ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు
ధ్యాన క్రిస్మసు
శిశువుగా ప్రత్యక్షమైన యేసుప్రభువా మా దృష్టిని క్రిష్ట్మసు యొక్క ముఖ్య స్థానమునకు త్రిప్పుచుండుమని వేడుకొనుచున్నాము. ఆమెన్.
ప్రసంగము:- ఒక బొమ్మ జ్ఞాపకములో నుంచుకొనండి. మన ఎదుట పశువులతొట్టి యున్నట్లు మనోనిదానములో కల్పించుకొని చూడండి. నామకార్ధ ధ్యానము కొట్టివేయండి. అలాగు కొట్టివేయకపోయిన రెండు కష్టములు వచ్చును. మనోనిదానము కుదరకుండ మనస్సును అక్కడక్కడకు రవాణా చేయును.
రెండవదిగా ఎంత చేసిన ప్రార్ధన వచ్చునుగాని, అసలు ప్రార్ధనరాదు. ఈ రెంటిని మనము జయించవలెను. మన జ్ఞానము యొక్క ఆలోచనలో తొట్టిని తలంచుకొనవలెను. మన కష్టములు, ఆపదలు, స్వంత ప్రార్ధనాంశములు మరచిపోవలెను. ఇట్టి ధ్యానము ప్రతివారు ఈ క్రిష్ట్మసు కాలములో తమ ఇండ్లలో చేసికొనవచ్చును. ఈ తొట్టి చుట్టు ఎవరున్నారు?
- 1. మరియమ్మ ఉన్నది.
- 2. యోసేపు ఉన్నాడు,
- 3. గొల్లలు ఆయనకు నమస్కారము చేయుచున్నారు.
- 4. తూర్పు జ్ఞానులు పూజించుచున్నారు.
నాలుగు ప్రక్కల నలుగురు కలరు. తొట్టి ప్రక్క తూర్పున మరియ, తర్వాత యోసేపు, తర్వాత గొల్లలు, తర్వాత ఆలస్యముగా వచ్చిన జ్ఞానులు గలరు. వీరికి పైన చుక్క ఉన్నది. చుక్కతొట్టిపై లేదు. ఇంటిపైన గలదు. అయితే ధ్యానమునకు ఇక్కడికి మనము ఆ చుక్కను తెచ్చుకొనవలెను. గొల్లలు శిశువును దర్శించిన రెండు సంవత్సరములకు జ్ఞానులు వచ్చిరి. ఈ రెండు సంవత్సరములు ప్రభువు తొట్టిలో లేరు. జ్ఞానులు వచ్చి నమస్కరించి వెళ్ళువరకు అద్దె ఇంటిలో గలరు.
ఉదా:- మనము ఎక్కడికైనా వెళ్ళునప్పుడు జట్కాఎక్కి ఇంటిలోనివారు వచ్చువరకు ఆగుదుము. అలాగే జ్ఞానులు వచ్చు వరకు వారిని దేవుడు ఆ ఇంట ఆపుచేసెను. మరియ, యోసేపులకు ఆ సంగతి తెలియదు. దేవునికి తెలియును. ఆ ఊరిలో ఉండవలసిన కారణము జ్ఞానులు వచ్చుట తప్ప మరే కారణము కనబడదు. ఇంకొక చిన్న కారణము ఎనిమిదవ దినమున సున్నతి చేయవలెను. మరియొక కారణము 40 దినములకు శుద్ధిచేయుటకు ఉండవలెను. 49వ దినమున నజరేతు వెళ్ళవలసినదే గాని వెళ్ళలేదు. వారు ప్రభువును అడుగలేదు. దేవుడు చెప్పినప్పుడు మకాము ఎత్తివేయవలయునని తలంచిరి. తర్వాత జ్ఞానులు వచ్చిరి. మరియు తొట్టిపైన దేవదూతల సైన్యము ఆకాశములో గువ్వలు తిరుగుచున్నట్లు తిరుగుచు స్తుతి చేయుచుండిరి.
తూర్పుజ్ఞానులు దూరమునుండి వెళ్ళిరి. ఇప్పుడు ప్రభువు దగ్గరను ఇంకా దూరమునుండి వచ్చుచున్నారు. ఇప్పుడు విమానములో వెళ్ళిన, బేత్లెహేము, యెరూషలేము క్రిక్కిరిసి యుండును. దాదాపు అన్ని దేశములవారు అక్కడకు 25వ తేదీకి చేరుకొందురు. ఇప్పుడు కబురు అందరికి తెలిసినది. అప్పుడు గొల్లలు, జ్ఞానులకు మాత్రము తెలిసినది. ఇప్పుడు అన్ని దేశములకు ఈ కబురు తెలిసినది.
