ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు
రక్షకుని వంశకర్తలు
క్రీస్తుప్రభువు ఈలోకములో పుట్టి షుమారుగా 2000 సంవత్సరములు అయినది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ పండుగ జరుగుచునే యున్నది. దేవుడు మనిషిగా జన్మించుట సంభవముకాదు. గాని జరిగినది. ఆయన ప్రేమ మనకొరకు ఉండబట్టి, ఆయన అక్కడ ఉండలేక పోయినాడు. ఆ ప్రేమనుబట్టి భూలోకమునకు వచ్చివేసెను. దేవుడే మనిషై పోయినాడు. ఈ సంగతి నమ్ముటకు వీలుకాదు. ఆయన ప్రేమకు అంతములేదు. అసహ్యములేదు. అంతప్రేమ ఆయనకు గలదు. ఆ ప్రేమను గ్రహించిన యెడల మనము బాగుపడుదుము. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను” అని వ్రాతగలదు. “ఎంతో” అనగా ఆకాశమునకు భూమికి ఎంతదూరము? అంతులేని దూరము అంతగా దేవుడు మనలను ప్రేమించెను.
మనిషికూడ దేవునిని అంతగా నమ్మితే ఇంకేమి కావలెను. అన్ని ఉన్నట్టే, మనిషి నమ్మినను నమ్మకపోయినను ఆయన అన్ని మేళ్ళు చేయుచున్నాడు. గాలి, నీరు, పంటలు, జబ్బులు బాగుచేయుట మొదలైన ఉపకారములు నమ్మనివారికి కూడ చేయును. అయితే ఆయనను నమ్మితే మోక్షము లేనియెడల మోక్షములేదు. ఆయనను నమ్మక పోయిన మిగతావన్నీ ఉండవచ్చును గాని, మోక్షము మాత్రముండదు. 2) ఆదిలో హవ్వ అనే ఆమె ఉన్నది. ఆరు వేల సంవత్సరముల క్రితము ఆమె ఉండెను. ఆమె మన తల్లి, అందరికీ తల్లి, మొదటి ఆమె. దేవుడు ఆమెను పరిశుద్ధముగా కలుగజేసెను. గాని పొరబాటు వచ్చెను. దేవుడు ఆమెతో నీ వంశములో రక్షకుని పంపించెదనను వాగ్ధానమిచ్చెను. పొరబాటు ఉన్న ఆమె వంశములో దేవుడు పుట్టవచ్చునా? పుట్టెను గనుక ఎంత ప్రేమ! ఆయన ఆమె చేసిన పొరపాటును క్షమించెను. గనుక ఆయన జన్మించెను.
లోక రక్షకుడు నాలుగు వేల సంవత్సరముల వరకు పుట్టలేదు గనుక కొందరు భక్తులను ఆయన ఏర్పాటు చేసికొని ఈ కబురు అందరికి వినిపించెను. ఈ కబురు అందించుటకు లోకములో చాలామందిని విడిచిపెట్టి కొందరిని మాత్రమే ఏర్పరచుకొనెను.
- 1.హవ్వ - దేవుడు ఆమె పొరపాటును క్షమించెను. ఆమె వంశములో రక్షకుడు పుట్టునని వాగ్ధానమిచ్చెను. నమ్ముటకు వీలులేదు గాని ఆమె నమ్మెను. రక్షకుని కొరకు కనిపెట్టి చివరకు చనిపోయెను.
- 2. అబ్రహాము – కొన్ని వందల ఏండ్లకు ఈయన పుట్టెను. ఈయన మంచివాడు, భక్తుడే, కాని పొరపాటులు గలవు. దేవుడు క్షమించి రక్షకుని పంపెదనని ఈయనతో వాగ్ధానముచేసెను. అబ్రహాము దేవునిమాట నమ్మెను. నమ్ముటయే మంచిపని. పొరపాటు ఉన్న యెడల నమ్మినను లాభములేదు. దేవుడు క్షమించి నిలువబెట్టెను.
