ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు
క్రిస్మస్
ఏ మతమునైనను, ఏ మనిషినైనను తుంచనాడకూడదు. ఎందుకనిన ఈ భూమిమీద మానవులందరికీ అన్ని విషయములలో సహాయము చేయుటకు క్రీస్తు అనగా ఆకాశమును, భూమిని, కలుగజేసిన అసలైన దేవుడు మన నిమిత్తమై భూమి మీద అసలైన మనుష్యుడుగా జన్మించెను. ఇదే క్రిష్ట్మస్ శుభవార్త. చాలా కాలమునకు ఒక రాజుగారు మనయొద్దకు వచ్చిన యెడల నమస్కారము చేయుదుము గదా! అట్లే క్రీస్తు మన లోకమునకు మొదటిసారి వచ్చినప్పుడు ఆయనను చూచి వెళ్ళినవారు ఆయనకు నమస్కారము చేసిరి. వారి మాదిరిని బట్టి మనమును ఇప్పుడు ఆయనకు అంతరంగముగా నమస్కారము చేయవలెను. అట్లు చేయుటయే క్రిస్ట్మస్ పండుగ.
క్రిష్ట్మసు అనగా క్రీస్తును ఆరాధించుట. క్రిష్టు+మస్= క్రిష్ట్మసు. అనగా ఆరాధన క్రీస్తు సృష్టికర్త గనుక ఆయననే ఆరాధింపవలెను అను అర్ధము క్రిష్ట్మసు అను మాటలో ఉన్నది. క్రీస్తు సృష్టికర్త గనుక మనము ఆయనను గాక మరి దేనిని లేక మరెవ్వరిని ఆరాధింపగలము? ప్రొద్దుతిరుగుడు పువ్వును చూడండి. దానిని ఏ తట్టునకు మలిపినను సూర్యుని తట్టే తిరుగును. అలాగే క్రీస్తువలన కలిగిన మనము ఏ ఇతర తలంపుల తట్టునకు త్రిప్పినను ఆ తట్టునకు మరలకూడదు. సృష్టిజాలములోని వస్తువులు ఎంతగొప్పవైనను నమస్కారము చేయుటకు వాటితట్టు తిరుగరాదు. మానవులలో ఎంతగొప్పవారు కనబడినను క్రీస్తును ఆరాధించుటకై చేయు నమస్కారమువంటి నమస్కారము చేయుటకు మళ్ళకూడదు. ఎందుకనిన ఎవ్వరును సృష్టికర్తలు కారు. ఆయనే క్రీస్తురాజు, ఎందుకనిన ఆయన స్వరమును సృజించిన వ్యక్తి గనుక రాజైయున్నాడు. ఆయన చేతిక్రింద భూలోక రాజులందరు ఉన్నారు. వారికి నమస్కారము చేయవచ్చును కాని స్వరమునకు రాజైయున్న క్రీస్తు రాజునకు చేయవలసిన నమస్కారము వంటి నమస్కారము చేయరాదు. అదివేరు ఇదివేరు.
క్రీస్తును చూడవచ్చిన తూర్పుజ్ఞానులు దేశాధికారియైన హేరోదును చూచి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అని అడిగిరి. ఆ సమయములో క్రీస్తు సర్వలోకరాజైయున్నాడు అను తలంపు వారిలో లేదు, కాని హేరోదు యూదులకు మాత్రమే రాజైయున్నాడు అను తలంపు వారిలో ఉన్నదిగాని తెలిసో, తెలియకో సర్వలోక రాజును సన్మానించునట్లు క్రీస్తును సన్మానించి ఆరాధించిరి, మేము ఆయనను ఆరాధింప వచ్చినాము అని హేరోదుతో చెప్పిరిగదా! క్రీస్తు ఒక్క యూదులకే రాజైయున్నయెడల వారు ఎందుకు ఆయనను పూజింపవలెను? తమకుకూడ రాజై ఉన్నాడని మనస్సులో గ్రహించుకొని యుండవచ్చును. ఇప్పుడు క్రీస్తు అంతరంగముగ రాజైయున్నను వెయ్యేండ్ల కడవరికాలములో ఆయన భూమి యంతటికి రాజైయున్నట్లు ప్రత్యక్ష పర్చుకొనును. అప్పుడు భూరాజులందరును తూర్పుజ్ఞానులవలె ఆయనకు నమస్కరింతురు.(ప్రకటన 15:3-4). అదే క్రిష్ట్మస్.
మనము అందరము చేయునది పెద్దవాడుగా ప్రత్యక్షమగు రాజునకు చేయుచున్న క్రిష్ట్మసు. సృష్టికర్తయైన క్రీస్తే. తండ్రియైన క్రీస్తే. శాంతి పాలన చేయు రారాజైన క్రీస్తే, “నేడు మీకొరకు రక్షకుడు పుట్టియున్నాడు” అను వచనమునుబట్టి రక్షకుడైన క్రీస్తే, సర్వములో సర్వమగు వ్యక్తియైన క్రీస్తే మాకు మీకు, అందరకు ఆత్మానంద క్రిష్ట్మసు ధన్యతలు కలుగజేయును గాక!