ఎవరైన పండుగకు క్రొత్తవారు వచ్చిన ఎక్కడనుండి వచ్చినారని అడుగుదుము గదా! ఇప్పుడు ధ్యానములో మరియమ్మను దగ్గరకు రమ్మని పిలువవలెను. అలాగే గొల్లలను, జ్ఞానులను, చుక్కను, దూతల సైన్యమును మన ధ్యానములోనికి రమ్మని అడుగవలెను. వారందరి యొక్క రాకకు కారణమైన శిశువునుకూడ రమ్మని పిలువవలెను. అప్పుడు దర్శన వరము గలవారు వారినందరిని చూడగలరు. అప్పుడు స్తుతిచేయవలెను.
స్తుతి:-
- 1) లోకమును ఎంతో ప్రేమించెను అని ఎవరిని గురించి వ్రాయబడెనో, ఆ దేవుని, ఆ తండ్రిని బయలుపర్చుటకు లోకములోనికి వచ్చిన శిశువా నీకు వందనములు.
- 2) మా మనుష్యులలో ఒక ఆమె నీవు ఆమెయందు జన్మించుటకు అంగీకరించినది. అవమానము భరించినది. తన సంతోషము వృద్ధిచేసుకొనుటకు ఎలీసబెతు దగ్గరకు వెళ్ళినది. నీకు తల్లిగా ఏ స్త్రీని నీవు అంగీకరింపక ఒక కన్యకనే అంగీకరించినావు. ఒక రీతిగా నీ తల్లి నీకు కుమార్తె, నీ తల్లి నీవు కలుగజేసిన సృష్టిలోని ఒక కన్యక వరుసకు నీ కుమార్తెగాని ఈ సమయమునకు తల్లి అయినది. అందుకు నీవు సిగ్గుపడలేదు. నీ తల్లి నిన్ను ఎన్నిమారులు ముద్దుపెట్టుకొన్నది వ్రాయబడలేదు. లోకములోని తల్లులు తమ బిడ్డలను అనేకమార్లు ముద్దుపెట్టుకొనుచుండగా ఆ మరియాంబ ఇంకా ఎక్కువ మార్లు, ఇంకా ఎక్కువ ప్రేమతో నిన్ను ముద్దుపెట్టు కొనియుండవచ్చును. అట్టి చనువిచ్చిన శిశువా నీకు ప్రణుతులు. ఎందుకనగా ఆమెకు అట్టి సమయ మిచ్చినావు తర్వాత అనేకమంది స్త్రీలు వచ్చియుందురు. వారు ముద్దుపెట్టుకొనవచ్చును గాని తల్లిముద్దువేరు. అట్టి సమయము మా మానవులకిచ్చిన ప్రభువా! నీకు అనేక ముద్దులు. మాకు నిన్ను ముద్దుపెట్టుకొను సమయము ఇవ్వక పోయినను మాలో ఒకరికి అట్టి సమయము ఇచ్చినావు గనుక నీ కనేక స్తోత్రములు. గొల్లలుకూడ ముద్దుపెట్టుకొని ఉందురు. జ్ఞానులుకూడ ముద్దుపెట్టుకొని యుందురు. యోసేపునకు కూడ ముద్దుపెట్టుకొను సమయమిచ్చినావు. వారికి ఆ సమయమిచ్చినావు గనుక నీకు నమస్కారములు.
- 3) నిన్ను ముద్దుపెట్టుకొన్న పైన చెప్పిన వారందరు భూలోక వాస్తవ్యులు, నీ జన్మ సమయమందు పరలోక వాస్తవ్యులు కూడా వచ్చియున్నారు. పరలోకములోని దేవదూతలు నీ సింహాసనము దగ్గరనుండి వచ్చిరి. వారి స్తుతి కొద్దిగా వ్రాయబడినది. మన స్తుతి కన్న వారి స్తుతి గొప్పది. యేసుప్రభువా! నీ పుట్టుకకు అనేక మందిని రప్పించినావు గనుక నీకు కృతజ్ఞతా వందనములు.
- 4) పరలోకపు తండ్రీ! నీ కుమారుని జన్మమునకు భూలోక వాస్తవ్యులను, పరలోక వాస్తవ్యులను ఏర్పాటు చేసినావు గనుక నీ కనేక వందనములు. పరిశుద్ధాత్మవైన తండ్రీ! ఈ జన్మ చరిత్రయొక్క ఆరంభమునుండి పుట్టిన దినమువరకు జరిగించినపని నీ పని కాబట్టి నీకు స్తుతులు.
- 5) జీవముగల మనుష్యులను, దేవదూతలను నీ కుమారుని జన్మార్ధము ఏర్పాటు చేయుట మాత్రమేకాక జీవములేని ఒక వస్తువును అనగా నక్షత్రమును ఏర్పర్చినావు కాబట్టి నీకు మంగళ స్తోత్రములు.