ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు
క్రిస్మస్ సంభాషణ
1. ప్రశ్న : యేసుప్రభువునకు యెషయా 9:6లో ఏయే బిరుదులున్నవి?
జవాబు: శిశువు, కుమారుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దేవుడు, తండ్రి, సమాధానాధిపతి.
2. ప్రశ్న: యెషయా ఏ సంవత్సరమున ఈ బిరుదులు చెప్పియుండును?
జవాబు: ప్రభువు పుట్టుటకు 740 యేండ్లకు ముందే ఆయన ప్రవచించెను.
3. ప్రశ్న: ఈ సంగతులు యెషయాకు ఏలాగు తెలిసినవి?
జవాబు: దైవాత్మ వలన తెలిసినవి.
4. ప్రశ్న: ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేరినది?
జవాబు: ఇది క్రిష్ట్మస్ రోజున నెరవేరుట ప్రారంభమైనది గాని నిత్యమును నెరవేరుచునే యుండును.
5. ప్రశ్న: యేసుప్రభువుయొక్క మొదటి రాకడకు సంబంధించిన ఈ ప్రవచనములో రెండవరాకడ జ్ఞప్తి తెచ్చుకొనుటకు ఏమైన సూచన గలదా?
జవాబు: ఈ లోకములోనుండి మోక్షలోకమునకు ఆరోహణము కావలసిన సంఘమొకటి ఇప్పుడు సిద్ధమగుచున్నది. యేసుప్రభువు మేఘాసీనుడై వచ్చునప్పుడది మరణ మొదకుండనే వెళ్ళిపోవును. అప్పుడే సంఘమునకు పూర్ణమైన సమాధానము కలుగును.
6.ప్రశ్న: అంతకుముందు సమాధానముండదా?
జవాబు: అంతకు ముందుకూడా సమాధానము అనగా శాంతికలుగును గాని అప్పుడప్పుడు శాంతి అంతరించుచుండును. సమాధానాధిపతిఉండును గాని ఆయన ఇచ్చు సమాధానము సంఘస్థులు నిలుపుకొనలేని కారణమున అది కనబడకపోవును.
7. ప్రశ్న: రెండవ రాకడ సూచన యెక్కడ ఉన్నది?
జవాబు: రాజులకు రాజు అను బిరుదు ఉండనే ఉన్నది. సమాధానము అనుమాట దగ్గర రాజు అని లేదు గాని అధిపతియని యున్నది. గనుక యువరాజు అని అర్ధము చేసికొనుటకు వీలుకలదు.
8. ప్రశ్న : ఈ సూచన ఎక్కడ ఉన్నది?
జవాబు: పెండ్లికుమార్తె అను బిరుదుగల సంఘమును ప్రభువు తీసికొని వెళ్ళుటకు వచ్చునప్పుడు, ఆయన అధిపతి అనగా యువరాజు అని అనిపించు కొనును. పరలోకములో సంఘమునకు పెండ్లివిందు అయిన పిమ్మట, ఆయన భూలోకమునకు ఆ వధువు సంఘముతో వచ్చి, వెయ్యేండ్లు పరిపాలన చేయునప్పుడు, రాజు అను బిరుదు కలిగియుండును. గనుక సమాధానాధిపతి అను మాటలో రెండవ రాకడ సూచనయున్నది.
9. ప్రశ్న: దీనినిబట్టి చూడగా ఆయనకు యువరాజు, రాజు అను రెండు బిరుదులు కూడ ఉన్నవి గ్రహించుకొనవచ్చునా?
జవాబు: అవును, ఆయన యువరాజే, ఆయన రాజే. ఆయన రాజ్యభారము వహించిన రాజే. శాంతి పరిపాలన చేయనైయున్న రాజే. ఆయన బహిరంగముగ భూమి మీద రాజైనప్పుడు, విశ్వాసులు అవిశ్వాసులు మహా సౌఖ్యమనుభవింతురు. అదే శాంతి పరిపాలన, అదే సమాధాన పరిపాలన, అదే వెయ్యేండ్ల పరిపాలన.