ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు
క్రిస్మస్ వర్తమానము
క్రిష్ట్మసు శుభవచనము: సర్వలోక చక్రవర్తి పరిపాలనలో, సర్వలోక ప్రజాసంఖ్య లిఖితమైన కాలములో నెరవేరిన సర్వలోక రక్షకుని జన్మవృత్తాంతము నేటి సర్వలోకమునకు వలె మీకును సర్వ జన రక్షణ ప్రకటన సందేశముగా మహోపకారమై వెడలును గాక!
రక్షకుడు ఒక్క జనాంగమునకే రక్షకుడై యుండుట సర్వజనులకు ఆనందకరమైన విషయము కాదు. ఒకరికే రక్షణ లభించి, తక్కిన వారికి లభింపకుండుట అ ఒక్కరికి సంతోషకరమైన వార్తకాదు. రక్షకుడు అనుపేరు వహించిన వ్యక్తి సర్వజనులకు రక్షకుడై యున్నాడని తెలియబడుటకు సర్వజనులకు ఉత్సహవర్తమానమై యుండగలదు. రక్షకుడుగాని, రక్షకుడు సంపాదించిన రక్షణ భాగ్యముకాని, సర్వజనులు అంగీకరించినను, అంగీకరింపకపోయినను రక్షకుడును, ఆయన సంపాదనయును సర్వజనులకు ఉద్దేశింపబడినందున అంగీకరించినవారు ఆ దైవోద్ధేశమును అనుసరించి క్రిష్ట్మసు పండుగ ఆచరించుట సత్యమైయున్నది.
నాలువేల సంవత్సరములలో రాని అవతార రక్షకుడైన క్రీస్తు ప్రభువు సరిగా చక్రవర్తి కాలములో జన్మించుట ఒక వింత, క్రీస్తుప్రభువే బహిరంగముగా భూలోకమంతటికి పరిపాలకుడై యుండవలసిన సమయము వెయ్యేండ్ల కాల పరిపాలన సమయమని ప్రకటన గ్రంధము వలన తెలియుచున్నది.
సర్వలోక పరిపాలకుడుగా క్రీస్తు వెడలవలసిన సమయమునకు ముందు సూచనయై యున్న సర్వలోక చక్రవర్తియగు ఔగుస్తుకాల మొకటి సువార్తలలో కనబడుచున్నది. సర్వలోక రక్షకుని జన్మము సరిగా సర్వలోక ప్రజాసంఖ్యా కాలమున నెరవేరుట మరియొక వింత. యేసుప్రభువును నమ్మినవారి నామములు పరలోకమందలి జీవగ్రంధమందు వ్రాయబడునని ప్రకటన గ్రంధమువలన తెలియుచున్నది. అది ఒక ప్రజాసంఖ్య వ్రాత, దానికి పూర్వము ఔగుస్తు వ్రాత సూచనగా సువార్తలలో కనబడుచున్నది. “సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను” అని లూకా వ్రాయుచున్నాడు. ఈ ఆజ్ఞ సర్వలోక చక్రవర్తి యొక్క ఆజ్ఞ. క్రీస్తుప్రభువు అవతారకాలాంతమున తన శిష్యులకొక ఆజ్ఞ ఇచ్చెను. అదేదనగా, “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి” మార్కు 16:15 ఔగుస్తు యొక్క ఆజ్ఞ ప్రభువుయొక్క ఆజ్ఞకు ముందుగా ఒక సూచనయై కనబడుచున్నది. ఔగుస్తు యొక్క ఆజ్ఞ వలన భూలోకములోని నరుల పేర్లు వ్రాయబడినవి.
క్రీస్తుయొక్క ఆజ్ఞను బట్టి రక్షణ అంగీకరించిన ఎన్నిక ప్రజలయొక్క పేర్లు పరలోకమందు వ్రాయబడును. రోమా చక్రవర్తి ఆనాటి ప్రపంచమంతటిని పరిపాలించునట్లు క్రీస్తుప్రభువు లోక చరిత్రాంతమందు వెయ్యేండ్లలో సర్వలోకమును పరిపాలించును. ఔగుస్తు లోకాధికారి గనుక అధికారమును చలాయించుకొనువాడు గనుక సర్వజనులు ఆయన ఆజ్ఞకు లోబడి తను పేర్లు ఇచ్చిరి. లేని యెడల శిక్ష విధింపబడును గాక! క్రీస్తు ప్రభువు యొక్క సువార్త అంగీకరించుట మానవుని ఇష్టమునకు అప్పగింపబడినది. అందుచేత అందరును రక్షణ సువార్తకు లోబడుటలేదు. లోబడినయెడల అందరును రక్షింపబడుదురు. క్రీస్తు సువార్త నమ్మనివారికి కూడ శిక్ష విధింపబడునని వ్రాయబడియున్నది. ఈ శిక్ష ప్రస్తుతం బహిరంగముగా కనబడకపోయినను అంత్యతీర్పు కాలమున కనబడును. ప్రకటన 20:15.
సర్వలోకము, చక్రవర్తి ఆజ్ఞ ప్రజా సంఖ్య ఈ నాలుగు మాటలును క్రీస్తుప్రభువుయొక్క జన్మచరిత్రలో కనబడుచున్నవి. సర్వలోక రక్షణార్ధమై వ్రాయబడిన బైబిలులోని పుస్తకములలో కూడ ఇట్టివే కనబడుచున్నవి. సంఘకాపరులు బాప్తిస్మ కాలమందు మతాంతరుల పేర్లు పుస్తకములలో వ్రాయుచున్నారు. ఇది ఒక విధముగా జన సంఖ్య వ్రాతగాని, ఇది స్థిరము కాదు. ఈ లోకమునకే పనికి వచ్చును. అది వరకు చెప్పినట్లు పరలోకములో మరియొక గ్రంధము కలదు. దానిలో నీ పేరుండునా? పౌలు ఇట్లు వ్రాయుచున్నాడు “ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని యవొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారీ ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. వారి పేర్లు జీవగ్రంధమందు వ్రాయబడియున్నవి. (ఫిలిప్పీ 4:2,3) ‘వారిపేర్లు జీవగ్రంధమందు వ్రాయబడియున్నవి.’ ఈ మాటలు చిత్రముగా కనబడుచున్నవి. పౌలు భూలోకములో ఉండగానే ఈ సంగతి ఆయనకు ఎట్లు తెలిసినది. మనము భూలోకములో ఉండగానే మన పేర్లు జీవగ్రంధములో ఉన్నట్లు తెలిసిన యెడల ఎంత సంతోషము!
మీ పేరులు జీవగ్రంధమందు లిఖితమై యున్నవా? క్రిష్ట్మసు కాలాశీర్వాదములన్నియు మీకు అన్వయించును గాక!