరదలు, ఆకలి, భేదములు, చలి, వేడి, సముద్ర ప్రయాణములు, బండ్ల ప్రయాణములు, జంతువులు, పురుగులు, పిడుగు, భూకంపము, వ్యాధులు, ఇబ్బందులు, కరవులు ఈ మొదలగు వానివలన హాని కలుగుచున్నది. ఇవి దేవుడు గాక మరియెవరు తప్పింపగలరు? గనుక భూమ్యాకాశములను, సమస్తమును కలుగజేసిన ఆయననే ప్రార్ధించుడి. ఆయన కలుగజేసిన సృష్టిలోని దేనిని ప్రార్ధించినను ప్రయోజనములేదు. ఏది మిగుల అపాయకరమైన కాలము?
పైన ఉదహరించినట్లుగా పాపశాపమువలన భూమిపై మానవునికి సృష్టివలన అనుకోకుండా సంభవించిన కష్టకాలమా! లేక ప్రతి మానవుని స్వంత పాపకార్యములవలన సంభవించే అపాయకరమైన కాలమా? అనగా జన్మతః ఈ శాపలోకములోనికి ప్రవేశించిన ప్రతి మానవునికి ఉన్న కష్టకాలమా! స్వకీయ దురాశల వలన చేసిన పాపమునుబట్టి కష్టకాలమా! ఏది ఎక్కువ అపాయకరమైననూ మనము పట్టుదలతో ప్రార్థించిన యెడల ఈ రెండు విధములైన అపాయములు తొలగును.
కష్టకాలమునకు కారణమైన పాపము ముందుగా పరిహారము కావలెను. పాపము మనలను దేవునికిని, మోక్షమునకును దూరస్థులనుగా చేయును. ఈ దుస్థితి ప్రార్ధన వలననే అంతరించును గనుక దేవుని ప్రార్ధించుడి. ప్రతి యింటిలోని వారందరు ప్రతి దినము దేవుని యెదుట మోకరించి ప్రార్ధింపవలయును. దేవుడు పాపుల మొర వినునా? మన కష్టములు చూచి ఆయన యొందుకు ఊరుకొనుచున్నాడు? అను నట్టి ప్రశ్నలు కట్టివేసి ప్రార్ధించుడి. ఇది మీరెందరిచేత చదివింతురో ఎందరికి వినిపింతురో! అన్ని దీవెనలు మీకు కలుగును.
మా క్రైస్తవుల మనవి యిది:- "అన్ని పూజలు మాని యేసుక్రీస్తు ప్రభువును పూజచేసి చూడుడి. మీ ప్రార్థనలు సిద్ధించును". దేవుడు మిమ్మును దీవించునుగాక!
క్రీస్తుప్రభువును పూజించుట వలన కలుగు మేళ్లు ఏవనగా?
- 1. ఎంత చిన్న తప్పు చేసినను అయ్యో! నేనెంత తప్పు చేసితిని అని నొచ్చుకొను నట్టి మనస్సు కలుగును.
- 2. పాపములు పరిహారమగును.
- 3. పాపములను విసర్జించునట్టి శక్తి కలుగును.
- 4. దైవభక్తి కలిగి, చక్కగా ప్రవర్తింపగల సమర్ధత కలుగును.
- 5. ప్రార్ధన చేసికొనువాలు కుదురును.
- 6. అన్ని సద్గుణములలో వృద్ధి కలుగును.
- 7. ఎన్ని కష్టములు వచ్చినను నిత్యము, మనశ్శాంతి గలిగియుండును.
- 8. దైవాంశములు సదా నేర్చుకొనవలెనని అపేక్ష కలిగియుండును.
- 9. దైవవిషయము లెప్పుడును ఇతరులకు చెప్పవలెనను ఆశ కలుగును.
- 10. అన్ని మతములవారును, అన్ని దేశములవారును, అన్ని జాతులవారును, శత్రువులును, స్నేహితులును, స్వజనులును, పరజనులును, సజ్జనులును, దుర్జనులును, రోగులును, బీదవారును, గొప్పవారును అందరును క్రీస్తు ప్రభువునే పూజింపవలెను అను కోరిక గలిగియుండును.
- 11. ఈ జీవాంతమున మోక్షములో చేరగల భాగ్యము కలుగును.
- 1. జబ్బులు పోయి ఆరోగ్యము కలుగును.
- 2. అన్న వస్త్రాదులు కలిగియుందుము.
- 3. మానవ జీవితమునకు కావలసినవన్నియు దొరుకును.
క్రీస్తుప్రభువును ప్రార్థించిన తరువాత సమస్తమును నెరవేరునని నమ్మవలెను. క్రీస్తు ప్రభువే మన ప్రార్ధనలన్నిటికి నెరవేర్పయి యున్నాడు. క్రైస్తవుల ప్రార్ధనలు ఎందుకు నెరవేరుటలేదు అని అడుగుదురేమో నమ్మికలోనో, నడతలోనో లోపముండుటను బట్టి నెరవేరవు. క్రీస్తును పూజించుటకు ఆయన ఎవరు? ఆకాశమును భూమిని నరులను సమస్తమును కలుగజేసిన దేవుడు, నరులకు కనబడి వారితో కలిసి మెలసియుండి వారి నిమిత్తమై నెరవేర్చవలసిన సమస్త కార్యములు నెరవేర్చుటకై మానవుడై జన్మించిన రక్షకుడు. ఆయన మానవావతార కాలమున యేసుక్రీస్తు అను నామమును ధరించెను. ఆయన ఒకరి రక్షకుడేకాదు. నమ్మువారందరి రక్షకుడునైయున్నాడు. మీకు శుభము కలుగునుగాక! ఆమేన్.