ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు
క్రిస్మస్ పండుగ
తండ్రి: యెషయా 9:6; కుమార:లూకా2:8; పరిశుద్ధాత్మ:రోమా1:1-7.
క్రిష్ట్మస్ పండుగనుబట్టి ఆరాధనలోనికి వచ్చిన మీరు, ఆ విలువను గ్రహించుటను బట్టి వచ్చినారు గనుక మీకు శుభములు కలుగునుగాక. నిన్నటి సాయంత్రము క్రిష్ట్మస్ పండుగను గురించి మీకు వేసిన ప్రశ్నలు విన్నారు. ఈ దినమైతే క్రిష్ట్మస్ చరిత్ర వినవలెను.
క్రిస్ట్మస్ 13 కథలు: ఈ క్రిష్ట్మస్ చరిత్రలో 13 కథలున్నవి. ఈ 13 కథలు కలిసి ఒక క్రిష్ట్మస్ కథ అగును. ఇవి అన్నియు పూర్తిగా వివరించుటకు సమయము చాలదు గనుక ఈ 13 కథల వివరము కొద్దిగా ఇస్తాను, పూర్తిగా ఇవ్వలేను. ఈ గాలిలో మన కన్నుల ఎదురుగా కొన్ని గీతల స్వరూపమున్నట్లు తలంచుకొనండి. ఈ గీతలలో మొదటి గీత పరలోకమునుండి భూమిమీదకి అనగా భూలోకములోనికి గీయబడినట్లుగా తలంచుకొనండి. ఆ లోకము నుండి గీయబడిన గీతలోనుండి గీయబడిన గీతలు 2 భాగములు, మొత్తము 4గీతలు. అయితే పరలోకము నుండి గీయబడిన మొదటి నిలువుగీత, అడ్డగీత గూర్చి చెప్పను, చెప్పవీలులేదు.
(ఇది పరలోకము నుండి భూలోకమునకు గీయబడిన మొదటి గీతయై యున్నది. అనగా ప్రభువు పరలోకమునుండి భూలోకమునకు వచ్చుటను సూచించు చున్నది. ఆ మహిమ దేవుడు ఏలాగున మానవ మాత్రుని రూపమునకు మార్చబడి, దాసుని రూపమును ధరించు కొనిరో మానవ జ్ఞానమునకు అగోచరమైన విషయమై యున్నది. ఆది, అంతములు లేని దేవుడే, చావు పుట్టుకలకు కల్గిన మానవునిగా దిగివచ్చుటకు అవసరమైన 4,000 సం||లను ఈ గీత సూచించు చున్నది. కనుకనే వివరించలేని భాగముగా, చెప్ప వీలులేనిదిగా ఇది వర్ణింపబడెను. అందు నిమిత్తమై దీనిని చెరిపి వేసి ఈ గీత క్రింది అడ్డగీతనుండి అనగా భూలోకము అను భాగము నుండి ప్రసంగము వివరించబడినది).
చిన్న అడ్డగీతలనుండి ప్రారంభమైన 13కథలు చెప్పుదును. పైనుండి ఉన్న గీతను చెరిపి చిన్న అడ్డు గీత దగ్గరకు వద్దాము, (చెరిపి వేయబడిన నిలువ గీత క్రింద ఉన్న అడ్డగీత, ప్రభువు భూలోక చరిత్ర ఆరంభమును సూచించున్నది. ఆయన మనవలె, మన పోలికలో, మన మానవుడైనందున ఇచ్చటనుండి ఆయన చరిత్ర వివరించుకొన వీలగును. ఏర్పాటు జనాంగ రక్షకునిగా వాగ్ధానము చేయబడిన ఆయన ఈ భూలోకములోనికి దిగి వచ్చుటకు, ఏర్పాటు దేశములోని రెండు జిల్లాలు ఆయత్తము చేయబడినవి. ఈ రెండు జిల్లాల చరిత్ర 13కథలుగా విభాగింపబడి వివరించబడినది).
