గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
5. బుషుల దేశము
-
1. మన హిందూదేశము బుషుల దేశమని మురియుట మంచిదే. కాని వారు చేయుచున్నట్లు చేయుచు మురియుట మరింతమంచిది. వారు నిత్యము
దైవధ్యానములో ఉందురు. అది వారి వృత్తి మనము దైవధ్యానము చేయగలము. ఒక వృత్తిగా చేయలేము. అయినను ఒక వాడుకగా చేయగలము.
ఏలాగనిన:- ప్రతి కుటుంబములో ప్రతిదినము ఒకగంటయైనను దైవ ధ్యానములో ఉండుటకు వీలుపడును. దినమంతయు మనము చేయు పనులలో ఇదియొక ముఖ్యమైనపని. అందువలన ఆ దినమంతయు దేవుని దీవెన మనకు కలిగియుండును. దైవధ్యానము చేయు సమయములో మనము దేవునికి చెప్పుకొనవలసిన కష్టసుఖములు చెప్పుకొనవచ్చును. కావలసినవి అడుగవచ్చును. తరువాత కొంతసేపు నిశ్శబ్దముగా దేవుని తలంపుతో ఊరకుండ వలయును. అప్పుడు మనకు మంచి ఆలోచనలు తోచును. - 2. బుషులు స్వస్థానమును, స్వజనమును, వృత్తులను మానుకొన్నారు. అవి మనము అట్లు చేయలేము. చేయనక్కరలేదు.
- 3. మనదేశమును హిందూ దేశమనుటకన్న వేదాంత దేశమనుట యుక్తమని వివేకానందస్వామివారు చెప్పిరి. ఇది మంచి సలహాయే గాని వేదాంతము తెలిసికొని మురియుట మరింత యుక్తమైనపని. మతవిషయములు బాగుగా తెలిసికొనవలయును. ప్రతివారు తమ మతమును గురించియు ఇతర మతములను గురించియు తెలిసికొనుట వలన జ్ఞానాభివృద్ధి కలుగును. తెలిసికొన్న పిమ్మట ఆయాసిద్ధాంతముల విషయములు జ్ఞానమే తీర్మానము చేసికొనును. సమస్తమును పరీక్షించండి, మేలైనదానిని చేపట్టండి అని బైబిలు చెప్పుచున్నది.
ధ్యానము వలనను, మతవిషయములు తెలిసికొనుటవలనను, శుద్దులకు పాప విసర్జనకు నిర్మలమైన మనస్సాక్షికి కష్టనివారణకు మార్గమేర్పడును. దుర్గుణములు చింతలు అంతరించును. మనశ్శాంతి కలుగును. అప్పుడు మనదేశములోని అన్ని భాగములు బుషుల భాగములును, వేదాంత భాగములును అగును. దేవుడు మిమ్ములనందరిని దైవధ్యానపరులుగా స్థిరపరచుచుండునుగాక! ఆమేన్.