గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
14. రక్షణ పిలుపు
దీనిలో దేవుని వాక్యమున్నది. పాడుకానీయకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక.
1. దేవలోకము:- ఇది అన్నిలోకములకు పైన ఉన్నది. దేవుడు ఆది అంతములేనివాడు. నిరాకారుడు, జ్ఞాని, పరిశుద్ధుడు, శక్తిమంతుడు, ప్రేమాస్వరూపి, న్యాయస్థుడు, సర్వవ్యాపి, స్వతంత్రుడు, మనతండ్రి. యెషయా 6:3.
2. దేవదూతల లోకము:- దేవుడు వీరిని మొదట కలుగజేసెను. వీరు నిరాకారులు, పరిశుద్ధులు, మనలను కాపాడువారు. యోబు 38:7.
3. మోక్ష లోకము:- భూమిమీద భక్తిగా జీవించినవారు చనిపోయిన తరువాత ఇక్కడకు వత్తురు. భక్తిలో ఎక్కువ తక్కువలు గలవు గనుక ఇక్కడ వారు తమతమ తరగతిలోనే ఉందురు. 1కొరిం. 15:23.
4. వాయుమండల లోకము:- దేవునికి భిన్నముగానుండిన దూత సైతానుగా మారినందున తన జట్టుతోపాటు ఇక్కడకు వచ్చి వేయవలసివచ్చెను. ఎఫెసీ. 6:12.
5. భూలోకము:- ఆది. 1 అధ్యాయము.
- (1) దేవుడు మన సదుపాయము నిమిత్తమై ఆకాశమును భూమినిచేసెను. పిమ్మట మన ఆది తల్లిదండ్రులను కలుగజేసెను. సైతానుమాట విన్నందున వారు పాపాత్ములైరి. సర్వలోకమును రక్షించుటకై ఒక రక్షకుని పంపితునని దేవుడు వారికి వాగ్దాన మిచ్చెను. ఆయన రాకడకు ఎదురుచూచినవారు ధన్యులైరి. దేవుడు కనబడనందున చాలమంది సృష్టిని పూజించిరి. కొందరు దేవుని పూజించిరి. అప్పుడు దేవుడు యూదులను నియమించి సమస్త ధర్మములు వారికి బోధించెను. వారు అవి వ్రాసిపెట్టి ఉంచిరి. ఇదే బైబిలులో మొదటిభాగము. వారు ఇతరులకు అవి బోధింపవలెను.
- (2) వారిలో రక్షకుడు పుట్టవలెను. నాలుగువేల యేండ్లకు దేవుడు కన్యకా గర్భమున శరీరధారిగా జన్మించి యేసుక్రీస్తు అను నామమున ప్రసిద్ధికక్కెను. ఈ పేరునకు లోకైకరక్షకుడు అని అర్ధము. ఆ దేవనరుడు అనేక విషయములు బోధించెను. మంచి మాదిరి చూపెను. పాపులకు క్షమాపణ వినిపించెను. రోగులను స్వస్థపరచెను. ఆకలిగొన్నవారికి ఆహారము కల్పించెను. ఆపదలోనున్నవారిని తప్పించెను. మనుష్యులలోని దయ్యములను వెళ్ళగొట్టెను. మృతులను బ్రతికించెను. తనబోధ సమస్త జనులకు వినిపించుడనియు, నమ్మి బాప్తిస్మముపొందినవాడు రక్షింపబడుననియు, నమ్మనివారికి శిక్ష విధింపబడుననియు, నేను వచ్చి మిమ్ములను తీసికొని వెళ్ళెదననియు, ఆయన ఈ లోకములో నున్నప్పుడే చెప్పివేసెను. ఆయన రెండవ రాకడకు ముందు భూకంపములు మొదలగు గుర్తులు జరుగుననికూడ చెప్పెను. లోక పాపములను తనమీద వేసికొని తనప్రాణము సమర్పించుటకై వచ్చెను. గనుక శత్రువులు ఆయనను చంపగా చంపనిచ్చెను. గాని మూడవ దినమందు బ్రతికివచ్చి నలుబది దినములు శిష్యులకు బోధచేసి మోక్షలోకమునకు మహిమశరీరముతో వెళ్ళిపోయెను. ఆయన రాకడ గుర్తులు ఇప్పుడు జరుగుచున్నవి. గనుక ఆయన రెండవ రాకడ వాగ్దాన ప్రకారము త్వరలో సంభవించును(1థెస్స 4:15-17) రాకడ దినమున క్రీస్తునందు మృతులైనవారు మొదట మేఘములోనికి లేచివెళ్ళగా సజీవులమైన మనము తరువాత వారిని కలిసికొని మోక్షమునకు వెళ్ళుదుము. రాకడ ఎప్పుడో తెలియదు, గనుక మీ హృదయములలో దైవాత్మ ప్రవేశించునట్లు అనుదినము ప్రార్ధించుచు సిద్ధపడండి. దైవాత్మ మీలోని వచ్చినపుడు మీకు ఉద్రేకము మహానందము మహాశక్తి. క్రీస్తుప్రభువు బోధ ప్రకటించుటకు వాక్కుకలుగును. మరియు కొన్ని వరములుకూడా దైవాత్మవలన మీకు లభించును. మీరు పరలోకమునకు నుళువుగా వెళ్ళగలరు. పరలోకమందు భక్తులందరికిని ఏడేండ్ల విందు జరుగును.
