ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు
క్రిస్మసు సిద్ధపడు ప్రసంగము
ప్రార్ధన: పరిశుద్ధాత్మవైన ఓ తండ్రీ! రెండవ రాకడకు భూమిమీద వధువు సంఘమును సిద్ధపరచుచున్న పరిశుద్ధాత్నుడవైన ఓ తండ్రీ! నీ కనేక వందనములు. ఈ సమయములో భూమిమీదనున్న క్రైస్తవ సంఘమంతటిని నీ మొదటిరాకకు (క్రిష్ట్మస్ పండుగకు) సిద్ధపరచుచున్న తండ్రీ! నీకు వందనములు. ఆయన రెండవసారి వచ్చేవరకు మొదటి రాకడ ఆచరించుచుండవలెను, లేకపోయిన బలము తగ్గిపోవును. గనుక నీ మొదటి రాకడ ఆచరించే అంతరంగిక బలము అనుగ్రహించుము. మొదటి రాకడ ఉపకారము పొందితే రెండవ రాకడ ఉపకారము పొందగలము గనుక దేనిని ఆచరిస్తే దానికి సిద్ధపడగలము. గనుక వర్తమానము అందించుమని వేడుకొనుచున్నాము. ప్రసంగము
క్రిష్త్మస్ నిరీక్షణాసక్తులైన విశ్వాసులారా! క్రిష్ట్మస్ రాకముందే క్రిష్ట్మసు శుభవచనము మీకు కలుగునుగాక! మన నేత్రముల ఎదుట ఉన్న డిసెంబరు 25వ తేదీ లలాటమందు వ్రాయబడినట్లుగా కనబడుచున్నది. ఆ దినమున ఆచరించు మహోత్సవము నిమిత్తమై ఇప్పుడే సిద్ధపడవలెను.సిద్ధపడుట సుళువుకాదు. అది హృదయముతో, జ్ఞానముతో, మనస్సాక్షితో ఆచరించుటకు సిద్ధపడుట కష్టము. గాని క్రిష్ట్మస్ ఆచరించే నిమిత్తమై బహిరంగముగా సిద్ధపడుట సుళువు. అంతరంగముగ సిద్ధపడుట కష్టము. బహిరంగముగ ఆచరించే విషయములు మనకు అన్నీ తెలుసు గనుక సుళువు. ఇవి కూడా మంచివే. ఎందుకంటే, ఇవి అంతరంగముగ నుండే భక్తికి, ముంగుర్తులుగా నుండే ఆచారములు,అదీ ముఖ్యమే, ఇదీ ముఖ్యమేగాని అంతరంగము కష్టము. మనము ఈ ఆచారములకు సిద్ధపడవలసిన దినములలో నున్నాము. డిసెంబరు 1నుండి సిద్ధపడుచున్నాము. ఇప్పుడు మరీ సమీపముగా ఉన్నాము.
ఈవేళ వినిపింపవలసిన ముఖ్య వర్తమానము ఒక్కటే ‘సిద్ధపడండి.’ అనగా అంతరంగ క్రిష్ట్మసు ఆచరించుటకు సిద్ధపడండి. బహిరంగ విషయము చెప్పవలసిన పనిలేదు. అంతరంగ విషయమై ఆచరించుటకై సిద్ధపడండి. రెండు క్రిష్ట్మసులు, ఒకటి బహిరంగ క్రిష్ట్మసు మరొకటి అంతరంగ క్రిష్ట్మసు. రెండును ఒక్కటే. పద్ధతులు, రెండు, పండుగ ఒక్కటే. ప్రతిసంవత్సరము బహిరంగములోనే క్రైస్తవసంఘము పాలు పుచ్చుకొనుటవలన తూకము ఎక్కువైనది. బహిరంగాచారమే బలీయమైపోయినది. గనుక అంతరంగ ఆచారము గురించి జ్ఞాపకము చేస్తాను. క్రొత్తవి లేవు. అన్నీ ఎరిగియున్నవేగాని వినడము క్రొత్త.