పై అడ్డగీతలో యూదయ జిల్లా, క్రింది అడ్డగీతలో గలిలయ జిల్లాల చరిత్రలున్నవి. (యూదయ జిల్లా పాలెస్తీనా దేశములో దక్షిణ దిక్కున ఉన్నది. ఇందులో మహారాజు పట్టణమైన యెరూషలేమును, దానికి సమీపములోనే బేత్లెహేమును కలవు. బేత్లెహేము గ్రామ సమీపమున ఉన్న కొండక్రిద చిన్న పల్లె ఉన్నది. అందులో జెకర్యా, ఎలీసబెతులు కాపురమున్నారు. ఈ గ్రామములో ఆయనకు ముందుగా నడవవలసిన యోహాను జన్మము ఆరంభమాయెను. అనగా దైవార్చన క్రమములో ఉన్న వృద్ధయాజక దంపతులైన జకర్యా ఎలీసబెతులకు, ఈ యోహాను జన్మము దూత దర్శ నముద్వారా వాగ్ధానము చేయబడెను. రెండవ జిల్లా గలిలయ, ఇది పాలెస్తీనాలో ఉత్తర భాగమున ఉన్నది). గలిలయ జిల్లాలో నజరేతు పట్టణమున్నది. దీనిలోని ఒక వీధిలో మరియమ్మ, రెండవ వీధిలో యోసేపు ఉన్నారు.
(దైవ దర్శనము పొందిన మరియమ్మ, అదే అంతస్తులో ఉన్న ఎలీసబెతును కలిసికొని 3 నెలలు పరిశుద్ధాత్మ సహవాసములో ఉండి, ఇద్దరును సిద్దపడిరి. ఇక్కడ నుండి రక్షకుని ఇహలోక జన్మ చరిత్ర ఆరంభమైనది. పైన చెప్పబడినట్లుగా ఇవి మొత్తము 4గీతలు అనగా ఈ 4 అంశములలోనే క్రిష్ట్మస్ చరిత్ర అంతయు ఇమిడియున్నది. అందులోని అంతర్భాగములను దైవజనులు 13కథలుగా చేసి, క్రిష్ట్మస్ చరిత్రను పూర్తిగా వివరించిరి. అవి:
- 1) పరలోకము
- 2) భూలోకము
- 3) గలిలయ జిల్లా
- 4) యూదయ జిల్లా
- 5) బేత్లెహేము
- 6) నజరేతు
- 7) కొండక్రింది పల్లె
- 8) నజరేతులోని మొదటి వీధి
- 9) నజరేతులోని రెండవ వీధి
- 10) జకర్యా
- 11) ఎలీసబెతు
- 12) యోసేపు
- 13) మరియమ్మ).
- 1. యూదయ జిల్లాలో యెరూషలేము, బెత్లెహేములున్నవి, వీటి దగ్గరనే బేత్లెహేము క్రింద కొండ సమీపాన ఉన్న పల్లెలో జకర్యా ఎలీసబెతులున్నారు. మొదటి కథ జెకర్యా ఎలీసబెతులదే. జెకర్యా పూజలో నుండగా పరలోకము నుండి దేవదూతలు వచ్చిరి. పూజ చేస్తూ దేవాలయంలో నుండగా దేవదూత వచ్చి నీకు కుమారుడు జన్మించనైయున్నాడు అనెను. ఇది నమ్మలేని మాట. ఇద్దరూ వృద్దులే, కుమారుడు ఏలాగున పుడతాడు. నమ్మవీలు లేదు గనుక నమ్మలేదు. అప్పుడు దేవదూత నీకు పుట్టబోవు కుమారుడు లోక రకషకునికి ముందుగా నడుస్తాడనెను. జెకర్యా ఆ వార్త భార్యకు చెప్పగా ఆమె నమ్మెను. జెకర్యా మాటలేనివాడై పలకపై వ్రాసి చెప్పెను. ఈ కథలో వృద్ధాప్యమైనను బిడ్డలను దేవుడిస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదియును లేదు అని తెలియుచున్నది.