- (3) భూమిమీద మిగిలిపోయినవారికి ఏడేండ్లు సైతానుయొక్క ప్రతినిధియగు క్రీస్తువిరోధివల్ల అనేక హింసలు కలుగును. అప్పుడు 144వేలమంది యూదులును, కోట్లకొలది యితరులును, ప్రభువుతట్టు తిరుగుదురు గాని ఇంకను చాలమంది తిరుగరు. తుదకు క్రీస్తునకును, అంతెక్రీస్తు అను బిరుదుగల విరోధికిని పాలస్తీనా దేశములో హర్మగెద్దోనువద్ద యుద్ధము జరుగును. అప్పుడు విరోధిని, అతని పనివారిని క్రీస్తుప్రభువు నరకములో పడవేయును. సైతానును పాతాళములోని వెయ్యేండ్ల చెరలో బంధించును కాని మారడు.
- (4) తరువాత క్రీస్తుప్రభువును పరలోక వాస్తవ్యులును ఈ భూమిమీదికి వచ్చి ఆ వెయ్యి ఏండ్లును శాంతి పరిపాలన చేయుదురు. సైతాను ఉండడు గనుక భూమి శుభ్రముగా నుండును. నరులు పాపకార్యములు చేయరు గనుక కొందరిలో పాపనైజము మాత్రమే మిగిలియుండును. వారికి క్రీస్తుబోధ ముమ్మరముగా వినబడును. సర్వత్ర దైవారాధన జరుగును. అనేకులు మారిపోవుదురు. అయినను మారని వారును ఉందురు. ఇప్పుడున్న కష్టములేవియు అప్పుడుండవు. నమ్మినవారు నమ్మనివారు మహాసౌఖ్యమనుభవింతురు. నీళ్ళు పరిశుభ్రముగా నుండును. భూమి బహుగా ఫలించును. జంతుబాధలు, పురుగుబాధలు, వ్యాధులు ఉండవు. మనుష్యులు వందలాది యేండ్లు బ్రతుకుదురు.
- (5) అప్పుడు వెయ్యేండ్లు బోధవిన్నవారు ఏమి తీర్మానించుకొనిరో చెప్పించుటకు క్రీస్తుప్రభువు ఈ భూమిమీద సింహాసనము వేసికొనును.
- (6) వెయ్యేండ్ల అంతమందు సైతానుకు విడుదల కలుగగా అతడు భూమిమీదికి ఉగ్రుడైవచ్చి తనపక్షముగనున్న మనుష్యులను గొప్ప సేనగా నియమించుకొని దేవునితో యుద్ధముచేసి ఓడిపోయి నరకములోనికి పడద్రోయబడును.
- (7) పిమ్మట క్రీస్తుప్రభువు సమాధులలో నున్నవారిని రప్పించి తీర్పుచెప్పి నరకమునకు పంపివేయును. ఇదే కడవరితీర్పు. చివరగడియలో కూడ ఎప్పుడైన ఎక్కడైన మారినవారు నరకమునకు వెళ్ళరు.
- (8) అప్పుడు భూలోకము మోక్షలోకములో ఒక భాగమగును. నమ్మినవారందరియొధ్ధ క్రీస్తు ప్రభువు నిత్యము ఉండును. మహానందము, మహావిశ్రాంతి, మహాసౌఖ్యము.
6. పాతాళలోకము:- (1) హేడెస్సు: భూలోకములో మారకుండ చనిపోయిన వారు ఇక్కడ కడవరి తీర్పువరకు ఉందురు. ఆ తీర్పు కాకముందు ఎవరును నరకములోనికి వెళ్ళరు. మారుటకై ప్రతివారికిని ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు ఏవిధముగానో ఒక విధముగ దేవుడు సమయమిచ్చును. క్రీస్తుయేసును తృణీకరించువారు ఎక్కడను మారరు.
- (1) చెర: ఇక్కడ సైతాను వెయ్యేండ్లు ఉండును.
- (2) నరకము: ఇది కడవరి తీర్పుకాలమున కనబడును. తీర్పు జరుగునప్పుడు క్రీస్తుకాక మరియెవ్వరును వెళ్ళరు.