క్రిష్ట్మసు అను మాటకు అర్ధమేమి.’క్రైస్ట్’ అనగా యేసుప్రభువు.’మాస్ ‘ అనగా ఆరాధన, అనగా యేసుప్రభువును ఆరాధించుట. దేవుడు తన కుమారుని ఇచ్చినాడు గనుక ఆయనను (దేవుని) ఆరాధించవలెను. కాని శిశువును ఆరాధించవలెనని సంఘము ఏర్పర్చుకొన్నది. తొట్టిలో అగపడుచున్న బాలుని ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట, అదే క్రిష్ట్మసు.
మామూలుగా ఆదివారమువలెకాక, ఈ రోజు ప్రత్యేకముగా శిశువైన క్రీస్తుప్రభువునకే ఆరాధన; గొల్లలు శిశువునకే నమస్కరించిరి, దేవదూతలు, మరియమ్మ యోసేపులు శిశువునకే, అన్న సుమెయోనులు శిశువునకే నమస్కరించిరి. ఆ తరువాత రెండు సంవత్సరములకు తూర్పుజ్ఞానులువచ్చి ఆ శిశువునే ఆరాధించిరి. కీర్తనలో జ్ఞానులు ఆరాధించిరి అని ఉన్నది. పైవారు ఏవిధముగా ఆరాధించిరో ఆ ప్రకారముగానే, ఆ రీతిగానే మనమును డిశంబరు 25న ఆరాధించితే అదియే అంతరంగ క్రిష్ట్మసు. అదే (జెరోంక్రిష్ట్మసు).
బైబిలును లాటిన్ లోనికి తర్జుమాచేసిన గొప్పపండితుడు ఈ జెరోం అనే విద్యావేత్త. ఆ కాలములో బైబిలును లాటిన్ లో చదివేవారు. ఆయన బేత్లెహేము తొట్టివద్ద 25సం||లు కూర్చుని ఆ శిశువుతో మాట్లాడుచుండెనని సంఘచరిత్రలో నున్నది. 25సం||లు ఏమి మాట్లాడుచున్నాడు? ఎట్లు కూర్చున్నాడు! సాధువు, యోగీశ్వరుడు గనుక విసుగుకొనడు. ఇంకా 25సం|| కూర్చుంటాడు. అద్భుతకరమైన మనిషి, ఆయన 25సం||లు ఆరాధించినాడు.
కాబట్టి ప్రియులారా! మనము క్రిష్ట్మసు దినమందు బాలుని ఆరాధించేటందుకు ఇప్పటినుండే సిద్ధపడవలెనని జ్ఞాపకము చేయుచున్నాను. ఏవీ కూడ సిద్ధపడకుండ జరుగుటలేదు. సిద్ధపడకుండా గుడికి వచ్చినారా? లేదు అలాగే అన్నిటికి సిద్ధపడుదుము. కాబట్టి మనము శిశువును ఆరాధించుటకు సిద్ధపడవలెను. శిశువును ఆరాదించేటందుకు సిద్ధపడుట అన్నిటి కంటె గొప్పపని. ఇది రెండవరాకడకు సంబంధించినది.
క్రిష్ట్మసు అంటే శిశువును ఆరాధించుట అని చెప్పవలెను. ఎవరైనా క్రిష్ట్మస్ అయిపోయిందా? లేక ఈవేళ క్రిష్ట్మసా? అని అడిగెదరు, గాని క్రిష్ట్మస్ అంటే ఏమిటి అని అడగరు. ఎవరన్న అడిగితే, క్రీస్తు అనే శిశువును ఆరాధించుట లేక పూజించుట: అదే క్రిష్ట్మసు అని చెప్పవలెను. మనము ఎప్పుడైతే ఆరాధింతుమో అప్పుడే మనము ఆయనవారము. ఆయన మనవాడు కాగలడు.
