ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు

క్రిస్మసు వర్తమానము



వాక్యభాగము: (యెషయా 9:6; లూకా 2:1-2)


ప్రార్ధన:- ఓ తండ్రీ! నీ కుమారుని బహుమానముగా ఇచ్చియున్నావు నీకు వందనములు. ఆ బహుమానము లోకమంత పెద్దది కాదు. ఆకాశమంత పెద్దది కాదు. వీటన్నితిని మించినది. ఈ కాలమందు నీ బహుమానమును జ్ఞాపకము చేసికొని చిన్నచిన్న బహుమానములు ఇచ్చుచున్నాము. ఇది జ్ఞాపకార్ధము. నీ విచ్చినది గొప్ప బహుమానము.


“మనకు కుమారుడు అనుగ్రహింపబడెను” అని ప్రవక్త పలికెను. మమ్ములను కుమారులనుగా స్వీకరించు నిమిత్తము, ఈ ప్రేమ అంతస్థు నిమిత్తము నీకు వందనములు. ఆ కాలమున గొల్లలు, జ్ఞానులు, దూతలు చేసినంతగా స్తుతులు మేము చేయలేకపోయినను మా స్తుతులు అంగీకరింతువని నమ్మి స్తుతించుచున్నాము. మాకు చిక్కులు, ఇబ్బందులు బాధలు ఉన్నను నీ బహుమానమును మాకు నీ ఆత్మ ద్వారా జ్ఞాపకము చేయుము. ఆ బహుమానమును బట్టి మా హృదయములను పరమానందముతో నింపుమని వేడుకొనుచున్నాము.


లూకా 2: 1-20లో ఒక ప్రవచనము గలదు. ఆదికాండములోని యేసుప్రభువు యొక్క జన్మ ప్రవచనము చివరి గ్రంధమైన మలాకీ వరకు వచ్చెను. వీటన్నిటికి నెరవేర్పు క్రొత్త నిబంధనలోని ప్రభువు యొక్క జన్మము అయితే పై వాక్య భాగములోని ప్రవచనమేమి? “ఇది ప్రజలందరికి కలుగబోవు వర్తమానము” అప్పుడు వారికి మాత్రము సంతోషముగాని ఈ ప్రవచనములో “అందరికి” అని వ్రాయబడి యున్నది. ఇది దూత చెప్పిన ప్రవచనము. మనము క్రిష్ట్మసు పండుగ చేసిన సంతోషమే గాని అందరు చేసిన ఇంకా సంతోషము. ఆ కాలములో గొల్లలకు మాత్రమే ఈ సంతోషము, వారు పండుగ చేసినారు. ప్రభువుయొక్క జన్మవార్త కొందరికి మాత్రమే తెలిసినది. ఆ కొద్దిమంది సంతోషించి పండుగ చేసిరి. రానురాను బాలుడు పెద్దవాడైన తర్వాత పెంతెకొస్తు దినమునకు మూడు వేలు తయారైరి.


“అందరికి” అనుమాట వినబడిన తర్వాత

పాత నిబంధన ప్రవచనము ఇంతటితో ఆగెను. ఎందుకనగా నెరవేరెను, కాని దూత చెప్పిన ప్రవచనము లోకాంతమువరకు వెళ్ళుచునే ఉండెను. ప్రవక్తల ప్రవచనము గొప్పదా? దూత చెప్పినది గొప్పదా? ప్రవచనము దూత చెప్పినది లోకాంతము వరకు ఉండును. అందరు అను మాటను బట్టి కొద్ధిమంది పండుగ చెయుచున్నారా? ఎక్కువమంది చేయుచున్నారా? ఎక్కువమంది చేయుచున్నారు గనుక మనము ఒంటరిగా చేయుటలేదు.


ప్రభువు పుట్టి 1965 సంవత్సరములు అయినది. ప్రస్తుతకాలమున

అన్ని ముఖ్య మతములలోను ఈ వార్తగలదు. వారందరికన్న మనకు ఎక్కువ దొరికెను. గనుక క్రైస్తవులు సువార్త ప్రకటించవలెను.


బర్మా దేశములోని కరెనేయులనువారు తమతమ గ్రంధమైన బౌద్ధమత గ్రంధము చదువుకొని ఆ గొప్పవారెవరని ఆలోచించుచుండగా మిషనెరీలు వెళ్ళి ప్రభువును గురించి బోధించగా వారి జాతి అంతా క్రైస్తవులైరి. వీరు పాడినట్లు ఆసియాలోని క్రైస్తవులెవరును పాడలేరు. బహు రమ్యముగా పాడుదురు. గొల్లలకు, ప్రభువు మనకొరకు పుట్టెనను సంతోషము మాత్రము గలదు. మనకు అన్ని విషయములలో వారికన్న ఎక్కువ సంతోషము గలదు. వారు ఒక గుంపు. మనము ఒక గొప్ప సైన్యము. పరలోక సైన్యసమూహము ఇంకా గొప్పది. ఇతర మతములలోని అభిమానులు గలరు. వారు ఒక సమూహము, దూత ప్రవచనము “అందరకు” అనునది ఈ సమూహము లన్నిటిలోను నెరవేరినది.


ఈ “అందరకు” అని చెప్పిన మహా సంతోషము చదువరులకు కూడా కలుగునుగాక!