గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
19. యత్న యంత్రము
ఒకరిలో భేదాభిప్రాయమగుపడగా కలహింపక సలహా ఇచ్చుట గొప్ప జ్ఞానము.
దేశీయులైన ప్రియులారా! మీకు శుభము. మా సలహా:
- 1. క్రీస్తును ప్రార్థించి చూడండి. కీడు తొలగును. మేలు కలుగును. మోక్షలోక నివాసము దొరుకును. దేవుడు మన నిమిత్తమై నరుడుగా కన్యకగర్భమున జన్మించెను. ఆయనే యేసుక్రీస్తు ఆయన ధర్మములు బోధించెను. ఆ ప్రకారముగా ఆయనే నడిచి చూపించెను. అద్భుతరీతిగా యొన్నోమేళ్ళు చేసెను. లోకపాపములు తనమీద వేసికొన్నందున ఘోరమరణము పొందవలసి వచ్చెను. ఐనను బ్రతికివచ్చి మోక్షలోకమునకు వెళ్ళెను. మిగుల త్వరలో మేఘాసీనుడైవచ్చి భక్తులను ప్రాణముతో మోక్షమునకు తీసికొనివెళ్ళును. గనుకనే ఆయనను ప్రార్ధించండని చెప్పుచున్నాము. క్రీస్తుపేరుమీద క్రైస్తవ మతము స్థాపితమాయెను. అది క్రీస్తువలె పాపులకు, రోగులకు, బీదలకు, బిడ్డలు లేనివారికి, భూతపీడితులకు, ఆయా అవస్థలలో నున్నవారికి మేలుచేయుచున్నది. ఇట్టిపని నేటికిని గుంటూరు సమీపముననున్న కాకానియొద్ద క్రీస్తువలన ప్రతిసోమవారము జరుగుచున్నది. ఇక్కడ కొందరికి ఆయన కనబడి వారితో మాట్లాడుచున్నాడు.
- 2. బైబిలు చదివిచూడండి. దేవుడు మనకు చెప్పవలసినవి దీనిలోగలవు. ఇది ఆయన లోకమునకు పంపిన ఉత్తరము.
- 3. తెలిసిన క్రైస్తవులతో సంభాషించి చూడండి. అప్పుడు మీ అనుభవజ్ఞానము వృద్ధిపొందును.
-
4. ఈ మూడును మీకిష్టము లేనియెడల ఈ దిగువనున్న ప్రార్ధనవంటి ప్రార్ధనచేసి చూడండి.
దేవా! అన్నిటిని అందరిని, నన్నును, కలుగజేసిన తండ్రీ! నాకు కనబడుము. అందరికిని కనబడుము. నాతో మాటలాడుము. అందరితోను మాటలాడుము. - 5. ఇదికూడ మీకిష్టము లేనప్పుడు నిశ్శబ్దముగా నున్న ఏకాంతస్థలములోనుండి మీకు ఉపయోగకరమైన విషయములను గురించి ఆలోచించిచూడండి. అప్పుడు మీకు సంతోషము కలిగింపగల మంచి మంచి తలంపులు వచ్చును.
సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పిన క్రీస్తు యేసు వారి కృప చదువరులకెల్లరకు తోడైయుండును గాక! ఆమెన్.