గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
8. విశ్వాసులకు సహాయము
క్రైస్తవ విశ్వాసులారా! మీకు అన్నిటిలోను దైవసహాయము కలుగునుగాక!
- 1. క్రైస్తవ విశ్వాసులారా! భూలోకములోని విశ్వాసులు మీ కష్టములను ఎరిగినవారై మీ కష్ట నివారణార్థమై దైవప్రార్ధనలు చేయుచుందురు గనుక మీరు మీ కష్టములవలన నలిగిపోవద్దు. విశ్వాసుల ప్రార్ధనలన్నియు దేవుని సింహాసనము నొద్దకు చేరును. వారి ప్రార్ధనలు దేవుని వాగ్థానముమీద ఆధారపడియుండును. ఇబ్బందులు, వ్యాధులు, అవమానములు, పురుగు బాధలు, శత్రుబాధలు, సైతాను పుట్టించునట్టి అవిశ్వాసపు తలంపులు - కష్టములనగా ఇట్టివే.
- 2. మోక్షలోక వాస్తవ్యులు మిమ్మును గురించి దేవుని నిత్యము ప్రార్ధించుచుందురు. వారు భూలోకమునుండి వెళ్ళినవారే. వారిలో కొందరు మన స్వకీయులు, మిత్రులు, మనలను ఎరిగినవారు గనుక మన కష్టములు వారికి తెలిసియేయున్నవి. వారు మనలను విడిచి వెళ్ళినంతమాత్రమున మనలను మరచిపోయినారని తలంపరాదు. వారి ప్రార్ధనలుకూడ దేవుని వాగ్దాన కృపమీద ఆధారపడియున్నవి గనుక మనము విచారముతో కాలము గడుపరాదు.
- 3. దేవుని సింహాసనమునొద్దనున్న దేవదూతలుకూడ మన నిమిత్తమై ప్రార్థించుచున్నారు. హెబ్రీ. 1:14లో వారు మనకు పరిచర్య చేయువారైయున్నారని వ్రాయబడియున్నదిగదా! మనకు ఆపద రాకుండ మనయొద్ద కావలిగాయుండునట్టి మిత్రులు వారు. పరిచర్యలలో ఒక పరిచర్య ప్రార్ధన పరిచర్యయే. వారు అన్ని విధముల నహాయము చేయుచు ప్రార్ధన విషయములో సహాయము చేయనియెడల నిష్ప్రయోజనముగదా!
-
3. ప్రకటన నాల్గవ అద్యాయములో ఏమి ఉన్నది? దేవుని సింహాసనము చుట్టు ఉన్న వ్యక్తులు:
- (1) సింహము
- (2) దూడ
- (3) మనుష్యుడు
- (4) పక్షి
- 1. దేవదూతలు సింహముకొరకు అనగా అడవి మృగములకొరకు ప్రార్ధించుచున్నారు.
- 2. దేవదూతలు దూడకొరకు అనగా ఊరిలోనున్న పశ్వాదులకొరకు ప్రార్ధించుచున్నారు.
- 3. దేవదూతలు లోకములోని మనుష్యుని కొరకు అనగా మనుష్యులందరికొరకు ప్రార్ధించుచున్నారు.
- 4. దేవదూతలు పక్షికొరకు అనగా లోకములోని అన్ని విధములైన పక్షులకొరకు ప్రార్ధించుచున్నారు.
- 5. ప్రకటన 5వ అ॥లో ఏమి ఉన్నది. సృష్టియావత్తు దేవుని స్తుతించుచున్నట్లున్నది. ఎందుచేతననగా అది దేవుని ఉపకారమును గ్రహించినది. ఇది ఎంత సంతోషకరమైన సంగతియైయున్నది.
- 6. లోకములోని విశ్వాసులు, మోక్షలోకములోని పరిశుద్ధులు పాపమెరుగని దేవదూతలు మనకొరకు ప్రార్ధించుచున్నారను సంగతి మనము జ్ఞాపకముంచుకొన్న యెడల మనము మరింత ఎక్కువ ప్రార్ధన చేయుటకు ప్రేరేపణ కలుగకమానదు.
- 7. బైబిలు కథ వినండి. శత్రుసైన్యము ఎలీషా ఉన్న పట్టణమును ముట్టడివేసినప్పుడు ఆయన సేవకుడు పెందలకడలేచి ఆయనతో ఇట్లనెను “అయ్యా! నా యేలినవాడా మనము ఏమిచేయుదమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు మనపక్షమున నున్నవారు వారికంటె అధికమైయున్నారనిచెప్పి - యెహోవా! వీడు చూచునట్లు దయచేసి వీనికండ్లను తెరువుమని ఎలీషా ప్రార్ధనచేయగా యెహోవా ఆ పనివారి కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషాచుట్టును, పర్వతము అగ్నిగుర్రములచేతను, రథములచేతను నిండియుండుట చూచెను.” కాబట్టి విశ్వాసులారా మనకు సహాయము చేయువారి సంఖ్యయే ఎక్కువని తలంచుకొని దేవుని స్తుతించుచు నిర్భయముగా నుండండి. (2రాజులు 6అ॥ము) శత్రువులు అప్పటినుండి వచ్చుట మానివేసిరి.
-
8.
- (1) ఆది 32:26 “నీవు ఆశీర్వదించితేనేగాని నేను విడువను” అని యాకోబు ప్రార్థించెను. అది నెరవేరెను.
- (2) తన మనవి న్యాయాధిపతి ఆలకించువరకు ఒక స్త్రీ న్యాయసభకు వెళ్లుట మానలేదు. న్యాయకర్త విసుగుకొని ఆమె మనవి ప్రకారము న్యాయము తీర్చెను లూకా 18:1-8.
- (3) ఒక స్నేహితుడు తన స్నేహితునియొద్దకు అనుకూలము కాని సమయమందు వెళ్ళి రొట్టెలు అడిగెను. ఆ స్నేహితుడు వీలులేదని చాలమార్లు చెప్పెను. అయినను వెళ్ళినవ్యక్తి గుమ్మముదగ్గర నిలువబడి మాటిమాటికి అడుగుచుండెను. తుదకు తన కోరిక నెరవేరెను లూకా 11:5-8.
- (4) ఏలీయా మనవంటి స్వభావముగలవాడైనను పట్టుదలతో ప్రార్ధింపగా వర్షము కురిసెను యాకోబు 5:17 - ఈ నాలుగు కథలలో ఉన్న సంగతిని అనుసరించి ప్రతి కుటుంబము ప్రార్ధింపనియెడల క్రైస్తవమతము అక్కరలేని వారివలన కలుగు ఒత్తుడు తప్పదు. అది వచ్చునప్పుడు మనము సహింపలేము. వారిని క్షమించి దీవించుమని దేవుని ప్రార్థించండి.
- 9. మీరు శోధనలో ప్రవేసించకుండునట్లు మెళుకువగా ఉండి ప్రార్ధన చేయండి. (మత్తయి 26:41) అని ప్రభువు తన శిష్యులకు చెప్పెనుగదా! మనము అట్లుచేసిన యెడల ప్రార్ధనఫలము దొరుకును.
- 10. "నా నామమునుబట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును" (యోహాను 14:14) అని ప్రభువుచెప్పినమాటలో ఏమి అనుమాట గుర్తించండి.
హెబ్రీ 12:1 ఇంతకంటె గొప్ప విశ్వాస సహాయ సాక్ష సమూహము మేఘమువలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసువైవుచూచుచు, మనయెదుట ఉంచబడిన పందెములో పరుగెత్తుదుముగాక! ఆమేన్.