గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

16. జెకర్యా మూగతనము



యెరూషలేములో గుడి ఉన్నది దాని యందు ధూప వేదిక గలదు. అక్కడ జెకర్యాయను యాజకుడు దూపము వేయు చున్నాడు(లూకా 1:8-25). ఆయనకు అక్కడ దేవాలయములో గబ్రియేలుదూత కనబడి “నీకు కుమారుడు పుట్టును గొప్ప వాడగునని చెప్పెను”. జెకర్యాయు తనభార్య ముసలివారగుటచే అనుమానము కలిగినది. అందుచేత “ఇది నాకు ఏలాగు తెలియునని” అడిగెను. తనకు కుమారుడు పుట్టునని ఏలాగు తెలియునని దూతను ప్రశ్నించెను. దేవునిదూత చెప్పుచున్నాడు గనుక ప్రశ్నవేయకూడదు, నమ్మవలెను, ఇంకా ప్రశ్నించుట ఎందుకు. ఇంకా ఎవరైన చెప్పితే నమ్మకూడదుగాని దూత చెప్పినప్పుడు ఎందుకు ఇంకా అపనమ్మిక? అతడు దూతమాట మనసులో నమ్మనందున ప్రశ్నవేసినాడు. వివరము తెసికొనుటకు అడుగవచ్చునుగాని అపనమ్మికతో అడుగకూడదు.


జెకర్యా వృద్ధాప్య కారణాన్ని ఎత్తుకుని ప్రశ్నించినాడు, దూతచెప్పినమాట నమ్మలేదు. అవిశ్వాసము చొప్పున అడిగినాడు. అవిశ్వాసముతో ఒక్మప్రశ్న వేసినను నేరమే. తెలిసికొనవలెనని వంద ప్రశ్నలు వేసినను నేరములేదు. కుమారుడు పుట్టునని సంతోషించక అవిశ్వాసమునుబట్టి ప్రశ్నవేసెను. ఆ ప్రశ్నకు పుట్టుకస్థానము అవిశ్వాసము, అనగా అవిశ్వాసమును బట్టి ప్రశ్న పుట్టినది. కాబట్టి అవిశ్వాసముతో ప్రశ్నలు వేయరాదు. వారికి కుమారుడు పుట్టుటకు ఆటంకము వృద్ధాప్యము. అట్టి ఆటంకము ఉన్నను దేవునిదూత చెప్పినది గనుక నమ్మివేయవలెను. ఎన్ని ఆటంకములున్నను దేవునిమాటలు నెరవేరునని మనము నమ్మవలెను. జబ్బు ఎంతకాలమునుండి ఉన్నప్పటికిని, ఎంతపెద్ద జబ్బు అయినను బాగుపడుదునని నమ్మవలెను. జబ్బునుబట్టి కాదు, జబ్బుయొక్క ఉరవడినిబట్టికాదు గాని దేవుని వాగ్ధానమునుబట్టి నమ్మవలెను. దీర్ఘకాలవ్యాధి అని, వ్యాధి ముమ్మరముగా ఉన్న మనము కూడా నమ్మలేము గనుక జెకర్యాను నిందించనక్కరలేదు. మనము కూడా కష్టము ఎక్కువగుటను చూచి అవిశ్వాసులమగుదుము. జెకర్యా అనుభవశాలి ప్రార్ధనలో ఉన్నాడు, దేవాలయములో ఉన్నాడు. బయట ప్రార్థనా కూటము ఉన్నది. దేవదూత మాట విన్నాడు, దేవదూతను చూచినాడు. అయినను కుమారుడు పుట్టునను వార్త నమ్మలేదు.


తాను నమ్మకుండుటకు ఒక్కటే ఆటంకము - వృద్ధాప్యము. పైవన్నీ మంచివే. అంత మంచి ఉన్నను ఒక్క ఆటంకము వలన అవిశ్వాసము కలిగినది. అట్టి బలహీనత భక్తులందరికి వచ్చును. గనుక ఎంత మంచి ఉన్నను, వారైనను చిన్నలోటు ఉన్నయెడల అట్టి అవిశ్వాస స్థితి వచ్చును గనుక జాగ్రత్తగా ఉండవలెను. మరియు జెకర్యా యాజకుడు, భార్య యాజక వంశస్తురాలు, దేవుని దృష్టిలో నీతిమంతులు, మరియు దూత వర్తమానములో భయపడవద్దు నీ ప్రార్ధన వినబడినది ఇవన్నీ ఆయనను గురించి బైబిలులో వ్రాయబడిన మంచి వరుస, నమ్ముటకు వీలగు వరుస (లూకా 1:5,6). వీటినిబట్టి అయినను నమ్మవలసినదిగాని నమ్మలేదు.


