ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు

క్రిస్మసు దీవెనలు



దేవుడు మనకు తోడై యున్నాడు (మత్తయి 1:23).


క్రైస్తవేతరులకు కూడ క్రిష్ట్మస్ దీవెనలు కలుగును గాక.

ఈ పత్రిక చదివిన తర్వాత ఈ సంవత్సరమున క్రిష్ట్మసు పండుగ శుభవార్త వినుచున్న మీరును క్రీస్తు జన్మచరిత్రను గురించి సంతోషముతో సంభాషించుకొనగల ఉద్రేకము మీకు కలుగును గాక. అనగా దేవుడే మనిషైనాడట ఆయన మరియాంబకు కన్యక గర్భమందు పుట్టినాడట. ఆయన మన ఉపయోగము నిమిత్తమై వెలసినాడట. ఆయన రోమా వారి ప్రభుత్వ కాలములో జన్మించినాడట. ఆయన పుట్టినప్పుడు రోమా చక్రవర్తి ప్రజాసంఖ్య వ్రాయించుచుండెనట. ఆ మొదటి శతాబ్ధమునాటి సర్వలోకమును పాటించుచు ప్రజాసంఖ్య వ్రాయించిన ఔగుస్తు నామధేయముగల రోమా చక్రవర్తికి గాని, పాలస్తీనా దేశాధికారులకుగాని, క్రీస్తు బేత్లెహేములో పుట్టునని వ్రాయబడిన బైబిలు వచనము చేతబట్టిన వేదాంత పండితులకు గాని, పేర్లు వ్రాయించుకొనుటకు వచ్చిన ప్రజలకు గాని దేవుడీ వార్త పంపక, సామాన్య ప్రజలైన కాపరులకు పంపినాడట. ఇదేమి చిత్రము! ఆయన నరావతారమెత్తిన సువార్త తెచ్చిన వారు మనుష్యులుకాదు, దేవదూతట.


క్రీస్తుప్రభువు యొక్క నరావతారము సర్వలోకమునకు ఉద్ధేశింపబడినదట. ఆయన అవతార చరిత్ర ఎరిగినవారై మొట్టమొదట దేవదూతలే స్తుతించిరట. కాపరులు శిశుదర్శనము చేసి, తమ ఇండ్లకు వెళ్ళినప్పుడు కనబడినవారికి శిశువు సంగతి చెప్పగా వారు ఆశ్చర్యపడిరట. మరియాంబ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసికొనెనట, జన్మ వృత్తాంతము విన్న కాపరులు. దూతలు స్తుతి విన్న వీరు, దేవదూతలను కన్నులారా చూచిన వీరు, యేసుప్రభువును దర్శించిన వీరు ఆ సంగతి ఇతరులకు చెప్పిన వీరు ఎంత ధన్యులు! ఎంత ధన్యులు! ఎంత ధన్యులు! అని ఈ ప్రకారముగా క్రీస్తు జన్మ చరిత్ర ధ్యానించునట్టి క్రైస్తవేతరులైన మీకును, క్రిష్ట్మసు పండుగ ఆచరించు ధన్యత లభించునుగాక.


కీర్తన:- రారెమన యేసుస్వామిని – జూతము కోర్కెలూర ప్రియులారా పేర్మిని

1) పతిత పావనమౌ వేల్పట – అనాది దేవ – సుతుడైయిల జేరినాడట;

2) తుదలేని మహిమ వాడట – తనుగొల్చు సాధు-హృదయుల సొమ్ముమూటట.

క్రైస్తవులకు మరల క్రిష్ట్మసు దీవెనలు కలుగును గాక.