ఉపదేశము
1. బైబిలు: ఇది 1135 భాషలలోనికి వచ్చినది. గనుక ఇది దేవుడు సర్వలోకము నిమిత్తము పంపిన గ్రంథమని గ్రహించుకొన వచ్చును. దీనిలో సృష్టిచరిత్ర, క్రీస్తురాకముందు జరిగిన చరిత్ర క్రీస్తు వచ్చిన తర్వాత జరిగిన చరిత్ర, ఆయన వెళ్ళిపోయిన చరిత్ర, క్రైస్తవ సంఘములో జరిగిన ప్రారంభ చరిత్ర, ఇక ముందునకు జరుగవలసిన చరిత్ర ఉండుటనుబట్టి ఇది మనమందరము చదువవలసినది. ఇది సర్వజనుల గ్రంథము.
2. క్రీస్తుప్రభువు: ఈయన సర్వలోకభారము వహించిన దేవుడును, మనుష్యుడును గనుక సర్వజనుల రక్షకుడు.
3. క్రైస్తవమతము: ఇది సర్వజనులకు విద్యయందు, నాగరికతయందు, చేతిపనులయందు, శరీరవిషయములన్నిటియందు మేలుచేయ యత్నించుచున్నది. మరియు ప్రజలకు దైవభక్తియు క్రీస్తువలన కలుగు రక్షణమార్గమును మోక్షప్రవేశాంశములును బోధించుచున్నది. గనుక ఇది సర్వజనుల మతము.
దైవప్రార్ధనచేయు విధము:
- (1) నీ గదిలో మోకరించి అన్నియు మరచిపోయి యేసుప్రభువును మాత్రమే తలంచుకొనుము.
- (2) నీ పాపములు ఒప్పుకొని క్షమాపణకోరుము.
- (3) నీవు పొందిన మేళ్ళు తలంచుకొని స్తుతించుము.
- (4) నీకవనరమైన అంశములు ఉదహరించుచు ప్రార్థించుము.
- (5) కొంతసేపు మౌనముగా కనిపెట్టుము. అప్పుడు దేవుడు నీ మనస్సులో మంచి తలంపులు పుట్టించును.
- 1. రండి - క్రీస్తునొద్దకు - సమస్తమైన వారలారా నాయొద్దకు రండి అని ఆయన చెప్పుచున్నాడు.
- 2. రండి - ఆయన బోధవినుటకు -నా యొద్ద నేర్చుకొనుడి అని ఆయన చెప్పుచున్నాడు.
- 3. రండి - మారుమనస్సు స్థితికి - మారుమనస్సు పొందండి అని ఆయన చెప్పుచున్నాడు.
- 4. రండి - పాపక్షమాపణ పొందుటకు - నీ పాపములు క్షమింపబడినవని ఆయన చెప్పుచున్నాడు.
- 5. రండి - నమ్ముటకు; రండి - బాప్తిస్మము పొందుటకు; రండి - రక్షణ పొందుటకు- నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అని ఆయన చెప్పుచున్నాడు.
- 6. రండి - సమస్తమును పొందుటకు - అడుగుడి మీకియ్యబడునని ఆయన చెప్పుచున్నాడు.
- 7. రండి - మోక్షములో ప్రవేశించుటకు - ఒకడు నీటిమూలముగాను, ఆత్మమూలముగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు అని ఆయన చెప్పుచున్నాడు.
గుంటూరు సమీపమందలి కాకానివద్దనున్న శ్రీ రావుసాహెబ్ జె. రాజారావుగారి తోటలోని స్వస్థిశాలలో ప్రతి సోమవారము ప్రార్ధన కూటములు జరుగుచున్నవి. అందునుబట్టి యేసుక్రీస్తు ప్రభువు రోగులను బాగుచేయుచున్నాడు. కొందరిలోని భూతములను వెళ్ళగొట్టుచున్నాడు. బిడ్డలు లేనివారికి బిడ్డలను అనుగ్రహించు చున్నాడు. కొందరికి దర్శనమిచ్చుచున్నాడు.
బైబిలు మిషను: ఇన్నిమతములుండగా ఎన్నో క్రైస్తవ మిషనులుండగా, ఎంతోమంది యోగ్యులుండగా, రాజమండ్రిలో 1938 సం॥న దేవుడు నాకు ఎందుకు "బైబిలు మిషను" అను అక్షరములు వ్రాసిచూపించి బైలుపరచెనో అదియు, “ఇది పైకెత్తి చూపించుము” అని ఎందుకు చెప్పెనో లోకము, ఆయనను అడిగి తెలిసికొనవలసియున్నది. ఆలాగున బైబిలు మిషనును పైకెత్తి చూపించగల కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక! ఆమేన్.