నమ్మలేకుండుటకు కారణములు

వారిలో మంచి లక్షణములు అనేకములున్నను, నమ్మకము కలిగించుటకు వీలగునవి అనేకములున్నను పై రెండు ఆటంకములనుబట్టి నమ్మలేకపోయెను. జెకర్యా నమ్మగలుగుటకు ఇంకా అనేక కారణములు గలవు. యాజకుడు, యాజక ధర్మము జరిగించుచున్నాడు. దేవుని గుడిలో నున్నాడు, దూపము వేయుచున్నాడు, బయట ప్రార్థన సమాజముగలదు, దూత కనబడుట, దూత మాట్లాడుట, భయపడవద్దని చెప్పుట, ప్రార్ధన వినబడినదని చెప్పుట, కొడుకు పుట్టుననుట, అతడు ఆత్మపూర్ణుడై యుండుననుట, అతని పని మొదటిరాకకు ప్రజలకు సిద్ధముచేయునని చెప్పుట, ఇంకా అనేకములు గలవు (లూకా 1:13 - 17). గాని రెండు ఆటంకములు ఎక్కువ నష్టము కలుగజేసినవి, నమ్మకుండా చేసినవి, అవిశ్వాసమునకు కారణమైనవి, ఆలాగే మనకును జరుగును. మనకు ధైర్యము కలిగించేవి అనేకములున్నను చిన్న పొరబాట్లు మనలోనున్న ఇట్టిస్థితి కలుగును. మనము దేవుని మాటలు నమ్ముటకు అనేక వాగ్ధానములున్నవి. గాని మనలను అవిశ్వాసులనుగా చేయుటకు ఏ చిన్నవియైనను ఒకటి లేక రెండు చిన్న కారణములుండునని తెలిసికొనవలెను, జాగ్రత్తపడవలెను. అందుకే ఈ పాటము వ్రాయ బడెను. జెకర్యాయొక్కగ్రామముపేరు జట్ట అను గ్రామము. జెకర్యా పూజారి పని తనవంతుచేయుటకు యెరూషలేము వచ్చెను.


పూర్వము అబ్రాము, శారా అనువారు హెబ్రోను అనుపట్టణములోనుండగా దేవుడు వారిదగ్గరకు వెళ్ళి ఆబ్రహామా నీకు కుమారుడు జన్మించునని చెప్పెను. అప్పుడు ఆయనకు 100 యేండ్లు. దేవుడు చెప్పితే మాత్రము అబ్రాము నమ్మునా? గాని నమ్మినాడు. అబ్రహాము నవ్వితే దేవుడు కోప పడలేదు గాని, శారాకూడా నవ్వినది. అబ్రాహాము దేవునిమాట నమ్మి నవ్వినాడు, గాని శారా నమ్మక నవ్వినది. శారా డేరాచాటున నవ్వినది అలా నవ్వకూడదని చెప్పెను. శిక్షించలేదుగాని గద్దించినాడు. అబ్రాహాము నూరు ఏండ్లవాడు అయితే మాత్రము నమ్మినాడు. దేవునికి అసాధ్యమేమున్నది, దేవుడు సంతానము ఇవ్వగలడు. జెకర్యాతో దూత “నేను దేవునిఎదుట నిలువబడు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును, నీకు ఈ మంచి కబురు చెప్పడానికిని దేవుడు నన్ను పంపెనని చెప్పి, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మూగవాడవై యుందువని చెప్పెను.


అవిశ్వాసి యొక్క అవిశ్వాసమునకు రావలసిన దుష్ట ఫలితము జెకర్యాకు కలిగెను. యోహాను రాకడ, యేసుప్రభువు రాకడ జెకర్యా నమ్మలేదు. జెకర్యా - యోహాను రాక నమ్మనందున యేసు ప్రభువు రాకడకూడ నమ్మలేదని చెప్పవచ్చును. మన కాలములోని వారుకూడా యేసుప్రభువు యొక్క రెండవరాకడనుగూర్చి నమ్మకపోయిన వారికి వాక్కురాదు. రాకడనుగురించి చెప్పమంటే ఎవరూ మాకు బోధించలేదు లేక మా పాదిరి మాకు బోధించలేదు, బోధించినా మాకు నమ్మకములేదు అని అంటారు. మీరు రాకడ నమ్మకపోతే మీకు రాకడను గురించి చెప్పుటకు వాక్కురాదు. ఇది వాక్కురాని మూగతనము. ఎవరు రాకడ నమ్ముదురో వారికి వాక్కు వచ్చును. ఎన్ని ప్రశ్నలు వచ్చినా బుజువుచేసి నమ్మించగలరు. ఇప్పుడు నమ్మి, తర్వాత నమ్మకపోయిన వాక్కురాదు. జెకర్యా గుర్తులు చూపించెను. బయటివారు నమ్మకపోతే ఆకాశగుర్తులు చూపింతురుగాని చెప్పుటకు వాక్కురాదు. బైబిలు మిషనువారు రాకడగుర్తులు చెప్పుచున్నారు. ఇతరులు, మాకు నమ్మకములేదు గాని వారు చెప్పారు గనుక ఇవి రాకడ గుర్తులని చెప్పుదురు, గాని నేను రాకడను గురించి నమ్ముచున్నానని చివర చెప్పుదురు. ఆలాగు చెప్పుట కాదుగాని, “రాకడ నిజమే” అని చెప్పుటకు వాక్కు రావలెను. ఈ గుర్తులు రాకడకేనట అని చెప్పుదురు. ఇది రెండవరాకడకు ముందువచ్చు మూగతనము. ఇది ఒక సంజ్ఞ అనగా సూచన. మనకు ప్రభువు త్వరగా వస్తాడని.


గనుక ఇట్టి సంజ్ఞలు గుర్తించి రాకడకు చదువరులు సిద్ధపడుదురుగాక! ఆమెన్.


రెండవ రాకడ ముందువచ్చు వాక్కురాని మూగతనము తప్పించుకొనండి.