- 2. గలిలయలోని ఒక స్థలములో మరియమ్మ ఒక్కతే ఉన్న సమయంలో, దేవదూత అమ్మా! నీకు కుమారుడు పుడతాడు అని చెప్పినది. మరియ, కన్య అయినను నమ్మినది. ముసలాయన నమ్మలేదుగాని పెండ్లికాని కన్యక నమ్మినది. ఈ కథలో దేవదూతగారు ఆ కన్యకతో, నీ బంధువురాలైన ఎలీసబెతు 6నెలల గర్భముతో యున్నదని చెప్పి పరలోకము వెళ్ళినది. దేవదూత వచ్చినప్పుడు ముసలాయన అవిశ్వాసంతో ప్రశ్నలు వేసిరి. పడుచు అమ్మాయి తెలిసికొనవలెనని వేసెను.ముసలాయనకు ఇచ్చుటకు అసాధ్యము కాననప్పుడు కన్యకకు ఇచ్చుట అసాధ్యమా? ముసలాయన ప్రశ్నలలో అవిశ్వాసమును, కన్యక ప్రశ్నలలో విశ్వాసమును ఉన్నది.
-
3. ఆ కన్యక యొర్ధాను నది దాటి 70 మైళ్ళ దూరము ప్రయాణం చేసి, 6మాసముల గర్భవతియు, వృద్ధురాలైన బంధువురాలిని చూడవచ్చెను. యొర్ధాను, యెరికోలు దాటి కొండసీమ వెళ్ళి వృద్ధురాలిని చూచెను. వృద్ధురాలు మరియమ్మను చూచి నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చెను, నేనెంత ధన్యురాలను! అనెను. ఆమె ప్రభువు తల్లి అని చెప్పుట పరిశుద్ధాత్మ ద్వారానే జరిగెను. గలిలయలోని కొండసీమలో యున్న మరియమ్మ సంగతి, దూత జకర్యా ఎలీసబెతులకు చెప్పలేదుగాని మరియమ్మకే వారి సంగతి బయల్పరచెను గాన ఆమె బయలుదేరివచ్చెను. ఎలీసబెతు నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చెనని చెప్పుటే కాక మరియమ్మ శబ్ధము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. ఇది ప్రభువునకు అసాధ్యమా? కాదు.
మరియమ్మ 3నెలలు ఎలీసబెతు దగ్గర ఉండి మాట్లాడిన విషయములు అన్నియు వ్రాయబడలేదుగాని సువార్తికులు ఆ కొద్ది సంగతులే వ్రాసిరి. ఎలీసబెతు చిన్న కీర్తన కట్టెను. మరియమ్మ పెద్ద కీర్తన కట్టెను. 3నెలలు అయిన పిదప గలిలయ రాజ్యములోని నజరేతు వెళ్ళెను. కన్యక గర్భవతియై యున్నది. దేవుడు ఈమెకు యోసేపు ప్రధానం చేసెను. ఈ వార్తను వినిన యోసేపు విచారంతో పండుకొనెను. ఒక రాత్రి వీరిద్దరికీ కబురు పంపిన ఆ దేవదూత, యోసేపుతో నీవు మరియమ్మను గూర్చి అపార్ధం చేసుకొని ఆమెను కోపపడవద్దు, చేర్చుకొని వివాహం చేసుకో అని చెప్పెను. ఈ కథ అయినది. - 4. రోమా పట్టణమును పరిపాలన చేసే చక్రవర్తి చేతిలో ఈ పట్టణాలున్నవి. ఆయన పేరు ఔగుస్తు. ఈయన పంపిన నోటీసులో ప్రతివారు తమతమ స్వగ్రామములో జనాభా లెక్కలకు వారివారి పేరులు వ్రాయించుకోవాలని ఉన్నది. లోకమంతా ఈయన చేతిలోనే యున్నది. యోసేపు మరియమ్మలు కొండ సీమలోని బేత్లెహేము రావాలి. ఎందుకనిన దావీదు మహారాజు ఈ బేత్లెహేములో ఉండేవాడు. ఈ యోసేపు దావీదు గోత్రములో పుట్టెను గనుక జనాభా లెక్కకు ఇక్కడికే రావాలి. ఆ కాలంలో జనాభా లెక్కకు స్త్రీలు రానక్కరలేదు. మగవారే స్త్రీల పేర్లు చెప్పుదురు. అయితే నిండు గర్భవతి అయిన మరియ అయ్యా! నేనును కొండసీమకు వస్తానని అనడంతో యూదయలోని బేత్లెహేముకు ఇద్దరు కలిసి వచ్చిరి. ప్రయాణ కదలికలలో దేవుడే నడిపించుకొని వచ్చిరి. జనాభాకు అన్ని ఊళ్ళనుండి ప్రజలు వచ్చినందున వారికి ఆ ఊర్లో స్థలములేదు. పట్నంలో, పట్నం చుట్టూ, సత్రాలలో స్థలం లేదు. పశువుల పాకలో ఆమెకు స్థలం దొరికినది. ఆ పాకలోనే ఆమె శిశువును ప్రసవించి, పొత్తి బట్టలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. ఈ కథ అయినది.