నేను నిన్నటి దినమందు శిశువును ఆరాధించుట అనెడి దానికి, సిద్ధపడుట అనెడి అంశముమీద బైబిలులో ఉన్న వచనములు వ్రాసితిని. అవి
ప్రవచన వాక్యములు: ఆది 3:15; 9:26; 12:3; సంఖ్యా 24:17;ద్వితి. 18:18; యెషయా 7:14; 9:6; 11:1; మీకా 5:2; యిర్మియా 23:5;
చరిత్ర వాక్యములు:యోహాను 1:1-5,9-13;మత్తయి 1:1-17;లూకా 3:23-38;1:5-25, 26-28,39-80; 2:1-39, యోహాను 1:14; మత్తయి 3:23-38; 1:5-25, 26-28, 39-80; 2:1-39, యోహాను 1:14; మత్తయి 2:1-12;
అవతార వాక్యములు: యోహాను 3:16,17, 31-36;గలతీ 4:4-6;ఫిలిప్పీ 2:5-11; కొలస్స 2:9;రోమా 8:32.
పై వచనములలో మూడు భాగములు కలవు. 1. క్రిష్ట్మసు ప్రవచనములు (పాతనిబంధనలోని ప్రవచనములు) 2. క్రిష్ట్మసు చరిత్ర. 3. క్రీస్తుయొక్క అవతారమంతటికి సంబంధించిన వచనములు. ఈ మూడు చరిత్రలకు సంబంధించిన వాక్యములను చదువుకొనుట వలన క్రీస్తును ఆరాధించుటకు సిద్ధపడగలము. చదువుటవలన, చదువుకొని ధ్యానిచుటవలన, నేర్చుకొనుటవలన, జ్ఞాపకముంచుకొనుటవలన, ధ్యానించుటవలన సిద్ధపడగలము. ఎవరు ఈ విధముగా చేయుదురో వారే క్రిష్ట్మసునాడు శిశువును ఆరాధించగలరు. వారే బలముతో, సంతోషముతో, ఉద్రేకముతో, శిశువును ఆరాధించగలరు. వారే
- (1) ప్రవచన వాక్యములవలన
- (2) చరిత్ర వాక్యముల వలన
- (3) అవతార వాక్యములవలన బలము పొంది ఆరాధించగలరు.
దేవుడు అంగికరించే ఆరాధన, పైవారు నేర్చుకొని ఆరాధించుటవల్ల మనకు బలము కలిగినది. నేర్చుకొనుటవలన జ్ఞాపకమునకు బలము, నేర్చినది అంగీకరించుటవలన మనస్సాక్షికిని బలము కలిగినది గనుక జ్ఞానము, మనస్సాక్షి, ఆత్మ ఆనందింపగలవు. ఎలాగనగా, నాకు సంగతులు తెలిసినవి
- 1) జ్ఞానము, నాకు అంగీకారమైనదని
- 2) మనస్సాక్షి, వారు బలపడినారు గనుక (అనగా జ్ఞానము, మనస్సాక్షి) నాకేమీ పరవాలేదని
- 3) ఆత్మ ఆనందింపగలదు.
