ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు
సర్వలోక రాజైన క్రీస్తు జన్మదినోత్సవము
“మన కొరకు శిశువు పుట్టెను; మనకు కుమారుడనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును” (యెషయా 9:6) ఇది పారమార్ధికము.
సోదరులారా! మీకందరకు క్రిష్ట్మసు సంతోషము కలుగును గాక! క్రిష్ట్మసు పందొమ్మిది వందలనాటి పండుగ. క్రిష్ట్మసు అనేక శుభవార్తలుగల పండుగ. “నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు” అనునది ముఖ్య సమాచారము. ఆ రక్షకుడు క్రీస్తే. క్రీస్తు మనలను కష్టములనుండియు, కష్టములకు కారణమగు పాపములనుండియు, పాపములకు కారకుడగు సాతాను నుండియు రక్షించి తుదకు మోక్షమున చేర్చు రక్షకుడు. ఇట్టి విశాలార్ధము క్రీస్తునందు గలదు. అట్టి రక్షకుడు జన్మించిన సమయమును తలంచుకొని క్రీస్తు భక్తులు క్రిష్ట్మసు ఆచరింతురు.
ఆ రక్షకుడు ప్రజలను రక్షించి వదలిపెట్టి ఊరకుండువాడుకాక, వారిని పాలించు రాజునై యున్నాడను సంగతికూడ ప్రవచనములందు గలదు. పైనున్న ప్రవచనము పూర్తిగా వినుడి: మన కొరకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. “క్రీస్తు రాజ్యభారము వహించుననియు, ఆయన రాజ్యము నీతి న్యాయములు గలదనియు ఈ ప్రవచనము కనబడుచున్నది.
మరొకరు ప్రవచించిన ప్రవచనము వినుడి: బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును” క్రీస్తు పాలస్తీనాలోని బేత్లెహేములో జన్మించుననియు, ఆయన ఏలబోవువాడు (అనగా రాజు) అనియు దీనిలో నున్నది.
ఇంకొకరు ప్రవచించిన ప్రవచనము వినుడి: నీ రాజు నీతిమంతుడును, రక్షణగల వాడును దీనుడునై – నీ యొద్దకు వచ్చుచున్నాడు. “ప్రజలను రక్షింపదలచువాడు నీతిమంతుడు కాని యెడల తనను రక్షించుకొనలేడు మరెవరిని రక్షించలేడు. క్రీస్తు దేవుడగుట వలన కేవలము పరిశుద్ధుడు గనుక నీతిపరుడని వేరుగా చెప్పనక్కరలేదు. అవతార కాలమున ఆయన నరుని స్థానమున సమస్త ధర్మములు నెరవేర్చే నీతిమంతుడని ఋజువు పరచుకొనెను.
క్రిష్ట్మసు చరిత్ర వినుడి: రోమా చక్రవర్తి సర్వలోక ప్రజాసంఖ్య వ్రాయించు కాలమున సర్వలోక చక్రవర్తియగు ఈ క్రీస్తు యూదులరాజగు దావీదు వంశమున బేత్లెహేమను రాజకీయ గ్రామములో మరియ యను ఒక కన్యకకు జన్మించెను. అప్పుడొక దేవదూత ఈ జన్మ వార్తను గొల్లలకు వినిపించెను. వెంటనే పరలోకసైన్యము స్తోత్రము పలికెను. తర్వాత తూర్పు దేశమునుండి జ్ఞానులు కొందరు యెరూషలేము వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు?” తూర్పు దిక్కున మేమాయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని విచారణ చేసి ఆ శిశువును దర్శించిరి. దూరమున ఉన్నవారికి క్రీస్తు రాజని తెలిసినది. పాపమున పడవేయజూచిన సాతానును, శ్రమపెట్టిన శత్రువులున్న లోకమును, శరీరమును చంపిన మృత్యువును, గెలిచి రాజు అని దృష్టాంతపరచుకొనెను. భూరాజ్యములన్నియు తుదకు క్రీస్తు రాజ్యములగునని ప్రకటనలో నున్నది. ఆ కాలము మిగుల సమీపములో ఉన్నది.
ప్రార్ధన:- క్రీస్తురాజా! నేను నీ స్వాధీనమే, నా జీవము నేలుము, అప్పుడు వర్ధిల్లుదును. తథాస్తు.