- 3. ఇస్సాకు – ఈయనలో కూడ పొరపాట్లు గలవు గాని దేవుడు శుభ్రముచేసి, రక్షకుడు నీ వంశమున పుట్టునని చెప్పెను. ఈయన కూడ నమ్మెను. ఈ ముగ్గురు భక్తులు విశ్వాసము, క్షమాపణ పొందినవారు. లోక రక్షకుడు పుట్టవలసిన వంశకర్తలు అనగా రక్షకుని వంశకర్తలు.
- 4. యాకోబు – ఈయనలో చాల పొరపాట్లు గలవు. గాని, శుభ్రముచేసిన తర్వాత పరిశుద్ధుడాయెను. నా వంశములోనే రక్షకుడు పుట్టునని నమ్మెను. దేవుని ప్రేమను ఆయనిచ్చిన దీవెనను తలంచుకొనెను. తప్పులున్నను వాటిని తలంచుకొనక దేవా క్షమించుము అనెను, వాగ్ధానము నమ్మెను.
- 5. యూదా - ఇతను యాకోబు కుమారుడు. పెద్ద పొరపాటులో ఉన్నవాడు. అతడు రక్షకుని వంశకర్త అంత పెద్ద తప్పు ఉన్న అతనిని దేవుడు ఏర్పర్చుకొనవచ్చునా? వంశకర్తగా చేయవచ్చునా? దేవుడతని శుభ్రముచేసి, వంశకర్తగా దీవించెను గనుక రక్షకుని వంశకర్తలలో ఒకడాయెను. రక్షకుని వంశకర్తలు అనుబిరుదు ఎంత గొప్పది. అనగా వారివలననే వంశము నిలువబడును.
- 6. దావీదు – ఈయన రాజు, కవీశ్వరుడు, పరమ భక్తుడు. దేవుని వలన అభిషిక్తుడు. అద్భుతకరమైన మనిషి, ఈయనను దేవుడు వంశకర్తగా ఏర్పర్చెను. ఈయనలో కూడ తప్పులున్నవి గాని, దేవుడే మరచిపోయెను. క్షమించెను. పాపములు కప్పివేసెను. కీర్తనలు 85:2లో పరిహరించి యున్నావు, కప్పివేసి యున్నావు అని గలదు. తప్పుచేసినయెడల దేవుని కోపము మండును. అయితే తర్వాత వారి పాపములు జ్ఞాపకము చేసికొనను అని దేవుడు సెలవిచ్చెను.
- 7. మరియమ్మ – ఈమె కన్యక, పరిశుద్ధురాలు, ఆమె తప్పులు తెలియవు. దేవునియొక్క ఆశీర్వాదము పొందినది. ఆమెకు కూడ పొరపాటులుండవచ్చును గాని అవి వ్రాయబడలేదు. మాటలో, వినికిడీలో రవ్వంత అయిన తప్పు ఉండదా? వాటిని వ్రాయించలేదు. భక్తులకు చెప్పలేదు. ఎందుచేత? దేవుడే వాటిని మరచిపోయెను.
యెషయా 43:25 “నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను” గనుక దేవుడు ఎంత ప్రేమ గలవాడు! పాపము లేదు. గనుకనే కన్యక దేవునికి మరపు ఉండునా? బైబిలులోని వాక్యమునే ఆధారము చేసికొని అనుచున్నాము. మనము ఆయనను నమ్మక పోయిన యెడల మన పాపములను ఆయన జ్ఞాపకముంచుకొని, శిక్ష విధించవలసి యుండును. దేవునికి మరపులేదు. గాని మన పాపములను మరచి పోవలెనని అనుకొని మరచిపోయెను. మరపు ఉండి ఆయన మరిచిపోలేదు. మనిషికి మరపుగలదు గాని దేవునికి లేదు. దేవునికి ఇసుక రేణువులన్నియు జ్ఞాపకమే, మన వెంట్రుకలన్నియు ఆయనకు జ్ఞాపకమే. మనమాయనను నమ్మిన మన పాపముల నాయన మరచిపోవును. మన పాపములను ఆయన మరువక పోయిన యెడల ఆయన క్షమించుటకు వీలులేదు. మనిషియొక్క పాపములు మరచిపోవలెనని ఆయనకున్నది. కాబట్టి ఆయన మనిషై పుట్టెను, మన పాపములన్నిటిని ఆయన మరచి నిజమైన క్రిష్ట్మసు చేయుటకు తండ్రి తోడ్పడును గాక!