అప్పుడు డిసెంబరు 25కు ముందే సిద్ధపడి, పూర్తిచేసుకొని ఇక్కడకు వచ్చి సంఘమంతటితో కలిసి ఆరాధింతురు. ఒక దూతవెళ్ళి బేత్లెహేములోని కాపరులకు వర్తమానము చెప్పిన పిమ్మట దేవలోకమునుండి దూతల సైన్యము భూలోకముమీదికి వచ్చిరి. అదియే సంఘారాధన. పరలోక సంఘము, దూతల సంఘము చేసిన ఆరాధన. అప్పటికి ఇక్కడ సంఘములేదు. కనుక దేవదూతలందరు మొదటగా ఆయనను ఆరాధించిరి. ఆలాగే ఈరోజు సంఘమంతా ఆరాధించవలెను, శిశువును ఆరాధించుటకు సిద్ధపడవలెను, నేర్చుకొనుటవలన సిద్ధపడవలెను. నేర్చుకొనుటవలన జ్ఞానము, అంగీకరించినందువలన బలము, వాటినిబట్టి మనస్సాక్షి ద్వారా ఆత్మ సంగతులతో సంతోషముగ ఆరాధించుటకు ఇంటివద్దనే శిశువును మొదటగా ఆరాధించుడి. అట్లు చేయుటవల్ల సంఘముతో ఆరాధించుటకు ఇంటివద్దనే శిశువును మొదటగా ఆరాధించుడి. అట్లు చేయుటవల్ల సంఘముతో ఆరాధించుటకు ఇంటివద్దనే సిద్ధమైనట్లు. గొల్లలు తొట్టివద్ద ఆరాధించిరి. గుడిలోకాదు. ఇది పశువులతొట్టి వద్ద మొదటగా ఆరాధించిన కాపరుల ఆరాధన. రెండవదిగా సుమెయోను, అన్న అనువారు ఆరాధించిరి. వారికి, మనకు దొరికినట్లు గుడి దొరికినది. అన్న, సుమెయోనులు గుడిలో ఆరాధించిరి. రెండు సంవత్సరములు అయిన తరువాత వచ్చిన తూర్పు జ్ఞానులు వచ్చేవరకు వారుండవలెను. లేకపోయిన వారు నిరాశపడిపోదురని అద్దె ఇంటిలోనే యోసేపు, మరియమ్మలుండిరి. ఈ విధముగ జ్ఞానులు అద్దె ఇంటిలో, గొల్లలు తొట్టివద్ద, అన్న, సుమెయోనులు గుడిలో ఆయనను ఆరాధించిరి.
మత్తయి రెండవ అధ్యాయములో జ్ఞానులు నక్షత్రమువల్ల నడిపింపబడిరని, ఆ నక్షత్రము వెళ్ళివెళ్ళి ఇంటిమీద ఆగినదని ఉన్నది. కాబట్టి అందరు అన్ని స్థలములలో ఆయనను ఆరాధించిరి. మూడును ఆరాధనలే. కలుపుకుంటే దేవదూతల ఆరాధనకూడా, అయితే వారు మనుష్యులుకారు. మనకు మంచి ఇళ్ళు, గుళ్ళు ఉన్నవి గనుక సిద్ధపడవలెనని ఓపికుంటే, మనము వారికంటె ఒక గంటకాదు, రెండుగంటలుకాదు, పూట పూటయే ఆరాధించగలము.
- 1) తన కుమారుని లోకమునకు సిద్ధము కాలేదు గనుక ఆగినాడు. దేవుడు ఆదాము హవ్వలను, హేబెలును, హనోకును, నోవహును పితామహులను, మోషేను, ఇశ్రాయేలీయులను, ప్రవక్తలను, పాతనింబంధన అయిపోయినదని గంటకొట్టిన మలాకీ వరకు సిద్ధపరచెను. అంతా సిద్ధమైయున్నది గనుక మనకు అంతసేపు సిద్ధపాటు అక్కరలేదు. అన్నము వండుటకు గంట పట్టును. తినుటకు కొద్దిసేపు చాలును. అట్లే మనకు కొద్ది సమయము చాలును
- 2) కుమారుని విషయమై జెకర్యా ఎలీసబెతు; మరియమ్మ యోసేపు వీరందరికీ దేవుడు చెప్పినాడు గనుక వీరు జన్మము కొరకు సిద్ధపడిరి. వీరు జన్మము కొరకు, వారు (పాత నిబంధన భక్తులు) అవతారము కొరకు సిద్ధపడిరి.