- 5. పొలంలో గొర్రెల కాపరులుండగా పరిశుద్ధ దేవదూత వచ్చి, రక్షకుడు పుట్టెనని చెప్పగా, వెంటనే వారు పాక వద్దకు వచ్చి బాలుని చూచి సంతోషించిరి. వారు రాకముందు దేవదూతల సమూహము చేసిన స్తుతి వారు విన్నారు. వారు వెళ్తూ ఎదురైన వారికందరికి ఆ కథ చెప్పుచూ వెళ్ళిరి. ఈ కథ అయినది.
- 6. ఎనిమిదవ దినమున యోసేపు, మరియమ్మలు బేత్లెహేము నుండి యెరూషలేము దేవాలయమునకు 4 మైళ్ళ, దూరము ప్రయాణం చేసి వెళ్ళిరి. 8వ రోజు పేరు పెట్టించే రోజు. ఆ రోజే మనకు ఆదివారమైనది. ఆ దిన వర్తమానం విందాము.
- ముసలివారికి కుమారుడు పుట్టుట.
- వివాహములేని కన్యకు కుమారుడు పుట్టుట.
- దేవలోకములోనిదేవుడే మనిషై ఆ తొట్టిలో నుండుట, ఇది మరీ అసాధ్యము, పై రెండింటికంటె అసాధ్యమైన విషయము.
కాబట్టి ఈ 3 మర్మముల ఎదుట మనమున్నాము. మన విశ్వాసమును బలపర్చుటకు ఇవి ఒకదానిని ఒకటి మించిపోయినవి. ఇంటియొద్ద ఈ కథలు లెక్కచూడండి.
క్రిష్ట్మస్ పండుగ మొదట ఎవరి పండుగ?
క్రిష్ట్మస్ పండుగలోని 13 పంక్తులు:
- 1) జెకర్యా
- 2) ఎలీసబెతు
- 3) మరియమ్మ
- 4) యోసేపు
- 5) గొల్లలు
- 6) సుమెయోను
- 7) అన్న పండుగ
- 8) ఇప్పుడందరి పండుగ, కాదు; ఈ పండుగను గూర్చి ఎందరు మనస్సున ఆనందించెదరో ఆ అందరి పండుగ.
- 9) కేవలము నా కొరకు జన్మించినారని సంతోషించు వారిదే ఈ పండుగ.
- 10) జ్ఞానులు
- 11) చంటిపిల్లలను చంపే కథ
- 12) ఈ సమయములో యేసుప్రభువు ఐగుప్తునకు వెళ్ళిన కథ
- 13) ప్రభువు ప్రక్కబడి, ప్రక్కబడి వెళ్ళిన కథ. ఇదే పూర్తి కథ. ఇది బైబిలులో అచ్చుపడుట కాదు, విన్న మన హృదయాలలో అచ్చుపడవలెను.
క్రిష్ట్మస్ మొదటి భాగము అనగా గొల్లల రిపోర్టు మరియమ్మ హృదయములో అచ్చుపడినది. ఈ కథ బైబిలులో అచ్చుపడినది. అది మనందరి హృదయములో అచ్చుపడాలి. అట్టి క్రిష్ట్మస్ పండుగ యొక్క ఆనందము మీ అందరి హృదయాలలో కలుగునుగాక! ఆమెన్.