ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు

క్రిస్మస్ పండుగ ప్రసంగము



“దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు” (హెబ్రీ 1:6)


ప్రార్ధన:- క్రిష్ట్మస్ మరల వచ్చెనను తలంపు మాలో నుంచుటకు క్రిష్ట్మస్ ను గ్రంధములోనే దాచిపెట్టిన తండ్రీ! భూలోకమునకు నీ కుమారుని బహుమానముగా అనుగ్రహించిన నీ అంతరంగ ప్రేమ నిమిత్తమై వందనములు. నీ కుమారునిచ్చుట వలన నీవు తండ్రివి, సృష్టికర్తవు. బహుమానములిచ్చు దానకర్తవని గ్రహించినాము. గనుక నీకు వందనములు. కుమారుడవైన తండ్రీ! తండ్రి ఏ విధముగా బహుమాన మిచ్చుటకు సందేహింపలేదో అలాగే సత్రములో స్థలములేనట్లు నీకెక్కడను స్థలములేదని తెలిసినప్పటికిని సందేహించక అసహ్యించుకొనక మమ్మును రక్షింపవలెనను ప్రేమ వలన మీరు వచ్చిరి. కాబట్టి పరిశుద్ధ శిశువైన ఓ ప్రభువా! నీ కనేక వందనములు.


పరిశుద్ధాత్మవైన తండ్రీ! తండ్రియొక్క పని నెరవేర్చుటలో గొప్పపని చేసినావు. మరియమ్మకు గొప్ప శక్తి, ప్రభావము కనపర్చినావు. ఆమెలో నీశక్తి ప్రభావము ప్రవేశింపజేసినావు గనుక నీకనేక వందనములు. త్రియేక దేవుడవైన తండ్రీ! మమ్మును రక్షించే ఉద్యోగములో గొప్పపని సాధించుచున్న నీకనేక వందనములు. నీ కుమారుని జన్మము ఆలోచించుటకు వెలిగింపు, గ్రహింపు అనుగ్రహించుమని బేత్లెహేము బాలకునిద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్.


ప్రసంగము:- ‘క్రిష్ట్మస్ – దేవలోకములో క్రిష్ట్మస్ = దూతల లోకములో క్రిష్ట్మస్ మోక్షలోకములో క్రిష్ట్మస్, భూలోకములో క్రిష్ట్మస్ – పాతాళ లోకములోని వారిని కూడ రక్షించవలెనని ప్రభువుయొక్క ఉద్ధేశ్యము గనుక అన్ని లోకములలో ఈ పండుగ గలదు. క్రిష్ట్మస్ పరలోకములో, భూలోకములో, భూమి క్రింద అని ఫిలిప్పి 2:9లో ఉన్నది. పాతాళ లోకములోనివారు మోకాళ్ళు వంగవలెను. యేసుప్రభువు నామమును ఒప్పుకొనవలెను. హెబ్రీ 1: 6లో దేవుని దూతలు ఆయనకు (క్రీస్తుప్రభువునకు) నమస్కారము చేయవలెనని గలదు ఎందుకు? భూలోకమునకు రక్షణ భాగ్యము క్రీస్తు వలననే కలిగినది సంతోషించి నమస్కారము చేయుదురు. అందుకని వారు క్రిష్ట్మస్ పండుగ ఆచరింతురు. వారి క్రిష్ట్మస్ యొక్క ఉరవడి (నిజముగాస్థితి) ఎక్కువ రక్షింపబడి మోక్షములో నున్న వారి క్రిష్ట్మసు కూడ బాగుండును. మనమెంత బాగుగా చేసినను అంత బాగుండదు. గాని మనము కొంచమే చేసినను దేవునికి గొప్ప సంతోషము.