ఎలీసబెతు నా ప్రభువు తల్లి నన్ను చూడవచ్చినది. నేనెంత ధన్యురాలనని అన్నది. శిశువు ప్రభువు అయినాడు, ఇంకా పుట్టలేదు. ఆయన ఇంకను పుట్టకుండానే ఎలీసబెతు ఏలాగు అనగల్గినదో! వారందరు (పరలోక సైన్యము) గగన మార్గమున వస్తూ తిరిగిన దేవదూతలే. వారు పరమందలి దేవదూతలు. వీరు (జన్మము కొరకు ఎదురుచూచినవారు) భూమండలమందలి దేవదూత లు, గనుక నిజమైన హృదయముతో చూచిరి. గొల్లలు సిద్ధపడిరి. జ్ఞానులు నక్షత్రము వల్ల సిద్ధపడిరి. ఎప్పుడా ఈ లోకములోనికి వెళ్ళుట అని యేసుప్రభువు సిద్ధపడెను. ఈలోగా పరిశుధాత్మ ప్రవచనము ద్వారా సిద్ధపరచెను. యెషయా 7వ అధ్యా||లో కొద్దిగా, 9వ అధ్యా||లో మరింత ఎక్కువగా, తరువాత మరింత ఎక్కువగా ఆయనను గూర్చి బైలుపడినది. ఈలాగున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు సిద్ధపడిరి. మనమును అట్లే సిద్ధపడవలెను. జ్ఞాన శక్తియొక్క నేర్పుతో, మనస్సాక్షి అంగీకారముతో, హృదయసంతోషముతో ఆరాధనకు వెళ్ళునప్పుడే శిశువు ఆరాధన క్రమముగా జరుగును.
గొల్లలు ఏ మాటలు చెప్పిరో ఆ మాటలు మీ హృదయములో భద్రము చేసికొని ఆయనను ఆరాధించుటకు రండి. శిశువును ఆరాధించుట తండ్రిని ఆరాధించుటే. ఎందుకనగా ఆయన ఈ లోకములో శిశువుగా జన్మించుట, తండ్రి చేసిన ఏర్పాటు గనుక శిశువును ఆరాధించుటవలన తండ్రిని ఆరాధించినట్టె. అలాగే శిశువును ఆరాధించుట పరిశుద్ధాత్మను ఆరాధించినట్టే. ఎందుకనగా పరిశుద్ధాత్మ ప్రవచన రూపముగ శిశువు జన్మమును బైలుపరచినాడు గనుక, ఆ విధముగానే శిశువును ఆరాధించుట ప్రభువును ఆరాధించినట్టే. ఎట్లనగా ప్రభువా! నా కొరకే నీవు వచ్చిన్నావు గనుక నీకు స్తోత్రములు అని స్తుతించుటవలన, సుమెయోనుకు ఆయన జన్మవార్త తెలియబడగా అదివరకు సిద్ధపడిన దానికంటె ఎక్కువగా సిద్ధపడినాడు. యోహానును గూర్చి- ఆయత్తపడిన జనాంగమును సిద్ధపరచుటకు అని యున్నది (లూకా 1:17). ఆయత్తపడిన అనగా సిద్ధపడినవారిని సిద్ధపరచుటకు. మీరు సిద్ధపడేయున్నారు. అయితే ఇంకా సిద్ధపడేందుకు నేను ఈ ప్రసంగము చెప్పినాను.
- 1. పూర్వచరిత్ర, అనగా క్రీస్తు జన్మ పూర్వ చరిత్ర,
- 2. జన్మకాల చరిత్ర
- 3. జన్మము తరువాత చరిత్ర.
అట్లే మీరంతా గొల్లలే, మరియమ్మ యోసేపులే, దేవదూతలే, అన్న సుమెయోనులే. అట్టి దీవెన మీకు అనుగ్రహింపబడునుగాక! ఆమెన్.